37. ముప్పదిఏడవ అధ్యాయము

విదురుడు ధృతరాష్ట్రునకు హిత ముపదేశించుట

విదుర ఉవాచ
సప్తదశేమాన రాజేంద్ర మనుః స్వాయంభువోఽబ్రవీత్।
వైచిత్రవీర్య పురుషాన్ ఆకాశం ముష్టిభిర్ఘ్నతః॥ 1
దానవేంద్రస్య చ ధనుః అనామ్యం నమతోఽ బ్రవీత్।
అధో మరీచినః పాదాన్ అగ్రాహ్యాన్ గృహ్ణతస్తథా॥ 2
విదురుడు ఇట్లు చెప్పెను. రాజా! స్వాయంభువ మనువు ఈపదునేడుగురిని 1) ఆకాశాన్ని పిడికిళ్లతో పొడిచే వారిగాను
2) వంచటానికి శక్యం కాని యింద్రధనుస్సును వంచేందుకు ప్రయత్నించేవారిగాను 3) పట్టటానికి శక్యంకాని సూర్యకిరణాలను పట్ట ప్రయత్నించే వారిగాను చెప్పాడు.
(దానవ = మేఘసమూహం, వాని రాజు ఇంద్రుడు) (1,2)
ఇవి చేయలేని పనులు - ఆపనులు చేయాలనుకోవడం మూర్ఖత్వం. అనగా ఈ 17 గురు మూర్ఖులని భావం.
యశ్చాశిష్యం శాస్తి వై యశ్చ తుష్యేత్
యశ్చాతివేలం భజతే ద్విషంతమ్।
స్త్రియశ్చ యో రక్షతి భద్రమశ్నుతే
యశ్చాయాచ్యం యాచతే కత్థతే చ॥ 3
యశ్చాభిజాతః ప్రకరోత్యకార్యం
యశ్చాబలో బలినా నిత్యవైరీ।
అశ్రద్ధధానాయ చ యో బ్రవీతి
యశ్చాకామ్యం కామయతే నరేంద్ర॥ 4
వధ్వా వసన్నభయో మానకామః।
పరక్షేత్రే నిర్వపతి స్వబీజం
స్త్రియం చ యః పరివదతే ఽతివేలమ్॥ 5
యశ్చాపి లబ్ధ్వా న స్మరామీతి వాదీ
దత్త్వా చ యః కత్థతి యాచ్యమానః।
యశ్చాసతః సత్త్వముపానయీత
ఏతాన్నయంతి నిరయం పాశహస్తాః॥ 6
1) ఆజ్ఞాపించకూడని వానిని ఆజ్ఞాపించేవాడు 2) (స్వల్పలాభంతో) అనవసరంగా సంతోషించేవాడు 3) శత్రువులను హద్దుమీరి సేవించేవాడు 4) స్త్రీలను రక్షించి దానితో లాభపడాలనుకొనేవాడు 5) యాచింపదగని వానిని యాచించేవాడు 6) కొంచెం చేసి గొప్పగా చెప్పుకొనేవాడు. (ఈ ఆరుగురు) మూర్ఖులు 7) సద్వంశంలో పుట్టి చేయరాని పనులు చేసేవాడు 8) బలహీనుడై కూడ బలవంతునితో నిత్యమూ వైరం పెట్టుకొనేవాడు 9) శ్రద్ధ లేని వారికి ఉపదేశించే వాడు 10) కోరకూడని వాటిని కోరేవాడు - మూర్ఖులు 11) కోడలితో వెకిలి మాటలు ఇష్టంగా భావించేవాడు. 12) కోడలి దగ్గర భయం పోగొట్టుకొని మళ్లీగౌరవం కావాలనుకొనేవాడు. 13) ఇతరుని క్షేత్రంలో విత్తనం నాటేవాడు 14) స్త్రీని హద్దుమీరి నిందించేవాడు 15) ఉపకారం పొంది గుర్తులేదని వాదించేవాడు 16) వాగ్దానం మాత్రం చేసి ఇవ్వకుండానే దానం చేశానని పొగడుకొనేవాడు 17) దుర్జనుని నుండి మంచితనం పొందాలనుకొనేవాడు. ఈ 17 గురిని యమభటులు నరకానికి లాగుకొని పోతారు. (3-6)
యస్మిన యథా వర్తతే యో మనుష్యః
తస్మింస్తథా వర్తితవ్యం స ధర్మః।
మాయాచారో మాయయా వర్తితవ్యః
సాధ్వాచారః సాధునా ప్రత్యుపేయః॥ 7
ఇతరుల పట్ల ప్రవర్తిస్తే వారు కూడా తన పట్ల అలాగే ప్రవర్తిస్తారు. అదేధర్మం కూడ. మాయావి పట్ల మాయతోనే ప్రవర్తిస్తారు. సజ్జనుని పట్ల సన్మార్గంతోనే ప్రవర్తించాలి. (7)
వి॥సం॥ సజ్జనులైన పాండవుల పట్ల నీవు సన్మార్గంలో ప్రవర్తించుమని విదురుడు ధృతరాష్ట్రునకు హిత బోధ చేస్తున్నాడు. (నీల)
జరా రూపం హరతి హి ధైర్య మాశా
మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా।
