56. ఏబది ఆరవ అధ్యాయము

సంజయుడు పాండవుల దివ్యశక్తులను వర్ణించుట.

దుర్యోధన ఉవాచ
అక్షౌహిణీః సప్త లబ్ధ్వా రాజభిః సహ సంజయ।
కిం స్వి దిచ్ఛతి కౌంతేయః యుద్ధప్రేప్సుర్యుధిష్ఠిరః॥ 1
దుర్యోధనుడు ఇట్లన్నాడు. యుద్ధకాంక్షి యుధిష్ఠిరుడు ఏడక్షుహిణులు సంపాదించాడు గదా! ఆ రాజులతో ఏం చేద్దామనుకొంటున్నాడు? (1)
సంజయ ఉవాచ
అతీవ ముదితో రాజన్ యుద్ధప్రేప్సు ర్యుధిష్ఠిరః।
భీమసేనార్జునౌ చోభౌ యమావపి న బిభ్యతః॥ 2
సంజయుడు ఇట్లన్నాడు. రాజా! యుద్ధకాంక్షి యుధిష్ఠిరుడు చాలా సంతోషిస్తున్నాడు. భీమార్జునులూ అంతే - నకుల సహదేవులు కూడా ఏమీ భయపడటం లేదు. (2)
రథం తు దివ్యం కౌంతేయః సర్వా విభ్రాజయన్ దిశః।
మంత్రం జిజ్ఞాసమానః సన్ బీభత్సుః సమయోజయత్॥ 3
తన మంత్రశక్తి నొకసారి పరీక్షించుకోవాలని అర్జునుడు దిక్కులన్నీ వెలిగిపోయేటట్లు తన దివ్యరథాన్ని సిద్ధం చేసుకొన్నాడు. (3)
తమపశ్యామ సన్నద్ధం మేఘం విద్యుద్యుతం యథా।
సమంతాత్ సమభిధ్యాయ హృష్యమాణోఽభ్యభాషత॥ 4
అలా సన్నద్ధమయిన అర్జునుడు మెరుపుతో కూడిన మేఘంలా కనపడ్డాడు. సమగ్రంగా ధ్యానం చేసి సంతోషిస్తూ అతడిట్లన్నాడు. (4)
పూర్వరూపమిదం పశ్య వయం జేష్యామ సంజయ।
బీభత్సుర్మాం యథోవాచ తథావైమ్యహమప్యుత॥ 5
"సంజయా! ఇదిగో చూడు శకునం - మేము జయిస్తాము" అన్నాడు. ఆ అర్జునుడన్నట్లే అవుతుందని నాకూ తెలుసు. (5)
దుర్యోధన ఉవాచ
ప్రశంస స్యభినందంస్తాన్ పార్థానక్షపరాజితాన్।
అర్జునస్య రథే బ్రూహి కథమశ్వాః కథం ధ్వజాః॥ 6
దుర్యోధనుడు ఇలా అన్నాడు. జూదంలో(నే) ఓడిపోయిన పాండవులను తెగ పొగడుతున్నావు. కాని అర్జునుని రథానికున్న గుర్రాలూ, ధ్వజాలూ ఎలా ఉన్నాయో చెప్పు. (6)
సంజయ ఉవాచ
భౌమనః సహ శక్రేణ బహుచిత్రం విశాం పతే।
రూపాణి కల్పయామాస త్వష్టా ధాతా సదా విభో॥ 7
సంజయుడు ఇలా చెప్పాడు. ఇంద్రునితో సమానంగా విశ్వకర్మ. త్వష్టృ ప్రజాపతి(రథం మీద) బహుచిత్రంగా సదా ఎన్నోరూపాలు సృష్టిస్తూ ఉంటారు. (7)
ధ్వజే హి తస్మిన్ రూపాణి చక్రుస్తే దేవమాయయా।
మహాధనాని దివ్యాని మహాంతి చ లఘూని చ॥ 8
వారు దేవమాయతో అర్జునుని ధ్వజం మీద అమూల్యమయిన దివ్యరూపాలు, పెద్దవిగాను, చిన్నవిగాను సృష్టిస్తూ ఉంటారు. (8)
భీమసేనానురోధాయ హనూమాన్ మారుతాత్మజః।
ఆత్మప్రతికృతిం తస్మిన్ ధ్వజ అరోపయిష్యతి॥ 9
భీమసేనుని అనుసరించడం కోసం వాయు పుత్రుడయిన హనుమంతుడు ఆ అర్జునుని ధ్వజం మీద తన రూపాన్ని కల్పిస్తాడు. (9)
సర్వా దిశో యోజనమాత్ర మంతరం
స తిర్యగూర్ధ్వం చ రురోధ వై ధ్వజః।
న సంసజ్జత్యసౌ తరుభిః సంవృతోఽపి
తథా హి మాయా విహితా భౌమనేన॥ 10
ఆ కపిధ్వజం యోజనం దూరం అడ్డంగా నిలువునా అన్ని దిక్కులకూ తన తేజస్సును వ్యాపింప జేస్తుంది. చెట్లు అడ్డం వచ్చినా ఆ తేజస్సు ఆగిపోదు. విశ్వకర్మ అటువంటి మాయకల్పించాడు. (10)
యథాకాసే శక్రధనుః ప్రకాశతే
న చైకవర్ణం న చ వేద్మి కింను తత్।
తథా ధ్వజో విహితో భౌమనేన
బహ్వాకారం దృశ్యతే రూపమస్య॥ 11
