19. పందొమ్మిదవ అధ్యాయము
ఉభయ సేనల వివరణము.
వైశంపాయన ఉవాచ
యుయుధానస్తతో వీరః సాత్వతానాం మహారథః।
మహతా చతురంగేణ బలేనాగాధ్యుధిష్ఠిరమ్॥ 1
వైశంపాయనుడు ఇలా చెప్పాడు. సాత్వతుల మహారథుడు సాత్యకి గొప్ప చతురంగ బలాలతో యుధిష్ఠిరుని దగ్గరకు వచ్చాడు. (1)
తస్య యోధా మహావీర్యాః నానాదేశసమాగతాః।
నానాప్రహరణా వీరాః శోభయాంచక్రిరే బలమ్॥ 2
వివిధ దేశాలనుండి అనేక విధఆయుధాలతో వచ్చిన మహావీరులంతా ధర్మరాజు సైన్యానికి శోభ చేకూర్చారు. (2)
పరశ్వధైర్భిందిపాలైః శూలతోమరముద్గరైః।
పరిఘైర్యష్టిభిః పాశైః కరవాలైశ్చ నిర్మలైః॥ 3
ఖడ్గకార్ముకనిర్వ్యూహైః శరైశ్చ వివిధైరపి।
తైలధౌతైః ప్రకాశద్భిః సదా శోభత వై బలమ్॥ 4
గొడ్డళ్లు, భిందిపొలాలు, శూలాలు, తోమరాలు, ముద్గరాలు, పరిఘలు, కర్రలు, పాశాలు, పదునైన కత్తులు, ఖడ్గాలు, ధనుస్సుల సమూహాలు నూనెతో తెల్లగా ప్రకాశించే వివిధ భాగాలు - వీటితో ఆసేన అంతా చక్కగా శోభిస్తోంది. (3,4)
తస్య మేఘప్రకాశస్య సౌవర్ణైః శోభితస్య చ।
బభూవ రూపం సైన్యస్య మేఘస్యేవ సవిద్యుతః॥ 5
బంగరు ఆభరణాలతో నల్లగా ఉన్న ఆ సైన్యం మెఱపులతో కూడిన మేఘంలా ఉంది. (5)
అక్షౌహిణీ తు సా సేనా తదా యౌధిష్ఠిరం బలమ్।
ప్రవిశ్యాంతర్దధే రాజన్ సాగరం కునదీ యథా॥ 6
సాత్యకి తెచ్చిన ఆ అక్షౌహీణిసేన యుధిష్ఠిరుని సేనలో కలిసింది. అప్పుడది సముద్రంలో కలిసిన చిన్న నదిలా అదృశ్యమై పోయింది. (6)
తథై వాక్షౌహిణీం గృహ్య చేదీనామృషభో బలీ।
ధృష్టకేతురుపాగచ్ఛత్ పాండవానమితౌజసః॥ 7
అలాగే ఒక అక్షౌహిణి సేనతో మహాబలుడయిన చేదిరాజు ధృష్టకేతువు పాండవులను చేరాడు. (7)
మాగధశ్చ జయత్సేనః జారాసంధిర్మహాబలః।
అక్షౌహిణ్యైవ సైన్యస్య ధర్మరాజముపాగమత్॥ 8
జరాసంధుని కొడుకు, మహాబలుడు, మగధరాజు అయిన జయత్సేనుడు అక్షౌహిణి సేనతో వచ్చి ధర్మరాజును చేరాడు. (8)
తథైవ పాండ్యో రాజేంద్ర సాగరానూపవాసిభిః।
వృతో బహువిధైర్యోధైః యుధిష్ఠిరముపాగమత్॥ 9
మహారాజా! అలాగే సముద్రద్వీప వాసులతో వివిధ యోధులతో కలిసి పాండ్యరాజు యుధిష్ఠిరుని చేరాడు. (9)
తస్య సైన్యమతీవాసీత్ తస్మిన్ బలసమగమే।
ప్రేక్షణీయతరం రాజన్ సువేషం బలవత్ తదా॥ 10
ఆ పాండ్యరాజుసేన చాలా ఉంది. ఆ సేన కలిసేసరికి పాండవసేన బలిష్ఠమూ, వేషయతమూ అయి చూడముచ్చటగా ఉంది. (10)
ద్రుపదస్యాప్యభూత్సేనా నానాదేశసమాగతైః।
శోభితా పురుషైః శూరైః పుత్రైశ్చాస్య మహారథైః॥ 11
వివిధ దేశాల నుండి వచ్చిన శూరులతో, మహారథులయిన పుత్రులతో కలిసి ద్రుపదుని సేన శోభిల్లింది. (11)