కామో హ్రియం వృత్త మనార్యసేవా
క్రోధః శ్రియం సర్వమే వాభిమానః॥ 8
ముసలితనం రూపాన్ని హరిస్తుంది. అలాగే ఆశ ధైర్యాన్ని, మృత్యువు ప్రాణాలను, అసూయ ధర్మాచరణను, కామం లజ్జను, నీచసేవ సత్ప్రవర్తనను, క్రోధం సంపదను, అభిమానం సర్వాన్ని చెడగొడతాయి. (వృథాభిమానం వదలుమని హితబోధ) (8)
ధృతరాష్ట్ర ఉవాచ
శతాయురుక్తః పురుషః సర్వవేదేషు వై యదా।
నాప్నోత్యథ చ తత్సర్వమ్ ఆయుః కేనేహ హేతునా॥ 9
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. వేదాలన్నీ మానవునికి నూరేళ్లు ఆయువని చెపుతున్నాయి. కాని ఆ ఆయువంతా మానవుడు ఎందుకు పొందలేక పోతున్నాడు. (9)
విదుర ఉవాచ
అతిమానోఽతివాదశ్చ తథాత్యాగో నరాధిప।
క్రోధశ్చాత్మవిధిత్సా చ మిత్రద్రోహశ్చ తాని షట్॥ 10
ఏత ఏవాసయస్తీక్ష్ణాః కృంతంత్యాయూంషి దేహినామ్।
ఏతాని మానవాన్ ఘ్నంతి న మృత్యుర్భద్రమస్తు తే॥ 11
విదురుడు చెప్పాడు రాజా! దురభిమానం, అతిగా మాట్లాడటం, దానం చేయకపోవడం, క్రోధం, తన్నుమాత్రమే పోషించుకోవాలనుకోవడం, మిత్రద్రోహం - ఈ ఆరూ పదునైన కత్తులు. మానవుల ఆయువులను తెగకోస్తాయి. ఇవే నిజానికి మానవులను చంపుతాయి. మృత్యువు కాదు మహారాజా! శుభమస్తు.
వి॥సం॥ ఆత్మవిధిత్సా = తననుతాను పోషించుకొనడం. శిశ్నోదర పరాయణత్వం(నీల)
2) అనువిధిత్సా అనిపాఠం. శత్రుత్వం తొలగించు కోవాలనే కోరిక(అర్జు)
విశ్వస్తస్యైతి యో దారాన్ యశ్చాపి గురుతల్పగః।
వృషలీపతిర్ద్విజో యశ్చ పానపశ్చైవ భారత॥ 12
ఆదేశకృద్ వృత్తిహంతా ద్విజానాం ప్రేషకశ్చ యః।
శరణాగతహా చైవ సర్వే బ్రహ్మహణః సమాః।
ఏతైః సమేత్య కర్తవ్యం ప్రాయశ్చిత్తమితి శ్రుతిః॥ 13
నమ్మిన వాని భార్యను పొందేవాడు, గురుపత్నిని పొందేవాడు, ద్విజుడై శూద్రవనితను పెండ్లియాడే వాడు, మద్యపానం చేసేవాడు, విప్రులను ఆజ్ఞాపించేవాడు, విప్రుల జీవనోపాధిని పాడుచేసేవాడు, విప్రులను సేవకవృత్తిలో పెట్టేవాడు, శరణువేడిన వానిని చంపేవాడు, వీరంతా బ్రహ్మ హత్యచేసిన వారితో సమానం. వీరితో సహవాసం చేసిన వారు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వేదం చెపుతోంది. (12,13)
వి॥సం॥ ఆదేశకృత్ - గ్రామణిః - గ్రామాధికారి అని (నీల)
గృహీతవాక్యో నయవిద్ వదాన్యః
శేషాన్నభోక్తా హ్యవిహింసకశ్చ।
నానర్థకృత్యాకులితః కృతజ్ఞః
సత్యో మృదుః స్వర్గముపైతి విద్వాన్॥ 14
పెద్దల మాటను ఆదరించే వాడు, నీతివేత్త, దాత, దేవతలకు అతిథులకు పెట్టి మిగిలిన అన్నం తినేవాడు, హింస చేయనివాడు, కీడు కలిగించే పనులతో కలత పడటం ఎరగని వాడు, చేసిన మేలు మరువని వాడు, సత్యశీలి, మెత్తని స్వభావం కల పండితుడు స్వర్గం పొందుతారు. (14)
సులభాః పురుషా రాజన్! సతతం ప్రియవాదినః।
అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః॥ 15
రాజా! సదా ప్రియంగా మాట్లాడే వారు తేలికగా దొరుకుతారు. అప్రియ మయినా హితం చెప్పేవాడు, దాన్ని వినేవాడు దొరకడం దుర్లభం(కష్టం) (15)
వి॥సం॥ ప్రియమనగా అప్పటికప్పుడు ఇష్టమైనది. హితమనగా చివరకు సుఖం కలిగించేది.
