38. ముప్పది యెనిమిదవ అధ్యాయము

విదురుడు ధృతరాష్ట్రునకు నీతినుపదేశించుట.

విదుర ఉవాచ
ఊర్ధ్వం ప్రాణా హ్యుత్క్రామంతి యూనః స్థవిర ఆయతి।
ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే॥ 1
విదురుడు ఇలా చెప్పాడు. పెద్దలు వస్తున్నపుడు చిన్నవారి ప్రాణాలు పైకి లేస్తాయి. ఎదురుగా వెళ్లి నమస్కారం చేస్తే మళ్లీ ఆ ప్రాణాలను చిన్నవాడు పొందుతాడు.(1)
పీఠం దత్వా సాధనే ఽభ్యాగతాయ
అనీయాపః పరినిర్ణిజ్య పాదౌ।
సుఖం పృష్ట్వా ప్రతివేద్యాత్మసంస్థాం
తతో దద్యాదన్నమవేక్ష్య ధీరః॥ 2
వచ్చిన సజ్జనుడికి ధీరుడు ఆసనం ఇచ్చి కూర్చుండ బెట్టి నీళ్లు తీసికొని వచ్చి పాదాలు కడిగి, కుశల మడిగి తెలుసుకొని, తన పరిస్థితిని నివేదించి తరువాత అతనికి భోజనం పెట్టాలి. (2)
యస్యోదకం మధుపర్కం చ గాం చ
న మంత్రవిత్ ప్రతిగృహ్ణాతి గేహే।
లోభాద్భయాదథ కార్పణ్యతో వా
తస్యానర్థం జీవితమాహురార్యః॥ 3
లోభంవల్ల కాని, భయంవల్ల కాని, జాలివల్ల కాని గృహస్థు వేదవేత్త అయిన ఆభ్యాగతుడికి ఉదకం, మధుపర్కం, ఆవును ఇవ్వకపోతే వాని బ్రతుకు వ్యర్థం అని పెద్దలు చెపుతారు. (3)
వి॥ మధుపర్కం : నెయ్యి, పాలు, పంచదార, తేనె, నీరు కలిపిన పదార్థం.
చికిత్సకః శల్యకర్తా ఽవకీర్ణీ
స్తేవః క్రూరో మద్యపో భ్రూణహా చ।
సేనాజీవీ శ్రుతివిక్రాయకశ్చ
భృశం ప్రియో ఽ ప్యతిథి ర్నోదకార్హః॥ 4
వైద్యుడు, బాణాలు తయారు చేసేవాడు, బ్రహ్మచర్యం తరిగిన వాడు(నియమంలేనివాడు), దొంగ, క్రూరుడు, త్రాగుబోతు, గర్భంలోని పిల్లలను చంపేవాడు, సేనలో బ్రతికేవాడు, వేదం అమ్ముకొని జీవించేవాడు - వీరు వస్తే ఉదకం ఇవ్వకూడదు. (4)
వి॥సం॥ ఉదకం ఇవ్వరాదు కాని అల్లుని వలె గౌరవించాలి(నీల)
అవిక్రేయం లవణం పక్వమన్నం
దధి క్షీరం మధు తైలం ఘృతం చ।
తిలా మాంసం ఫలమూలాని శాకం
రక్తం వాసః సర్వగంధా గుడాశ్చ॥ 5
ఉప్పు, అన్నం, పెరుగు, పాలు, తేనె, నూనె, నెయ్యి, నువ్వులు, మాంసం, పండ్లు, దుంపలు, కూర, ఎర్రని వస్త్రాలు, గంధాలు, బెల్లం ఇవి అమ్మరాదు. (5)
ఆరోషణో యః సమలోష్టాశ్మకాంచనః
ప్రహీణశోకీ గతసంధివిగ్రహః।
నిందాప్రశంసోపరతః ప్రియాప్రియే
త్యజన్నుదాసీన వదేషభిక్షుకః॥ 6
కోపంలేనివాడు ; మట్టి, రాయి, బంగారం వీటిని సమంగా చూసేవాడు; శోకం తరిగిన వాడు; స్నేహం - విరోధం లేనివాడు; నింద - ప్రశంస రెంటికీ చలనం లేనివాడు; ప్రియాన్ని అప్రియాన్ని వదిలిపెట్టినవాడు; ఏదీ అంటనివాడు సన్యాసి అవుతాడు.(అతడే భిక్షుకుడు). (6)
