57. ఏబది ఏడవ అధ్యాయము
సంజయుడు పాండవుల బలమును ధృతరాష్ట్రునికి తెలుపుట.
ధృతరాష్ట్ర ఉవాచ
కాంస్తత్ర సంజయాపశ్యః ప్రీత్యర్థేన సమాగతాన్।
యే యోత్స్యంతే పాంఢవార్థే పుత్రస్య మమ వాహినీమ్॥ 1
ధృతరాష్ట్రుడిట్లు ప్రశ్నించాడు. సంజయా! పాండవ పక్షాన వారికోసం నా కుమారుల సేనలతో యుద్ధం చేద్దామనుకొంటున్న వారిని ఎవరిని అక్కడ చూశావు? (1)
సంజయ ఉవాచ
ముఖ్యమంధకవృష్ణీనామ్ అవశ్యం కృష్ణమాగతమ్।
చేకితానం చ తత్రైవ యుయుధానం చ సాత్యకిమ్॥ 2
వృష్ణి అంధక వంశాలకు మూఖ్యుడయిన కృష్ణుని చూశాను. అలాగే అక్కడ చేకితానుని, యుద్ధకాంక్షి అయిన సాత్యకిని చూశాను. (2)
పృథగక్షౌహిణీభ్యాం తు పాండవానభిసంశ్రితౌ।
మహారథౌ సమాఖ్యాతౌ ఉభౌ పురుషమానినౌ॥ 3
వీరిద్దరూ ఒక్కొక్క అక్షౌహిణి సేనతో పాండవులను చేరినవారు. మహారథులని ప్రశస్తి వహించిన పౌరుషం కలవారు. (3)
అక్షౌహిణ్యాథ పాంచాల్యః దశభిస్తనయైర్వృతః।
సత్యజిత్ప్రముఖైర్వీరైః ధృష్టద్యుమ్నపురోగమైః॥ 4
ద్రుపదో వర్ధయన్ మానం శిఖండిపరిపాలితః।
ఉపాయాత్ సర్వసైన్యానాం ప్రతిచ్ఛాద్య తదా వపుః॥ 5
సత్యజిత్తు మొదలయిన పదిమంది పుత్రులతో ధృష్టద్యుమ్నుని ముందుంచుకొని ద్రుపదుడు ఒక అక్షౌహిణి సేనతో వచ్చి పాండవులను చేరాడు. ధర్మజుని గౌరవం పెంచుతూ శీఖండి రక్షణలో సైన్యాలను(కవచాలతో) కప్పుతూ ద్రుపదుడు వచ్చాడు. (4,5)
విరాటః సహపుత్రాభ్యాం శంఖేనైవోత్తరేణ చ।
సూర్యదత్తాదిభి ర్వీరైః మదిరాక్షపురోగమైః॥ 6
సహితః పృథివీపాలః భ్రాతృభిస్తనయై స్తథా।
అక్షౌహిఞైవ సైన్యానాం వృతః పార్థే సమాశ్రితః॥ 7
విరాటమహారాజు శంఖుడు, ఉత్తరుడు అనే కొడుకులతోనూ, కలిసి ఒక అక్షౌహిణి సేనతో వచ్చి పాండవులను చేరాడు. (6-7)
జారాసంధిర్మాగధశ్చ ధృష్టకేతుశ్చ చేదిరాట్।
పృథగనుప్రాప్తౌ పృథగక్షౌహిణీవృతౌ॥ 8
మగధదేశపురాజు జరాసంధుని కొడుకు సహదేవుడూ, చేది దేశపు రాజు ధృష్టకేతుడూ వేర్వేరుగా ఒక్కొక్క అక్షోహిణీ సేనతో వచ్చి చేరారు. (8)
కేకయా భ్రాతరః పంచ సర్వే లోహితకధ్వజాః।
అక్షౌహిణీపరివృతాః పాండవా నభిసంశ్రితాః॥ 9
కేకయరాజులు(పదిమందిలో) అయిదుగురు సోదరులు ఎఱ్ఱని జెండాలతో, ఒక అక్షౌహిణి సేనతో వచ్చి పాండవులను చేరారు. (9)
ఏతానేతావత స్తత్ర తానపశ్యం సమాగతాన్।
