27. ఇరువది ఏడవ అధ్యాయము
సంజయుని వచనములు.
సంజయ ఉవాచ
ధర్మనిత్యా పాండవ తే విచేష్టా
లోకే శ్రుతా దృశ్యతే చాపి పార్థ।
మహాశ్రావం జీవితం చాప్యనిత్యం
సంపశ్య త్వం పాండవ మా వ్యనీనశః॥ 1
సంజయుడు పలికాడు - పాండునందనా! నీ పనులన్నీ ధర్మాన్ని అనుసరించే ఉంటాయి. ఈ విషయం లోకానికంతటికి తెలిసిందే. అలా కనబడుతోంది కూడ. జీవితం అనిత్యమైనదయినా దీనివల్ల మంచికీర్తిని పొందవచ్చు. పాండునందనా! అనిత్యమైన శరీరం మీది దృష్టితో శాశ్వతమైన కీర్తిని నష్టపరచకు. (1)
న చేద్ భాగం కురవోఽన్యత్ర యుద్ధాత్
ప్రయచ్ఛేరంస్తుభ్యమజాతశత్రో।
భైక్షచర్యామంధకవృష్ణిరాజ్యే
శ్రేయో మన్యే న తు యుద్ధేన రాజ్యమ్॥ 2
అజాతశత్రూ! యుద్ధం లేకుండా కౌరవులు మీకు రాజ్యభాగం ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ అంధక వృష్ణీ రాజ్యాలలో మీరు భిక్షావృత్తిచే జీవించటం మేలు. యుద్ధం చేసి రాజ్యం పొందటం మేలు కాదని భావిస్తున్నాను. (2)
అల్పకాలం జీవితం యన్మనుష్యే
మహాస్రావం నిత్యదుఃఖం చలం చ।
భూయశ్చ తద్ యశసో నానురూపం
తస్మాత్ పాపం పాండవ మా కృథాస్త్వమ్॥ 3
మానవుని జీవితకాలం చాల తక్కువ. ఇది క్షీణించేది, నిత్యం దుఃఖమయమైంది. చంచలమైనదీ కూడా. పాండునందనా! నీవు యుద్ధరూపమైన పాపాన్ని చేయవద్దు. అది నీకీర్తికి తగినదికాదు. (3)
కామా మనుష్యం ప్రసజంత ఏతే
ధర్మస్య యే విఘ్నమూలం నరేంద్ర!
పూర్వం నరస్తాన్ మతిమాన్ ప్రణిఘ్నన్
లోకే ప్రశంసాం లభతే ఽనవద్యామ్॥ 4
రాజా! ధర్మానికి విఘ్నం కలిగించే మూలకారణం కోరికలు. అవి తమ వైపు మానవుని ఆకర్షిస్తాయి. బుద్ధిమంతుడైన మానవుడు ముందుగానే ఆ కోరికలను కట్టడిచేసి, లోకంలో స్వచ్ఛమైన ప్రశంసను పొందుతాడు. (4)
నిబంధనీ హ్యర్థతృష్ణేహ పార్థ
తామిచ్ఛతాం బాధ్యతే ధర్మ ఏవ।
ధర్మం తు యః ప్రవృణీతే స బుద్ధః
కామే గృధ్నో హీయతేఽర్థానురోధాత్॥ 5
పృథానందనా! ఈ లోకంలో ధనదాహం మానవుని బంధనంలో పడవేస్తుంది. దాన్ని కోరుకునే వారి ధర్మాన్ని అది బాధిస్తుంది. ధర్మాన్ని కోరుకొన్న వాడే తెలివైనవాడు. భోగలాలసుడైన వాడు ధనాసక్తుడై ధర్మ భ్రష్టుడౌతాడు. (5)
ధర్మం కృత్వా కర్మణాం తాత ముఖ్యం
మహాప్రతాపః సవితేవ భాతి।
హీనో హి ధర్మేణ మహీమపీమాం
లబ్ధ్వా నరః సీదతి పాపబుద్ధిః॥ 6
నాయనా! కర్మలలో ముఖ్యమైన ధర్మాన్ని ఆచరించినవాడు ప్రచండ సూర్యునిలా ప్రకాశిస్తాడు. ధర్మహీనుడైనవాడు ఈ భూమండలాన్ని పొందినప్పటికి పాపబుద్ధియై నశిస్తాడు. (6)
వేదోఽధీతశ్చరితం బ్రహ్మచర్యం
యజ్ఞైరిష్టం బ్రాహ్మణేభ్యశ్చ దత్తమ్।
పరం స్థానం మన్యమానేన భూయః
ఆత్మా దత్తో వర్షపూగం సుఖేభ్యః॥ 7