తథైవ రాజా మత్స్యానాం విరాటో వాహినీపతిః।
పార్వతీయైర్మహీపాలైః సహితః పాండవానియాత్॥ 12
అలాగే వాహినీపతి అని పేరొందిన మత్స్యరాజు విరాటుడు పర్వతరాజులతో కలిసి పాండవులను చేరాడు. (12)
ఇతశ్చేతశ్చ పాండూనాం సమాజగ్ముర్మహాత్మనామ్।
అక్షౌహిణ్యస్తు సప్తైతాః వివిధధ్వజ సంకులాః॥ 13
యుయుత్సమానాః కురుభిః పాండవాన్ సమహర్షయన్।
ఇంకా అక్కడక్కడ నుండి వచ్చిన సేనలు వివిధ ధ్వజాలతో మొత్తం పాండవులకు చేరిన సేనలు ఏడు అక్షౌహిణులయ్యాయి. కౌరవులతో యుద్ధం చేయటానికి వచ్చి వారి పాండవులను సంతోష పెట్టారు. (13 1/2)
తథైవ ధార్తరాష్ట్రస్య హర్షం సమభివర్ధయన్।
భగదత్తో మహీపాలః సేనామక్షౌహిణీం దదౌ॥ 14
అలాగే దుర్యోధనునికి సంతోషం కలిగిస్తూ భగదత్తుడనే రాజు ఒక అక్షౌహిణి సేనను ఇచ్చాడు. (14)
తస్య చీనైః కిరాతైశ్చ కాంచనైరివ సంవృతమ్।
బభౌ బలమనాధృష్యం కర్ణికారవనం యథా॥ 15
చీనులతో, కిరాతులతో కలిసి ఎదిరింప శక్యంకాని ఆ సేన సంపెంగపూలతో కూడిన కొండగోగు పూల తోట వలె ప్రకాశించింది. (15)
తథా భూరిశ్రవాః శూరః శల్యశ్చ కురునందన।
దుర్యోధనముపాయాతౌ అక్షౌహిణ్యా పృథక్ పృథక్॥ 16
అలాగే శూరుడయిన భూరిశ్రవుడూ, శల్యుడూ ఒక్కొక్క అక్షౌహిణీ సేనతో దుర్యోధనుని చేరారు. (16)
కృతవర్మా చ హార్దిక్యః భోజాంధకుకురైస్సహ।
అక్షౌహిణ్యైవ సేనాయాః దుర్యోధనముపాగమత్॥ 17
భోజులు, అంధకులు, కుకురులతో కలసి కృతవర్మ అక్షౌహిణి సేనతో దుర్యోధనుని చేరాడు. (17)
తస్య తైః పురుషవ్యాఘ్రైః వనమాలాధరైర్బలమ్।
అశోభత యథామత్తైః వనం ప్రక్రీడితైర్గజైః॥ 18
వనమాలలు ధరించిన పురుషసింహాలతో కూడిన సైన్యం విహరించే మదపుటేనుగులతో మత్తెక్కిన అడవిలా ప్రకాశించింది. (18)
జయద్రథముఖాశ్చాన్యే సింధుసౌవీరవాసినః।
ఆజగ్ముః పృథివీపాలాః కంపయంత ఇవాచలాన్।
తేషామక్షౌహిణీ సేనా బహులా విబభౌ తదా॥ 20
సింధు, సౌవీరదేశస్థులయిన జయద్రథుడు మొదలయిన రాజులు కొండలను కంపింపజేస్తూ ఉన్నట్లు అక్షౌహిణి సేనతో వచ్చారు. ఆ సేన బహుళమై ప్రకాశించింది. (20)
విధూయమానో వాతేన బహురూప ఇవాంబరః।
సుదక్షిణశ్చ కాంబోజః యవనైశ్చ శకైస్తదా॥ 21
ఉపాజగామ కౌరవ్యమ్ అక్షౌహిణ్యా విశాంపతే।
గాలికి చెల్లా చెదరై అనేక రూపాలు దాల్చే మేఘంలా కాంబోజరాజు సుదక్షిణుడు యవనులతో, శకులతో కలసి ఒక అక్షౌహిణి సైన్యంతో దుర్యోధనుని చేరాడు. (21 1/2)
తస్య సేనాసమావాయః శలభానామివాబభౌ॥ 22
సచ సంప్రాప్య కౌరవ్యం తత్రైవాంతర్దధే తదా।