యే పాండవార్థే యోత్స్యంతి ధార్తరాష్ట్రస్య వాహినీమ్॥ 10
పాండవుల కోసం దుర్యోధనుని సేనతో యుద్ధం చేయటానికి వచ్చిన వారిని నేనింతమందినే చూశాను. (10)
యో వేద మానుషం వ్యూహం దైవం గాంధర్వమాసురమ్।
స తత్ర సేనాప్రముఖే ధృష్టద్యుమ్నో మహారథః॥ 11
మానవులకు, దేవతలకు, గంధర్వులకు, రాక్షసులకు సంబంధించిన వ్యూహాలు తెలిసిన మహారథుడు ధృష్టద్యుమ్నుడు సేనకు అగ్రభాగాన నిలిచాడు. (11)
భీష్మః శాంతనవో రాజన్ భాగః కఌ ప్తః శిఖండినః।
తం వీరాటోఽనుసంయాతా సార్థం మత్స్యైః ప్రహారిభిః॥ 12
జ్యేష్ఠస్య పాండుపుత్రస్య భాగో మద్రాధిపో బలీ।
తౌ తు తత్రాబ్రువన్ కేచిత్ విషమౌ నో మతా వితి॥ 13
ధర్మరాజు పాలు శల్యుడు. కాని విరిద్దరూ సమానులు కారని కొందరన్నారు. (13)
దుర్యోధనః సహసుతః సార్ధం భ్రాతృశతేన చ।
ప్రాచ్యాశ్చ దాక్షిణాత్యాశ్చ భీమసేనస్య భాగతః॥ 14
కొడుకులు, తమ్ములతో పాటు దుర్యోధనుడూ, తూర్పు దక్షిణ దిక్కుల రాజులూ భీముని పాలు. (14)
అర్జునస్య తు భాగేన కర్ణో వైకర్తనో మతః।
అశ్వత్థామా వికర్ణశ్చ సైంధవశ్చ జయద్రథః॥ 15
కర్ణుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సింధురాజు జయద్రథుడు అర్జునుని పాలు. (15)
అశక్యాశ్పైవ యే కేచిత్ పృథివ్యాం శూరమానినః।
సర్వాంస్తా నర్జునః పార్థః కల్పయామాస భాగతః॥ 16
ఇంకా వీరులమనుకొనే వారు ఎంతమంది ఉన్నా వారంతా అర్జునుని పాలుగా నిశ్చయించారు. (16)
మహేష్వాసా రాజపుత్రాః భ్రాతరః పంచకేకయాః।
కేకయా నేవ భాగేన కృత్వా యోత్స్యంతి సంయుగే॥ 17
రాజకుమారులు, విలుకాండ్రు అయిన కేకయ సోదరులు అయిదుగురు మనవైపు ఉన్న కేకయ సోదరులు అయిదుగురితో యుద్ధం చేస్తారు. (17)
తేషామేవ కృతో భాగః మాలవాః శాల్వకా స్తథా।
త్రిగర్తానాం చైవ ముఖ్యౌ యౌ తౌ సంశప్తకావితి॥ 18
ఆకేకయ సోదరుల పాలు మాలవీయులూ, శాల్వకులూ, త్రిగర్త ముఖ్యులు సంశప్తకులూను. (18)
దుర్యోధనసుతాః సర్వే తథా దుఃశాసనస్య చ।
సౌభద్రేణ కృతో భాగః రాజా చైవ బృహద్బలః॥ 19
దుర్యోధనుని కొడుకులూ, దుశ్శాసనుని కొడుకులూ, బృహద్బలుడనే రాజూ అభిమన్యుని పాలు. (19)
ద్రౌపదేయా మహేష్వాసాః సువర్ణవికృతధ్వజాః।
ధృష్టద్యుమ్నముఖా ద్రోణమ్ అభియాస్యంతి భారత॥ 20
