53. ఏబది మూడవ అధ్యాయము
పాండవ బలమును గూర్చి ధృతరాష్ట్రుని విలాపము.
ధృతరాష్ట్ర ఉవాచ
యథైవ పాండవాః సర్వే పరాక్రాంతా జిగీషవః।
తథైవాభిపరాస్తేషాం త్యక్తాత్మానో జయే ధృతాః॥ 1
ధృతరాష్ట్రుడిట్లు అన్నాడు. పాండవులు జయంకోసం విక్రమిస్తున్నట్లే వారికి సహాయపడటానికి వచ్చినవారు కూడా జయం కోసం ప్రాణాలు వదలటానికయినా సిద్ధపడుతున్నారు. (1)
త్వమేవ హి పరాక్రాంతాన్ ఆచక్షీథాః పరాన్మమ।
పంచాలాన్ కేకయాన్ మత్స్యాన్ మాగధాన్ వత్సభూమిపాన్॥ 2
అలా విక్రమించే పాంచాలురు, కేకయులు, మగధ దేశీయులు, వత్సరాజులు, వీరిని గురించి చెప్పావు గదా! నాకు. (2)
యశ్చ సేంద్రా నిమాన్ లోకాణ్ ఇచ్ఛన్ కుర్యాద్వశే బలీ।
సః స్రష్టా జగతః కృష్ణః పాండవానాం జయే ధృతః॥ 3
అనుకొంటే చాలు ఇంద్రునితో సహా లోకాలన్నిటినీ వశపరచుకోగల బలవంతుడు. జగత్కర్త అయిన కృష్ణుడు పాండవుల విజయం మీద ధైర్యంతో ఉన్నాడు. (3)
సమస్తామర్జునా ద్విద్యాం సాత్యక్షిః క్షిప్రమాప్తవాన్।
శైనేయః సమరే స్థాతా బీజవత్ ప్రవపన్ శరాన్॥ 4
శిని మనుమడు సాత్యకి అర్జునుని దగ్గర విద్యనంతనూ చురుకుగా నేర్చాడు. ఆ సాత్యకి ఇపుడు విత్తనాలు చల్లినట్లు యుద్ధరంగంలో బాణాలు అలవోకగా విసురుతాడు. (4)
ధృష్టద్యుమ్నశ్చ పాంచాల్యః క్రూరకర్మా మహారథః।
మామకేషు రణం కర్తా బలేషు పరమాస్త్రవిత్॥ 5
పాంచాలారాజు కుమారుడు ధృష్టద్యుమ్నుడు క్రూరకర్ముడయిన మహారథుడు. దివ్యాస్త్రవేత్త, వాడు మా సేనలతో యుద్ధం చేస్తున్నాడు. (5)
యుధిష్ఠిరస్య చ క్రోధాత్ అర్జునస్య చ విక్రమాత్।
యమాభ్యాం భీమసేనాచ్చ భయం మే తాత జాయతే॥ 6
ధర్మరాజు కోపం వల్లనూ, అర్జునుని పరాక్రమం వల్లనూ, నకులసహదేవులవల్లనూ, భీముని వల్లనూ, సంజయా! నాకు భయం కలుగుతోంది. (6)
అమానుషం మనుష్యేంద్రైః జాలం వితత మంతరా।
న మే సైన్యాస్తరిష్యంతి తతః క్రోశామి సంజయ॥ 7
ఈ మానవేంద్రులు అమానుషమయిన పెద్దవల విసిరారు. అందులో నుండి నా సైన్యాలు బయట పడలేవు. సంజయా! అందుకు ఏడుస్తున్నాను. (7)
దర్శనీయో మనస్వీ చ లక్ష్మీవాన్ బ్రహ్మవర్చసీ।
మేధావీ సుకృతప్రజ్ఞః ధర్మాత్మా పాండునందనః॥ 8
మిత్రామాత్యైః సుసంపన్నః సంపన్నో యుద్ధయోజకైః।
భ్రాతృభిః శ్వశురై ర్వీరైః ఉపపన్నో మహారథైః॥ 9
ధృత్వా చ పురుషవ్యాఘ్రః నైభౄత్యేన చ పాండవః।
అనృశంసో వదాన్యశ్చ హ్రీమాన్ సత్యపరాక్రమః॥ 10