ఈ శ్లోకం రామాయణంలో కూడా ఉంది.
యో హి ధర్మం సమాశ్రిత్య హిత్వా భర్తుః ప్రియాప్రియే।
అప్రియాణ్యాహ పథ్యాని తేన రాజా సహాయవాన్॥ 16
ప్రియమా - అప్రియమా అనేది వదిలివేసి, ధర్మం మాత్రమే గ్రహించి రాజుకు అప్రియ మయినా మేలు కలిగించే మాటలు చెప్పేవాడు రాజుకు నిజమైన సహాయుడు. (16)
త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్।
గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్॥ 17
కులం కోసం ఒకరిని విడిచి పెట్టవచ్చును. గ్రామం కోసం కులమంతా విడవవచ్చు. దేశం కోసం గ్రామం విడవవచ్చు. తనకోసం భూమినంతటినీ కూడా త్యజించవచ్చు. (17)
ఆపదర్థే ధనం రక్షేద్ దారాన్ రక్షే ద్ధనైరపి।
ఆత్మానం పతతం రక్షేద్ దారైరపి ధనైరపి॥ 18
ఆపదల కోసం(ఆపదలు వస్తే ఆదుకొనేందుకు) ధనాన్ని రక్షించుకోవాలి. సంపదలన్నీ ఖర్చుపెట్టి అయినా భార్యను రక్షించుకోవాలి. భార్యను, ధనాన్ని ఉపయోగించి యైనా తనను రక్షించుకోవాలి. (18)
ద్యూత మేతత్ పురాకల్పే దృష్టం వైరకరం నౄణామ్।
తస్మాత్ ద్యూతం న సేవేత హాస్యార్థ మపి బుద్ధిమాన్॥ 19
పూర్వం ఈ జూదం రాజులకు వైరం కలిగించింది. అందుచేత తెలివైనవాడు నవ్వులాటకు కూడా జూదం ఆడకూడదు. (19)
ఉక్తం మయా ద్యూత కాలేఽపి రాజన్
వేదం యుక్తం వచనం ప్రాతిపేయ।
తదౌషధం పథ్యమివాతురస్య
న రోచతే తవ వైచిత్రవీర్య॥ 20
ప్రతీపుని వంశంలో పుట్టిన మహారాజా! ఆనాడు జూదం ఆడేటప్పుడే 'ఇది మంచిదికా' దని నేను చెప్పాను. రోగికి మేలు చేసే మందులాగా నీకు అది రుచించలేదు. (20)
కాకైరిమాంశ్చిత్రబర్హాన్ మయూరాన్
పరాజయేథాః పాండవాన్ ధార్తరాష్ట్రైః।
హిత్వా సింహాన్ క్రోష్టుకాన్ గూహమానః
ప్రాప్తే కాలే శోచితా త్వం నరేంద్ర॥ 21
రాజా! చిత్రమైన చక్కని పింఛాలున్న నెమళ్లు లాంటి పాండవులను కాకుల వంటి నీ కొడుకులతో ఓడింఛగలవా? సింహాలను విడిచిపెట్టి నక్కలను చేరదీసుకొని సమయం వచ్చే సరికి ఏడుస్తున్నావు. (21)
యస్తాత న క్రుధ్వతి సర్వకాలం
భృత్యస్య భక్తస్య హితే రతస్య।
తస్మిన్ భృత్వా భర్తరి విశ్వసంతి
న చైనమాపత్సు పరిత్యజంతి॥ 22
ప్రభువు యొక్క హితం మీదనే దృష్టిపెట్టి భక్తితో సేవించే సేవకునిపై ఎన్నడూ కోపించని రాజును సేవకులు నమ్ముతారు. ఆపదలలో ఆ రాజును విడిచిపెట్టరు కూడ. (22)
వి॥సం॥ హితే = ఆదిమధ్యాంతములలో అనుకూలుడైన, రతస్య = స్వభావప్రవృత్తస్య, భక్తస్య = సెవమానస్య - (అర్జు) సేవాం కుర్వతః (సర్వ - నీల)
న భృత్యానాం వృత్తి సంరోధనేన
రాజ్యం ధనం సంజిఘృక్షేదపూర్వమ్।
త్యజంతి హ్యేనం వంచితా వై విరుద్ధాః
స్నిగ్ధా హ్యమాత్యాః పరిహీనభోగాః॥ 23