మహాధనుర్ధారులయిన ఉపపాండవులు బంగారు ధ్వజాలతో ధృష్టద్యుమ్నుని ముందు నిలుపుకొని ద్రోణుని ఎదిరిస్తారు. (20)
చేకితానః సోమదత్తం ద్వైరథే యోద్ధుమిచ్ఛతి।
భోజంతు కృతవర్మాణం యుయుధానో యుయుత్సతి॥ 21
చేకితానుడు సోమదత్తునితో ఒంటరిగా పోరుటకు సిద్ధపడుతున్నాడు. భోజవంశస్థుడయిన కృతవర్మతో సాత్యకి యుద్ధం చేయగోరుతున్నాడు. (21)
సహదేవస్తు మాద్రేయః శూరః సంక్రందనో యుధి।
స్వమంశం కల్పయామాస శ్యాలం తే సుబలాత్మజమ్॥ 22
మాద్రి కొడుకు సహదేవుడు యుద్ధంలో పెద్దగా ధ్వనిచేస్తూ సుబలుని కొడుకు శకునిని తన వంతుకు వేసుకొన్నాడు. (22)
ఉల్లూకం చైవ కైతవ్యం యే చ సారస్వతా గణాః।
నకులః కల్పయామాస భాగం మాద్రవతీసుతః॥ 23
జూదరి యైన ఉలూకునీ, సారస్వత గణాలనూ మాద్రి కొడుకు నకులుడు తన భాగంలో వేసుకొన్నాడు. (23)
యే చాన్యే పార్థివా రాజన్ ప్రత్యుద్యాస్యంతి సంగరే।
సమాహ్వానేన తాంశ్చాపి పాండుపుత్రా అకల్పయన్॥ 24
ఇంకా యుద్ధానికి వస్తున్న రాజులందరినీ పేర్కొని పాండవులు తమవంతు చేసుకున్నారు. (24)
ఏవ మేషామనీకాని ప్రవిభక్తాని భాగశః।
యత్తే కార్యం సపుత్రస్య క్రియతాం తదకాలికమ్॥ 25
ఇలా సేనలన్నిటినీ వారు పంచుకున్నారు. ఇక నీవూ నీకుమారులూ త్వరగా తగిన పని చేయండి. (25)
ధృతరాష్ట్ర ఉవాచ
న సంతి సర్వే పుత్రా మే మూఢా దుర్ద్యూతదేవినః।
యేషాం యుద్ధం బలవతా భీమేన రణమూర్ధని॥ 26
ధృతరాష్ట్రుడు ఇట్లు అన్నాడు. నా పుత్రులంతా ఇక లేనట్లే - తెలివి తక్కువ వారు. కపట ద్యూతమాడారు. దానితో బలవంతుడయిన భీమునితో రణరంగంలో యుద్ధం దాపురించింది. (26)
రాజానః పార్థివాః సర్వే ప్రోక్షితాః కాలధర్మణా।
గాండీవాగ్నిం ప్రవేక్ష్యంతి పతంగా ఇవ పావకమ్॥ 27
యముడు రాజులందరిమీద నీటిని ప్రోక్షించాడు. మంటలో పడే మిడతలవలె వారంతా గాండీవాగ్నిలో ప్రవేశిస్తారు. (27)
విద్రుతాం వాహినీం మన్యే కృతవైరై ర్మహాత్మభిః।
తాం రణే కేఽనుయాస్యంతి ప్రబగ్నాం పాండవైర్యుధి॥ 28
శత్రుత్వం పెంచుకొన్న పాండవులు మాసైన్యాన్ని పారద్రోలినట్లే అనిపిస్తోంది. పాండవులు భగ్నం చేసిన మా సేనను వెనుకనుండి రక్షించే నాథుడెవడు? (28)
సర్వే హ్యతిరథాః శూరాః కీర్తిమంతః ప్రతాపినః।
సూర్యపావకయోస్తుల్యాః తేజసా సమితింజయాః॥ 29