వేదాధ్యయనం చేశావు. బ్రహ్మచర్యం పాటించావు. యజ్ఞాలు చేసి, బ్రాహ్మణులకు దానమిచ్చావు. పరలోకాన్ని విశ్వసించావు. అక్కడ అనేక సంవత్సరాల సుఖాల కోసం నిన్ను నీవు అర్పించుకొన్నావు. (7)
సుఖప్రియే సేవమానోఽతివేలం
యోగాభ్యాసే యో న కరోతి కర్మ।
విత్తక్షయే హీనసుఖోఽతివేలం
దుఃఖం శేతే కామవేగప్రణున్నః॥ 8
సుఖాన్ని, ప్రియాన్ని హద్దుమీరి సేవించేవాడు, యోగాబ్యాసంలో కర్మ చేయనివాడు. ధనం క్షీణించాక, సుఖాలకు దూరమై, కోరికల తాకిడికి లోనై అంతులేని దుఃఖాన్ని పొందుతాడు. (8)
ఏవం పునర్బ్రహ్మచర్యా ప్రసక్తః
హిత్వా ధర్మం యః ప్రకరోత్యధర్మమ్।
అశ్రద్దధత్ పరలోకాయ మూఢః
హిత్వా దేహం తప్యతే ప్రేత్య మందః॥ 9
ఇదే విధంగా బ్రహ్మచర్యం పాటింపక, ధర్మాన్ని విడిచి అధర్మాన్ని ఆచరించేవాడు పరలోకంపట్ల శ్రద్ధ లేనివాడై, మూఢుడై ఈ దేహాన్ని విడిచి పరలోకంలో మిక్కిలి బాధపడతాడు. (9)
న కర్మణాం విప్రణాశో ఽస్త్యముత్ర
పుణ్యానాం వాప్యథవా పాపకానామ్।
పూర్వం కర్తుర్గచ్ఛతి పుణ్యపాపం
పశ్చాత్త్వేనమనుయాత్యేవ కర్తా॥ 10
పుణ్యకర్మలైనా, పాపకర్మలైనా ఈ లోకంలో నశించవు. ముందుగా కర్తయొక్క పుణ్యపాపాలు పరలోకం చేరతాయి. తర్వాత కర్త వాటిని అనుసరించి వెళ్తాడు. (10)
న్యాయ్యోపేతం బ్రాహ్మణేభ్యోఽథ దత్తం
శ్రద్ధాపూతం గంధరసోపపన్నమ్।
అన్వాహర్యేషూత్తమదక్షిణేషు
తథారూపం కర్మ విఖ్యాయతే తే॥ 11
మీరు ఉత్తమ దక్షిణలతో మాసిక శ్రాద్ధాది కర్మలందు బ్రాహ్మణులకు న్యాయంగా సంపాదించిన ధనాన్ని; శ్రద్ధచే పవిత్రమై, మంచి గంధరసాలతో రుచిగా ఉన్న అన్నాన్ని దానమివ్వటం ఈ భూమిపై ప్రసిద్ధమైందే కదా. (11)
ఇహ క్షేత్రే క్రియతే పార్థ కార్యం
న వై కించిద్ క్రియతే ప్రేత్య కార్యమ్।
కృతం త్వయా పారలౌక్యం చ కర్మ
పుణ్యం మహత్ సద్భిరతిప్రశస్తమ్॥ 12
కుంతీనందనా! ఈ శరీరంతో ఉండగానే ఏదైనా సత్కార్యం చేయగలం. మరణించిన తర్వాత ఏమీ చేయలేము. సత్పురుషులచే ప్రశంసింపబడిన పరలోకంలో సుఖాలనిచ్చే మహాపుణ్య కార్యాలు నీవు చేశావు. (12)
జహాతి మృత్యుం చ జరాం భయం చ
న క్షుత్పిపాసే మనసో ఽప్రియాణి।
న కర్తవ్యం విద్యతే తత్ర కించిత్
అన్యత్ర వై చేంద్రియప్రీణనాద్ధి॥ 13
పుణ్యాత్ముడైన మనుష్యుడు పరలోకానికి వెళ్లి మృత్యువును, ముసలితనాన్ని, భయాన్ని విడిచిపెడతాడు. మనస్సుకు ఇష్టంలేని ఆకలిదప్పులు అక్కడ ఉండవు. పరలోకంలో ఇంద్రియ భోగాల ననుభవించడం తప్ప ఇక కర్తవ్యమంటూ ఏమీ ఉండదు. (13)
ఏవం రూపం కర్మఫలం నరేంద్ర
మాఽత్రావహం హృదయస్య ప్రియేణ।
న క్రోధజం పాండవ హర్షజం చ
లోకావుభౌ మా ప్రహాసీశ్చిరాయ॥ 14
