41. నలువది యొకటవ అధ్యాయము

(సనత్సుజాత పర్వము)

అధ్యాత్మవిద్యనుపదేశింపుమని విదురుడు సనత్సుజాతుని కోరుట.

ధృతరాష్ట్ర ఉవాచ
అనుక్తం యది తే కించిద్ వాచా విదుర ఉచ్యతే।
తన్మే శుశ్రూషతో బ్రూహి విచిత్రాణి హి భాషసే॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. విదురా! నీవు ఆశ్చర్యకరమయిన విషయాలు చెపుతున్నావు. ఇంకా చెప్పనివి ఏవయినా ఉంటే అవి వినాలనుకుంటున్నాను చెప్పు. (1)
విదుర ఉవాచ
ధృతరాష్ట్ర కుమారో వై యః పురాణః సనాతనః।
సనత్సుజాతః ప్రోవాచ మృత్యుర్నాస్తీతి భారత॥ 2
విదురుడు చెప్పనారంభించాడు. ధృతరాష్ట్రా! ప్రాచీనుడూ, నిత్యుడూ, కుమారుడూ అయిన సనత్సుజాతుడు "మృత్యువు లేదు" అని చెప్పాడు. (2)
స తే గుహ్యాన్ ప్రకాశాంశ్చ సర్వాన్ హృదయ సంశ్రయాన్।
ప్రవక్ష్యతి మహారాజ సర్వబుద్ధిమతాం వరః॥ 3
ప్రజ్ఞావంతు లందరిలోనూ సనత్సుజాతుడు ఉత్తముడు. అతడు నీకు రహస్యములూ, ప్రకాశములూ అయిన ధర్మాలన్నీ చెపుతాడు. (3)
వి॥సం॥ గుహ్యములు = యోగ, కాలాదులకు సంబంధించినవి (నీల)
ధృతరాష్ట్ర ఉవాచ
కిం త్వం న వేద తద్భూయః యన్మే బ్రూయాత్ సనాతనః।
త్వమేవ విదుర బ్రూహి ప్రజ్ఞాశేషోఽస్తి చేత్తవ॥ 4
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు. విదురా! ఆ సనత్సుజాతుడు చెప్పేవి నీకు తెలియవా? నీకు తెలిస్తే నీవే చెప్పు. (4)
వి॥సం॥ సనాతనుడని సనత్సుజాతునకు మరియొక పేరు (నీల)
విదుర ఉవాచ
శూద్రయోనావహం జాతః నాతోఽన్యద్వక్తుముత్సహే।
కుమారస్య తు యా బుద్ధిః వేద తాం శాశ్వతీమహమ్॥ 5
విదురుడిలా జవాబు చెప్పాడు. సనత్సుజాతుడు చెప్పే శాశ్వత విద్య నాకూ తెలుసును. కాని నేను శూద్రస్త్రీకి పుట్టినందువల్ల చెప్పను. (5)
బ్రాహ్మీం హి యోనిమాపన్నః సుగుహ్యమపి యో వదేత్।
న తేన గర్హ్యో దేవానాం తస్మాదేతద్బ్రవీమి తే॥ 6
బ్రాహ్మణుడు గుహ్యము లయిన విశేషాలు చెప్పినా దేవతలు వానిని నిందింపరు. అందుకోసం నీకు అలా చెప్పాను. (6)
ధృతరాష్ట్ర ఉవాచ
బ్రవీహి విదుర త్వం మే పురాణాం తం సనాతనమ్।
కథమేతేన దేహేన స్యాదిహైవ సమాగమః॥ 7
అపుడు ధృతరాష్ట్రుడు "ఆ సనత్సుజాతుడు చాల పూర్వుడు కదా! ఈ శరీరంతో ఇక్కడే ఆయనను కలవడం ఎలా కుదురుతుంది? చెప్పు" అన్నాడు. (7)
వైశంపాయన ఉవాచ
చింతయామాస విదురః తమృషిం శంపితవ్రతమ్।
స చ తచ్చింతితం జ్ఞాత్వా దర్శయామాస భారత॥ 8
వైశంపాయనుడు చెపుతున్నాడు. భారతా! వెంటనే విదురుడు ప్రశస్తమైన వ్రతం కల ఆమహర్షిని మనుసులో తలచుకొన్నాడు. విదురుని మనసెరిగి సనత్సుజాతుడు ప్రత్యక్షమయ్యాడు. (8)
స చైనం ప్రతిజగ్రాహ విదిదృష్టేన కర్మణా।
సుఖోపవిష్టం విశ్రాంతమ్ అథైనం విదురోఽబ్రవీత్॥ 9
అపుడు విదురుడు సనత్సుజాతునికి యథాశాస్త్రంగా స్వాగతం చెప్పాడు. సనత్సుజాతుడు సుఖంగా కూర్చుని విశ్రాంతి తీసుకొంటుండగా విదురు డాయనతో ఇలా అన్నాడు. (9)
భగవాన్ సంశయః కశ్చిద్ ధృతరాష్ట్రస్య మానసః।
యో న శక్యో మయా వక్తుం త్వ మస్మై వక్తు మర్హసి॥ 10
స్వామీ! ధృతరాష్ట్రుని మనస్సులో ఒక సందేహం కలిగింది.
అది నేను తీర్చలేను. మీరే వీనికి చెప్పాలి. (10)
యం శ్రుత్వాఽయం మనుష్యేంద్రః సర్వదుఃఖాతిగో భవేత్।
లాభాలాభౌ ప్రియద్వేష్యే యదైనం న జరాంతకౌ॥ 11
విషహేరన్ భయామర్షే క్షుత్పిపాసే మదోద్భవౌ।
అరతిశ్చైవ తంద్రీ చ కామక్రోధౌ క్షయోదయౌ॥ 12
మీ ఉపదేశం విని ఈ మహారాజు సర్వదుఃఖాలూ విడిచిపెడతాడు. లాభాలాభాలు, ప్రియాప్రియాలు, జరామరణాలు, భయం, అసహనం, ఆకలిదప్పులు. గర్వం సంపద, విరక్తి ఆలస్యం కామక్రోధాలు, పాపపుణ్యాలు ఇతనిని బాధించవు. (11,12)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగ పర్వణి సనత్సుజాత పర్వణి విదురకృత సనత్సుజాత ప్రార్థనే ఏక చత్వారింశోఽధ్యాయః॥ 41 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగ పర్వమున సనత్సుజాత పర్వమను ఉపపర్వమున
సనత్సుజాతుని ప్రార్థించుట అను నలుబది యొకటవ అధ్యాయము. (41)