వారంతా అతిరథులు, శూరులు, యశస్వులు, ప్రతాపం కలవారు. తేజస్సులో సూర్యునితో అగ్నితో సమానులు - యుద్ధంలో జయించేవారు. (29)
యేషాం యుధిష్ఠిరో నేతా గోప్తా చ మధుసూదనః।
యోధౌచ పాండవౌ వీరౌ సవ్యసాచివృకోదరౌ॥ 30
నకులః సహదేవశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః।
సాత్యకిర్ద్రుపదశ్పైవ ధృష్టకేతుశ్చ సానుజః॥ 31
ఉత్తమౌజాశ్చ పాంచాల్యః యుధామన్యుశ్చ దుర్జయః।
శిఖండీ క్షత్రదేవశ్చ తథా వైరాటిరుత్తరః॥ 32
కాశయ శ్చేదయ శ్పైవ మత్స్యాః సర్వే చ సృంజయాః।
విరాటపుత్రో బభ్రుశ్చ పాంచాలాశ్చ ప్రభద్రకాః॥ 33
యేషామింద్రోఽప్యకామానాం న హరేత్ పృథివీమిమామ్।
వీరాణాం రణధీరాణాం యే భింద్యుః పర్వతానపి॥ 34
తాన్ సర్వగుణ సంపన్నాన్ అమనుష్యప్రతాపినః।
క్రోశతో మమ దుష్పుత్ర యోద్ధుమిచ్ఛతి సంజయ॥ 35
వారి నాయకుడు యుధిష్ఠిరుడు - రక్షకుడు కృష్ణుడు - వీరయోధులు అర్జున భీమసేనులు - నకులుడు సహదేవుడు, ధృష్నద్యుమ్నుడు, సాత్యకి, ద్రుపదుడు, పాంచాలరాజు ఉత్తమౌజుడు, జయింపరాని యుధామన్యుడు, శిఖండి, క్షత్రదేవుడు, విరాటుని కొడుకు ఉత్తరుడు, కాశి, చేది, మత్స్య సృంజయరాజులు, విరాటుని కొడుకు బభ్రువు, పాంచాల దేశీయులు ప్రభద్రకులు, వీరు పాండవపక్ష యోధులు - వారి యిష్టం లేకుండా రణధీరులయిన ఈ రాజుల భూమిని ఇంద్రుడు కూడా హరింపలేడు.
సంజయా! వీరు కొండలను కూడా పిండిచేస్తారు. నేనెంత ఏడుస్తున్నా నా మాట వినకుండా సర్వసద్గుణ సంపన్నులూ, అమానుష పరాక్రములూ అయిన పాండవులతో యుద్ధం చేయాలనుకొంటున్నాడు నా దుష్పుత్రుడు (30-35)
దుర్యోధన ఉవాచ
ఉభౌ స్వ ఏకజాతీయౌ తథోభౌ భూమిగోచరౌ।
అథ కస్మాత్ పాండవానామ్ ఏకతో మన్యసే జయమ్॥ 36
దుర్యోధనుడు చెప్పాడు. మేము ఇద్దరమూ ఒకే జాతి వాళ్లం - ఇద్దరమూ భూమి మీది వాళ్లమే. అటువంటప్పుడు పాండవులకొక్కరికే జయం కలుగుతుందని ఎందుకు అనుకొంటున్నావు? (36)
పితామహం చ ద్రోణం చ కృపం కర్ణం చ దుర్జయమ్।
జయద్రథం సోమదత్తం అశ్వత్థామానమేవ చ॥ 37
సుతేజసో మహేష్వాసాన్ ఇంద్రోఽపి సహితోఽమరైః।
అశక్తః సమరే జేతుం కింపునస్తాత పాండవాః॥ 38
తేజస్వులయిన విలుకాండ్రు అయిన భీష్మునీ, ద్రోణునీ, కృపునీ, కర్ణునీ, సైంధవునీ, సోమదత్తునీ, అశ్వత్థామనూ దేవతలంతా కలిసి వచ్చినా ఇంద్రుడు కూడా జయించలేడు. తండ్రీ! ఇక పాండవులు గెలవగలరా? (37-38)
