29. ఇరువది తొమ్మిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి సందేశమిచ్చుట.

వాసుదేవ ఉవాచ
అవినాశం సంజయ పాండవానామ్
ఇచ్ఛామ్యహం భూతిమేషాం ప్రియం చ।
తథా రాజ్ఞో ధృతరాష్ట్రస్య సూత
సమాశంసే బహుపుత్రస్య వృద్ధిమ్॥ 1
వాసుదేవుడు చెప్పనారంభించాడు.
సంజయా! ఈ పాండవుల క్షేమాన్ని ఐశ్వర్యాన్ని, ప్రియాన్ని కోరుకొంటున్నాను. అదే విధంగా బహుపుత్రులుగల ధృతరాష్ట్రుని అభివృద్ధినీ కాంక్షిస్తాను. (1)
కామో హి మే సంజయ నిత్యమేవ
నాన్యద్ బ్రూయాం తాన్ ప్రతి శామ్యతేతి।
రాజ్ఞశ్చ హి ప్రియమేతచ్ఛృణోమి
మన్యే చైతత్ పాండవానాం సమక్షమ్॥ 2
సూతా! నేను ఇద్దరినీ శాంతించమనే చెప్తాను. నా కోరిక కూడ అదే. మరొకటి నే చెప్పను. ధర్మరాజు నోటివెంట కూడ పాండవుల సమక్షంలో ఈ ప్రియవచనాన్నే వింటున్నాను. ఇది మంచిదనే భావిస్తున్నాను. (2)
సుదుష్కరస్తత్ర శమో హి నూనం
ప్రదర్శితః సంజయ పాండవేన।
యస్మిన్ గృద్ధో ధృతరాష్ట్రః సపుత్రః
కస్మాదేషాం కలహో నావమూర్ఛేత్॥ 3
సంజయా! పాండునందనుడైన ధర్మరాజు చెప్పింది చూస్తే శాంతిని సాధించడం కష్టం. ఇది నిశ్చయం, ఎందుకంటే పుత్రపక్షపాతి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రులతో బాటు ఈ రాజ్యాన్ని ఆశిస్తూ ఉంటే, ఇక వీరికి యుద్ధం రాకుండా ఎలా ఉంటుంది? (3)
వి॥తె॥ దీన్ని తెలుగులో తిక్కన స్పష్టంగా చెప్పాడు.
పాండవాగ్రజన్ముపలుకుల చందంబు
చూడ సంధిలేని చొప్పు దోఁచె.
ఉద్యో 1-338
ధర్మరాజు మాటలు చూస్తే సంధి కుదరదనిపిస్తోంది - అని.
న త్వం ధర్మం విచరం సంజయేహ
మత్తశ్చ జానాసి యుధిష్ఠిరాచ్చ।
అథో కస్మాత్ సంజయ పాండవస్య
ఉత్సాహినః పూరయతః స్వకర్మ॥ 4
యథాఽఽఖ్యాతమావసతః కుటుంబే
పురా కస్మాత్ సాధు విలోపమాత్థ।
అస్మిన్ విధౌ వర్తమానే యథావద్
ఉచ్చావచా మతయో బ్రాహ్మణానామ్॥ 5
సంజయా! నావల్లకాని యుధిష్ఠిరుని వల్లకాని ఢ్ నీవు - బాగా ఎరుగుదువు. యుధిష్ఠిరుడు ఉత్సాహంతో స్వధర్మాన్ని ఆచరిస్తాడు. శాస్త్రవిధానంలో గృహస్థధర్మం పాటిస్తాడు. అట్టివాడు ధర్మలోపం చేస్తాడేమోనని నీవు ముందుగానే ఎందుకు శంకిస్తున్నావు? గృహస్థాశ్రమవిషయంలో వేదజ్ఞులైన బ్రాహ్మణులలోనే భిన్నాభిప్రాయాలున్నాయి. (4,5)
కర్మణాఽఽహుః సిద్ధిమేకే పరత్ర
హిత్వా కర్మ పద్యయా సిద్ధిమేకే।
నాభుంజానో భక్ష్య భోజ్యస్య తృప్యేద్
విద్వానపీహ విహితం బ్రాహ్మణానామ్॥ 6
కొందరు కర్మయోగం ద్వారా పరలోక సిద్ధిని పొందవచ్చని చెప్పారు. మరికొందరు కర్మత్యాగం చేసి జ్ఞానంచేత మోక్షం పొందవచ్చన్నారు. విద్వాంసుడు కూడ ఈ లోకంలో భక్ష్యభోజ్యాలు తినకుండా తృప్తినొందలేడు. అందువల్లే బ్రహ్మ విద్యానిష్ఠ కలవారికి కూడా ఆకలి తీరటం కోసం భోజనవిధిని శాస్త్రం చెపుతోంది. (6)
వి॥సం॥ గార్హస్థ్వం పన్యాసం రెండూ సమానమని శాస్త్రాలు విధించినా గృహస్థాశ్రమమే మిన్న, ఆశ్రమాంతర సాధ్యమైన జ్ఞానాన్ని గృహస్థుడు కూడా పొందవచ్చు. కాని గృహస్థుడు చేయగల యజ్ఞాది కర్మలు ఇతరాశ్రమాలలో కుదరవు. (నీల)
యా వై విద్యాః సాధయంతీహ కర్మ
తాసాం ఫలం విద్యతే నేతరాసామ్।
తత్రేహ వై దృష్టఫలం తు కర్మ
పీత్వోదకం శామ్యతి తృష్ణయాఽఽర్తః॥ 7
కర్మను సాధించే విద్యలకే ఈ లోకంలో ఫలం కనబడుతోంది. ఇతర విద్యలకు కాదు. విద్యాకర్మలలో కర్మయొక్క ఫలమే ప్రత్యక్షంగా కనబడుతుంది. దప్పికతో బాధపడేవాడు నీటిని త్రాగితేనే దప్పిక తీరుతుంది. (7)
సోఽయం విధిర్విహితః కర్మణైవ
