26. ఇరువది ఆరవ అధ్యాయము
తనరాజ్యమిచ్చినచో శాంతి లభించునని యుధిష్ఠిరుడు చెప్పుట.
యుధిష్ఠిర ఉవాచ
కాం ను వాచం సంజయ మే శృణోషి
యుద్ధైషిణీం యేన యుద్ధాద్ బిభేషి।
అయుద్ధం వై తాత యుద్ధాద్ గరీయః
కస్తల్లబ్ధ్వా జాతు యుధ్యేత సూత॥ 1
యుధిష్ఠిరుడు పలికాడు. సంజయా! నేను యుద్ధాన్ని కోరుతున్నట్లు ఏ నా మాటను విని నీవు యుద్ధాన్ని గురించి భయపడుతున్నావు? నాయనా! యుద్ధం కంటె యుద్ధంలేకపోవడం (సంధి) శ్రేష్ఠమైనదే. అది లభించినట్లైతే ఎవడు యుద్ధం చేస్తాడు. (1)
అకుర్వతశ్చేత్ పురుషస్య సంజయ
సిద్ధ్యేత్ సంకల్పో మనసా యం యమిచ్ఛేత్।
న కర్మ కుర్యాద్ విదితం మమైతద్
అన్యత్ర యుద్ధాద్ బహు యల్లఘీయః॥ 2
సంజయా! పని చెయ్యకుండానే తాను మనస్సులో కోరుకున్నది సిద్ధించినట్లయితే ఏ మనిషీ ఇక పని చెయ్యడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. యుద్ధం లేకుండా లభించినది చిన్నదైనా దాన్ని నేను పెద్దదిగానే భావిస్తాను. (2)
కుతో యుద్ధం జాతు నరో ఽవగచ్ఛేత్
కో దేవశప్తో హి వృణీత యుద్ధమ్।
సుఖైషిణః కర్మ కుర్వంతి పార్థాః
ధర్మాదహీనం యచ్చ లోకస్య పథ్యమ్॥ 3
మానవుడు ఎప్పుడైనా ఎందుకు యుద్ధాన్ని కోరుకుంటాడు? విధివంచితుడెవడో యుద్ధాన్ని కోరుతాడు. సుఖాన్ని కోరుకునే పాండవులు లోకానికి హితమైన, ధర్మం తప్పని పనినే చేస్తారు. (3)
ధర్మోదయం సుఖమాశంసమానాః
కృచ్ఛ్రోపాయం తత్త్వతః కర్మ దుఃఖమ్।
సుఖం ప్రేప్సుర్విజిఘాంసుశ్చ దుఃఖం
య ఇంద్రియాణాం ప్రీతిరసానుగామీ॥ 4
మేము ధర్మం వల్ల కలిగే సుఖాన్ని మాత్రమే కోరుకొంటాము. ఇంద్రియాల కిష్టమైన విషయానందాన్ని కోరుకొనేవాడూ, దుఃఖాన్ని పారద్రోలి సుఖాన్ని పొందాలనుకొనేవాడూ, కష్టమైన ఉపాయాలతో కూడిన పనిని చేస్తాడు. వాస్తవాని కది చివరకు దుఃకాన్నే కలిగిస్తుంది. (4)
కామాభిధ్యా స్వశరీరం దునోతి
యయా ప్రముక్తో న కరోతి దుఃఖమ్।
యథేధ్యమానస్య సమిద్ధతేజసః
భూయో బలం వర్ధతే పావకస్య॥ 5
కామార్థలాభేన తథైవ భూయః
న తృప్యతే సర్పిషేవాగ్నిరిద్ధః।
కోరికలమీది ధ్యాస తన శరీరాన్ని బాధిస్తుంది. ఆ చింతన లేకపోతే దుఃఖమే కలుగదు. మండుతున్న అగ్నిలో ఇంధనం వేస్తే దానిబలం ఎక్కువౌతుంది. నేతివల్ల అగ్ని ప్రజ్వలించినట్లుగా కోరుకొన్న భోగాలను పొందేకొద్దీ మానవుని తృష్ణ అధికమవుతుంది. (5 1/2)