నీవారమూలేంగుదశకవృత్తిః
సుసంయతాత్మా ఽగ్ని కార్యేషు చోద్యః।
వనే వసన్నతిథిష్వప్రమత్తః
ధురంధరః పుణ్యకృదేష తాపసః॥ 7
నీవార ధాన్యంతో, దుంపలతో, కూరలతో జీవించేవాడు, మనోనిగ్రహం, అగ్నికార్యాల మీద శ్రద్ధ కలిగి అడవిలో ఉన్నా అతిథులపట్ల అప్రమత్తుడై, బరువు బాధ్యతలున్నా పుణ్యకార్యాలు చేసేవాడు - అతనిని తాపసుడంటారు. (7)
వి॥సం॥ తాపసుడే అంత అతిథిమర్యాదలు చేస్తూ ఉంటే ఇక ధనవంతుని మాట చెప్పాలా? అనిభావం (నీల)
అపకృత్య బుద్ధిమతః ద్ఱూరస్థోఽస్మీతి నాశ్వసేత్।
దీర్ఘౌ బుద్ధిమతో బాహూ యాభ్యాం హింసతి హింసితః॥ 8
తెలివైన వానికి అపకారం చేసి దూరంగా ఉన్నా కదా అని ఏమరుపాటుతో ఉండకూడదు. తెలివి వల్ల బుద్ధిమంతుని చేతులు చాలా పొడవుగా ఉంటాయి. వాటితో తనకపకారం చేసిన వాడిని హింసిస్తాడు. (8)
వి॥సం॥ దూరంగా ఉన్నా పాండవులు ఉపేక్షించదగిన వారు కాదు. (నీల)
న విశ్వసేదవిశ్వస్తే విశ్వస్తే నాతివిశ్వసేత్।
విశ్వాసాద్భయముత్పన్నం మూలాన్యపి నికృంతతి॥ 9
నమ్మదగని వారిని నమ్మకూడదు. నమ్మ దగిన వారిని కూడ అతిగా నమ్మకూడదు. నమ్మకంతో పుట్టిన భయం వేళ్లనుకూడ పెకలిస్తుంది. (9)
అనీర్షుర్గుప్తదారశ్చ సంవిభాగీ ప్రియంవదః।
శ్లక్ష్ణః మధురవాక్ స్త్రీణాం న చాసాం వశగో భవేత్॥ 10
మానవుడు ఈర్ష్యారహితుడు, భార్యను రక్షించుకో గలిగినవాడు, తన సొమ్మును న్యాయబద్ధంగా పంచేవాడు, ప్రియంగా మాట్లాడేవాడు, మృదుస్వభావుడు కావాలి. స్త్రీల విషయంలో మధురంగా మాట్లాడాలి కాని వారికి వశం కాకూడదు. (10)
పూజనీయా మహాభాగాః పుణ్యాశ్చ గృహదీప్తయః।
స్త్రియః శ్రియో గృహస్యోక్తాః తస్మా ద్రక్ష్యా విశేషతః॥ 11
స్త్రీలు పూజింప దగ్గవారు. మహిమ కలవారు. పుణ్యాత్ములు. ఇంటికి వెలుగులు. ఇంటిలోని లక్ష్ములు. అందుచేత వారిని శ్రద్ధతో రక్షించాలి. (11)
పితు రంతఃపురం దద్యాత్ మాతు ర్దద్యా న్మహానసమ్।
గోషు చాత్మసమం దద్యాత్ స్వయమేవ కృషిం వ్రజేత్॥ 12
తండ్రికి అంతఃపురాన్ని, తల్లికి వంటింటిని, సోదర, పుత్రాదులకు గోసంరక్షణను అప్పజెప్పవచ్చును. కాని వ్యవసాయానికి తానే వెళ్లాలి. (12)
భృత్యైర్వాణిజ్యచారం చ పుత్రైః సేవేత చ ద్విజాన్।
సేవకుల చేత వాణిజ్యం చేయించాలి. కొడుకుల చేత ద్విజసేవ చేయించాలి. (12 1/2)
అద్భ్యోఽగ్ని ర్బ్రహ్మతః క్షత్రమ్ అశ్మనో లోహముత్ధితమ్॥ 13
తేషాం సర్వత్రగం తేజః స్వాసు యోనిషు శామ్యతి।
