30. ముప్పదియవ అధ్యాయము

యుధిష్ఠిరుని సందేశము.

సంజయ ఉవాచ
ఆమంత్రయే త్వాం నరదేవదేవ
గచ్ఛామ్యహం పాండవ స్వస్తి తేఽస్తు।
కచ్చిన్న వాచా వృజినం హి కించిత్
ఉచ్చారితం మే మనసోఽభిషంగాత్॥ 1
సంజయుడు పలికాడు. రాజశ్రేష్ఠా! నీకు శుభమగుగాక! ఇక వెళ్లివస్తా. నా మాటలు నీకు కష్టం కలిగించి ఉంటాయి. కాని నేని మానసికావేగంతో అలా మాట్లాడాను కాని నిన్ను కష్టపెట్టాలనే కోరిక నాకే మాత్రం లేదు. (1)
జనార్దనం భీమసేనార్జునౌ చ
మాద్రీసుతౌ సాత్యకిం చేకితానమ్।
ఆమంత్ర్య గచ్ఛామి శివం సుఖం వః
సౌమ్యేన మాం పశ్యత చక్షుషా నృపాః॥ 2
శ్రీకృష్ణుని, భీమార్జునుల్ని, నకులసహదేవుల్ని, సాత్యకి చేకితానుల్ని వీడ్కొని వెళుతున్నాను. మీకు శుభమగుగాక. క్షత్రియులారా! మీరంతా నన్ను సౌమ్యంగా ప్రసన్నంగా చూడండి. (2)
యుధిష్ఠిర ఉవాచ
అనుజ్ఞాతః సంజయ స్వస్తి గచ్ఛ
న నః స్మరస్యప్రియం జాతు విద్వన్।
విద్మశ్చ తాం తే చ వయం చ సర్వే
శుద్ధాత్మానం మధ్య్గతం సభాస్థమ్॥ 3
యుధిష్ఠిరుడు పలికాడు. సంజయా! శుభమగుగాక! నీవిక వెళ్లవచ్చు. విద్వాంసుడా! నీవు మాకు అనిష్టాన్నెప్పుడూ తలపెట్టవు. కౌరవులు, మేము కూడా నిన్ను చిత్తశుద్ధిగల, తటస్థ సభ్యుడ వని భావిస్తాం. (3)
ఆప్తో దూతః సంజయ సుప్రియోఽసి
కల్యాణవాక్ శీలవాంస్తృప్తిమాంశ్చ।
న ముహ్యేస్త్వం సంజయ జాతు మత్యా
న చ క్రుద్ధ్యేరుచ్యమానో దురుక్తైః॥ 4
సంజయా! నీవు మాకు విశ్వసింప దగినవాడవు. మిక్కిలి ప్రీతిపాత్రుడవు. మంచిగా మాట్లాడతావు - శీలవంతుడవు. తృప్తిగలవాడవు. నీ బుద్ధి ఎప్పుడూ వ్యామోహానికి లోనుకాదు. కటువుగా మాట్లాడినా నీవు కోపించవు. (4)
న మర్మగాం జాతు వక్తాసి రూక్షాం
నోపశ్రుతిం కటుకాం నోత ముక్తామ్।
ధర్మారామామర్థవతీమహింస్రామ్
ఏతాం వాచం తవ జానీమ సూత॥ 5
సూతా! మర్మఘాతములూ, క్రూరములూ అయిన మాటలెప్పుడూ నీవు పలుకవు. నీరసములూ, అసందర్భములూ ఐన మాటలు కూడా నీనోట రావు. నీమాటలు ధర్మానుకూలంగా, అర్థయుక్తంగా, మనోహరంగా, అహింసా యుతంగా ఉంటాయని మాకు తెలుసు. (5)
త్వమేవ నః ప్రియతమోఽసి దూత
ఇహాగచ్ఛేద విదురో వా ద్వితీయః।
అభీక్ష్ణదృష్టోఽసి పురా హి నస్త్వం
ధనంజయస్యాత్మసమః సఖాసి॥ 6
నీవు మాకు మిక్కిలి ఇష్టుడవు. నీవు కాకుంటే విదురుపడే ఇక్కడకు దూతగా రాదగిన రెండవ వ్యక్తి. నీవు ఇంతకు మునుపు కూడ తరచుగ మమ్మల్ని చూసేవాడివి. అర్జునునికి ప్రాణమిత్రుడవు. (6)
వి॥తె॥ ఈ మాటలసారాన్ని తిక్కన అర్జునుని నోట పలికించాడు.