సంవర్తతే సంజయ తత్ర కర్మ।
తత్ర యోఽన్యత్ కర్మణః సాధు మన్యేత్
మోఘం తస్యాలపితం దుర్బలస్య॥ 8
సంజయా! జ్ఞానమార్గం కూడా కర్మతోబాటు ఉండవలసిందే. జ్ఞానంలో కూడ కర్మ ఉంటుంది. కర్మ కంటె కర్మత్యాగమే గొప్పదని భావించేవాడు దుర్బలుడు. అతని మాటలు వ్యర్థములైనవి. (8)
కర్మణామీ భాంతి దేవాః పరత్ర
కర్మణైవేహ ప్లవతే మాతరిశ్వా।
అహోరాత్రే విదధత్ కర్మణైవ
అతంద్రితో నిత్యముదేతి సూర్యః॥ 9
కర్మచేతనే ఈ దేవతలు స్వర్గలోకంలో ప్రకాశిస్తున్నారు. కర్మవల్లనే ఇహలోకంలో గాలి వీస్తోంది. రాత్రింబవళ్లను ఏర్పరిచే సూర్యుడు కూడా కర్మ వల్లనే అలసత లేకుండా ప్రతిరోజూ ఉదయిస్తున్నాడు. (9)
మాసార్థమాసానథ నక్షత్రయోగాన్
అతంద్రితశ్చంద్రమాశ్చాభ్యుపైతి।
అతంద్రితో దహతే జాతవేదాః
సమిధ్యమానః కర్మ కుర్వన్ ప్రజాభ్యః॥ 10
చంద్రుడు కూడ కర్మచేతనే అలసత్వం లేక మాసాలను, పక్షాలను, నక్షత్రాలతో కలయికను పొందుతున్నాడు. అగ్నికూడ అలసత్వం లేకుండా ప్రజలకోసం కర్మచేస్తూనే ప్రజ్వలిస్తున్నాడు. (10)
అతంద్రితా భారమిమం మహాంతం
బిభర్తి దేవీ పృథివీ బలేన।
అతంద్రితాః శీఘ్రమపో వహంతి
సంతర్పయంత్యః సర్వభూతాని నద్యః॥ 11
కర్మచేతనే ఈ భూదేవి అలసత లేకుండా ఇంతటి మహాభారాన్ని మోస్తోంది. నదులు కూడ కర్మవల్లనే అలసత్వం లేకుండా సర్వభూతాలను తృప్తి పరుస్తూ నీటితో వేగంగా ప్రవహిస్తున్నాయి. (11)
అతంద్రితో వర్షతి భూరితేజాః
సంనాదయన్నంతరిక్షం దిశశ్చ।
అతంద్రితో బ్రహ్మచర్యం చచార
శ్రేష్ఠత్వమిచ్ఛన్ బలభిద్ దేవతానామ్॥ 12
గొప్ప తేజస్సుగల మేఘం కూడా అలసత్వం లేకుండా అంతరిక్షాన్నీ, దిక్కులనూ ఆనందింపజేస్తూ వర్షిస్తోంది. దేవతలలో శ్రేష్ఠత్వాన్ని కోరుకొనే ఇంద్రుడు కూడ అలసత్వం విడిచిపెట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాడు. (12)
హిత్వా సుఖం మనసశ్చ ప్రియాణి
తేన శక్రః కర్మణా శ్రైష్ఠ్యమాప।
సత్యం ధర్మం పాలయన్నప్రమత్తః
దమం తితిక్షాం సమతాం ప్రియం చ॥ 13
ఏతాని సర్వాణ్యుపసేవమానః
స దేవరాజ్యం మఘవాన్ ప్రాప ముఖ్యమ్।
బృహస్పతిర్బ్రహ్మచర్యం చచార
సమాహితః సంశితాత్మా యథావత్॥ 14
హిత్వా సుఖం ప్రతిరుధ్యేంద్రియాణి
తేన దేవానామగమద్ గౌరవం సః।
తథా నక్షత్రాణి కర్మణాముత్ర భాంతి
రుద్రాదిత్యా వసవోఽథాపి విశ్వే॥ 15
సుఖాన్ని, మనస్సుకిష్టమైన వాటిని విడిచిపెట్టి ఇంద్రుడు కర్మచేతనే శ్రేష్ఠత్వాన్ని పొందాడు. అప్రమత్తుడై సత్యధర్మాలను రక్షిస్తూ, ఇంద్రియనిగ్రహాన్ని, సహనాన్ని, సమత్వాన్ని, ప్రేమను సేవిస్తూ ఇంద్రుడు ముఖ్యమైన దేవరాజ్యాన్ని పొందాడు. ఇలాగే బృహస్పతి ఏకాగ్రమైన సంయత చిత్తంతో, సుఖాన్ని విడిచిపెట్టి, ఇంద్రియాల్ని నిరోధించి, బ్రహ్మచర్యాన్ని పాటించి, దేవతల గౌరవాన్ని(గురుస్థానాన్ని) పొందాడు. అదే విధంగా నక్షత్రాలు, రుద్రాదిత్యులు కర్మ చేతనే ఈ విశ్వంలో ప్రకాశిస్తున్నారు. (13,14,15)
యమో రాజా వైశ్రవణః కుబేరః
గంధర్వయక్షాప్సరసశ్చ సూత।
బ్రహ్మవిద్యాం బ్రహ్మచర్యం క్రియాం చ
నిషేవమాణా ఋషయోఽముత్ర భాంతి॥ 16
యమధర్మరాజు, విశ్రవుని కుమారుడైన కుబేరుడు, గంధర్వులు, యక్షులు, అప్సరసలు, ఋషులు, వీరంతా బ్రహ్మవిద్యనూ, బ్రహ్మచర్యాన్నీ కర్మలనూ సేవిస్తూ ప్రకాశిస్తున్నారు. (16)
జానన్నిమం సర్వలోకస్య ధర్మం
విప్రేంద్రాణాం క్షత్రియాణాం విశాం చ।
స కస్మాత్ త్వం జానతాం జ్ఞానవాన్ సన్
వ్యాయచ్ఛసే సంజయ కౌరవార్థే॥ 17