సేవకుల జీవికను పోగొట్టి, ఇతరుల రాజ్యాన్ని, ధనాన్ని లాగుకొనరాదు. అలా మోసగిస్తే, మునుపు తనతో స్నేహం కల మంత్రులు మొదలయిన వారంతా భోగాలు లేక ఆ రాజును విడిచి పోతారు. (23)
కృత్యాని పూర్వం పరిసంఖ్యాయ సర్వా
ణ్యాయవ్యయే చానురూపాం చ వృత్తిమ్।
సంగృహ్ణీయా దనురూపాన్ సహాయన్
సహాయసాధ్యాని హి దుష్కరాణి॥ 24
ముందుగానే చేయదగిన పనులు అన్నీ నిశ్చయించుకొని, ఆదాయవ్యయాలు లెక్క కట్టుకొని, సేవకులకు అనురూపమయిన జీతాలు కూడా లెక్కించుకొని తనకనుకూలమయిన వారి నుండి రాజు సహాయం పొందాలి. తనకు అసాధ్యములయిన వానిని సహాయుల ద్వారా సాధ్యపరచుకోవాలి. (24)
అభిప్రాయం యో విదిత్వా తు భర్తుః
సర్వాణి కార్యాణి కరోత్యతంద్రీ।
వక్తా హితానా మనురక్త ఆర్యః
శక్తిజ్ఞ ఆత్మేన హి సోఽనుకంప్యః॥ 25
రాజు యొక్క అభిప్రాయం తెలిసి, ఏమరకుండా పనులన్నీ చేసేవాడు, హితంగా మాట్లాడేవాడు, రాజుమీద భక్తి కలవాడు, సన్మార్గుడు, తనశక్తి తాను ఎరిగినవాడు అయిన సేవకుని రాజు తనలాగానే దయతో కటాక్షించాలి. (25)
వాక్యం తు యో నాద్రియతేఽనుశిష్టః
ప్రత్యాహ యశ్చాపి నియుజ్యమానః।
ప్రజ్ఞాభిమానీ ప్రతికూలవాదీ
త్యాజ్యశ్చ తాదృక్ త్వరమైన భృత్యః॥ 26
రాజు ఆజ్ఞను ఆదరించని వాడిని, పని చెపితే ఆచరించకుండా ఎదురు చెప్పే వాడిని, తన తెలివిమీద మాత్రమే అభిమానం కలవాడినీ, వ్యతిరేకంగా మాట్లాడే వాడినీ వెంటనే కొలువు నుండి తొలగించాలి. (26)
అస్తబ్ధమక్లీబమదీర్ఘసూత్రం
సానుక్రోశం శ్లక్ష్ణమహార్యమన్యైః।
అరోగజాతీయముదారవాక్యం
దూతం వదంత్యష్టగుణోపపన్నమ్॥ 27
దూత ఎనిమిది సద్గుణాలు కలిగి ఉండాలి. 1) గర్వం లేనివాడు 2. సమర్థుడై ఉండాలి. 3. త్వరగా పని నెరవేర్చేవాడు అయి ఉండాలి. 4. దయగలవాడు 5. అందరికీ హితుడు 6. ఇతరులు ఆశ చూపితే లోబడనివాడు. 7. రోగరహితుడు 8. ఉదారంగా మాట్లాడే వాడు అయి ఉండాలి అని చెపుతున్నారు. (27)
వి॥సం॥ అస్తబ్ధమ్ = అగర్వం
అక్లీబమ్ = అకాతరమ్, అదీర్ఘసూత్రమ్ = క్షిప్రకారిణమ్
సానుక్రోశమ్ = సకృపమ్, శ్లక్ష్ణమ్ = అకర్కశమ్
అహార్యమ్ = అభేద్యమ్, అరోగి జాతీయమ్ = అరోగి కులోత్పన్నమ్
ఉదారవాక్యమ్ = అదీన వచనమ్(దేవ)
న విశ్వాసాజ్జాతు పరస్య గేహే
గచ్ఛేన్నరశ్చేతయానో వికాలే।
న చత్వరే నిశి తిష్ఠేన్నిగూఢః
న రాజకామ్యాం యోషితం ప్రార్థయీత॥ 28
తెలివైనవాడు కానిసమయంలో (సాయంకాలం మునుమాపువేళ)శంకాశీలుని యింటికి వెళ్ళకూడదు. నాలుగు రోడ్ల కూడలిలో రాత్రిపూట రహస్యంగా నిలువ రాదు - రాజు కోరుకొనే స్త్రీని అడగరాదు. (28)
వి॥సం॥ పరస్య =అవిశ్వస్తస్య (నమ్మకం లేనివాని యొక్క)
న నిహ్నవం మంత్రగతస్య గచ్ఛేత్
సంసృష్టమంత్రస్య కుసంగతస్య।
న చ బ్రూయాత్ నాశ్వసిమి త్వయీతి