బాలసఖుండవు నాకును
నీలెస్సదనంబు మేము నీతివిడిచి దు
శ్శీలురమగుటయు శైశవ
లీలమొదలుగాగ మును దెలియదే నీకున్?
ఉద్యో-1-378
ఇతో గత్వా సంజయ క్షిప్రమేవ
ఉపాతిష్ఠేథా బ్రాహ్మణాన్ యే తదర్హాః।
విశుద్ధవీర్యాశ్చరణోపపన్నాః
కులే జాతాః సర్వధర్మోపపన్నాః॥ 7
సంజయా! నీవు ఇక్కడనుండి వెళ్లినవెంటనే సత్త్వశక్తి సంపన్నులై, బ్రహ్మచర్యం పాటిస్తూ, వేదాధ్యయనం చేస్తున్న కులీనులు, సర్వ ధర్మాలు తెలిసిన బ్రాహ్మణులకు మా నమస్కారాలు చెప్పు. (7)
స్వాధ్యాయినో బ్రాహ్మణభిక్షవశ్చ
తపస్వినో యే చ నిత్యా వనేషు।
అభివాద్యా వై మద్వచనేన వృద్ధాః
తథేతరేషాం కుశలం వదేథాః॥ 8
వేదాధ్యయనశీలులైన బ్రాహ్మణులు, సన్యాసులు, తపస్వులు... వీరికి నామాటగా నమస్కరించి. అలాగే వృద్ధులను ఇతరులను కూడ నా మాటగా కుశలం అడుగు. (8)
పురోహితం ధృతరాష్ట్రస్య రాజ్ఞః
తథాఽఽచార్యానృత్విజో యే చ తస్య।
తైశ్చ త్వం తాత సహితైర్యథార్హం
సంగచ్ఛేథాః కుశలేనైవ సూత॥ 9
నాయనా! సంజయా! ధృతరాష్ట్రమహారాజుయొక్క పురోహితుని, ఆచాయులను, ఋత్విజులను కలిసినపుడు మామాటగా వారి కుశలాన్ని అడిగి తెలుసుకో. (9)
(తతో ఽబ్యగ్రస్తన్మనాః ప్రాంజలిశ్చ
కుర్యా నమో మద్వచనేన తేభ్యః।)
(తరువాత శాంతంగా ఏకాగ్రతతో మనఃస్ఫూర్తిగా మామాటగా చేతులు జోడించి నమస్కరించు.)
అశ్రోత్రియా యే చ వసంతి వృద్ధాః
మనస్వినః శీలబలోపపన్నాః।
ఆశంసంతోఽస్మాకమనుస్మరంతః
యథాశక్తి ధర్మమాత్రాం చరంతః॥ 10
శ్లాఘస్వ మాం కుశలినం స్మ తేభ్యః
హ్యనామయం తాత పృచ్ఛేర్జఘన్యమ్।
సంజయా! శ్రోత్రియులు కాని వృద్ధులు, మనస్వులు, శీలము, బలము కలిగి, నాక్షేమాన్ని కోరుతున్న వారందరికి మా క్షేమాన్ని తెలియజెయ్యి. వారి క్షేమాన్ని కూడా మామాటగా అడిగి తెలుసుకో. (10 1/2)
యే జీవంతి వ్యవహారేణ రాష్ట్రే।
పశూంశ్చ యే పాలయంతో వసంతి॥ 11
(కృషీవలా బిభ్రతి యే చ లోకం
తేషాం సర్వేషాం కుశలం స్మ పృచ్ఛేః।)
కౌరవరాజ్యంలో వ్యాపారంతో, పశుపాలనతో, వ్యవసాయంతో జీవిస్తూ ప్రజలపోషణభారాన్ని వహిస్తున్న వైశ్యులందరినీ మామాటగా కుశలమడుగు. (11)
ఆచార్య ఇష్టో నయగో విధేయః
వేదానభీప్సన్ బ్రహ్మచర్యం చచార।
యోఽస్త్రం చతుష్పాత్ పునరేవ చక్రే
దోణః ప్రసన్నోఽభివాద్యస్త్వయాసౌ॥ 12