సంజయా! శ్రేష్ఠులైన బ్రాహ్మణుల, క్షత్రియ, వైశ్యుల యొక్క సర్వ లోక ధర్మాన్ని తెలిసికొని కూడ, జ్ఞానులలో శ్రేష్ఠుడవై కూడా కౌరవుల స్వార్థంకోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావు? (17)
ఆమ్నాయేషు నిత్యసంయోగమస్య
తథాశ్వమేధే రాజసూయే చ విద్ధి।
సంయుజ్యతే ధనుషా వర్మణా చ
హస్త్వశ్వాద్యై రథశస్త్రైశ్చ భూయః॥ 18
తే చేదిమే కౌరవాణా ముపాయమ్
అవగచ్ఛేయురవధేనైవ పార్థాః।
ధర్మత్రాణం పుణ్యమేషాం కృతం స్యాద్
ఆర్యే వృత్తే భీమసేనం నిగృహ్య॥ 19
యుధిష్ఠిరుడు వేదశాస్త్రాలతో, అశ్వమేధ రాజసూయాలతో, నిత్యసంబంధం కలవాడు, ధనుస్సు, కవచం నిత్యం ధరిస్తూ ఉంటాడు. ఏనుగు, గుర్రం మొదలగు వాహనాలతోను, రథశస్త్రాలతోను నిత్యసంబంధం గలవాడు. ఈ పాండవులు కౌరవుల వధలేకుండా రాజ్యప్రాప్తికి ఏదైనా ఉపాయం కనుక్కోగలిగితే, ఆర్యవర్తనమయిన అహింసలో భీమసేనుని ప్రవృత్తిని కట్టడిచేసి, ధర్మరక్షణ చేసి పుణ్యాన్ని పొందుతారు. (18,19)
సం॥వి॥ శ్లోకపూర్వార్ధంచే ధర్మజుని ధర్మనిష్ఠ తెలుపబడింది. ఉత్తరార్ధంలో అతని క్షాత్రం సూచింపబడింది. అనగా ధార్మికుడు కాబట్టి హింసను చేయడు. కాని క్షాత్ర ధర్మంగా శత్రువుల్ని వధిస్తాడు. అని అభిప్రాయం. (సర్వ)
తే చేత్ పిత్ర్యే కర్మణి వర్తమానాః
ఆపద్యేరన్ దిష్టవశేన మృత్యుమ్।
యథా శక్త్వా పూరయంతః స్వకర్మ
తదప్యేషాం నిధనం స్యాత్ ప్రశస్తమ్॥ 20
పాండవులు తమపితృసంబంధమైన క్షాత్ర ధర్మంలో ప్రవర్తిస్తూ యథాశక్తిగా తమ కర్తవ్యాన్ని పరిపాలిస్తూండగా, దైవవశం చేత మృత్యువును కూడా పొందవచ్చు. అటువంటి మృత్యువు కూడ వారికి మంచిదే. (20)
ఉతాహో త్వం మన్యసే శామ్యమేవ
రాజ్ఞాం యుద్ధే వర్తతే ధర్మతంత్రమ్।
అయుద్ధే వా వర్తతే ధర్మతంత్రం
తథైవ తే వాచమిమాం శృణోమి॥ 21
అలా కాక శాంతిని వహించడమే యుక్తమని నీవు భావిస్తూంటే, యుద్ధం చేసే రాజుల ధర్మతంత్రం యుక్తంగా ఉంటుందో, యుద్ధాన్ని వదిలి శాంతిని వహించే వారి ధర్మతంత్రం యుక్తంగా ఉంటుంధో నీవే చెప్పు. నీ మాటనే నేను వింటా. (21)
వి॥సం॥ స్వం చ కర్మ = మీ పని - సభలో ద్రౌపదిని కొప్పు వట్టి ఈడ్చుట మొదలగునవి. పాండవానాం కర్మ = పాండవుల కర్మ - నియమాన్ని అనుసరించి వనవాస, అజ్ఞాతవాసాలను పూర్తి చేయటం (అర్జు - దుర్ఘ)
చాతుర్వర్ణ్యస్య ప్రథమం సంవిభాగమ్
అవేక్ష్య త్వం సంజయ స్వం చ కర్మ।
నిశమ్యాథో పాండవానాం చ కర్మ
ప్రశంశ వా నింద వా యా మతిస్తే॥ 22
సంజయా! నీవు ముందుగా బ్రాహ్మణులు మొదలయిన నాలుగు వర్ణాలను, వారి వారి ధర్మాలను గూర్చి బాగా తెలుసుకో. అపుడు పాండవులు చేసే ఇప్పటి పనిమీద దృష్టి సారించు. అటు తరువాత ఆలోచించి వారిని ప్రశంసించడం కాని, నిందించడం కాని చెయ్యి. (22)
అధీయీత బ్రాహ్మణో వై యజేత
దద్యాదీయాత్ తీర్థముఖ్యాని చైవ।
అధ్యాపయేద్ యాజయేచ్చాపి యాజ్యాన్
ప్రతిగ్రహాన్ వా విహితాన్ ప్రతీచ్చేత్॥ 23
బ్రాహ్మణుడు అధ్యయనం, యజ్ఞం, దానం, తీర్థయాత్రలు, శిష్యులకు చదువు చెప్పడం, యజమానులచే యజ్ఞం చేయించడం, శాస్త్ర విహితమైన ప్రతిగ్రహం (తీసికోవడం) అనేవి చేయాలి. (23)
(అధీయీత క్షత్రియోఽథో యజేత
దద్యాద్ దానం న తు యాచేత కించిత్।
న యాజయే న్నాపి చాధ్యాపయీత
ఏష స్మృతః క్షత్రిధర్మః పురాణః॥)
ఇక క్షత్రియుడు అధ్యయనం చెయ్యాలి. దానం చెయ్యాలి. యజ్ఞం చేయించరాదు. అధ్యాపనం చేయరాదు. ప్రతిగ్రహం చేయరాదు యాచించరాదు. ఇది క్షత్రధర్మం.)