సకారణం వ్యపదేశం తు కుర్యాత్॥ 29
చాలామంది దుర్మార్గులు కలిసి చేసిన కుతంత్రాన్ని చటుక్కున వ్యతిరేకించరాదు. "నిన్ను నమ్మను" అని కూడా అనరాదు. ఏదో నెపం పెట్టి అక్కడ నుండి తొలగిపోవాలి. (29)
ఘృణీ రాజా పుంశ్చలీ రాజభృత్యః
పుత్రో భ్రాతా విధవా బాలపుత్రా।
సేనాజీవీ చోద్ధృతభూతిరేవ
వ్యవహారేషు వర్జనీయాః స్యురేతే॥ 30
1. దయగలవాడు 2. రాజు 3. శీలం లేనిస్త్రీ, 4. రాజసేవకుడు, 5. కొడుకు, 6. సోదరుడు, 7. విధవ, 8. చిన్నపిల్లలున్న తల్లి, 9. సేనలో జీవించువాడు 10. అధికారం పోయినవాడు, వీరి నందరినీ వ్యవహారాల్లో విడిచి పెట్టాలి. (వ్యవహారాలంటే ధనం ఇచ్చిపుచ్చుకోవడాలు) (30)
వి॥సం॥ 1. దయగలవాడు ఇతరులకిచ్చిన అప్పును మళ్లీ తీసుకోలేడు. 2.3. శీలం లేని స్త్రీని అప్పు అడిగితే నన్ను అనుభవించావని అంటుంది. 4. రాజసేవకుడు తన బలాన్ని ప్రదర్శిస్తాడు 5. పుత్రుడు కాని సోదరుడు కాని తనసొమ్ము మీద అధికారం కలవారు కాబట్టి వారిని అడగలేము 9. సేనాజీవిని కూడా రాజదండభయంతో అడగలేము. 10. అధికారం పోయిన వాడిని అడిగినా డబ్బులేకపోవడం చేత ఇవ్వలేకపోతాడు. వాడిని పీడిస్తే చెడ్డపేరు వస్తుంది. (దేవ)
అష్టౌ గుణాః పురుషం దీపయంతి
ప్రజ్ఞా చ కౌల్యం చ శ్రుతం దమశ్చ।
పరాక్రమశ్చాబహుభాషితా చ
దానం యథాశక్తి కృతజ్ఞతా చ॥ 31
తెలివి తేటలు, సత్కులం, సద్విద్య, ఇంద్రియ నిగ్రహం, పరాక్రమం, మితంగా మాట్లాడటం, శక్తిననుసరించిన దానం, కృతజ్ఞత - ఈ ఎనిమిది గుణాలు మానవుని వెలుగులోకి తీసుకువస్తాయి. (31)
ఏతాన్ గుణాంస్తాత్ మహానుభావాన్
ఏకో గుణః సంశ్రయతే ప్రసహ్య।
రాజా యదా సత్కురుతే మనుష్యం
సర్వాన్ గుణానేష గుణో బిభర్తి॥ 32
ఈ ఎనిమిది గుణాలూ చాలా గొప్పవే అయినా ఒకగుణం వీటిని పట్టినిలుపుతుంది. రాజు ఆ మానవుని సత్కరించినపుడు పై గుణాలన్నిటికీ ఈ ఒక్క గుణమే నిండుతనం తెస్తుంది. (32)
గుణా దశ స్నానశీలం భజంతే
బలం రూపం స్వరవర్ణప్రశుద్ధిః।
స్పర్శశ్చ గంధశ్చ విశుద్ధతా చ
శ్రీః సౌకుమార్యం ప్రవరాశ్చ నార్యః॥ 33
బలం, రూపం, శుద్ధమైన కంఠస్వరం, స్పష్టమైన వర్ణోచ్చారణ, మృదుశరీరమ్, సువాసన, శరీరశుద్ధి, శోభ, లావణ్యం, ఉత్తమస్త్రీలు - ఈ పది స్నానశీలం కలవానికి లభిస్తాయి. (33)
గుణాశ్చ షట్ మితభుక్తం భజంతే
ఆరోగ్యమాయుశ్చ బలం సుఖం చ।
అనావిలం చాస్య భవత్యపత్యం
న చిఅవమాద్యూన ఇతి క్షిపంతి॥ 34
మితంగా తినే వానికి ఆరు గుణాలు కలుగుతాయి. 1. ఆరోగ్యం 2. ఆయువు, 3. బలం, 4. సుఖం, 5. రోగరహితమైన సంతానం, అంతేకాదు 6. 'తిండిపోతు' అని ఆక్షేపించక పోవడం. (34)
వి॥సం॥ ఆద్యూనః = బహుభుక్(దేవ) అతిగా తినేవాడు.