ఆకాశంలో ఈంద్ర ధనుస్సు ప్రకాశిస్తున్నట్లు ఒక రంగు కాదు ఎన్ని రంగులో ఆ రూపంలో కనిపిస్తాయి. విశ్వకర్మ ఆ ధ్వజం అలా సృష్టించాడు. (11)
యథాగ్నిధూమో దివమేతి రుద్ధ్వా
వర్ణాన్ బిభ్ర త్తైజసాంశ్చిత్రరూపాన్।
తథా ధ్వజో విహితో భౌమనేన
న చేద్భారో భవతా నోత రోధః॥ 12
అగ్ని పొగలతో తేజోరూపములయిన చిత్రవర్ణాలు ధరిస్తూ ఆకాశాని కెగసినట్లు విశ్వకర్మ ఆ ధ్వజాన్ని సృష్టించాడు. ఆ రథం మీద అది బరువు అనిపించదు. ద్వారాదుల దగ్గర ఆగిపోదు. (12)
శ్వేతా స్తస్మిన్ వాతవేగాః సదశ్వాః
దివ్యాయుక్తా శ్చిత్రరథేన దత్తాః।
భువ్యంతరిక్షే దివి వా నరేంద్ర
యేషాం గతి ర్హీయతే నాత్ర సర్వా॥
శతం యత్తత్ పూర్యతే నిత్యకాలం
హతం హతం దత్తవరః పురస్తాత్॥ 13
రాజా! ఆ రథానికి కట్టిన గుర్రాలు వాయువేగం కలవి. తెల్లటివి. అవి పూర్వం చిత్రరథుడిచ్చిన దివ్యాశ్వాలు. నేలమీద కాని, ఆకాశాన కాని, స్వర్గంలో కాని వాటి గమనం తగ్గదు (వేగం తగ్గదు). ఒకవేల కొన్ని చనిపోయినా మళ్లీ నూరు సంఖ్యకు తగ్గవు. ఇది ఆ చిత్ర రథుడిచ్చిన వరం. (13)
తథా రాజ్ఞో దంతవర్ణా బృహంతః
రథే యుక్తా భాంతి తద్వీర్యతుల్యాః।
ఋక్షప్రఖ్యా భీమసేనస్య వాహాః
రథే వాయోస్తుల్యవేగా బభూవుః॥ 14
అలాగే ధర్మరాజు యొక్క రథాశ్వాలు దంతాల వలె తెల్లనివి, పెద్దవి, అర్జునుని గుర్రాల వంటి పుష్టి కలవి. ఇక భీముని గుర్రాలు సప్తర్షిమండలం వంటివి(అంత తేజస్సు కలవి). వాయువేగం కలవి. (14)
వి॥సం॥ ఋక్షములంటే నక్షత్రాలు - ఆకాశంలో సప్తర్షులు - నక్షత్ర మండలం అని ప్రసిద్ధి - (నీల)
కల్మాషాంగా స్తిత్తిరిచిత్రపృష్ఠాః
భ్రాత్రా దత్తాః ప్రీయతా ఫాల్గునేన।
భ్రాతుర్వీరస్య స్వైస్తురంగైర్విశిష్టాః
ముదా యుక్తాః సహదేవం వహంతి॥ 15
సహదేవుని గుర్రాలు నలుపుకలిసిన తెలుపుగలవి. తీతువు పక్షి వీపులాగా చిత్రవర్ణపు వీపు కలవి. వాటిని ప్రీతితో అర్జునుడిచ్చాడు. అవి అర్జునుని గుర్రాలతో సమామయినవి. సంతోషంతో అవి సహదేవుని వహిస్తాయి. (15)
వి॥సం॥ కల్మాషవర్ణం = నలుపు కలిసిన తెలుపు వర్ణం(నీల)
మాద్రీ పుత్రం నకులం త్వాజమీఢ
మహేంద్రదత్తా హరయో వాజిముఖ్యాః।
సమా వాయో ర్బలవంత స్తరస్వినః
వహంతి వీరం వృత్రశత్రుం యథేంద్రమ్॥ 16
అజమీఢ వంశంలో పుట్టిన రాజా! నకులుని గుర్రాలు ఇంద్రుడిచ్చినవి - వాయువేగం కలవి. బలిష్ఠములు, చురుకైనవి. వృత్రాసురుని చంపిన ఇంద్రుని వలె ఆ గుర్రాలు నకులుని వహిస్తూ ఉంటాయి. (16)
తుల్యాం శ్పైభిర్వయసా విక్రమేణ
మహాజవాశ్చిత్రరూపాః సదశ్వాః।
సౌభద్రాదీన్ ద్రౌపదేయాన్ కుమారాన్
వహం త్యశ్వా దేవదత్తా బృహంతః॥ 17
వయసులోనూ, పరాక్రమంలోనూ వీటితో సమాన వేగం కల్గి చిత్ర వర్ణాలు కల ఉత్తమాశ్వాలను చిత్రరథుడు ఇచ్చాడు. అవి అభిమన్యుడు, ఉపపాండవులు మొ॥ కుమారులను వహిస్తూ ఉంటాయి. (17)
వి॥సం॥ దేవదత్తాః = దేవ(గంధర్వ) జాతి వాడయిన చిత్రరథుడు ఇచ్చినవి(నీల)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి సంజయ వాక్యే షట్పంచాశత్తమోఽధ్యాయ॥ 56 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున సంజయ వాక్యమను ఏబది ఆరవ అధ్యాయము. (56)