సంపశ్యేమం భోగచయం మహాంతం
సహాస్మాభిర్ధృతరాష్ట్రస్య రాజ్ఞః॥ 6
మాతోపాటుగ ఆ ధృతరాష్ట్రమహారాజు దగ్గరకు చేరిన ఈ భోగాల సముదాయాన్ని చూడు. అయినా అతనికింకా తృప్తి కలుగలేదు కదా. (6)
నాశ్రేయానీశ్వరో విగ్రహాణాం
నాశ్రేయాన్ వై గీతశబ్దం శృణోతి।
నాశ్రేయాన్ వై సేవతే మాల్యగంధాన్
న చాప్యశ్రేయాననులేపనాని॥ 7
నాశ్రేయాన్ వై ప్రావారాన్ సంవివస్తే
కథం త్వస్మాన్ సంప్రణుదేత్ కురుభ్యః।
అత్రైవ స్యాదబుధస్యైవ కామః
ప్రాయః శరీరే హృదయం దునోతి॥ 8
పుణ్యాత్ముడు కానివాడు యుద్ధాల్లో విజయం పొందలేడు. తన కీర్తి గానాన్ని వినలేడు. గంధ మాల్యాలను ధరింపలేడు. మంచి గంధాన్ని పూసుకోజాలడు. మంచి వస్త్రాలను ధరింపలేడు. ఈ భోగాలన్నీ ఉన్న ధృతరాష్ట్రుడు పుణ్యాత్ముడే. అతడు పుణ్యాత్ముడు కాకుంటే మమ్మల్ని కురుదేశాలనుండి ఎలా దూరం జేయగలడు? సాధారణంగా ఎదుటివారి శరీరంలోని హృదయాన్ని బాధించే అజ్ఞానియైన దుర్యోధనుడి వంటి వానికే ఈ భోగతృష్ణ ఉంటుంది. (7,8)
స్వయం రాజా విషమస్థః పరేషు
సామస్థ్యమన్విచ్ఛతి తన్న సాధు।
యథాత్మనః పశ్యతి వృత్తమేవ
తథా పరేషామపి సో ఽభ్యుపైతి॥ 9
రాజు స్వయంగా విషమస్థితిలో ఉండి ఇతరులు సమస్థితిలో ఉండాలని కోరుకోవడం యుక్తం కాదు. (తాను వంకరగా ఆలోచిస్తూ ఇతరులు సవ్యంగా ఆలోచించాలనడం యుక్తం కాదని భావం). తన స్థితిలాగానే ఇతరులస్థితిని కూడా చూచే వాడే యోగ్యుడు.(9)
ఆసన్నమగ్నిం తు నిదాఘకాలే
గంభీరకక్షే గహానే విసృజ్య।
యథా వివృద్ధం వాయువశేన శోచేత్
క్షేమం ముముక్షుః శిశిరవ్యపాయే॥ 10
ప్రాప్తైశ్వర్యో ధృతరాష్ట్రోఽద్య రాజా
లాలప్యతే సంజయ కస్య హేతోః।
ప్రగృహ్య దుర్బుద్ధిమనార్జనే రతం
పుత్రం మందం మూఢ మమంత్రిణం తు॥ 11
సంజయా! శిశిరం గడిచాక వేసవిలో గడ్డితో నిండిన దట్టమైన అడవిలో అగ్గిని పడేసి, గాలివల్ల మంట చెలరేగితే తరువాత తన క్షేమంకోసం దుఃఖించే వాడిలా, ధృతరాష్ట్ర మహారాజు సమస్త రాజ్య సంపదమీద ఆధిపత్యంతో, దుర్బుద్ధి, కుటిలుడు, భాగ్యహీనుడు, మూర్ఖుడూ, ఐన తనకొడుకును అనుసరిస్తూ ఇపుడు దుఃఖపడుతున్నాడు. (10,11)
అనాప్తవచ్చాప్తతమస్య వాచః
సుయోధనో విదురస్యావమత్య।
సుతస్య రాజా ధృతరాష్ట్రః ప్రియైషీ
సంబుధ్యమానో విశతే ఽధర్మమేవ॥ 12