మాకు ఇష్టుడు, నీతిజ్ఞుడు, విధేయుడు, బ్రహ్మచర్యంతో వేదాధ్యయనం చేసినవాడు, మంత్ర-ఉపచార - ప్రయోగ - ఉపసంహారాలనే నాలుగు పాదాలతో కూడిన అస్త్రవిద్య నభ్యసించినవాడు, ప్రసన్న చిత్తుడు ఐన ద్రోణాచార్యునకు మా నమస్కారాలను తెలియ జెయ్యి. (12)
అధీతవిద్యశ్చరణోపపన్నః
యోఽస్త్రం చతుష్పాత్ పునరేవ చక్రే।
గంధర్వపుత్రప్రతిమం తరస్వినం
తమశ్వత్థామానం కుశలం స్మ పృచ్ఛేః॥ 13
అశ్వత్థామ వేదాధ్యయన సంపన్నుడు. సదాచారపరుడు, నాలుగు పాదాల అస్త్రవిద్యను నేర్చినవాడు. గంధర్వ కుమారునివలె అసమానమైన వేగం కలవాడు. మా మాటగా అతని క్షేమాన్ని అడుగు. (13)
శారదవతస్యావసథం స్మ గత్వా
మహారథస్యాత్మవిదాం వరస్య।
త్వం మామభీక్ష్ణం పరికీర్తయన్ వై
కృపస్య పాదౌ సంజయ పాణినా స్పృశేః॥ 14
సంజయా! కృపాచార్యుడు ఆత్మజ్ఞానం కలవారిలో శ్రేష్ఠుడు, మహారథుడు, మమ్మల్ని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాడు. నీవు ఆయన ఇంటికి వెళ్లి నా పేర పాదాభివందనం చెయ్యి. (14)
యస్మిన్ శౌర్యమానృశంస్యం తపశ్చ
ప్రజ్ఞా శీలం శ్రుతిసత్త్వే ధృతిశ్చ।
పాదౌ గృహీత్వా కురుసత్తమస్య
భీష్మస్య మాం తత్ర నివేదయేథాః॥ 15
శౌర్యం, దయ, తపస్సు, ప్రజ్ఞ, శీలం, శాస్త్రజ్ఞానం, సత్త్వం, ధైర్యం, మున్నహు సద్గుణాలు కలవాడు భీష్మపితామహుడు. ఆయనకు మా పాదాభివందనాలు చేసి చెప్పు. (15)
ప్రజ్ఞాచక్షుర్యః ప్రణేతా కురూణాం
బహుశ్రుతో వృద్ధసేవీ మనీషీ।
తస్మై రాజ్ఞే స్థవిరాయాభివాద్య
ఆచక్షేథాః సంజయ మామరోగమ్॥ 16
సంజయా! ఆ ధృతరాష్ట్ర మహారాజు ప్రజ్ఞాచక్షువు, కౌరవులందరికి నాయకుడు, బాగా చదువుకొన్నవాడు. వృద్ధులను సేవించే బుద్ధి శాలి. ఆ వృద్ధరాజుకు నమస్కరించి మా క్షేమాన్ని తెలియజెయ్యి. (16)
జ్యేష్ఠః పుత్రో ధృతరాష్ట్రస్య మందః
మూర్ఖః శఠః సంజయ పాపశీలః।
యస్యాపవాదః పృథివీం యాతి సర్వాం
సుయోధనం కుశలం తాత పృచ్ఛేః॥ 17
సంజయా! ధృతరాష్ట్రుని పెద్దకొడుకు దుర్యోధనుడు తెలివితక్కువవాడు, మూర్ఖుడు, పొగరుబోతు, పాపశీలుడు. అతని అపకీర్తి భూమి అంతటా వ్యాపించింది. అతణ్ణి మా మాటగా కుశలమడుగు. (17)
భ్రాతా కనీయానపి తస్య మందః
తథాశీలః సంజయ సోఽపి శశ్వత్।
మహేష్వాసః శూరతమః కురూణాం
దుఃశాసనః కుశలం తాత వాచ్యః॥ 18
నాయనా! ఆ దుర్యోధనుని తమ్ముడు కూడ తెలివితక్కువవాడే, అతనివంటి స్వభావం కలవాడే. ఎప్పుడూ పాపాలయందు ఆసక్తి కలిగి ఉంటాడు. మహాధనుర్ధరుడని, గొప్ప శూరుడని కౌరవులనుకొంటూ ఉంటారు. అటువంటి దుఃశాసనుణ్ణి కుశలమడుగు. (18)