అకర్మశీలం చ మహాశనం చ
లోకద్విష్టం బహుమాయం నృశంసమ్।
అదేశకాలజ్ఞమనిష్టవేశ్హం
ఏతాన్ గృహే న ప్రతివాసయేత॥ 35
సోమరిని, తిండిపోతును, లోకులను ద్వేషించే వానిని, మాయల మారిని, క్రూరుని, దేశకాలాలు తెలియని వానిని, అసహ్యకరమయిన వేషం వేసుకొనే వానిని ఇంటిలో ఉండనీయకూడదు. (35)
కదర్యమాక్రోశకమశ్రుతం చ
వనౌకసం ధూర్తమమాన్యమానినమ్।
నిష్ఠూరిణం కృతవైరం, కృతఘ్నం
ఏతాన్ భృశార్తోఽపి న జాతు యాచేత్॥ 36
పిసిని గొట్టును, వదరు బోతును, శాస్త్రమెరుగని మూర్ఖుని, అడవిమనిషిని, జూదగాడిని, నీచులను గౌరవించే వాడిని, క్రూరస్వభావుని, పగబట్టిన వానిని, చేశిన మేలు మరచిన వానిని ఎంత కష్టంలో ఉన్నా యాచింపరాదు. (36)
సంక్లిష్టకర్మాణమతిప్రమాదం
నిత్యానృతం చాదృఢభక్తికం చ।
విసృష్టరాగం పటుమానినం చా
ప్యేతాన్న సేవేత నరాధమాన్ షట్॥ 37
నీచుని, ఎప్పుడూ ఓళ్లు మరచి ఉండే వాడిని, నిత్యమూ అబద్ధాలాడే వాడిని, దృఢమైన భక్తి లేని వానిని, స్నేహం విడిచి పెట్టేవాడిని, తానే గొప్పవాడని భావించే వానిని, ఈ ఆరుగురు నరాధములనూ ఎన్నడూ సేవింపరాదు. (37)
సహాయ బంధనా హ్యర్థాః సహాయాశ్చార్థబంధనాః।
అన్యోన్యబంధనావేతౌ వినాన్యోన్యం న సిద్ధ్యతః॥ 38
సంపదలు సహాయులతో ముడిపడి వస్తాయి. సహాయులు కూడా సంపదలతో ముడిపడి ఏర్పడుతారు. సంపదలు, సహాయులు ఈ రెండూ పరస్పరం కూడి ఉంటాయి. వేరుగా ఉంటే ఫలించవు. (38)
ఉత్పాద్య పుత్రాననృణాంశ్చ కృత్వా
వృత్తిం చ తేభ్యోఽనువిధాయ కాంచిత్।
స్థానే కుమారీః ప్రతిపాద్య సర్వాః
అరణ్యసంస్థోఽథ ముని ర్బుభూషేత్॥ 39
మానవుడు పుత్రులను కని, వారికి అప్పు మిగల్చకుండా తగిన వృత్తిని కల్పించి, పుత్రికలను తగినవరులకిచ్చి ఆ తరువాత అడవికేగి ముని వృత్తి నవలంబించాలి. (39)
హితం యత్ సర్వభూతానాం ఆత్మనశ్చ సుఖావహమ్।
తత్కుర్యాదీశ్వరే హ్యేతత్ మూలం సర్వార్థసిద్ధయే॥ 40
ప్రాణులన్నిటికీ హితమయినదీ, తనకు కూడా సుఖకరమయినదీ దైవం పట్ల చెయ్యాలి. సర్వప్రయోజనాలూ కలగటానికి మూలం అదే. (40)
వి॥సం॥ మనం చేసుకొన్న స్వ పర హితాచరణం వల్లనే భగవంతుడు కూడ ఫలితం ఇస్తాడు. (నీల)
వృద్ధిః ప్రభావస్తేజశ్చ సత్త్వముత్థానమేవ చ।
వ్యవసాయశ్చ యస్యస్యాత్ తస్యావృత్తిభయం కుతః॥ 41
అభివృద్ధి, ప్రభావం, తేజస్సు, సత్త్వం, ప్రయత్నం నిశ్చయం, ఈ ఆరూ కలవానికి జీవనోపాధిని గురించి భయం ఉండదు. (41)
పశ్య దోషాన్ పాండవైర్విగ్రహే త్వం
యత్ర వ్యథేయురపి దేవాః సశక్రాః।
పుత్రైర్వైరం నిత్యముద్విగ్నవాసః
యశః ప్రణాశో ద్విషతశ్చ హర్షః॥ 42
పాండవులతో వైరం వల్ల వచ్చే దోషాలను చూడు. వారితో వైరానికి దేవతలూ, ఇంద్రుడూ కూడా తల్లడిల్లి పోతారు. పుత్రులతో వైరం నిత్యమూ దుఃఖంతో బ్రతకటం, కీర్తి పోవటం, శత్రువులకు సంతోషం తప్ప మరేమీ లేదు. (42)
భీష్మస్య కోపస్తవ చైవేంద్రకల్ప
ద్రోణస్య రాజ్ఞశ్చ యుధిష్ఠిరస్య।
ఉత్సాదయేల్లోకమిమం ప్రవృద్ధః
శ్వేతో గ్రహస్తిర్యగివాపతన్ ఖే॥ 43
ఇంద్రసమానుడా! భీష్ముడు, నీవు, ద్రోణుడు, రాజయిన ధర్మరాజు - వీరికోపం బాగా పెరిగి ఆకాశంలో అడ్డంగా తోచిన తోకచుక్కలాగా ఈ లోకమంతటినీ రూపుమాపుతుంది. (43)
తవ పుత్రశతం చైవ కర్ణః పంచ చ పాండవః।
పృథివీమనుశాసేయుః అఖిలాం సాగరాంబరామ్॥ 44
