20. ఇరువదియవ అధ్యాయము
(సంజయయాన పర్వము)
ద్రుపద పురోహితుడు కౌరవసభలో మాట్లాడుట.
వైశంపాయన ఉవాచ
స చ కౌరవ్యమాసాద్య ద్రుపదస్య పురోహితః।
సతృతో ధృతరాష్ట్రేణ భీష్మేణ విదురేణ చ॥ 1
వైశంపాయనుడు పలికాడు - జనమేజయా! ద్రుపదుని పురోహితుడు కురురాజును సమీపించాడు. అప్పుడు ధృతరాష్ట్రమహారాజు, భీష్ముడు, విదురుడు అతనిని సన్మానించారు. (1)
సర్వం కౌశల్యముక్త్వా ఽ దౌ పృష్ట్వా చైవమనామయమ్।
సర్వసేనాప్రణేతౄణాం మధ్యే వాక్యమువాచ హ॥ 2
ముందుగా తమ పక్షంవారి క్షేమసమాచారాన్ని చెప్పి, తరువాత ధృతరాష్ట్రాదుల క్షేమసమాచారాన్ని అడిగి సేనానాయకులందరి సమక్షంలో ద్రుపద పురోహితుడు ఇలా చెప్పాడు. (2)
సర్వైర్భవద్భిర్విదితః రాజధర్మః సనాతనః।
వాక్యోపాదానహేతోస్తు వక్ష్యామి విదితే సతి॥ 3
సనాతనమైన రాజధర్మం మీకందరికీ తెలుసు. మీకు తెలిసినప్పటికీ మీ అభిప్రాయం తెలిసికోవాల్సి ఉంది కాబట్టి, నేను చెప్తున్నాను. (3)
ధృతరాష్ట్రశ్చ పాండుశ్చ సుతావేకస్య విశ్రుతౌ।
తయోః సమానం ద్రవిణం పైతృకం నాత్ర సంశయః॥ 4
ధృతరాష్ట్రస్య యే పుత్రాః ప్రాప్తం తైః పైతృకం వసు।
పాండుపుత్రాః కథం నామ న ప్రాప్తాః పైతృకమ్ వసు॥ 5
ధృతరాష్ట్రుడు, పాండురాజు - ఈ ఇద్దరూ ఒకే తండ్రి కొడుకులు, పిత్రార్జితమైన సంపదపై ఇద్దరికీ సమానమైన అధికారం ఉంది. ఇందులో సందేహం లేదు. ధృతరాష్ట్రుని పుత్రులు తమ తండ్రి సంపదను పొందారు. కాని పాండు కుమారులు మాత్రం ఎందువల్ల పిత్రార్జితాన్ని పొందలేకపోయారు? (4,5)
ఏవం గతే పాండవేయైః విదితం వః పురా యథా।
న ప్రాప్తం పైతృకం ద్రవ్యం ధృతరాష్ట్రేణ సంవృతమ్॥ 6
ఇట్లుండగా పిత్రార్జితసంపదంతా ధృతరాష్ట్రుని అధీనంలో ఉండటం వల్ల, పాండవులు తమ పిత్రార్జితమైన సొత్తును పొందలేకపోయారు. ఈ విషయం ముందునుండి మీకు తెలుసు. (6)
ప్రాణాంతికైరప్యుపాయైః ప్రయతద్భిరవేకశః।
శేషవంతో న శకితాః నేతుం వై యమపాదవమ్॥ 7
పైగా ధృతరాష్ట్రుని కుమారులైన దుర్యోధనుడు మున్నగువారు ప్రాణాంతకాలైన ఉపాయాలచేత పాండవులను చంపడానికి చాలామార్లు ప్రయత్నించారు. కాని వాళ్లకు ఆయువు మిగిలి ఉండటంచేత మరణం పొందలేదు. (7)
పునశ్చ వర్ధితం రాజ్యం స్వబలేన మహాత్మభిః।
ఛద్మనాపహృతం క్షుద్రైః ధార్తరాష్ట్రైః ససౌబలైః॥ 8
మళ్లీ మహాత్ములైన పాండవులు తమ బాహుబలంచేత నూతన రాజ్యాన్ని స్థాపించి, వృద్ధి చేశారు. కాని శకునితో కలిసి ధృతరాష్ట్రకుమారులు జూదంవంకతో దాన్నికూడా అపహరించారు. (8)
తదప్యనుమతం కర్మ యథాయుక్తమనేన వై।
వాసితాశ్చ మహారణ్యే వర్షాణీహ త్రయోదశ॥ 9
ధృతరాష్ట్రుడు కూడా ఆ జూదాన్ని అనుమతించాడు. వారు నిర్ణయించినట్లుగా పాండవులు పదమూడు సంవత్సరాలు వనవాసం చేశారు. (12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాత వాసం కలిపి 13 సంవత్సరాలుగా చెప్పబడింది.) (9)
సభాయాం క్లేశితైర్వీరైః సహభార్యైస్తథా భృశమ్।
అరణ్యే వివిధాః క్లేశాః సంప్రాప్తాస్తైః సుదారుణాః॥ 10
కౌరవసభలో భార్యతోపాటు పాండవులు చాలాకష్టాలు పొందడమే కాదు, అరణ్యంలో కూడ దారుణమైన కష్టాలు ఎన్నో అనుభవించారు. (10)
తథా విరాటనగరే యోన్యంతరగతైరివ।