యస్య కామో వర్తతే నిత్యమేవ
నాన్యః శమాద్ భారతానామితి స్మ।
స బాహ్లీకానామృషభో మనీషీ
త్వయాభివాద్యః సంజయ సాధుశీలః॥ 19
సంజయా! బాహ్లీకుల్లో శ్రేష్ఠుడైన బాహ్లీకుడు నిత్యం భరతవంశీయులంతా పరస్పరం శాంతిగా ఉండాలని కోరు కొంటాడు. సాధుస్వభావుడు. అతడికి నీవు నమస్కరించు. (19)
గుణైరనేకైః ప్రవరైశ్చ యుక్తో
విజ్ఞానవాన్ నైవ చ నిష్ఠురో యః।
స్నేహాదమర్షం సహతే సదైవ
స సోమదత్తః పూజనీయో మతో మే॥ 20
సంజయా! సోమదత్తుడు సద్గుణాలనేకం కలవాడు. విజ్ఞాని, పరుషం పల్కనొవాడు. మామీద ప్రేమవల్ల మా కోపాన్ని కూడా సహించేవాడు. అటువంటి సోమదత్తుని నీవు గౌరవించు. (20)
అర్హత్తమః కురుషు సౌమదత్తిః
స నో భ్రాతా సంజయ మత్సఖా చ।
మహేష్వాసో రథినాముత్తమో ఽర్హః
సహామాత్యః కుశలం తస్య పృచ్ఛేః॥ 21
సంజయా! సోమదత్తుని కొడుకైన భూరిశ్రవుడు కురువంశంలోనే మిక్కిలి పూజ్యుడు. అతడు మాకు మంచి సోదరుడు, మిత్రుడు కూడ. గొప్ప విలుకాడు. రథికులలో ఉత్తముడు. మంత్రులతోబాటుగా అతని క్షేమాన్ని అడుగు. (21)
యే చైవాన్యే కురుముఖ్యా యువానః
పుత్రాః పౌత్రా భ్రాతరశ్చైవ యే నః।
యం యమేషాం మన్యసే యేన యోగ్యం
తత్ తత్ ప్రోచ్యానామయం సూత వాచ్యాః॥ 22
సంజయా! ఇంకా కురువంశీయులలో ముఖ్యులైన యువకులైన మా పుత్రులకు, పౌత్రులకు, సోదరులకు, తక్కిన యోగ్యులందరికి మేము క్షేమంగా,ఆనందంగా ఉన్నామని చెప్పు. (22)
యే రాజానః పాండవాయోధనాయ
సమానీతా ధార్తరాష్ట్రేణ కేచిత్।
వశాతయః శాల్వకాః కేకయాశ్చ
తథాంబష్ఠా యే త్రిగర్తాశ్చ ముఖ్యాః॥ 23
ప్రాచ్యోదీచ్యా దాక్షిణాత్యాశ్చ శూరాః
తథా ప్రతీచ్యాః పర్వతీయాశ్చ సర్వే।
అనృశంసాః శీలవృత్తోపపన్నాః
తేషాం సర్వేషాం కుశలం సూత పృచ్ఛేః॥ 24
సంజయా! ధృతరాష్టుని కుమారుడైన దుర్యోధనుడు మాతోయుద్ధం చేయడానికి పిలిపించిన వశాతి, శాల్వ, కేకయ, అంబష్ఠ, త్రిగర్త దేశాల రాజులు; తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులవంఇ వచ్చిన యోధులు; పర్వతప్రాంతాల నుండి వచ్చిన వారు అంతా దయాశీల సంపత్తికలవారు. వారందనీ మామాటగా కుశలం అడుగు. (23, 24)
హస్త్యారోహా రథినః సాదినశ్చ
పదాతయశ్చార్యసంఘా మహాంతః।
ఆఖ్యాయ మాం కుశలినం స్మ నిత్యమ్
అనామయం పరిపృచ్ఛేః సమగ్రాన్॥ 25