నీటినుండి అగ్ని పుట్టింది. బ్రాహ్మణత్వం నుండి క్షత్రియత్వం పుట్టింది. రాతినుండి లోహం పుట్టింది. అంతటా ప్రసరించే వీటి తేజస్సు తమ జన్మస్థలాల్లో మాత్రం అణగిపోతుంది. (13 1/2)
నిత్యం సంతః కులే జాతాః పావకోపమతేజసః॥ 14
క్షమావంతో నిరాకారాః కాష్ఠేఽగ్నిరివ శేరతే।
సద్వంశంలో పుట్టి అగ్ని సమానమయిన తేజస్సు కలిగినా సహనంకలవారు బయటపడకుండా కట్టెలోని నిప్పులాగా ప్రశాంతంగా ఉంటారు. (14 1/2)
వి॥సం॥ పాండవులు ఇపుడు అలా ఉన్నారు. (నీల)
యస్య మంత్రం న జానంతి బాహ్యాశ్చాభ్యంతరాశ్చ యే॥ 15
స రాజా సర్వతశ్చక్షుః చిరమైశ్వర్య మశ్నుతే।
బాహ్యపరివారానికి గాని, ఆభ్యంతర పరివారానికి గాని తెలియకుండా ఆలోచన చేసే రాజు సర్వత్ర తన చూపులు ప్రసరింపజేస్తూ చిరకాలం ఐశ్వర్యం పొందుతాడు. (15 1/2)
కరిష్యన్న ప్రభాషేత కృతాన్యేవతు దర్శయేత్॥ 16
ధర్మకామార్థకార్యాణి తథా మంత్రో న భిద్యతే।
ధర్మార్థ కామాలకు సంబంధించిన పనులు చేస్తున్నపుడు చెప్పరాదు. చేసిన తరువాతనే చెప్పాలి. అలా అయితే మంత్రం భేదించదు. (ఆలోచన కార్యరూపం చెందుతుంది). (16 1/2)
గిరిపృష్ఠముపారుహ్య ప్రాసాదం వా రహోగతః॥ 17
అరణ్యే నిఃశలాకే వా తత్ర మంత్రో ఽభిధీయతే।
రహస్యంగా కొండ ఎక్కిగాని, భవనం ఎక్కిగాని, నిర్జన మయిన అరణ్యంలో కాని రాజు ఆలోచన చేయాలి. (17 1/2)
నాసుహృత్పరమం మంత్రం భారతార్హతి వేదితుమ్॥ 18
అపండితో వాపి సుహృత్ పండితో వా ప్యనాత్మవాన్।
మిత్రుడు కానివాడు రహస్యాలోచన తెలిసి కొనదగడు. పండితుడుకాని స్నేహితుడు, చపలచిత్తుడయిన పండితుడు - వీరికి కూడా రహస్యం తెలియరాదు. (18 1/2)
నా పరీక్ష్య మహీపాలః కుర్యాత్ సచివమాత్మనః॥ 19
అమాత్యే హ్యర్థలిప్సా చ మంత్రరక్షణ మేవ చ।
కృతాని సర్వకార్యాణి యస్య పారిషదా విదుః॥ 20
ధర్మే చార్థే చ కామే చ స రాజా రాజసత్తమః।
గూఢమంత్రస్య నృపతేః తస్య సిద్ధిరసంశయమ్॥ 21
పరీక్షించకుండా రాజు తనకు మంత్రిని నియమించుకొనరాదు. ధనప్రాప్తి, రహస్యం రక్షించడం ఈ రెండూ అమాత్యునిలో ఉంటాయి. ధర్మార్థకామాలకు సంబంధించిన పనులన్నీ అయిపోయిన తరువాతనే సభ్యులకు తెలియాలి. అలా చేసే రాజు శ్రేష్ఠుడు. మంత్రరక్షణం చేసే రాజుకు నిస్సంశయంగా కార్యం సిద్ధిస్తుంది. (19,20,21)
అప్రశస్తాని కార్యాణి యో మోహాదనుతిష్ఠతి।
స తేషాం విపరిభ్రంశాత్ భ్రంశ్యతే జీవితాదపి॥ 22
మోహవశాత్తు నిందింపదగిన పనులు చేసేవాడు వాటి విపరీత పరిణామాల్ వల్ల జీవితం కూడా పోగొట్టుకొంటాడు. (22)