వాని సేనా సముదాయం మిడతల దండులా ఉంది. ఆ సేన వచ్చి దుర్యోధనుని సేనలో లీనమయి పోయింది. (22 1/2)
తథా మాహిష్మతీవాసీ నీలో నీలాయుధైః సహ॥ 23
మహీపాలో మహావీర్యైః దక్షిణాపథవసిభిః।
అలాగే మాహిష్మతీపురరాజు నీలుడు నీలాయుధాలతో కూడిన దక్షిణ దేశస్థులతో వచ్చాడు. (23 1/2)
ఆవంత్యౌ చ మహీపాలౌ మహాబలసుసంవృతౌ।
పృథగక్షౌహిణీభ్యాం తౌ అభియాతౌ సుయోధనమ్॥ 24
విందానువిందులు అవంతి రాజులు ఇద్దరు మహాబలంతో కూడి ఒక్కొక్క అక్షౌహిణి సేనతో వచ్చి సుయోధనుని చేరారు. (24)
కేకయాశ్చ నరవ్యాఘ్రాః సోదర్యాః పంచ పార్థివాః॥ 25
సంవర్షయంతః కౌరవ్యమ్ అక్షౌహిణ్యా సమాద్రవన్।
నరోత్తములయిన అయిదుగురు కేకయ రాజులు దుర్యోధనుని ఉప్పొంగ జేస్తూ ఒక అక్షుహిణి సేనతో పరువున వచ్చారు. (25 1/2)
తతస్తతశ్చ సర్వేషాం భూమిపానాం మహాత్మనామ్॥ 26
తిస్రోఽన్యాః సమవర్తంత వాహిన్యో భరతర్షభ।
ఇంకా ఇతర రాజుల సేనలన్నీ కలసి మూడు అక్షౌహిణు లయ్యాయి. (26 1/2)
ఏవమేకాదశావృత్తాః సేనా దుర్యోధనస్య తాః॥ 27
యుయుత్సమానాః కౌంతేయాన్ నానాధ్వజసమాకులాః।
ఇలా దుర్యోధనుని కోసం పాండవులతో యుద్ధం చేయటానికి వచ్చిన పదకొండు అక్షౌహిణులు ఎన్నో రకాల ధ్వజాలతో నిండి పోయాయి. (27 1/2)
న హాస్తినపురే రాజన్ అవకాసోఽభవత్ తదా।
రాజ్ఞాం స్వబలముఖ్యానాం ప్రాధాన్యేనాపి భారత॥ 28
ఆయాసేనల్లో ముఖ్యులయిన వారికీ, ప్రాధాన్యాన్ని బట్టి నిలబడటానికి కూడా హస్తినలో చోటు చాలటం లేదు. (28)
తతః పంచనదం చైవ కృత్స్నం చ కురుజాంగలమ్॥ 29
తథా రోహితకారణ్యం మరుభూమిశ్చ కేవలా।
అహిచ్ఛత్రం కాలకూటం గంగాకూలం చ భారత॥ 30
వారణం వాటధానంచ యామునశ్చైవ పర్వతః।
ఏష దేశః సువిస్తీర్ణః ప్రభూతధనధాన్యవాన్॥ 31
బభూవ కౌరవేయాణాం బలేనాతీవ సంవృతః।
పంచనదం, కురుజాంగలం అంతా, రోహితకారణ్యం, మరుభూమి, అహిచ్ఛత్రం, కాలకూటం, గంగాతీరం, వాటధానం, యామునపర్వతం - ఈ ప్రదేశాలున్న ధనధాన్యపూర్ణమయిన విశాల ప్రదేశం అంతా కౌరవసేనతో నిండిపోయింది. (29-31 1/2)
తత్ర సైన్యం తథాయుక్తం దదర్శ స పురోహితః॥ 32
యః స పాంచాలరాజేన ప్రేషితః కౌరవాన్ ప్రతి॥ 33
అలా నిండిన సైన్యాన్ని కౌరవుల దగ్గరకు వచ్చిన ద్రుపదపురోహితుడు చూశాడు. (32,33)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి పురోహిత సైన్య దర్శనే ఏకోనవింశోఽధ్యాయః॥ 19 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున సేనోద్యోగ పర్వమను ఉపపర్వమున పురోహిత సైన్యదర్శనమను పందొమ్మిదవ అధ్యాయము. (19)