బహుశ్రుతః కృతాత్మా చ వృద్ధసేవీ జితేంద్రియః।
తం సర్వగుణసంపన్నం సమిద్ధమివ పావకమ్॥ 11
తపంతమభి కో మందః పతిష్యతి పతంగవత్।
పాండవాగ్ని మనావార్యం ముమూర్షు ర్నష్టచేతనః॥ 12
పాండురాజుకుమారుడయిన ధర్మరాజు చూడముచ్చటయిన వాడు. మనసు గలవాడు. ఐశ్వర్యం కలవాడు. బ్రహ్మవర్చస్సు కలవాడు. మేధావి. ఫలవంతమయిన తెలివి కలవాడు. ధర్మాత్ముడు. (8)
మిత్రులూ, మంత్రులూ పుష్కలంగా ఉన్నారు అతనికి. యుద్ధనిపుణుల సహాయం అతనికి ఉంది. మహారథులైన తమ్ములు, వీరులైన మామలు అతనికున్నారు. (9)
పురుష శ్రేష్ఠుడయిన ధర్మరాజు ధైర్యం కలవాడు. రహస్యం రక్షించుకోగలవాడు. క్రూరుడు కాడు. దానపరుడు, లజ్జాశీలి, సత్య పరాక్రముడు. (10)
చాలా శాస్త్రజ్ఞానం కలవాడు - పుణ్యాత్ముడు, వృద్ధులను సేవిస్తాడు. ఇంద్రియాలను జయిస్తాడు. సర్వ సద్గుణ సంపన్నుడయిన ధర్మరాజు మండే అగ్నిలాగా కాల్చి వేస్తాడు. అటువంటి ధర్మజాగ్నిలో మిడుతలాగా ఏ తెలివి తక్కువ వాడు పడతాడు? ఆర్పరాని పాండవాగ్నిని ఆర్పవలె ననుకొనే ఆయువు మూడిన వాడెవడు? (12)
తనురుద్ధః శిఖీ రాజా మిథ్యోపచరితో మయా।
మందానాం మమ పుత్రాణాం యుద్ధేనాంతం కరిష్యతి॥ 13
ధర్మరాజు మెల్లగా రాజుకొనే నిప్పు. వానిపట్ల దొంగ ప్రేమలు నటించాను. (ద్యూతంతో మోసం చేశాను) నా తెలివి కొడుకులను యుద్ధంలో తుదముట్టిస్తాడు.(13)
తైరయుద్ధం సాధు మన్యే కురవస్తన్నిబోధత।
యుద్ధే వినాశః కృత్స్నస్య కులస్య భవితా ధ్రువమ్॥ 14
కౌరవులారా! వారితో యుద్ధం రాకపోవడమే మంచిది. తెలుసుకోండి. యుద్ధమే వస్తే కులమంతా నశించి పోతుంది. నిస్సందేహం. (14)
ఏషా మే పరమా బుద్ధిః యయా శామ్యతి మే మనః।
యది త్వయుద్ధమిష్టం వః వయం శాంత్యై యతామహే॥ 15
ఇది నాకు తోచిన మంచి ఊహ. దీనివల్ల నా మనసు శంతిస్తుంది. మీకు కూడా యుద్ధం ఇష్టం లేకపోతే మనం శాంతికోసం ప్రయత్నించుదాం. (15)
న తు నః క్లిశ్యమానానామ్ ఉపేక్షేత యుధిష్ఠిరః।
జుగుప్సతి హ్యధర్మేణ మామేవోద్దిశ్య కారణమ్॥ 16
ఇలా నలిగిపోతున్న మనలను ఆ ధర్మరాజు ఉపేక్షింపకుండునుగాక. దీనికంతకూ కారణం నేనే అని ధర్మరాజు నన్ను అధర్మంతో అసహ్యించుకొంటాడు. (16)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి ధృతరాష్ట్ర వాక్యే త్రిపంచాశత్తమోఽధ్యాయ॥ 53 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రవాక్యమను ఏబదిమూడవ అధ్యాయము. (53)