రథ, గజ, తురగ, పదాతిదళాలను, అక్కడకు జేరిన సజ్జనులను మామాటగా కుశలమడిగి, వారికి మా క్షేమాన్ని తెలియజెయ్యి. (25)
తథా రాజ్ఞో హ్యర్థయుక్తానమాత్యాన్
దౌవారికాన్ యే చ సేనాం నయంతి।
ఆయవ్యయం యే గణయంతి నిత్యమ్
అర్థాంశ్చ యే మహతశ్చింతయంతి॥ 26
రాజహితాన్ని కోరి పనిచేసే మంత్రుల్నీ, ద్వారపాలకుల్నీ, సేనానాయకుల్నీ, ఆయవ్యయాలు చూసే గణకుల్నీ, నిత్యం పెద్ద పెద్ద పనులను గూర్చి ఆలోచించే వారినీ మా మాటగా కుశలమడుగు. (26)
వృందారకం కురుమధ్యేష్వమూఢం
మహాప్రజ్ఞం సర్వధర్మోపపన్నమ్।
న తస్య యుద్ధం రోచతే వై కదాచిద్
వైశ్యాపుత్రం కుశలం తాత పృచ్ఛేః॥ 27
నాయనా! వైశ్యాపుత్రుడైన యుయుత్సుడు కౌరవులలో శ్రేష్ఠుడు, మహాబుద్ధిమంతుడు, గొప్ప ప్రజ్ఞకలవాడు, అన్ని ధర్మాలు తెలిసినవాడు. కౌరవపాండవుల యుద్ధం అతనికెప్పుడూ ఇష్టం కాదు. అతనిని మా మాటగా కుశలమడుగు. (27)
నికర్తనే దేవనే యో ఽద్వితీయః
ఛన్నోపధః సాధుదేవీ మతాక్షః।
యో దుర్జయో దేవరథేన సంఖ్యే
స చిత్రసేనః కుశలం తాత వాచ్యః॥ 28
నాయనా! చిత్రసేనుడు ఇతరుల ధనాన్ని అపహరించడంలోను, జూదమాడడంలోనూ అద్వితీయుడు, మోసం తెలియకుండా ఆడగల గొప్ప జూదరి, యుద్ధంలో దేవరథం చేత కూడా జయింపశక్యం కాడు. అతణ్ణి మా మాటగా కుశలమడుగు. (28)
గాంధారరాజః శకునిః పర్వతీయః
నికర్తనే యో ఽద్వితీయో ఽక్షదేవీ।
మానం కుర్వన్ ధార్తరాష్ట్రస్య సూత
మిథ్యాబుద్ధేః కుశలం తాత పృచ్ఛేః॥ 29
నాయనా! పర్వతీయుడు, గాంధారరాజు ఐన శకుని జూదంలో పరులసొమ్ము నపహరించడంలో నేర్పరి. అతడు మిథ్యాబుద్ధి ఐన దుర్యోధనుని గౌరవిస్తాడు. మామాటగా అతనిని కుశలమడుగు. (29)
యః పాండవానేకరథేన వీరః
సముత్సహత్యప్రధృష్యాన్ విజేతుమ్।
యో ముహ్యతాం మోహయితా ద్వితీయః
వైకర్తనః కుశలం తస్య పృచ్ఛేః॥ 30
జయింపశక్యంగాని పాండవులను ఒక్క రథంతో జయించాలనుకొంటున్న వీరుడు కర్ణుడు. మోహపడేవాళ్లను మోహపెట్టడంలో అతడికతడే సాటి. మామాటగా అతణ్ణి కూడా కుశలమడుగు. (30)
స ఏవ భక్తః స గురుః స భర్తా
స వై పితా స చ మాతా సుహృచ్చ।
అగాధబుద్ధి ర్విదురో దీర్ఘదర్శీ
స నో మంత్రీ కుశలం తం స్మ పృచ్ఛేః॥ 31
విదురుడు లోతైన బుద్ధి, దూరదృష్టి కలవాడు. మమ్మల్ని ప్రేమించేవాడు. మాకు గురువు, రక్షకుడు, తల్లి, తండ్రి, మిత్రుడూను. మాకు మంత్రికూడ. మా మాటగా అతణ్ణి కుశలమడుగు. (31)