సర్వే చ పృథివీపాలాః మదర్థే తాత పాండవాన్।
ఆర్యాః శస్త్రభృతాః శూరాః సమర్థాః ప్రతిబాధితుమ్॥ 39
నాకోసం వచ్చిన యీ రాజులంతా ఆర్యులు, శస్త్రధారులు, శూరులు, పాండవులను త్రిప్పికొట్టగల సమర్థులు. (39)
న మామకాన్ పాండవాస్తే సమర్థాః ప్రతివీక్షితుమ్।
పరాక్రాంతో హ్యహం పాండూన్ సపుత్రాన్ యోద్ధుమాహవే॥ 40
ఆ పాండవులు నా వాళ్లను నిలిచి చూడలేరు కూడా - యుద్ధంలో కొడుకులతో సహా పాండవులను నేను ఒక్కడినే ఆక్రమించగలను. (40)
మత్ప్రియం పార్థివాః సర్వే యే చికీర్షంతి భారత।
తే తా నావారయిష్యంతి ఐణేయానివ తంతునా॥ 41
నాకు ప్రియం కోరి వచ్చిన రాజులంతా పాండవులను ఉచ్చులో లేడి పిల్లల్ని బిగించినట్లు బిగిస్తారు. (41)
మహతా రథవంశేన శరజాలైశ్చ మామకైః।
అభిద్రుతా భవిష్యంతి పంచాలాః పాండవైస్సహ॥ 42
గొప్పవయిన నా రథ సమూహాలచేతనూ, బాణ పరంపరలచేతనూ పాండవులతోపాటు పాంచాలురు కూడా పారిపోతారు. (42)
ధృతరాష్ట్ర ఉవాచ
ఉన్మత్త ఇవ మే పుత్రః విలపత్యేష సంజయ।
న హి శక్తో రణే జేతుం ధర్మరాజం యుధిష్ఠిరమ్॥ 43
వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు. సంజయా! నా కుమారుడు పిచ్చివాని వలె వాగుతున్నాడు. యుద్ధంలో స్థిరంగా నిలవగల ధర్మరాజును వీడు జయింపలేడు. (43)
జానాతి హి యథా భీష్మః పాండవానాం యశస్వినామ్।
బలవత్తాం సపుత్రాణాం ధర్మజ్ఞానాం మహాత్మనామ్॥ 44
యతో నారోచయదయం విగ్రహం తైర్మహాత్మభిః।
కింతు సంజయ మే బ్రూహి పునస్తేషాం విచేష్టితమ్॥ 45
పుత్ర సహితులయిన పాండవులు మంచి పేరుగలవారు - ధర్మం తెలిసిన మహాత్ములు - వారి బలం ఏపాటిదో ఈ భీష్మునికి తెలుసును గదా! అందుకే ఇతడు ఆ మహాత్ములతో విరోధానికి ఇష్టపడడు. అవునుగాని సంజయా! ఇంకా ఆ పాండవులు ఏం చేస్తున్నారో చెప్పు. (44,45)
కస్తాంస్తరస్వినో భూయః సందీపయతి పాండవాన్।
అర్చిష్మతో మహేష్వాసాన్ హవిషా పావకానివ॥ 46
వేగమూ, తేజస్సు కలిగి మహాధనుర్ధారులయిన పాండవులను హవిస్సుతో అగ్నులను ప్రజ్వలింపచేసినట్లు ఎవరు ప్రజ్వలింపచేస్తున్నారు? (46)
సంజయ ఉవాచ
ధృష్టద్యుమ్నః సదైవైతాన్ సందీపయతి భారత।