కర్మణాం తు ప్రశస్తానామ్ అనుష్ఠానం సుఖావహమ్।
తేషా మే వాననుష్ఠానం పశ్చాత్తాపకరం మతమ్॥ 23
ప్రశస్త మయిన పనులు చేస్తే సుఖం కలుగుతుంది. చేయకపోతే పస్చాత్తాపం కలుగుతుంది. (23)
అనధీత్య యథా వేదాన్ న విప్రః శ్రాద్ధమర్హతి।
ఏవమశ్రుతషాడ్గుణ్యో న మంత్రం శ్రోతుమర్హతి॥ 24
వేదం అధ్యయనం చేయని విప్రుడు శ్రాద్ధానికి యోగ్యుడు కాడు. అలాగే షాడ్గుణ్యం తెలియని వాడు మంత్రం (రహస్యం) వినటానికి తగడు. (24)
వి॥సం॥ అశ్రుతషాడ్గుణ్యః = సంధి, విగ్రహం, యానం, ఆసనం, ద్వైధీభావం, సమాశ్రయము - అనే ఆరూ వినని వాడు(నీల)
స్థానవృద్ధిక్షయజ్ఞస్య షాడ్గుణ్యవిదితాత్మనః।
అనవజ్ఞాతశీలస్య స్వాధీనా పృథివీ నృప॥ 25
తనస్థితి యొక్క వృద్ధి క్షయాలు, షాడ్గుణ్యమూ తెలిసిన వానికి, అవమానింపబడని శీలం కలవానికి ఈ భూమి అంతా స్వాధీన మవుతుంది. (25)
అమోఘక్రోధహర్షస్య స్వయం కృత్యాన్వవేక్షిణః।
ఆత్మప్రత్యయకోశస్య వసుదైవ వసుంధరా॥ 26
వ్యర్థం కాని కోపమూ, సంతోషమూ కలిగి, తనపనిని తానే విమర్శించుకొంటూ, తానే కోశాగారాన్ని రక్షించుకొనే రాజుకు ఈ భూమి సర్వసంపదలనూ ఇస్తుంది. (26)
నామమాత్రేణ తుష్యేత ఛత్రేణ చ మహీపతిః।
భృత్యేభ్యో విసృజేదర్థాన్ నైకః సర్వహరో భవేత్॥ 27
రాజు అనే పేరుతోనూ, ఛత్రంతోనూ రాజు సంతోషించాలి. తానొక్కడే సర్వాన్ని హరించకూడదు. సేవకులకు సంపదలు పంచాలి. (27)
వి॥సం॥ రాజు భోగాల్ని సేవకులతో కలసి అనుభవించాలి. (నీల)
బ్రాహ్మణం బ్రాహ్మణో వేద భర్తా వేద స్త్రియం తథా।
అమాత్యం నృపతి ర్వేద రాజా రాజానమేవ చ॥ 28
బ్రాహ్మణుని గురించి బ్రాహ్మణునికి తెలుస్తుంది. భార్యను గురించి భర్తకు తెలుస్తుంది. మంత్రిని గురించి రాజుకు తెలుస్తుంది. కాని రాజునుగురించి రాజుకే తెలుస్తుంది. (28)
న శత్రుర్వశమాపన్నః మోక్తవ్యో వధ్యతాం గతః।
న్యగ్భూత్వా పర్యుపాసీత వధ్యం హన్యాద్ బలే సతి।
అహతాద్ది భయం తస్మాద్ జాయతే న చిరాదివ॥ 29
చంపదగిన శత్రువు తనకు చిక్కితే వదిలిపెట్టకూడదు. తనకంటే అధికుడయితే అణగిమణిగి సేవించాలి. బలం పుంజుకున్నాక చంపివేయాలి. లేకపోతే త్వరలోనే వానివల్ల భయం ఏర్పడుతుంది. (29)
దైవతేషు ప్రయత్నేన రాజసు బ్రాహ్మణేషు చ।
నియంతవ్యః సదా క్రోధః వృద్ధబాలాతురేషు చ॥ 30
దైవతముల పట్ల, రాజులు, బ్రాహ్మణుల పట్ల, వృద్ధులపట్ల, బాలురపట్ల, రోగుల పట్ల కోపాన్ని ప్రయత్న పూర్వకంగా అణచుకోవాలి. (30)
నిరర్థః కలహం ప్రాజ్ఞః వర్జయేన్మూఢసేవితమ్।
