54. ఏబది నాలుగవ అధ్యాయము

సంజయుని మాటలు.

సంజయ ఉవాచ
ఏవమేతన్మహారాజ యథా వదసి భారత।
యుద్ధే వినాశః క్షత్రస్య గాండీవేన ప్రదృశ్యతే॥ 1
సంజయుడిలా అన్నాడు. మహారాజా! నీవు చెప్పినది నిజం. గాండీవంతో క్షత్రియ వంశమంతా నశించిపోయేటట్లే కనిపిస్తోంది. (1)
ఇదం తు నాభిజానామి తవ ధీరస్య నిత్యశః।
యత్పుత్రవశ మాగచ్ఛేత్ తత్త్వజ్ఞః సవ్యసాచినః॥ 2
అర్జునుని శక్తిలోని తత్త్వం తెలిసికూడా నీ కొడుకుకు వశమవుతున్నావు. నిత్యమూ నీకీ ధైర్యమెక్కడి నుండి వస్తోందో నాకయితే తెలియటం లేదు. (2)
నైష కాలో మహారాజ తవ శశ్వత్ కృతాగసః।
త్వయా హ్యేవాదితః పార్థాః నికృతా భారతర్షభ॥ 3
మహారాజా! మొదటి నుండీ నీవు పాండవులకు కీడు కలిగిస్తూనే ఉన్నావు. ఎప్పుడూ కీడు చేసే నీకు ఇపుడు ఈ బుద్ధి నిలవదు. (3)
పితా శ్రేష్ఠః సుహృద్ యశ్చ సమ్యక్ ప్రణిహితాత్మవాన్।
ఆఖ్యేయం హి హితం తేన న ద్రోగ్ధా గురురుచ్యతే॥ 4
ఉత్తముడయిన తండ్రి మంచి మనసు కలిగి చక్కగా స్థిరబుద్ధితో కొడుకులకు హితం చెప్పాలి. అంతేకాని ద్రోహం చేసే వానిని గురువని పిలవరు. (4)
ఇదం జితమిదం లబ్ధం ఇతి శ్రుత్వా పరాజితాన్।
ద్యూతకాలే మహారాజ స్మయసే స్మ కుమారవత్॥ 5
మహారాజా! జూదం సమయంలో "ఇది గెలువబడింది, ఇది పొందబడింది" అని పరాజితులయిన పాండవులను గురించి విని పిల్లలవలె (నీ కొడుకులవలె) పొంగిపోయావు. (5)
పరుషాణ్యుచ్యమానాంశ్చ పురా పార్థానుపేక్షసే।
కృత్స్నం రాజ్యం జయంతీతి ప్రసాతం నానుపశ్యసి॥ 6
అపుడు(జూదం నాడు) పాండవులను (నీ కొడుకులు) పరుషవాక్కులు పలుకుతూ ఉంటే రాజ్యం అంతా పూర్తిగా దక్కుతోంది కదా అని ఉపేక్షించావు కాని రాబోయే ఘోర వినాశాన్ని గమనించలేకపోయావు. (6)
పిత్ర్యం రాజ్యం మహారాజ కురవస్తే సజాంగలాః।
అథ వీరైర్జితాముర్వీమ్ అఖిలం ప్రత్యపద్యథాః॥ 7
ఈ కురు, జాంగల దేశములన్నీ వారి తండ్రి(పాండురాజు) సంపాదించినవి. ఇంకా ఆ వీరులు (పాండవులు) భూమినంతటినీ జయించారని తెలుసుకో. (7)
బాహువీర్యార్జితా భూమిః తవ పార్థైర్నివేదితా।
మయేదం కృతమిత్యేవ మన్యసే రాజసత్తమ॥ 8
తమ భుజబలంతో సంపాదించిన భూమి నంతనూ పాండవులు నీకు సమర్పించారు. రాజోత్తమా! నీవేమో ఇదంతా (నా చేతనే చేయబడింది) "నా సుకృతమే" అని భావిస్తున్నావు. (8)
గ్రస్తాన్ గంధర్వరాజేన మజ్జతో హ్యప్లవేఽంభసి।
ఆనినాయ పునః పార్థః పుత్రాంస్తే రాజసత్తమ॥ 9
గంధర్వరాజుకు చిక్కి, నావ లేకుండా నీటిలో మునిగిపోయే నీ కొడుకులను ఆ ధర్మరాజే(అర్జునుడే) మళ్లీ (నావగా అయి) ఉద్ధరించాడు. (9)
కుమారవచ్చ స్మయసే ద్యూతే వినికృతేషు యత్।
పండవేషు వనే రాజన్ ప్రవ్రజత్సు పునః పునః॥ 10
పాండవులు జూదంలో ఓడిపోయినపుడు అడవులకు వెడుతున్నపుడు కూడ నీవు పిల్లలలాగా/ నీ కొడుకుల లాగా సంతోషించావు. (ఏమనుకోవాలి?) (10)
ప్రవర్షతః శరవ్రాతాన్ అర్జునస్య శితాన్ బహూన్।
అప్యర్ణవా విశుష్యేయుః కింపునర్మాంసయోనయః॥ 11
అర్జునుడు వాడి బాణపరంపరలను వర్షిస్తూ ఉంటే సముద్రాలు కూడా ఎండిపోతాయి. ఇక మానవుల మాట చెప్పాలా? (మానవులు మాంసం నుండి పుట్టినవారు) (11)