వృద్ధాః స్త్రియో యాశ్చ గుణోపపన్నాః
జ్ఞాయంతే నః సంజయ మాతరస్తాః।
తాభిః సర్వాభిః సహితాభిః సమేత్య
స్త్రీభిర్వృద్ధాభిరభివాదం వదేథాః॥ 32
సంజయా! రాజగృహాల్లో ఉన్న సద్గుణవతులు, వృద్ధ స్త్రీలంతా మాతల్లులే. వారినందరిని ఒకసారి మా పక్షాన కలిసి నమస్కరించి ఇలా చెప్పు. (32)
కచ్చిత్ పుత్రా జీవపుత్రాః సుసమ్యగ్
వర్తంతే వో వృత్తిమనృశంసరూపాః।
ఇతి స్మోక్త్వా సంజయ బ్రూహి పశ్చాద్
అజాతశత్రుః కుశలీ సపుత్రః॥ 33
"తల్లులారా! మీరంతా మీ పుత్రులతో బాగా ఉన్నారా! వారంతా మీ పట్ల దయతో ప్రవర్తిస్తున్నారా!" అని అడిగి, తర్వాత పుత్రులతో బాటు యుధిష్ఠిరుడు కుశలమని చెప్పు. (33)
యా నో భార్యాః సంజయ వేత్థ తత్ర
తాసాం సర్వాసాం కుశలం తాత పృచ్ఛేః।
సుసంగుప్తాః సురభయో ఽనవద్యాః
కచ్చిద్ గృహానావసథాప్రమత్తాః॥ 34
కచ్చిద్ వృత్తిం శ్వశురేషు భద్రాః
కల్యాణీం వర్తధ్వమనృశంసరూపామ్।
యథా చ వః స్యుః పతయో ఽనుకూలాః
తథా వృత్తిమాత్మనః స్థాపయధ్వమ్॥ 35
సంజయా! హస్తినాపురంలోని మా సోదరుల భార్యలనందరిని కుశలమడిగి ఇలా చెప్పు - 'మీరంతా మంచిరక్షణ కల్గి పవిత్రంగా, గౌరవంగా అప్రమత్తంగా జీవిస్తున్నారా! మీకు కావలసిన అలంకార సామగ్రి లభిస్తోందా! మామగార్ల విషయంలో మంచిగా దయతో ప్రవర్తిస్తున్నారా! మీ భర్తలు మీకు అనుకూలంగా ప్రవర్తించేందుకు తగిన విధంగా సద్భావంతో మీరు ప్రవర్తిస్తున్నారా! (34, 35)
యా నః స్నుషాః సంజయ వేత్థ తత్ర
ప్రాప్తాః కులేభ్యశ్చ గుణోపపన్నాః।
ప్రజావత్యో బ్రూహి సమేత్య తాశ్చ
యుధిష్ఠిరో వోఽభ్యవదత్ ప్రసన్నః॥ 36
సంజయా! అక్కడున్న మంచికుటుంబాల నుండి వచ్చిన, మంచి గుణాలు కల మా కోడళ్ళను నీవెరుగుదువు. వారి దగ్గరకు వెళ్ళి - 'కులవధువులారా! ప్రసన్నుడైన యుధిష్ఠిరుడు మీ కుశల సమాచారాన్ని అడుగుతున్నాడు' అని చెప్పు. (36)
కన్యాః స్వజేథాః సదనేషు సంజయ
అనామయం మద్వచనేన పృష్ట్వా।
కల్యాణా వః సంతు పతయోఽనుకూలా
యూయం పతీనాం భవతానుకూలాః॥ 37
సంజయా! అంతఃపురంలో ఉన్న కన్యలనందరిని నా మాటగా కుశలాన్ని అడిగి 'పుత్రికలారా! మీకు అనుకూలురైన భర్తలు లభించుగాక! మీరూ మీ భర్తలకు అనుకూలంగా ఉండెదరుగాక' అని నా మాటగా చెప్పు. (37)
అలంకృతా వస్త్రవత్యః సుగంధాః
అబీభత్సాః సుఖితా భోగవత్యః।
లఘు యాసాం దర్శనం వాక్ చ లఘ్వీ