తనకొడుకు ఇష్టాన్ని కోరుకొంటున్న ధృతరాష్ట్రుడు తమకందరికంటె ఆప్తుడైన విదురుని ఆప్తినిగ గుర్తింపక, అతని మాటలను లక్ష్యపెట్టక, అతడెంత చెప్పినా అధర్మాన్నే ఆశ్రయిస్తున్నాడు. (12)
మేధావినం హ్యర్థకామం కురూణాం
బహుశ్రుతం వాగ్మినం శీలవంతమ్।
స తం రాజా ధృతరాష్ట్రః కురుభ్యః
న సస్మార విదురం పుత్రకామ్యాత్॥ 13
పుత్రునిమీది మోహంతో ధృతరాష్ట్రుడు మేధావి, విద్వాంసుడు, కౌరవుల అభీష్టాన్ని కోరుకొనేవాడు, బాగా చదువుకున్న విద్వాంసుడు, మంచిమాటకారి, శీలమంతుడూ ఐన విదురుని కౌరవులకోసమైనా ఆదరించలేదు. (13)
మానఘ్నస్యాసౌ మానకామస్య చేర్షోః
సంరంభిణశ్చార్థధర్మాతిగస్య।
దుర్భాషిణో మన్యువశానుగస్య
కామాత్మనో దైర్హృదైర్భావితస్య॥ 14
అనేయస్యాశ్రేయసో దీర్ఘమన్యోః
మిత్రద్రుహః సంజయ పాపబుద్ధేః।
సుతస్య రాజా ధృతరాష్ట్రః ప్రియైషీ
ప్రపశ్యమానః ప్రాజహాద్ ధర్మకామౌ॥ 15
సంజయా! దుర్యోధనుడు ఇతరుల అభిమానాన్ని దెబ్బతీస్తూ, స్వాభిమానాన్ని కోరుకొంటాడు. ఈర్ద్యాళువు, క్రోధంతో ధర్మార్థాలను అతిక్రమిస్తాడు. దుర్భాషలాడుతూ, క్రోధవివశుడై ప్రవర్తిస్తాడు. భోగాసక్తుడు, పాపాత్ములచే గౌరవింపబడేవాడు, నేర్వదగినవాడు, భాగ్యహీనుడు, దీర్ఘకోపి, మిత్రద్రోహి, పాపబుద్ధి, అటువంటి కుమారుని ప్రియాన్ని కోరుతూ ధృతరాష్ట్రమహారాజు ధర్మకామాలను విడిచి పెట్టాడు. (14,15)
తదైవ మే సంజయ దీవ్యతోఽభూత్
మతిః కురూణామాగతః స్యాదభావః।
కావ్యాం వాచం విదురో భాషమాణో
న విందతే యద్ ధార్తరాష్ట్రాత్ ప్రశంసామ్॥ 16
సంజయా! జూదం ఆడుతున్నప్పుడు విదురుడు చెప్పదగినట్లు మాట్లాడినా, దుర్యోధనుడు విదురుని ఏమాత్రం ప్రశంసించలేదు. అపుడే 'కౌరవులకు వినాశకాలం దగ్గరపడిం'దని నేను అనుకొన్నాను. (16)
క్షత్తుర్యదా నాన్వవర్తంత బుద్ధిం
కృచ్ఛ్రం కురూన్ సూత తదాభ్యాజగామ్।
యావత్ ప్రజ్ఞామన్వవర్తంత తస్య
తావత్తేషాం రాష్ట్రవృద్ధిర్బభూవ॥ 17
సంజయా! కౌరవులు విదురుని బుద్ధిననుసరించి ప్రవర్తించినంతకాలం వారి రాజ్యం వృద్ధి చెందింది. వారు విదురుని మాటను వినడం మానేసి నప్పటినుండే వారికి ఆపదలు వచ్చాయి. (17)
తదర్థలుబ్ధస్య నిబోధ మే ఽద్య
యే మంత్రిణో ధార్తరాష్ట్రస్య సూత।
దుఃశాసనః శకునిః సూతపుత్రః
గావల్గణే పశ్య సమ్మోహమస్య॥ 18