ప్రాప్తాః పరమసంక్లేశః యథా పాపైర్మహాత్మభిః॥ 11
అదే విధంగా విరాటనగరంలో మహాత్ములైన పాండవులు మరోజన్మ ఎత్తిన పాపాత్ములవలె మిక్కిలికష్టాన్ని అనుభవించారు. (11)
తే సర్వం పృష్ఠతః కృత్వా తత్ సర్వం పూర్వకిల్బిషమ్।
సామైవ కురుభిః సార్ధమ్ ఇచ్ఛంతి కురుపుంగవాః॥ 12
మునుపటి తప్పులన్నింటిని వెనుకకునెట్టి కురుశ్రేష్ఠులైన పాండవులు కౌరవులతో సంధినే కోరుకొంటున్నారు. (12)
తేషాం చ వృత్తమాజ్ఞాయ వృత్తం దుర్యోధనస్య చ।
అనునేతుమిహార్హంతి ధార్తరాష్ట్రం సుహృజ్జనాః॥ 13
ఆ పాండవుల నడవడిని, దుర్యోధనుని ప్రవృత్తిని బాగా తెలిసికొని, ఉభయులక్షేమాన్నీ కోరే స్నేహితులు దుర్యోధనుని అనునయించడం మంచిది. (13)
న హి తే విగ్రహం వీరాః కుర్వంతి కురుభిః సహ।
అవినాశేన లోకస్య కాంక్షంతే పాండవాః స్వకమ్॥ 14
వీరులైనప్పటికీ పాండవులు కౌరవులతో యుద్ధం చేయరు. జననష్టం లేకుండా తమ రాజ్యాన్ని తాము పొందా లనుకొంటున్నారు. (14)
యశ్చాపి ధార్తరాష్ట్రస్య హేతుః స్యాద్ విగ్రహం ప్రతి।
స చ హేతుర్న మంతవ్యః బలీయాంసస్తథా హి తే॥ 15
ఏ కారణంతో దుర్యోధనుడు యుద్ధం చెయ్యాలనుకొంటున్నాడో, దాన్ని నిజమైన కారణంగా భావించవద్దు. ఎందుకంటే పాండవులు కౌరవులకంటె బలవంతులు. (15)
అక్షౌహిణ్యశ్చ సప్తైవ ధర్మపుత్రస్య సంగతాః।
యుయుత్సమానాః కురుభిః ప్రతీక్షంతేఽస్య శాసనమ్॥ 15
కౌరవులతో యుద్ధం చేయడంకోసం ధర్మరాజు దగ్గరకు చేరిన ఏడు అక్షౌహిణుల సేనలు అతని ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాయి. (16)
అపరే పురుషవ్యాఘ్రాః సహస్రాక్షైహిణీసమాః।
సాత్యకి ర్భీమసేనశ్చ యమౌ చ సుమహాబలౌ॥ 17
వారితోపాటు ఇంకా వేయి అక్షౌహిణులతో సమానులూ, పురుషశ్రేష్ఠులూ ఐన సాత్యకి, భీమసేనుడు, మహాబలవంతులైన నకుల సహదేవులూ కూడా ఉన్నారు. (17)
ఏకాదశశైతాః పృతనాః ఏకతశ్చ సమాగతాః।
ఏకతశ్చ మహాబాహుః బహురూపీ ధనంజయః॥ 18
కౌరవపక్షంలోని పదకొండు అక్షౌహిణులసేనలు ఒకవైపు మహాబాహువు, బహురూపధారి ఐన అర్జునుడొక్కడూ మరొకవైపు ఉన్నా, ఆ సేనలకు అర్జునుడొక్కడూ చాలు. (18)
యథా కిరీటీ సర్వాభ్యః సేనాభ్యో వ్యతిరిచ్యతే।
ఏవమేవ మహాబాహుః వాసుదేవో మహాద్యుతిః॥ 19
అర్జునుడొక్కడూ అన్ని సేనలను మించి ఉన్నట్లే,మహాబాహువు, మహాతేజస్వి ఐన వాసుదేవుడు కూడా అందర్నీ మించినవాడు. (19)
బహులత్వం చ సేనానాం విక్రమం చ కిరీటివః।
బుద్ధిమత్వం చ కృష్ణస్య బుద్ధ్వా యుధ్యేత కో నరః॥ 20
సేనా బాహుళ్యాన్ని, అర్జునుని పరాక్రమాన్ని, శ్రీకృష్ణుని తెలివి తేటల్నీ తెలిసి కూడా ఎవడు యుద్ధం చేస్తాడు? (20)
తే భవంతో యథాధర్మం యథాసమయమేవ చ।
ప్రయచ్ఛంతు ప్రదాతవ్యం మా వః కాలోఽత్యగాదయమ్॥ 21
అందువల్ల మీరు మీ ధర్మాన్ని అనుసరించి, మునుపు చేసిన ప్రతిజ్ఞలను అనుసరించి పాండవులకు ఇవ్వదగిన రాజ్య భాగాన్ని ఇవ్వండి. ఇంకా మీకు సమయం మించిపోలేదు. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి పురోహితయానే వింశోఽధ్యాయః॥ 20 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయయాన పర్వమను ఉపపర్వమున
పురోహితయానమను ఇరువదియవ అధ్యాయము. (20)