వేశస్త్రియః కుశలం తాత పృచ్ఛేః॥ 38
సంజయా! అందమైన అలంకారాలు, వస్త్రాలు ధరించి, మంచి పరిమళాలతో మనోహరంగా ఉండి, మాట, దర్శనం సులభంగా ఉండే వేశ్య స్త్రీలను కుశలమడుగు. (38)
దాస్యః స్స్యుర్యా యే చ దాసాః కురూణాం
తదాశ్రయా బహవః కుబ్జఖంజాః।
ఆఖ్యాయ మాం కుశలినం స్మ తేభ్యో
ఽప్యనామయం పరిపృచ్ఛేర్జఘన్యమ్॥ 39
కౌరవులను సేవిస్తున్న దాసదాసీ జనాన్ని, వారినాశ్రయించి జీవిస్తున్న గూని, చెవిటి వంటి అంగవికలులను కుశలమడుగు. వారికి మా క్షేమాన్ని కూడ చెప్పు. (39)
కచ్చిద్ వృత్తిం వర్తతే వై పురాణీం
కచ్చిద్ భోగాన్ ధార్తరాష్ట్రో దదాతి।
అంగహీనాన్ కృపణాన్ వామనాన్ వా
యానానృశంస్యో ధృతరాష్ట్రో బిభర్తి॥ 40
"ధృతరాష్ట్రుడు అంగహీనులపట్ల, దీనులపట్ల దయగా వ్యవహరిస్తున్నాడా! వారికి రక్షణ కల్పిస్తున్నాడా! పోషణకు తగిన సామగ్రిని దుర్యోధనుడు ఇస్తున్నాడా! వారు వారి ప్రాచీనవృత్తులను నిర్వహిస్తున్నారా!" (40)
అంధాంశ్చ సర్వాన్ స్థవిరాంస్తథైవ
హస్త్యాజీవా బహవో యేఽత్ర సంతి।
ఆఖ్యాయ మాం కుశలినం స్మ తేభ్యో
ఽప్యనామయం పరిపృచ్ఛేర్జఘన్యమ్॥ 41
హస్తినాపురంలోని అంధులకు, వృద్ధులందరికి, మావరివారికి మా క్షేమాన్ని తెలియజేయి. మా మాటగా వారి క్షేమాన్ని అడిగినట్లు చెప్పు. (41)
మా భైష్ట దుఃఖేన కుజీవితేన
నూనం కృతం పరలోకేషు పాప,।
నిగృహ్య శత్రూన్ సుహృదోఽనుగృహ్య
వాసోభిరన్నేన చ వో భరిష్యే॥ 42
వారితో ఇలా చెప్పు - 'ఇప్పుడున్న కష్టాల్ని, ధైన్యమైన జీవితాన్ని చూసి భయపడకండి. ఇది తప్పక పూర్వజన్మలో చేసిన పాపమే అయి ఉంటుంది. శత్రువులను దండించి, మిత్రులను రక్షించి, మీకు అన్న వస్త్రాలను మేము భరిస్తాము.' (42)
సంత్యేన మే బ్రాహ్మణేభ్యః కృతాని
భావీన్యథో నో బత వర్తయంతి।
తాన్ పశ్యామి యుక్తరూపాంస్తథైవ
తామేవ సిద్ధిం శ్రావయేథా నృపం తమ్॥ 43
రాజైన దుర్యోధనుడితో ఇలా చెప్పు - "న్ఱ్ను కొందరు బ్రాహ్మణులకు వార్షికమగు జీవన వృత్తిని కల్పించాను. కాని నీ ఉద్యోగులు దాన్ని సక్రమంగా నిర్వహించడంలేదని తెలిసి బాధపడుతున్నాను. మరల ఆ బ్రాహ్మణులను వారి వారి వృత్తులలో చూడగోరుతున్నాను. 'నేనూ నీలాగనే ఆ వృత్తులన్నిటినీ సముచితరీతిలో సాగిస్తున్నాను' అని ఎవరయినా దూతచేత కబురంప వలసినది" అని రాజుతో చెప్పు. (43)
యే చానాథా దుర్బలాః సర్వకాలమ్