తథా రాజన్యో రక్షణం వై ప్రజానాం
కృత్వా ధర్మేనాప్రమత్తోఽథ దత్త్వా।
యజ్ఞైరిష్ట్వా సర్వవేదానధీత్య
దారాన్ కృత్వా పుణ్యకృదావసేద్ గృహాన్॥ 24
స ధర్మాత్మా ధర్మమధీత్య పుణ్యం
యదిచ్ఛాయా వ్రజతి బ్రహ్మలోకమ్।
క్షత్రియుడు ధర్మాన్ని అనుసరిస్తూ అప్రమత్తుడై, ప్రజలను రక్షించాలి. దానం, యజ్ఞం, సంపూర్ణ వేదాధ్యయనం చేసి, వివాహం చేసికొని పుణ్యకర్మానుష్ఠానం చేస్తూ గృహస్థాశ్రమంలో ఉండాలి. ఇలా ఉండే ధర్మాత్ముడైన క్షత్రియుడు పుణ్యాన్ని సంపాదించి, తన ఇచ్ఛానుసారం బ్రహ్మలోకాన్ని చేరుతాడు. (24 1/2)
వైశ్యోఽధీత్య కృషిగోరక్షపణ్యైః
విత్తం చిన్వన్ పాలయన్నప్రమత్తః॥ 25
ప్రియం కుర్వన్ బ్రాహ్మణ క్షత్రియాణాం
ధర్మశీలః పుణ్యకృదావసేద్ గృహాన్।
వైశ్యుడు అధ్యయనం చేసి కృషి, గోరక్షణ, వ్యాపారాలతో ధనాన్ని సంపాదించి అప్రమత్తుడై దాన్ని రక్షిస్తూ, బ్రాహ్మణ క్షత్రియులకు ప్రియాన్ని చేకూరుస్తూ, ధర్మశీలుడై గృహస్థాశ్రమంలో ఉండాలి. (25 1/2)
పరిచర్యా వందనం బ్రాహ్మణానాం
నాధీయీత ప్రతిషిద్ధోఽస్య యజ్ఞః।
నిత్యోత్థితో భూతయేఽతంద్రితః స్యాద్
ఏవం స్మృతః శూద్రధర్మః పురాణః॥ 26
శూద్రుడు బ్రాహ్మణులను సేవించాలి, నమస్కరించాలి. వేదాధ్యయనమూ, యజ్ఞమూ అతనికి నిషిద్ధం. నిత్యం కృషీవలుడై అలసత లేకుండా తన అభివృద్ధికి పని చెయ్యాలి. ఇది పురాతనమైన శూద్రధర్మం. (26)
ఏతాన్ రాజా పాలయన్నప్రమత్తః
నియోజయన్ సర్వవర్ణాన్ స్వధర్మే।
అకామాత్మా సమవృత్తిః ప్రజాసు
నాధార్మికాననురుధ్యేత కామాన్॥ 27
వీరందరినీ రాజు అప్రమత్తుడై పాలించాలి. అన్ని వర్ణాలవారిని వారి వారి ధర్మాలలో నియోగించాలి. భోగాసక్తి లేకుండా ప్రజలపట్ల సమభావంతో ప్రవర్తించాలి. అధార్మికాలైన కోరికల్ని ఎపుడూ అనుసరించకూడదు. (27)
శ్రేయాం స్తస్మాద్ యది విద్యేత కశ్చిద్
అభిజ్ఞాతః సర్వధర్మోపపన్నః।
స తం ద్రష్టుమనుశిష్యాత్ ప్రజానాం
న చైతద్ బుధ్యేదితి తస్మిన్న సాధుః॥ 28
కాబట్టి తన రాజ్యంలో సర్వధర్మాలూ తెలిసిన శ్రేష్ఠమైన వ్యక్తి ఎవరైనా ఉంటే, అతనిని ప్రజల గుణదోషాలను తెలిసికోవడానికి నియోగించాలి. అతని ద్వారా తన రాజ్యంలో పాపకర్మ చేసే వాడెవడూ లేడని తెలిసికోవాలి. (28)
వి॥సం॥ ఇచట తస్మాత్ అంటే యుధిష్ఠిరాత్ = యుధిష్ఠిరునికంటె జ్ఞానవంతుడుంటే... (అర్జు, సర్వ) ఇదే భావాన్ని నీలకంఠుడు వివరించాడు.