నీ వందమంది కొడుకులూ, కర్ణుడూ, పాండవు లయిదుగురూ కలిసి సముద్రంలో చుట్టిన భూమి నంతటినీ పాలింతురు గాక. (44)
ధార్తరాష్ట్రా వనం రాజన్ వ్యాఘ్రాః పాండుసుతా మతాః।
మా వనం ఛిన్ది సవ్యాఘ్రం మావ్యాఘ్రాన్నీనశన్ వనాత్॥ 45
న స్యాద్వనమృతే వ్యాఘ్రాన్ వ్యాఘ్రా న స్యురృతే వనమ్।
వనం హి రక్ష్యతే వ్యాఘ్రైః వ్యాఘ్రాన్ రక్షతి కాననమ్॥ 46
పులులు లేకపోతే అడవి నిలవదు(నరికివేస్తారు) అడవి లేకపోతే (బయటకు వస్తే) పులులు బ్రతకవు. అనగా పులులు అడవిని నిలబెడతాయి. అడవి పులుల్ని రక్షిస్తుంది. (46)
న తథేచ్ఛంతి కల్యాణాన్ పరేషాం వేదితుం గుణాన్।
యథైషాం జ్ఞాతు మిచ్ఛంతి నైర్గుణ్యం పాపచేతసః॥ 47
పాపాత్ములు ఇతరుల గుణహీనతను(దోషమును) తెలుసు కోవాలనుకొంటారు కాని సద్గుణాలను తెలుసుకోవాలనుకోరు. (47)
అర్థసిద్ధిం పరామిచ్ఛన్ ధర్మమేవాదితశ్చరేత్।
న హి ధర్మాదపైత్యర్థః స్వర్గలోకాదివామృతమ్॥48
పరమార్థం పొందాలనుకొనేవాడు ముందుగా ధర్మాన్నే ఆచరించాలి. అమృతం స్వర్గాన్ని విడవనట్లుగా అర్థం ధర్మాన్ని విడిచిపెట్టదు. (అందువలన ధర్మపూర్వకంగా అర్థ సాధనం చెయ్యాలి) (48)
యస్మాత్మా విరతః పాపాత్ కళ్యానే చ నివేశితః।
తేన సర్వమిదం బుద్ధం ప్రకృతిర్వికృతిశ్చ యా॥ 49
పాప కృత్యాలు చేయకుండా శుభప్రదములయిన పనులు మాత్రమే చేసేవారికి ప్రకృతి ఇది, వికృతి ఇది అని సర్వమూ బోధపడుతుంది. (49)
యో ధర్మమర్థం కామం చ యథాకాలం నిషేవతే।
ధర్మార్థకామసంయోగం సోఽముత్రేహ చ విందతి॥ 50
దేశకాలానుసారంగా ధర్మార్థకామాలను సేవించే వానికి ఇహపరాలు రెండిట అవి సిద్ధిస్తాయి. (50)
సంనియచ్ఛతి యో వేగం ఉత్థితం క్రోధహర్షయోః।
స శ్రియో భాజనం రాజన్! యశ్చాపత్సు న ముహ్యతి॥ 51
కోప సంతోషాం వేగాన్ని అదుపు చేసుకొనగలిగిన వాడు సంపదలను పొందుతాడు. ఆపదలలో మునిగిపోడు. (51)
బలం పంచవిధం నిత్యం పురుషాణాం నిబోధ మే।
యత్తు బాహుబలం నామ కనిష్ఠం బలముచ్యతే॥ 52
అమాత్యలాభో భద్రం తే ద్వితీయం బలముచ్యతే।
తృతీయం ధనలాభం తు బలమాహుర్మనీషిణః॥ 53
యత్త్వస్య సహజం రాజన్ పితృపైతామహం బలమ్।
అభిజాతబలం నామ తచ్చతుర్థం బలం స్మృతమ్॥ 54
యేన త్వేతాని సర్వాణి సంగృహీతాని భారత।
యద్బలానాం బలం శ్రేష్ఠం తత్ర్పజ్ఞాబలముచ్యతే॥ 55
రాజా! బలం అనేది మానవులకు అయిదు విధాల ఉంటుంది. చెపుతా విను. మొదటిది భుజబలం అది మిక్కిలి తక్కువది. చక్కని మంత్రులు దొరకడం రెండవది. మూడవ బలం ధనం. అభిజాతబలం నాల్గవది. అది తండ్రి తాతల నుండి వంశపారంపర్యంగా వచ్చేది. ఈ అన్ని బలాల మొత్తం కంటే శ్రేష్ఠం ప్రజ్ఞాబలం. అది అయిదవది. అన్ని బలాలకూ అది బలం. (52-55)
మహతే యో ఽపకారాయ నరస్య ప్రభవేన్నరః।
తేన వైరం సమాసజ్య దూరస్థోఽస్మీతి నాశ్వసేత్॥ 56
చాలా అపకారం చేయగల శత్రువు దూరంగానే ఉన్నాడుగా అని ఆదమరచి ఉండకూడదు. (56)
స్త్రీషు రాజసు సర్పేషు స్వాధ్యాయప్రభుశత్రుషు।
భోగేష్వాయుషి విశ్వాసం కః ప్రాజ్ఞః కర్తుమర్హతి॥ 57
స్త్రీల మీద, రాజుల మీద, పాముల మీద, వేదాధ్యయనం మీద, సమర్థునిమీద, శత్రువుమీద, భోగం మీద, ఆయువు మీద, నమ్మకం ఏ బుద్ధిమంతుడు పెట్టుకుంటాడు? (అనగా వీటి మీద విశ్వాసం ఉంచినవాడు తెలివితక్కువ వాడని భావం) (57)
వి॥ స్వాధ్యాయశత్రుషు, ప్రభుశత్రుషు = వేదాధ్యయన శత్రువుల మీద, రాజు శత్రువుల మీద అంటే బాగుంటుందేమో!