కీర్తిం చ లభతే లోకే న చానర్థేన యుజ్యతే॥ 31
లోకంలో మూఢులు మాత్రమే వ్యర్థంగా కలహిస్తారు. దాన్ని తెలివిగలవాడు విడిచి పెట్టాలి. అలా విడిచి పెడితే మంచిపేరు కలుగుతుంది. కీడు కలగదు. (31)
ప్రసాదో నిష్ఫలో యస్య క్రోధశ్చాపి నిరర్థకః।
న తం భర్తారమిచ్ఛంతి షండం పతిమివ స్త్రియః॥ 32
నపుంసకుని స్త్రీలు భర్తగా కోరనట్లుగా నిష్ఫల మయిన అనుగ్రహమూ, వ్యర్థమయిన కోపమూ కలవానిని ప్రజలు రాజుగా కోరుకోరు. (32)
న బుద్ధిర్ధనలాభాయ న జాడ్య మసమృద్ధయే।
లోకపర్యాయవృత్తాంతం ప్రాజ్ఞో జానాతి నేతరః॥ 33
బుద్ధిగలిగినంత మాత్రాన సంపద రాదు. మూఢుడయినంత మాత్రాన దారిద్ర్యం కలగదు. లోకంలో తారుమారు పరిస్థితులను ప్రాజ్ఞుడే గమనిస్తాడు. ఇతరులకు తెలియదు. (33)
వి॥సం॥ అన్నీ కర్మను బట్టి ఏర్పడతాయని ప్రాజ్ఞుడికి తెలుసును (నీల)
విద్యాశీలవయోవృద్ధాన్ బుద్ధివృద్ధాంశ్చ భారత।
ధనాభిజాతవృద్ధాంశ్చ నిత్యం మూఢోఽవమన్యతే॥ 34
విద్య, శీలం, బుద్ధి, ధనం, వంశం వీనిచేత వృద్ధులయిన వారిని మూఢుడు నిత్యమూ అవమానిస్తూ ఉంటాడు. (34)
అనార్యవృత్త మప్రాజ్ఞం అసూయక మధార్మికమ్।
అనర్థాః క్షిప్ర మాయాంతి వాగ్దుష్టం క్రోధనం తథా॥ 35
సత్ప్రవర్తన లేని వానికి, తెలివిలేని వానికి, అసూయాపరునికి, ధర్మపూర్వకమైన నడవడి లేనివానికి నోరు మంచిదికాని వానికి, కోపం కలవానికి త్వరగా కష్టాలు వస్తాయి. (35)
అవిసంవాదనం దానం సమయస్యావ్యతిక్రమః।
ఆవర్తయంతి భూతాని సమ్యక్ ప్రణిహితా చ వాక్॥ 36
వంచన లేని దానం, హద్దు(మర్యాద) మీరక పోవడం, హితంగా మాట్లాడిన మాట ఈ మూడూ ప్రాణులను తనవైపుకు త్రిప్పుకుంటాయి. (36)
అవిసంవాదకో దక్షః కృతజ్ఞో మతిమాన్ ఋజుః।
అపి సంక్షీణకోశోఽ పి లభతే పరివారణమ్॥ 37
మోసం చేయని వాడు, సమర్థుడు, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడు, నిష్కల్మషుడు, ఎపుడయినా ధనం తగ్గినా పరివారం (అండదండలు) కలిగే ఉంటాడు. (37)
ధృతిః శమో దమః శౌచం కారుణ్యం వాగనిష్ఠురా।
మిత్రాణాం చావభిద్రోహః సప్తైతాః సమిధః శ్రియః॥ 38
ధైర్యం, శమం, దమం, శుచిత్వం, కరుణ, మృదువయినమాట, మిత్రద్రోహం చేయకపోవడం ఈ ఏడూ సంపదను వృద్ధి పొందిస్తాయి. (38)
అసంవిభాగీ దుష్టాత్మా కృతఘ్నో నిరపత్రపః।
తాదృఙ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిపః॥ 40
రాజా! తన వారికి పెట్టకుండా తినేవాడు, దుష్టుడు, కృతఘ్నుడు, సిగ్గులేనివాడు, అయిన రాజును విడిచిపెట్టాలి. (39)