యదా గృధ్యేత్ పరభూతౌ నృశంసః
విధిప్రకోపాద్ బలమాదదానః।
తతో రాజ్ఞామభవద్ యుద్ధమేతత్
తత్ర జాతం వర్మ శస్త్రం ధనుశ్చ॥ 29
ఇతరుల సొత్తుపై ఆశపడి దాన్ని సంగ్రహించే ప్రయత్నంలో విధిప్రేరితుడై కోపంతో సొంతసైన్యాన్ని కూర్చుకోవడం ప్రారంభించే క్రూరుడైన రాజుకూ, ఇతరులకూ యుద్ధం ఏర్పడినప్పుడు అందులోంచి పుట్టినవే ఈ ధనుస్సు, శస్త్రము, కవచమూను. (29)
ఇంద్రేణైతద్ దస్యువధాయ కర్మ।
ఉత్పాదితం వర్మ శస్త్రం ధనుశ్చ॥ 30
ఇటువంటి దోపిడీ దారుల్ని చంపడంకోసమే ఇంద్రుడు కవచాన్ని, శస్త్రాన్ని ధనుస్సును తయారు చేశాడు. (30)
సం.వి. దోపిడీదారుడైన దుర్యోధనుని చంపడం పాండవులకు ధర్మమే అవుతుంది. (నీల)
తత్ర పుణ్యం దస్యువధేన లభ్యతే
సోఽయం దోషః కురుభిస్తీవ్రరూపః।
అధర్మజ్ఞైర్ధర్మమబుధ్యమానైః
ప్రాదుర్భూతః సంజయ సాధు తన్న॥ 31
అటువంటి యుద్ధంలో దొంగలను చంపడం వల్ల రాజులకు పుణ్యం వస్తుంది. సంజయా! ఇతరుల సొత్తు నపహరించడమనే దోషం కౌరవుల పక్షంలో తీవ్రరూపంలో ప్రకటితమైంది. అధర్మమే తెలిసి, ధర్మాన్ని తెలియని కౌరవులు చేసినపని మంచిది కాదు. (31)
సం॥వి॥ ఇంద్రుని వల్ల పారదార్యదోషం పుట్టినల్లు కౌరవుల వల్ల ఈ వంచనారూపమైన దోషం ఏర్పడింది. (నీల)
తత్ర రాజా ధృతరాష్ట్రః సపుత్రః
ధర్మ్యం హరేత్ పాండవానామకస్మాత్।
నావేక్షంతే రాజధర్మం పురాణం
తదన్వయాః కురవః సర్వ ఏవ॥ 32
ఆ ధృతరాష్ట్ర మహారాజు పుత్రులతో కలిసి పాండవులకు ధర్మంగా చెందవలసిన రాజ్యాన్ని అకారణంగా హరించాడు. అతనిని అనుసరించే కౌరవులంతా పురాతనమైన రాజధర్మాన్ని గమనించటం లేదు. (32)
స్తేనో హరేద్ యత్ర ధనం హ్యదృష్టః
ప్రసహ్య వా యత్ర హరేత దృష్టః।
ఉభౌ గర్హ్యౌ భవతః సంజయైతౌ
కిం వై పృథక్త్వం ధృతరాష్ట్రస్య పుత్రే॥ 33
దొంగ ఎవరూ చూడకుండా ఇతరుల ధనాన్ని అపహరిస్తాడు. ఒకవేళ ఇతరుల కంటబడితే, వారిని బంధించి అపహరిస్తాడు. ఈ రెండు దశల్లోనూ కూడ దొంగ దోపిడీదారుగా నిందింపదగినవాడే అవుతాడు. సంజయా! వారిద్దరూ నీ దృష్టిలో నిందింపదగిన వారే కదా! మరి ధృతరాష్ట్ర పుత్రునికి వారికి తేడా ఏముంది? (33)
సోఽయం లోభాన్మన్యతే ధర్మమేతం
యమిచ్ఛతి క్రోధవశానుగామీ।
భాగః పునః పాండవానాం నివిష్టః
తం నః కస్మాదాదదీరన్ పరే వై॥ 34
దుర్యోధనుడు లోభంవల్ల తానా రాజ్యాన్ని కోరుకోవడం ధర్మమే అనుకొంటున్నాడు. అతడు క్రోధం త్రిప్పినట్లు తిరుగుతున్నాడు. పైగా పాండవుల భాగం కౌరవుల దగ్గర న్యాసంగా ఉంచినది. (34)
అస్మిన్ పదే యుధ్యతాం నో వధోఽపి
శ్లాఘ్యః పిత్ర్యం పరరాజ్యాద్ విశిష్టమ్।
ఏతాన్ ధర్మాన్ కౌరవాణాం పురాణాన్
ఆచక్షీథాః సంజయ రాజమధ్యే॥ 35
సంజయా! పిత్ర్యమైన రాజ్యభాగాన్ని పొందడం కోసం యుద్ధం చేస్తూ మా పాండవులు వధింపబడినా, అది వారికి గొప్పదే. ఇతరుల రాజ్యం కంటె పిత్ర్యమైన రాజ్యం విశిష్టమైంది కదా! పురాతనమైన ఈ ధర్మాలను నీవు రాజులందరి సమక్షంలో కౌరవులకు చెప్పు. (35)
ఏతే మదన్మృత్యువశాభిపన్నాః
సమానీతా ధార్తరాష్ట్రేణ మూఢాః।
ఇదం పునః కర్మ పాపీయ ఏవ
సభామధ్యే పశ్య వృత్తం కురూణామ్॥ 36
యుద్ధంకోసం దుర్యోధనుడు సమావేశపరిచిన ఈ రాజులందరూ మూఢులై గర్వం వల్ల మృత్యువశం చెందుతారు. సంజయా! సభామధ్యంలో కౌరవులు చేసినపని ఎంతటి పాపంతో నిండిందో! ఒకసారు వారి దురాచారాలపట్ల దృష్టి సారించు. (36)