ఆత్మన్యేవ ప్రయతంతేఽథ మూఢాః।
తాంశ్చాపి త్వం కృపణాన్ సర్వథైవ
హ్యస్మద్వాక్యాత్ కుశలం తాత పృచ్ఛేః॥ 44
నాయనా! ఎల్లకాలం తమ శరీరపోషణకోసమే ప్రయత్నిస్తూ ఉండే అనాథలను, దుర్బలులను, మూఢులను మా మాటగా అన్ని విధాలా కుశలమడుగు. (44)
యే చాప్యన్యే సంశ్రితా ధార్తరాష్ట్రాన్
నానాదిగ్భ్యో ఽభ్యాగతాః సూతపుత్ర।
దృష్ట్వా తాంశ్పైవార్హతశ్చాపి సర్వాన్
సంపృచ్ఛేథాః కుశలం చావ్యయం చ॥ 45
సూతపుత్రా! ఇంకా దుర్యోధనుని ఆశ్రయాన్ని కోరి నానాదేశాలనుండి వచ్చి ఉన్నవారిని కలిసి 'బ్రతుకు బాగా సాగుతోందా, కుశలమేనా' అని అడుగు. (45)
ఏవం సర్వానాగతాభ్యాగతాంశ్చ
రాజ్ఞో దూతాన్ సర్వదిగ్భ్యోఽభ్యుపేతాన్।
పృష్ట్వా సర్వాన్ కుశలం తాంశ్చ సూత
పశ్చాదహం కుశలీ తేషు వాచ్యః॥ 46
ఇదే విధంగా అభ్యాగతులను, ఇతర దేశాలనుండి రాజుదగ్గరకు వచ్చిన దూతలను కుశలమడిగి తరువాత నా క్షేమాన్ని వారికి చెప్పు. (46)
న హీదృశాః సంత్యపరే పృథివ్యాం
యే యోధకా ధార్తరాష్ట్రేణ లబ్ధాః।
ధర్మస్తు నిత్యో మమ ధర్మ ఏవ
మహాబలః శత్రునిబర్హణాయ॥ 47
దుర్యోధనుడు సమకూర్చుకొన్న యోధులు మహావీరులు, వారితో సమానమైనవారు ఈ భూమండలం లోనే లేరు. కాని ధర్మం, శాశ్వతమైనది, శత్రువులను ఓడించడానికి నా దగ్గరున్న గొప్పబలం ధర్మమే. (47)
ఇదం పునర్వచనం ధార్తరాష్ట్రం
సుయోధనం సంజయ శ్రావయేథాః।
యస్తే శరీరే హృదయం దునోతి
కామః కురూనసపత్నోఽనుశిష్యామ్॥ 48
న విద్యతే యుక్తిరేతస్య కాచిత్
నైనం విధాః స్యామ యథాప్రియం తే।
దదస్చ వా శక్రపురీం మమైవ
యుధ్యస్వ వా భారతముఖ్య వీర॥ 49
సంజయా! ధృతరాష్ట్ర కుమారుడైన సుయోధనునికి ఈ మాటను మళ్లీ ప్రత్యేకంగా చెప్పు - "కురుదేశాలకు(కౌరవులకు) శత్రువులు లేకుండా చెయ్యాలి అనే నీ మనస్సులోని కోరిక నీ శరీరాన్ని బాధిస్తోంది. అది సిద్ధించడానికి తగిన ఉపాయం ఏమీలేదు. నీకిష్టమైనట్లుగా మేం ఉండలేము - ఇంద్రప్రస్థాన్ని నాకు తిరిగి ఇయ్యి. లేదా భారతవీరా! యుద్ధానికి సిద్ధంగా ఉండు." (48,49)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి యుధిష్ఠిరసందేశే త్రింశోఽధ్యాయః॥ 30 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సంజయయాన పర్వమను ఉపపర్వమున యుధిష్ఠిర సందేశమను ముప్పదియవ అధ్యాయము. (30)
(దాక్షిణాత్యపాఠములోని అధికశ్లోకముతో కలిపి మొత్తం 50 శ్లోకములు)