న చ రాత్రౌ సుఖం శేతే ససర్ప ఇవ వేశ్మని।
యః కోసయతి నిర్దోషం సదోషోఽభ్యంతరం జనమ్॥ 40
తాను తప్పులు చేస్తూ తప్పులు చేయని తనవారికి కోపంకలిగేటట్లు ప్రవర్తించేవాడు పామున్నయింటిలో లాగా సుఖంగా నిద్రపోలేడు. (40)
యేషు దుష్టేషు దోషః స్యాద్ యోగక్షేమస్య భారత।
సదా ప్రసాదనం తేషాం దేవతానామివాచరేత్॥ 41
ఎవరికి చేటు కలిగితే తన యోగక్షేమాలకు చేటుకలుగుతుందో వారిని ఎల్లప్పుడూ దేవతలలాగా ప్రసన్నులను చేసుకోవాలి. (41)
యేఽర్థాః స్త్రీషు సమాయుక్తః ప్రమత్తపతితేషు చ।
యే చానార్యే సమాసక్తాః సర్వే తే సంశయం గతాః॥ 42
స్త్రీలు, ప్రమత్తులు, పతితులు, దుర్జనులు - వీరి వల్ల కావలసిన పనులన్నీ సంశయ గ్రస్తములే - ఫలితాన్ని ఇస్తాయా అనేద్ సంశయమే. (42)
యత్ర స్త్రీ యత్ర కితనః బాలో యత్రానుశాసితా।
మజ్జంతి తేఽఅవశా రాజన్ నద్యామశ్మప్లవా ఇవ॥ 43
వనిత, జూదగాడు, బాలుడు శాసించే వారయితే ఆ ప్రజలు రాతినావలు నదిలో మునిగిపోయినట్లు శీఘ్రంగా మునిగిపోతారు. (43)
ప్రయోజనేషు యే సక్తా న విశేషేషు భారత।
తానహం పండితాన్ మన్యే విశేషా హి ప్రసంగినః॥ 44
అవసరమయినపుడు మాత్రం ఆదుకొని, మిగిలిన సమయంలో దూరంగా ఉండే సేవకులే పండితులని నా అభిప్రాయం. అనవసర సమయాల్లో చేసే సేవ వల్ల ఘర్షణ, త్రొక్కిసలాట తప్ప వేరే ప్రయోజనం ఉండదు. (44)
యం ప్రశంసంతి కితవాః యం ప్రశంసంతి చారిణాః।
యం ప్రశంసంతి బంధక్యో న స జీవతి మానవః॥ 45
జూదరులచే మాత్రమే ప్రశంసింపబడేవాడు, అలాగే చారణుల చేత, వేశ్యల చేత పొగడ్తలు పొందేవాడు ఎంతో కాలం బ్రతకడు. (45)
హిత్వా తాన్ పరమేష్వాసాన్ పాండవానమితౌజసః।
ఆహితం భారతైశ్వర్యం త్వయా దుర్యోధనే మహత్॥ 46
రాజా! మేటి విలుకాండ్రు, మిక్కిలి తేజస్సుకల పాండవులను వదలి నీ సంపద నంతనూ దుర్యోధనుని మీద పెట్టావు. (46)
తం ద్రక్ష్యసి పరిభ్రష్టం తస్మాత్ త్వమచిరాదివ।
ఐశ్వర్యమదసంమూఢం బలిం లోకత్రయాదివ॥ 47
ఐశ్వర్య మదమత్తు డయిన దుర్యోధనుడు త్వరలో ఆ పదవినుండి భ్రష్టుడయినట్లు చూస్తావు. బలి చక్రవర్తి లోకత్రయం నుండి భ్రష్టుడయినట్లు దుర్యోధనుడు రాజ్యభ్రష్టుడవుతాడు. (47)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి ప్రజాగరపర్వణి విదుర వాక్యే అష్టాత్రింశోఽధ్యాయః॥ 38 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున ప్రజాగర పర్వమను ఉపపర్వమున
విదుర వాక్యమను ముప్పది ఎనిమిదవ అధ్యాయము. (38)