యుద్ధ్యధ్వ మితి మా భైష్ట యుద్ధాద్భరతసత్తమాః॥ 47
రాజా! ధృష్టద్యుమ్నుడు "భరత సత్తములారా! యుద్ధం చెయ్యండి - యుద్ధానికి భయపడకండి" అంటూ వారిని సదా రెచ్చగొడుతూ ఉంటాడు. (47)
యే కేచిత్ పార్థివా స్తత్ర ధార్తరాష్ట్రేణ సంవృతాః।
యుద్ధే సమాగమిష్యంతి తుములే శస్త్రసంకులే॥ 48
తాన్ సర్వా నాహవే క్రుద్ధాన్ సానుబంధాన్ సమాగతాన్।
అహమేకః సమాదాస్యే తిమిర్మత్స్యానివోదకాత్॥ 49
దుర్యోధనుడు సమకూర్చుకొన్న రాజులంతా ఆయుధ సహితమైన యుద్ధంలో ఒకచోట కలుస్తారు. క్రోధంతో వచ్చిన స్నేహితులతో సహా వారినందరినీ తిమి నీటిలో నుండి చేపలను లాగి వేసినట్లు నేనొకడినే విసిరి పారేస్తాను. (48,49)
భీష్మం ద్రోణం కృపం కర్ణం ద్రౌణిం శల్యం సుయోధనమ్।
ఏతాంశ్చాపి నిరోత్స్యామి వేలేన మకరాలయమ్॥ 50
భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, శల్యుడు, దుర్యోధనుడు, వీరందరినీ కూడా సముద్రాన్ని చెలియలికట్టలాగా ఆపివేస్తాను. (50)
తథా బ్రువంతం ధర్మాత్మా ప్రాహ రాజా యుధిష్ఠిరః।
తవ ధైర్యం చ వీర్యం చ పాంచాలాః పాండవైః సహ॥ 51
సర్వే సమధిరూఢాః స్మ సంగ్రామా న్నః సముద్ధర।
జానామి త్వాం మహాబాహో క్షత్రధర్మే వ్యవస్థితమ్॥ 52
సమర్థమేకం పర్యాప్తం కౌరవాణాం వినిగ్రహే।
పురస్తాదుపయాతానాం కౌరవాణాం యుయుత్సతామ్॥ 53
అలా అంటున్న, ధృష్టద్యుమ్నునితో ధర్మాత్ముడయిన ధర్మరాజు ఇలా అన్నాడు. "మహాభుజుడా! నీ ధైర్యమూ, పరాక్రమూ పాంచాలురూ పాండవులూ కూడా బాగా ఎరుగుదురు - ఈ యుద్ధం నుండి మమ్మల్ని ఉద్ధరించు. నీవు క్షత్రియ ధర్మం పాటించే వాడవు గదా! ఉరకలు వేస్తూ యుద్ధానికి వచ్చే కౌరవులను నిగ్రహించటానికి నీవే సమర్థుడవు. (51,52,53)
భవతా యద్విధాతవ్యం తన్నః శ్రేయః పరంతప।
సంగ్రామాదపయాతానాం భగ్నానాం శరణైషిణామ్॥ 54
పౌరుషం దర్శయన్ శూరః యస్తిష్ఠేదగ్రతః పుమాన్।
క్రీణీయాత్తం సహస్రేణ ఇతి నీతిమతాం మతమ్॥ 55
నీవు చేయాలనుకొన్నదే మాకు శ్రేయస్కరమయినది. యుద్ధం నుండి పారిపోయే వారికి, దెబ్బతిన్నవారికి, శరణుకోరిన వారికి పౌరుషం ప్రదర్శిస్తూ ముందు భాగాన్ నిలువగల పురుషుని వేయిమంది నిచ్చి అయినా కొనుక్కోవాలని నీతి వేత్తల అభిప్రాయం. (54,55)
స త్వం శూరశ్చ వీరశ్చ విక్రాంతశ్చ నరర్షభ।