ప్రియాం భార్యాం ద్రౌపదీం పాండవానాం
యశస్వినీం శీలవృత్తోపపన్నామ్।
యదుపైక్షంత కురవో భీష్మముఖ్యాః
కామానుగేనోపరుద్ధాం వ్రజంతీమ్॥ 37
ద్రౌపది పాండవులకు ప్రియమైన భార్య. యశస్విని, శీలవతి, సదాచార సంపత్తిగలది. అట్టి ద్రౌపదిని రజస్వలావస్థలో ఉండగా సభలోకి లాక్కువచ్చారు. భీష్మాది కౌరవముఖ్యులు కూడా దానిని ఉపేక్షించారు. (37)
వి॥సం॥ కామానుగేన = రజస్సుచేత; ఉపరుద్ధామ్ = గృహకృత్యాలనుండి నిరోధింపబడిన - (నీల)
తం చేత్ తదా తే సుకుమారవృద్ధాః
అవారయిష్యన్ కురవః సమేతాః।
మమ ప్రియం ధృతరాష్ట్రోఽ కరిష్యత్
పుత్రాణాం చ కృతమస్యాభవిష్యత్॥ 38
పిల్లలనుండి వృద్ధులవరకు కౌరవులంతా కలిసి ఆ దుఃశాసనుని అప్పుడు నివారించి ఉంటే, ధృతరాష్ట్రుడు నాకెంతో ప్రియాన్ని చేసి యుండేవాడు. అతని కుమారులకూ ప్రియం కలిగేది. (38)
దుఃఖాసనః ప్రాతిలోమ్యా న్నినాయ
సభామధ్యే శ్వశురాణాం చ కృష్ణామ్।
సా తత్ర నీతా కరుణం వ్యపేక్ష్య
నాన్యం క్షత్తుర్నాథమవాప కించిద్॥ 39
వదినగారనే మర్యాద లేకుండా దుశ్శాసనుడు అక్రమంగా ద్రౌపదిని మామగార్ల సభామధ్యంలోకి లాగుకొని వచ్చాడు. ఆమె దీనంగ నలుదిక్కులూ చూసి, విదురుడు తప్ప తన్ను రక్షించేవాడు లేడని గ్రహించింది. (39)
కార్పణ్యాదేవ సహితాస్తత్ర భూపాః
నాశక్నువన్ ప్రతివక్తుం సభాయామ్।
ఏకః క్షత్తా ధర్మ్యమర్థం బ్రువాణః
ధర్మబుద్ధ్యా ప్రత్యువాచాల్పబుద్ధిమ్॥ 40
అక్కడ సమావేశమైన రాజులంతా దైన్యంవల్ల అన్యాయాన్ని వ్యతిరేకించలేకపోయారు. విదురుడొక్కడే తన ధర్మాన్ని గుర్తించి మందబుద్ధియైన దుర్యోధనుడికి ధర్మసహితమైన మాటలు చెప్పి ఆ అన్యాయాన్ని వ్యతిరేకించారు. (40)
అబుద్ధ్వా త్వం ధర్మమేతం సభాయామ్
అథేచ్ఛసే పాండవస్యోపదేష్టుమ్।
కృష్ణా త్వేతత్ కర్మ చకార శుద్ధమ్
సుదుష్కరం తత్ర సభాం సమేత్య॥ 41
యేన కృచ్ఛ్రాత్ పాండవానుజ్జహార
తథాఽఽత్మానం నౌరివ సాగరౌఘాత్।
యత్రాబ్రవీత్ సూతపుత్రః సభాయాం
కృష్ణాం స్థితాం శ్వశురాణాం సమీపే॥ 42
న తే గతిర్విద్యతే యాజ్ఞసేని
ప్రపద్య దాసీ ధార్తరాష్ట్రస్య వేశ్మ।
పరాజితాస్తే పతయో న సంతి
పతిం చాన్యం భావిని త్వం వృణీష్వ॥ 43
సంజయా! నాటి ద్యూత సభలో జరిగిన ఈ అన్యాయం గుర్తులేక ధర్మరాజుకు ధర్మోపదేశం చేయాలనుకొంటున్నావు. ద్రౌపది ఆ రోజు సభలోకి వెళ్లి మిక్కిలి కష్టసాధ్యమైన, పవిత్రమైన పని చేసింది. సముద్రం నుండి నావను ఉద్ధరించినట్లు, పెద్దకష్టం నుండి పాండవులనూ, తన్నూ ఉద్ధరించింది. మామగార్ల సమక్షంలో ఉన్న ద్రౌపదిని సభలో సూతపుత్రుడు కర్ణుడు ఇలా అన్నాడు - యాజ్ఞసేనీ! నీకు వేరే దిక్కులేదు. దాసిగా దుర్యోధనుని భవనంలో ప్రవేశించు, పాండవులు జూదంలో ఓడిపోయాయి. అందువల్ల నీకు భర్తలేడు. ఇక పై నీవు వేరొకభర్తను వరించుకో. (41, 42, 43)
యో బీభత్సో ర్హృదయే ప్రోత ఆసీత్
అస్థిచ్ఛిందన్ మర్మఘాతీ సుఘోరః।
కర్ణాచ్ఛరో వాఙ్మయస్తిగ్మతేజాః
ప్రతిష్ఠితో హృదయే ఫాల్గునస్య॥ 44
కర్ణుని నోటినుండి వెలువడ్డ ఘోరమైన, పరుషమైన తీక్ష్ణమైన ఆ మాటలబాణాలు అర్జునుని చెవుల ద్వారా లోనికి ప్రవేశించి, ఎముకలను పిండిచేసి, హృదయంలో నాటుకొని ఆయువుపట్టులను బాధిస్తున్నాయి. (44)
వి॥తె॥ నరునకు నది వాఙ్మయమగు
శరమై హృదయంబు నాఁటి చలియింపక దు
ర్భర వేదనఁ జేయంగాఁ
జిరకాలము దచ్చికిత్స సేసెనె చెపుమా!