సంజయా! ధనలోభియైన దుర్యోధనుడి దగ్గర దుఃశాసనుడు శకుని, సూతపుత్రుడు కర్ణుడు మంత్రులుగా ఉన్నారు. వాని మోహం, అజ్ఞానం ఎంతటిదో తెలిసికో. (18)
సోఽహం న పశ్యామి పరీక్షమాణః
కథమ్ స్వస్తి స్యాత్ కురుసృంజయానామ్।
ఆత్తైశ్వర్యో ధృతరాష్ట్రః పరేభ్యః
ప్రవ్రాజితే విదురే దీర్ఘదృష్టౌ॥ 19
ఆశంసతే వై ధృతరాష్ట్రః సపుత్రః
మహారాజ్యమసపత్నం పృథివ్యామ్।
తస్మిన్ శమః కేవలం నోపలభ్యః
సర్వం స్వకం మద్గతే మన్యతే ఽర్థమ్॥ 20
ఎంత పరీక్షించినా కురు సృంజయ వంశీయులకు క్షేమం ఎలా కలుగుతుందో నాకు తెలియటం లేదు. ధృతరాష్ట్రుడు ఇతరుల రాజ్యసంపదను పొంది, దూరదృష్టిగల విదురుని దేశంనుండి వెళ్లగొట్టి, తన కుమారులతో కలిసి ఈ భూమిమీద తన మహారాజ్యం నిష్కంటకం కావాలనుకొంటున్నాడు. మేము అడవికి వెళ్లగానే మా రాజ్యం కూడా తనదే అని భావించే ఇటువంటి లోభితో సంధి కూడా పొసగుతుందని నేను భావించడం లేదు. (19,20)
యత్ తత్ కర్ణో మన్యతే పారణీయం
యుద్ధే గృహీతాయుధమర్జునం వై।
ఆసంశ్చ యుద్ధాని పురా మహంతి
కథం కర్ణో నాభవడ్ద్ ద్వీప ఏషామ్॥ 21
యుద్ధంలో ధనుర్ధారి ఐన అర్జునుని జయించవచ్చని కర్ణుడు భావిస్తున్నాడు. కాని అది అతని భ్రమ. ఇంతకు మునుపు అనేక(గొప్ప) యుద్ధాలు జరిగాయి. మరి అపుడు కర్ణుడు కౌరవులను ఎందుకు రక్షించలేకపోయాడు? (21)
కర్ణశ్చ జానాతి సుయోధవశ్చ
ద్రోణశ్చ జానాతి పితామహశ్చ।
అన్యే చ యే కురవస్తత్ర సంతి
యథార్జునాన్నాస్త్యపరో ధనుర్ధరః॥ 22
అర్జునుని వంటి మరొక విలుకాడు లేడన్న సంగతి కర్ణసుయోధనులకు తెలుసు. భీష్మద్రోణులకూ తెలుసు. అక్కడున్న తక్కిన కురురాజులందరికీ తెలుసు. (22)
జానంత్యేతత్ కురవః సర్వ ఏవ
యే చాప్యన్యే భూమిపాలాః సమేతాః
దుర్యోధనే రాజ్యమిహాభవద్ యథా
అరిందమే ఫాల్గునే విద్యమానే॥ 23
శత్రుదమనుడయిన అర్జునుడు లేనపుడు దుర్యోధనుని రాజ్యం ఎలా తయారయిందో కౌరవులందరికీ తెలుసు. అక్కడకు చేరిన రాజులందరికీ తెలుసు. (23)
తేనానుబంధం మన్యతే ధార్తరాష్ట్రః
శక్యం హర్తుం పాండవానాం మమత్వమ్।
కిరీటినా తాలమాత్రాయుధేన
తద్వేదినా సంయుగం తత్ర గత్వా॥ 24
దీర్ఘమైన ధనుస్సు ధరించి ధనుర్విద్యాకోవిదుడైన అర్జునునితో యుద్ధరంగంలో తలపడిన దుర్యోధనుడు రాజ్యంమీద పాండవులకున్న మమకారాన్ని(అధికారాన్ని) అంత సులభంగా హరించగల ననుకొంటున్నాడా! (24)