నరేంద్రా! మనస్సుకు ఇష్టమైన విషయ భోగాలచేత ఇటువంటి కర్మఫలం పొందలేం. పాండునందనా! నీవు క్రోధం వల్ల కలిగే నరకానికి కాని, ఆనందంవల్ల కలిగే స్వర్గానికి గాని వెళ్లజాలవు. కాని సనాతనమైన మోక్షాన్ని పొందగలవని భావం. (14)
అంతం గత్వా కర్మణాం మా ప్రజహ్యాః
సత్యం దమం చార్జవమానృశంస్యమ్।
అశ్వమేధం రాజసూయం తథేజ్యాః
పాపస్యాంతం కర్మణో మా పునర్గాః॥ 15
జ్ఞానం చేత కర్మల అంతానికి చేరుకున్న నీవు సత్యం, ధర్మం, ఋజువర్తనం, దయ మున్నగు సద్గుణాల్ని విడిచి పెట్టకు. అశ్వమేధం, రాజసూయం, యజ్ఞం మున్నగు వాటిని విడవకు, యుద్ధం వంటి పాపకార్యంజోలికి మళ్లీ వెళ్లకు. (15)
తచ్చేదేవం ద్వేషరూపేణ పార్థాః
కరిష్యధ్వం కర్మ పాపం చిరాయ।
నివసధ్వం వర్షపూగాన్ వనేషు
దుఃఖం వాసం పాండవా ధర్మ ఏవ॥ 16
కుంతీకుమారులారా! చిరకాలముండే ద్వేషంతో మీరు యుద్ధరూపమైన పాపం చేసేటట్లైతే, అనేక సంవత్సరాలు దుఃఖమయమైన ఈవనవాసం చేయడమే మీకు ధర్మం. (16)
అప్రవ్రజ్యే మా స్మ హిత్వాఽఽపురస్తాత్
ఆత్మాధీనం యద్ బలం హ్యేతదాసీత్।
నిత్యం చ వశ్యాః సచివాస్తవేమే
జనార్దనో యుయుధానశ్చ వీరః॥ 17
ఇపుడు నీ అధీనంలో ఉన్న ఈ బలమంతా మునుపు కూడా మీవెంటే ఉన్నా, మీరు వనానికి వెళ్లారు. ఇపుడున్న ఈ మంత్రులు, శ్రీకృష్ణుడు, వీరవరుడైన సాత్యకు అప్పుడు కూడా మీతోనే ఉన్నారుగదా. (17)
మత్స్యో రాజా రుక్మరథః సపుత్రః
ప్రహారిభిః సహ వీరైర్విరాటః।
రాజానశ్చ యే విజితాః పురస్తాత్
త్వామేవ తే సంశ్రయేయుః సమస్తాః॥ 18
దెబ్బకొట్టడంలో కుశలులైన వీరసైనికులతో, పుత్రులతో కూడి బంగారు రథం మీద వచ్చే మత్స్యదేశాధీశుడు విరాటుడు, మీరింతకు మునుపు జయించిన రాజులందరూ యుద్ధంలో మీ పక్షమే వహిస్తారు. (18)
మహాసహాయః ప్రతపన్ బలస్థః
పురస్కృతో వాసుదేవార్జునాభ్యామ్।
వరాన్ హనిష్యన్ ద్విషతో రంగమధ్యే
వ్యనేష్యథా ధార్తరాష్ట్రస్య దర్పమ్॥ 19
గొప్పసహాయసంపత్తితో నీవు బలవంతుడవై శ్రీకృష్ణార్జునులు ముందు వెళుతుండగా, యుద్ధరంగంలో శత్రుశ్రేష్ఠులను వధిస్తూ దుర్యోధనుడి గర్వాన్ని పోగొట్టగలవు. (19)
బలం కస్మాద్ వర్ధయిత్వా పరస్య
నిజాన్ కస్మాత్ కర్శయిత్వా సహాయాన్।
నిరుష్య కస్మాద్ వర్షపూగాన్ వనేషు
యుయుత్ససే పాండవ హీనకాలమ్॥ 20
పాండునందనా! శత్రువుల బలాన్ని పెరగనిచ్చి, నీ సహాయకులను దుర్బలులను చేసి, పన్నెండేళ్లు వనవాసం చేసి, కాలం కలసిరానపుడు ఎందుకోసం యుద్ధం చెయ్యాలనుకొంటున్నావు? (20)
అప్రాజ్ఞో వా పాండవ యుధ్యమానః
ఽధర్మజ్ఞో వా భూతిమథోఽభ్యుపైతి।
ప్రజ్ఞావాన్ వా బుధ్యమానోఽపి ధర్మం
సంస్తంభాద్ వా సోఽపి భూతేరపైతి॥ 21
పాండునందనా! మనుష్యుడుఅజ్ఞాని అయినా, పాపి ఐనా యుద్ధం చేసి సంపదను పొందుతాడు. కాని జ్ఞాని, ధర్మజ్ఞుడూ అయినవాడు దైవసంబంధమైన బాధకారణంగా పరాజితుడై ఐశ్వర్యాన్ని వదులుకొంటాడు. (21)