ఉద్యో-1-351
కృష్ణాజినాని పరిధిత్సమానాన్
దుఃశాసనః కటుకాన్యభ్యభాషత్।
ఏతే సర్వే షండతిలా వినష్టాః
క్షయం గతా నరకం దీర్ఘకాలమ్॥ 45
అడవికి వెళ్లడంకోసం కృష్ణాజినాలను ధరించాలను కొంటున్న పాండవులను దుఃశాసనుడు 'వీరంతా నపుంసకులు. చచ్చుదద్ధమ్మలు - చాలాకాలం నరకంలో పడిపోయారు' అని పరుషంగా మాట్లాడాడు. (45)
వి॥తె॥ ఈ మాటలకు ముక్తాయింపుగా కృష్ణుడు "పెద్దకాలంబేని వీరలుగొడ్డుపోయిరి గాక - వీరిదెన వారికి నేమి ఫలించె? (నిజంగానే వీరుగొడ్డుపోయారు - ఎందుచేతనంటే వీరివల్ల వారికి ఏమి వచ్చింది గనుక? అని భావం)
గాంధారరాజః శకుని ర్నికృత్యా
యదబ్రవీద్ ద్యూతకాలే స పార్థమ్।
పరాజితో నందనః కిం తవాస్తి
కృష్ణయా త్వం దీవ్య వై యాజ్ఞసేన్యా॥ 46
గాంధారరాజైనా శకుని ధర్మరాజుతో వెటకారంగా 'నీవు నీ చిన్న తమ్ముడితో సహా అందర్నీ ఓడిపోయావు. ఇక ఇపుడు నీదగ్గరేముంది? యాజ్ఞసేని ఐన ద్రౌపదిని ఒడ్డి జూదమాడు' అని అన్నాడు. (46)
జానాసి త్వం సంజయ సర్వమేతద్
ద్యూతే వాక్యం గర్హ్యమేవం యథోక్తమ్।
స్వయం త్వహం ప్రారథయే తత్ర గంతుం
సమాధాతుం కార్యమేతద్ విపన్నమ్॥ 47
సంజయా! జూదంలో వాళ్లు అన్న అసహ్యములైన మాటలన్నీ నీవెరుగుదువు. అయినా ఈ విపత్కరమైన కార్యాన్ని సాధిచటానికి నేను స్వయంగా హస్తినాపురమ్ వెడతానని పాండవులను ప్రార్థిస్తాను. (47)
వి॥కృష్ణుడు తనంత తానే రాయబారానికి సిద్ధపడ్డాడు. ఆ తరువాతనే ధర్మరాజు అడిగాడు.
అహాపయిత్వా యది పాండవార్థం
శమం కురూణామపి చేచ్ఛకేయమ్।
పుణ్యం చ మే స్యాచ్చరితం మహోదయం
ముచ్యేరంశ్చ కురవో మృత్యుపాశాత్॥ 48
పాండవుల ప్రయోజనం సిద్ధించి, కౌరవులతో ఈ సంధిని చేసికోవడంలో నేను సఫలుడినయితే, నా ద్వారా పరమపవిత్రమై శ్రేయోదాయకమైన పని జరిగినట్లే, కౌరవులుకూడ మృత్యుపాశం నుండి విముక్తులైనట్లే. (48)
అపి మే వాచం భాషమాణస్య కావ్యాం
ధర్మారామామర్థవతీమహింస్రామ్।
అవేక్షేరన్ ధార్తరాష్ట్రాః సమక్షం
మాం చ ప్రాప్తం కురవః పూజయేయుః॥ 49
నీతి సమ్మతమై ధర్మయుక్తమై, అర్థవంతమై, అహింసాయుతమైన, నామాటను కౌరవులు ఆలకించుదురు గాక - ఈ విషయమై వెళ్లిన నన్ను ఆదరింతురుగాక. (49)
అతోఽన్యథా రథినా ఫాల్గునేన
భీమేన చైవాహనదంశితేన।
పరాసిక్తాన్ ధార్తరాష్ట్రాంశ్చ విద్ధి
ప్రదహ్యమానాన్ కర్మణా స్వేన పాపాన్॥ 50
సంజయా! అలా కాని పక్షంలో యుద్ధరంగంలో రథారూఢుడైన అర్జునునిచేత కవచంధరించిన భీమునిచేత పాపాత్ములైన ధృతరాష్ట్రకుమారులు పరాజితులై, స్వయంకృతాపరాధాలతో దహింపబడతారని గ్రహించు. (50)
పరాజితాన్ పాండవేయాంస్తు వాచః
రౌద్రా రూక్షా భాషతే ధార్తరాష్ట్రః।
గదాహస్తో భీమసేనో ఽప్రమత్తః
దుర్యోధనం స్మారయితా హి కాలే॥ 51
జూదంలో ఓడిపోయిన పాండవులను దుర్యోధనుడు ఘోరమూ, కఠినమూ అయిన మాటలన్నాడు. యుద్ధకాలంలో గదాహస్తుడైన భీముడు అప్రమత్తుడై ఆ మాటలను తలచుకొంటాడు కదా! (51)
సుయోధనో మన్యుమయో మహాద్రుమః
స్కంధః కర్ణః శకునిస్తస్య శాఖాః।
దుఃశాసనః పుష్పఫలే సమృద్ధే
మూలం రాజా ధృతరాష్ట్రోఽమనీషీ॥ 52
సుయోధనుడు క్రోధమయమైన మహావృక్షం. కర్ణుడు దాని స్కంధం. శకుని దాని కొమ్మలు. దుఃశాసనుడు దానికి సమృద్ధమైన పుష్పాలూ, ఫలాలూ. అజ్ఞానియైన ధృతరాష్ట్రుడు దానికి మూలం. (52)
వి॥తె॥ రోషమయమహాతరువు సుయోధనుఁ; డురు
స్కంధ మందులోనఁ గర్ణుఁ; డలరుఁ
గొమ్మ సౌబలుండు; గుసుమఫలములు దు
శ్శాసనుండు; మూలశక్తి తండ్రి.