అస్యతాం ఫాల్గునః శ్రేష్ఠః గాండీవం ధనుషాం వరమ్।
కేశవః సర్వభూతానామ్ ఆయుధానాం సుదర్శనమ్॥ 12
వానరో రోచమానశ్చ కేతుః కేతుమతాం వరః।
విలుకాండ్రలో అర్జునుడు ఉత్తముడు. ధనుస్సులలో గాండీవం శ్రేష్ఠమయినది. సర్వభూతాలలో కేశవుడు శ్రేష్ఠుడు. ఆయుధాలలో సుదర్శన చక్రం శ్రేష్ఠం. ధ్వజాలలో వానరుడు ప్రకాశించే కపిధ్వజం శ్రేష్ఠమయినది. (12 1/2)
ఏవమేతాని స రథే వహన్ శ్వేతహయో రణే॥ 13
క్షపయిష్యతి నో రాజన్ కాలచక్రమివోద్యతమ్।
వీని నన్నిటినీ రథంమీద పెట్టుకొని తెల్లని గుర్రాలు రథానికి పూన్చి రాజా! కాలచక్రం లాగా అర్జునుడు మనలనందరినీ నరికి పారేస్తాడు. (13 1/2)
తస్యాద్య వసుధా రాజన్ నిఖిలా భరతర్షభ॥ 14
యస్య భీమార్జునౌ యోధౌ స రాజా రాజసత్తమ।
రాజా! ఇపుడు భూమి అంతా అతనిది. భీమార్జునులు ఎవరి యోధులో అతనిదే రాజ్యం. అతడే(ధర్మరాజే) రాజు. (14 1/2)
తథా భీమహతప్రాయాం మజ్జంతీం తవ వాహినీమ్॥ 15
దుర్యోధనముఖా దృష్ట్వా క్షయం యాస్యంతి కౌరవాః।
అలా భీముని చేత సగం చచ్చి మునిగిపోతున్న నీ సేనను దుర్యోధనాదులు చూసి, చచ్చి ఊరుకుంటారు. (15 1/2)
న భీమార్జునయోర్భీతా లప్స్యంతే విజయం విభో॥ 16
తవ పుత్రా మహారాజ రాజాన శ్చానుచారిణః।
భీమార్జునులకు భయపడిన నీ కొడుకులూ, వారి సహచరులయిన రాజులూ విజయం పొందలేరు. (16 1/2)
మత్స్యా స్త్వామద్య నార్ఛంతి పంచాలాశ్చ సకేకయాః॥ 17
శాల్వేయాః శూరసేనాశ్చ సర్వే త్వామవజావతే।
పార్థం హ్యేతే గతాః సర్వే వీర్యజ్ఞాః తస్య ధీమతః॥ 18
మత్స్యరాజులు, పాంచాలురు, కేకయులు, శాల్వేయులు, శూరసేనులు ఇపుడు నిన్ను సేవించడం లేదు. సరిగదా వారంతా నిన్ను అవమానిస్తున్నారు. ధీమంతుడయిన ధర్మరాజు యొక్క శక్తి పెరిగి ఈ రాజులంతా ధర్మరాజును చేరారు. (18)
భక్త్యా హ్యస్య విరుధ్యంతే తవ పుత్రైః సదైవ తే।
అనర్హానేవ తు వధే ధర్మయుక్తాన్ వికర్మణా॥ 19
యోఽక్లేశయత్ పాండుపుత్రాన్ యో విద్వేష్ణ్యధునాపి వై।
సర్వోపాయై ర్నియంతవ్యః సానుగః పాపపూరుషః॥ 20
తవ పుత్రో మహరాజ నానుశోచితు మర్హసి।
ద్యూతకాలే మయా చోక్తం విదురేణ చ ధీమతా॥ 21
ధర్మరాజు మీది భక్తితో వారు నీ పుత్రులతో విరోధిస్తున్నారు. ధర్మసహితులూ వధకు తగని వారూ అయిన పాండవులను అవమానించి కష్టపెట్టినవాడు, ఇప్పటికీ వారిని ద్వేషించేవాడూ, అయిన నీ కొడుకును వాడి స్నేహితులతో పాటు అన్ని ఉపాయాలతో అదుపు చెయ్యాలి. అంతేకాని ఇపుడు ఏడవరాదు. ఇది జూదం నాడే నేనూ, మహామేధావి అయిన విదురుడూ కూడా చెప్పాము. (19-21)
యదిదం తే విలపితం పాండవాన్ ప్రతి భారత।
అనీశేనేవ రాజేంద్ర సర్వమేతన్నిరర్థకమ్॥ 22
రాజా! పాండవులను గూర్చి ఇప్పటిదాకా అసమర్థునివలె ఏడ్చిన ఏడుపు అంతా వ్యర్థం. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయ వాక్యే చతుష్పంచాశత్తమోఽధ్యాయ॥ 54 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయ వాక్యము కల ఏబది నాల్గవ అధ్యాయము. (54)