ప్రజ్ఞాశరేణాభిహతస్య జంతోః
చికిత్సకాః సంతి న చౌషధాని।
న హోమ మంత్రా న చ మంగళాని
నాథర్వణా నాప్యగదాః సుసిద్ధాః॥ 58
ప్రజ్ఞ అనే బాణపు దెబ్బ తగిలిన ప్రాణికి వైద్యులు లేరు. మందులు లేవు. హోమాలు చేసే మంత్రాలు లేవు. మంగళ కృత్యాలు లేవు. అథర్వ వేద మంత్రాలు లేవు. ప్రసిద్ధమయిన సిద్ధౌషధాలు లేవు. (పాదరసం మొ॥) (58)
సర్పశ్చాగ్నిశ్చ సింహశ్చ కులపుత్రశ్చ భారత।
నావజ్ఞయా మనుష్యేణ సర్వే హ్యేతేఽతి తేజసః॥ 59
పాము, అగ్ని, సింహం, జ్ఞాతి ఇవన్నీ మిక్కిలి తేజస్సు కలవి, మానవుడు చులకన చేయకూడదు. (59)
అగ్నిస్తేజో మహల్లోకే గూఢస్తిష్ఠతి దారుషు।
స చోపయుంక్తే తద్దారు యావన్నోద్దీప్యతే పరైః॥ 60
లోకంలో అగ్ని గొప్ప తేజస్సు, అది కట్టెలలో గూఢంగా దాగి ఉంటుంది. అది మరోకట్టెతో రాపిడిపొంది ప్రజ్వలించేంత వరకు ఆ కట్టెలో దాగిన అగ్ని ఉపయోగపడదు. (60)
స ఏవ ఖలు దారుభ్యః యదా నిర్మథ్య దీప్యతే।
తద్దారు చ వనం చాన్యత్ నిర్దహ త్యాశుతేజసా॥ 61
కట్టెల రాపిడి వల్ల అగ్ని మండుతుంది. అదే అగ్ని అడవి నంతటినీ శీఘ్రంగా మంటలతో దహించి వేస్తుంది. (61)
ఏవమేవ కులే జాతాః పావకోపమతేజసః
క్షమావంతో నిరాకారాః కాష్ఠేఽగ్నిరివ శేరతే॥ 62
ఇలాగే నీ వంశంలో పుట్టిన పాండవులు అగ్నివంటి తేజస్సు కలవారు. సహనంతో గూఢంగా కట్టెలో నిప్పులాగా నిద్రిస్తున్నారు. (62)
లతా ధర్మా త్వం సపుత్రః శాలాః పాండుసుతా మతాః।
న లతా వర్ధతే జాతు మహాధ్రుమమనాశ్రితా॥ 63
రాజా! పుత్రులతో కూడిన నీవు లతవంటి వాడవు. పాండవులు సాలవృక్షాల వంటివారు. పెద్ద పెద్ద వృక్షాలను ఆశ్రయించకుండా లత ఎన్నడూ వృద్ధి పొందదు. (63)
వనం రాజన్ తవ పుత్రోఽంబికేయ
సింహాన్వనే పాండవాన్ తాత విద్ధి।
సింహైర్విహీనం హి వనం వినశ్యేత్
సింహా వినశ్యేయుర్హి ఋతే వనేన॥ 64
రాజా! నీపుత్రుడు(లు) అడవి అనీ పాండవులు సింహాలనీ తెలుసుకో, సింహాలు లేని అడవి తరిగిపోతుంది. అలాగే వనంలో లేకపోతే సింహాలూ నశించి పోతాయి. (64)
వి॥తె॥ ఈ సందర్భంలో లేదు కాణి సంజయుడు రాయబారానికి వెళ్లినపుడు కృష్ణుడు చెప్పినట్లుగా తెలుగులో తిక్కన దీన్ని అనువదించాడు.
ధృతరాష్ట్రుండును పుత్రులున్ వనము, కుంతీనందనుల్ సింహముల్ మతి నూహింప నసింహమైన వనమున్ మర్దింతు రెండున్ వనా వృత వృత్తంబులు కాని సింహములకున్ వేగంబ చేబొందుఁగా
న తగం బొందుట మేలుభయమున్ సంతుష్టిమై నున్కికిన్.
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి ప్రజాగరపర్వణి విదురహితవాక్యే సప్తత్రింశోఽధ్యాయః॥ 37 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున ప్రజాగరపర్వమను ఉపపర్వమున
విదురునిహితవాక్యము ముప్పది ఏడవ అధ్యాయము. (37)