(ఉద్యో-1-355)
యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమః
స్కంధోఽర్జునో భీమసేనోఽస్య శాఖాః।
మాద్రీపుత్రౌ పుష్ఫఫలే సమృద్ధే
మూలం త్వహం బ్రహ్మ చ బ్రాహ్మణాశ్చ॥ 53
ధర్మరాజు ధర్మమయమైన మహావృక్షం. అర్జునుడు దాని స్కంధం. భీమసేన్డుఉ కొమ్మలు. నకుల సహదేవులు సమృద్ధములైన పుష్పాలూ, ఫలాలు. నేను, వేదం, బ్రాహ్మణులు దానికి మూలం. (53)
సం.వి. ధార్తరాష్ట్రులను సంహరిస్తే ధృతరాష్ట్రుడొక్కడే దుఃఖిస్తాడు. పాండవులు నశిస్తే నేను(ఈశ్వరుడు), వేదము, బ్రాహ్మణులు దుఃఖిస్తారు. కావున ఎక్కువమంది దుఃఖించడం యుక్తం కాదు. (నీల)
వి॥తె॥ ధర్మజుండు ధర్మతరు; వర్జునుఁడు ఘన
స్కంధ; మనిలసుతుఁడు శాఖ; కవలు
పుష్పఫలము; లేను భూసురులును వేద
ములుఁ దదీయమైన మూలచయము.
(ఉద్యో-1-135)
వనం రాజా ధృతరాష్ట్రః సపుత్రః
వ్యాఘ్రాస్తే వై సంజయ పాండుపుత్రాః।
సింహాభిగుప్తం న వనం వినశ్యేత్
సింహో న నశ్యేత వనాభిగుప్తః॥ 54
సంజయా! పుత్రులతో కూడిన ఆ ధృతరాష్ట్రుడు ఒక మహారణ్యం పాండుపుత్రులు దాంట్లో సంచరించే పులులు. సింహంచే రక్షింపబడే వనం నశించదు. వనంచే రక్షింపబడే సింహమూ నశించదు. (54)
నిర్వనో వధ్యతే వ్యాఘ్రః నిర్వ్యాఘ్రం ఛిద్యతే వనమ్।
తస్మాద్ వ్యాఘ్రో వనం రక్షేద్ వనం వ్యాఘ్రం చ పాలయేత్॥ 55
వనం నుండి బయటపడ్డ పులి చంపబడుతుంది. పులిలేని వనం నరకబడుతుంది. అందువల్ల పులి వనాన్ని రక్షించాలి. వనం పులిని రక్షించాలి. (55)
లతాధర్మా ధార్తరాష్ట్రాః శాలాః సంజయ పాండవాః।
న లతా వర్ధతే జాతు మహాద్రుమ మనాశ్రితా॥ 56
సంజయా! ధృతరాష్ట్రకుమారులు లతల వంటివారు. పాండవులు సాలవృక్షాల వంటివారు. పెద్దచెట్ల ఆశ్రయం లేకుండా లతలు వృద్ధి పొందలేవు. (56)
సం.వి. పాండవుల ఆశ్రయంలేనిదే కౌరవులకు బ్రతుకులేదని భావం. (నీల)
స్థితాః శుశ్రూషితుం పార్థాః స్థిథా యోద్ధుమరిందమాః।
యత్ కృత్యం ధృతరాష్ట్రస్య తహ్ కరోతు నరాధిపః॥ 57
పాండవులు శుశ్రుషచేయడానికి సిద్ధంగా ఉన్నారు. శత్రుసంహారకులై యుద్ధానికీ సిద్ధంగా ఉన్నారు. రాజయిన ధృతరాష్ట్రుడు చేయవలసినదేదో అది చేయాలి. (57)
స్థితాః శమే మహాత్మానః పాండవా ధర్మచారిణః।
యోధాః సమర్థాస్తద్ విద్వన్నాచక్షీథా యథాతథమ్॥ 58
విద్వాంసుడవైన సంజయా! ధర్మంగా నడుచుకొనే పాండవులు (సంధికి) శాంతికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం చేయడానికైనా సమర్థులైన యోధులే. ఈ రెండు పరిస్థితులను గ్రహించి నీవు ధృతరాష్ట్రునికి ఉన్నదున్నట్లుగా చెప్పు. (58)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి కృష్ణవాక్యే ఏకోనత్రింశోఽధ్యాయః॥ 29 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయయాన పర్వమను ఉపపర్వమున కృష్ణవాక్యమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (29)
(దాక్షిణాత్యపాఠములోని ఒక అధికశ్లోకముతో కలిపి 59 శ్లోకములు)