గాండీవ విస్ఫారిత శబ్దమాజౌ
అశృణ్వానా ధార్తరాష్ట్రా ధ్రియంతే।
క్రుద్ధం న చేదీక్షతే భీమసేనం
సుయోధనో మన్యతే సిద్ధమర్థమ్॥ 25
అర్జునుని గాండీవధనుష్టంకారాన్ని విననంతవరకే యుద్ధరంగంలో కౌరవులు జీవించి ఉండేది. కోపించిన భీమసేనుని చూడనంతవరకు దుర్యోధనుడు తన రాజ్యకాంక్ష సిద్ధించిందనుకోవచ్చు. (25)
ఇంద్రోఽప్యేతన్నోత్సహేత్ తాత హర్తుమ్
ఐశ్వర్యం నో జీవతి భీమసేనే।
ధనంజయే నకులే చైవ సూత
తథా వీరే సహదేవే సహిష్ణా॥ 26
నాయనా! సంజయా! మా భీమసేనుడు, అర్జునుడు, నకులుడు, సహనశీలుడు, వీరుడూ ఐన సహదేవుడు జీవించి ఉన్నంతవరకు ఇంద్రుడు కూడా మారాజ్యసంపదను హరించడానికి ప్రయత్నింపడు. (26)
స చేదేతాం ప్రతిపద్యేత బుద్ధిం
వృద్ధో రాజా సహపుత్రేన సూత।
ఏవం రణే పాండవకోపదగ్ధాః
న నశ్యేయుః సంజయ ధార్తరాష్ట్రాః॥ 27
సూతా! సంజయా! తన కుమారులతో బాటు ధృతరాష్ట్రుడు పాండవులకు రాజ్యం ఇవ్వకపోతే క్షేమం కాదనే సంగతిని బాగా తెలుసుకోవాలి - అపుడే యుద్ధరంగంలో ధృతరాష్ట్రకుమారులు పాండవుల కోపాగ్నిచే దహింప బడకుండా ఉంటారు. (27)
జానాసి త్వం క్లేశమస్మాసు వృత్తం
త్వాం పూజయన్ సంజయాహం క్షమేయమ్।
యచ్చాస్మాకం కౌరవైర్భూతపూర్వం
యా నో వృత్తిర్ధార్తరాష్ట్రే తదాఽఽసీత్॥ 28
సంజయా! కౌరవుల కారణంగా మేముపడ్డ కష్టం నీవు ఎరుగుదువు. నిన్ను గౌరవిస్తూ ఆ అపరాధాలన్నింటిని నేను క్షమించగలను. ఇంతకుమునుపు కౌరవులు మాపట్ల ఎలా ప్రవర్తించారో, అపుడు మేము వారి పట్ల ఎలా ప్రవర్తించామో కూడ నీకు తెలుసు. (28)
అద్యాపి తత్ తత్ర తథైవ వర్తతాం
శాంతిం గమిష్యామి యథా త్వమాత్థ।
ఇంద్రప్రస్థే భవతు మమైవ రాజ్యం
సుయోధనో యచ్ఛతు భారతాగ్ర్యః॥ 29
ఇపుడు కూడ వారంతా అక్కడ పూర్వం లాగే ఉందురుగాక. నీవు చెప్పినట్లు నేను కూడా శాంతిని వహిస్తాను. ఇంద్రప్రస్థంలో నా రాజ్యం ఉండుగాక, దుర్యోధనుడు అక్కడ నారాజ్యం నాకు తిరిగి ఇవ్వాలి. (29)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి యుధిష్ఠిరవాక్యే షడ్వింశోఽధ్యాయః॥ 26 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయయాన పర్వమను ఉపపర్వమున యుధిష్ఠిరవాక్యమను ఇరువది ఆరవ అధ్యాయము. (26)