నాధర్మే తే ధీయతే పార్థ బుద్ధిః
న సంరంభాత్ కర్మ చకర్థ పాపమ్।
ఆత్థ కిం తత్ కారణం యస్య హేతోః
ప్రజ్ఞావిరుద్ధం కర్మ చికీర్షసీదమ్॥ 22
ధర్మజా! నీబుద్ధి అధర్మం వైపు ఎప్పుడూ వర్తించదు. కోపంవల్ల (పూర్వం) ఎపుడూ పాపకర్మనూ నీవు చెయ్యలేదు. మరి ఇపుడు ప్రజ్ఞావిరుద్ధమైన ఈపాపపు పని (యుద్ధం) చెయ్యాలని ఎందుకనుకొంటున్నావు? దీనికి కారణం ఏమిటి? (22)
అవ్యాధిజం కటుకం శీర్షరోగి
యశోముషం పాపఫలోదయం వా।
సతాం పేయం యన్న పిబంత్యసంతః
మన్యుం మహారాజ పిబ ప్రశామ్య॥ 23
మహారాజా! క్రోధం వ్యాధిలేకుండా పుడుతుంది., చేదుగా ఉంటుంది. శిరస్సును బాధిస్తుంది, కీర్తిని నాశనం చేస్తుంది. పాపపు పనిని చేయిస్తుంది. అది సత్పురుషులు మ్రింగగలిగింది, దుర్మార్గులు మ్రింగలేనిది, అటువంటి క్రోధాన్ని శాంతింపజేసి మింగెయ్యి. (23)
పాపానుబంధం కో ను తం కామయేత
క్షమైవ తే జ్యాయసీ నోత భోగాః।
యత్ర భీష్మః శాంతనవో హతః స్యాద్
యత్ర ద్రోణః సహపుత్రో హతః స్యాత్॥ 24
పాపంతో కలసి వచ్చే కోపాన్ని ఎవడు కోరుకొంటాడు? నీకు సమానమే మంచిది. భోగాలు కావు. శాంతనవుడైన భీష్ముడూ, అశ్వత్థామా, ద్రోణుడూ చంపబడే భోగం నీకు వద్దు. (24)
కృపః శల్యః సౌమదత్తి ర్వికర్ణః
వివింశతిః కర్ణ దుర్యోధనౌ చ।
ఏతాణ్ హత్వా కీదృశం తత్ సుఖం స్యాద్
యద్ విందేథాస్తదను బ్రూహి పార్థ॥ 25
ధర్మజా! కృపుడు, శల్యుడు, భూరిశ్రవుడు, వికర్ణుడు, వివింశతి, కర్ణ దుర్యోధనులు - వీరందిరినీ చంపి నీవేం సుఖం పొందుతావు? చెప్పు. (25)
లబ్ధ్వాపీమాం పృథివీం సాగరాంతాం
జరామృత్యూ నైవ హి త్వం ప్రజహ్యాః।
ప్రియాప్రియే సుఖదుఃఖే చ రాజన్
ఏవం విద్వాన్ నైవ యుద్ధం కురు త్వమ్॥ 26
రాజా! సాగరపర్యంతం వ్యాపించిన ఈ భూమండలాన్ని పొందినా నీవు జరా మృత్యువులను, ప్రియా ప్రియాలను, సుఖ దుఃఖాలను విడిచి పెట్టలేవు. నీవు విద్వాంసుడవు. నీవు యుద్ధం చేయవద్దు. (ద్వంద్వాలు జయించలేవని భావం) (26)
అమాత్యానాం యది కామస్య హేతోః
ఏవం యుక్తం కర్మ చికీర్షసి త్వమ్।
అపక్రామేః స్వం ప్రదాయైవ తేషాం
మా గాస్త్వం వై దేవయానాత్ పథోఽద్య॥ 27
నీమంత్రులు కోరికవల్ల నీవిటువంటి పని చెయ్యాలనుకొంటూంటే, వారికి ధనమిచ్చి పంపి, వానప్రస్థాన్ని స్వీకరించు, అంతేకాని దేవయాన మార్గం నుండి మాత్రం తప్పుకోకు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి సంజయవాక్యే సప్తమోఽధ్యాయః॥ 27 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున సంజయ యానపర్వమను ఉపపర్వమున సంజయవాక్యమను ఇరువది ఏడవ అధ్యాయము. (27)