భయార్తానాం పరిత్రాతా సంయుగేషు న సంశయః॥ 56
అటువంటి శూరుడవు, వీరుడవు, పరాక్రమశాలివి నీవే. యుద్ధాల్లో భయార్తులకు రక్షకుడవు నీవే. నిస్సందేహం. (56)
ఏవం బ్రువతి కౌంతేయే ధర్మాత్మని యుధిష్ఠిరే।
ధృష్టద్యుమ్న ఉవాచేదం మాం వచో గతసాధ్వసమ్॥
సర్వాన్ జనపదాన్ సూత యోధా దుర్యోధనస్య యే॥ 57
స బాహ్లికాన్ కురూన్ బ్రూయాః ప్రాతిపేయా శరద్వతః।
సూతపుత్రం తథా ద్రోణం సహపుత్రం జయద్రథమ్॥58
దుఃశాసనం వికర్ణం ద్రోణం సహపుత్రం జయద్రథమ్॥ 58
దుఃశాసనం వికర్ణం చ తథా దుర్యోధనం నృపమ్।
భీష్మం చ బ్రూహి గత్వా త్వమ్ ఆశు గచ్ఛ చ మాచిరమ్॥59
ధర్మాత్ముడయిన యుధిష్ఠిరుడు ఇలా చెపుతూ ఉంటే ధృష్టద్యుమ్నుడు నిర్భయంగా నాతో ఇలా అన్నాడు. "సూత! నీవు వెళ్లి దుర్యోధనుని యోధులతోనూ, జానపదులతోను, ప్రతీప వంశస్థులు, బాహ్లిక దేశస్థులూ అయిన కౌరవులతోనూ కృపాచార్యుని తోనూ, కర్ణునితోనూ, పుత్రసహితుడయిన ద్రోణునితోనూ, సైంధవునితోనూ చెప్పు. ఇంకా దుశ్శాసనునితో, వికర్ణునితో అలాగే దుర్యోధనునితో భీష్మునితో కూడా వెళ్లి చెప్పు - నీవు త్వరగా వెళ్లు ఆలస్యం చేయకు. (57-59)
యుధిష్ఠిరః సాధునైవాభ్యుపేయః
మా వో వధీదర్జునో దేవగుప్తః।
రాజ్యం దధ్వం ధర్మరాజస్య తూర్ణం
యాచధ్వం వై పాండవం లోకవీరమ్॥ 60
ధర్మరాజు కేవలం మంచిమాటలచేతనే పొందదగిన వాడు. దేవతల రక్షణ కల అర్జునుడు మిమ్మల్ని చంపకుండునుగాక - వెంటనే ధర్మరాజుకు రాజ్యం ఇవ్వండి, లోకైకవీరుడయిన అర్జునుని శరణుకోరండి. (60)
నైతాదృశో హి యోధోఽస్తి పృథివ్యామిహ కశ్చన।
యథావిధః సవ్యసాచీ పాండవః సత్యవిక్రమః॥ 61
సవ్యసాచి లాంటి యోధుడు ఈ భూమిమీద మరొకడు లేడు. అతడు సత్యపరాక్రముడు. (61)
దేవైర్హి సంభృతో దివ్యః రథో గాండీవధన్వనః।
న స జేయో మనుష్యేణ మాస్మకృద్ధ్వం మనో యుధి॥ 62
గాండీవ ధారి అయిన అర్జునుని రథం దేవతల రక్షణ కల దివ్యరథం - మానవ మాత్రుడు వానిని జయించలేడు. యుద్ధం మీద మనసు పెట్టకండి. (62)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయ వాక్యే సప్తపంచాశత్తమోఽధ్యాయ॥ 57 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధిపర్వమను ఉపపర్వమున సంజయవాక్యమను ఏబది ఏడవ అధ్యాయము. (57)