63. అరువది మూడవ అధ్యాయము

విదురుని ఉపదేశము.

దుర్యోధన ఉవాచ
సదృశానాం మనుష్యేషు సర్వేషాం తుల్యజన్మనామ్।
కథమేకాంతతస్తేషాం పార్థానాం మన్యసే జయమ్॥ 1
దుర్యోధనుడన్నాడు. సమాన జన్మలు కల సమానులలో (మాలో) పాండవులకు మాత్రమే జయం కలుగుతుందని నీవు ఎలా అనుకుంటున్నావు? (1)
వయం చ తేఽపి తుల్యా వై వీర్యేణ చ పరాక్రమైః।
సమేన వయసా చైవ ప్రాతిభేన శ్రుతేన వా॥ 2
వీర్యం, పరాక్రమం, శమం, వయస్సు(వర్చస్సు) ప్రతిభ, (సమయస్ఫూర్తి) పాండిత్యం - అనే వాటి విషయాల్లో మేము(కౌరవులు, పాండవులూ) సమానులమే. (2)
అస్త్రేణ యోధయుగ్యా చ శీఘ్రత్వే కౌశలే తథా।
సర్వే స్మ సమజాతీయాః సర్వే మానుషయోనయః॥ 3
అస్త్రాలచేత, యోధ సంపాదనం చేత, చురుకుదనం చేత, నేర్పుచేత అందరమూ సమానులమే - అందరమూ మానవ జన్మఎత్తిన వారమే. (3)
పితామహ విజానీషే పార్థేషు విజయం కథమ్।
నాహం భవతి న ద్రోణే న కృపే న చ బాహ్లికే॥ 4
అన్యేషు చ నరేంద్రేషు పరాక్రమ్య సమారభే।
పితామహా! పాండవులకే విజయం కలుగుతుందని నీఖెలా తెలుసు? నేను నీమీద కాని, ద్రోణ కృపుల మీద కాని, బాహ్లికుని మీద కాని, ఇతర రాజుల మీదకాని ఆధారపడి యుద్ధానికి సిద్ధపడటం లేదు. (4)
అహం వైకర్తనః కర్ణః భ్రాతా దుశ్శాసనశ్చ మే॥ 5
పాండవాన్ సమరే పంచ హనిష్యామః శితైః శరైః।
నేనూ, కర్ణుడూ, నా తమ్ముడు దుశ్శాసనుడూ యుద్ధంలో వాడి బాణాలతో పాండవులయిదుగురినీ చంపగలం. (5)
తతో రాజన్ మహాయజ్ఞైః వివిధైర్భూరిదక్షిణైః॥ 6
బ్రాహ్మణాన్ తర్పయిష్యామి గోభిరశ్వైర్ధనేన చ।
రాజా! తరువాత భూరిదక్షిణలిచ్చి ఎన్నో యజ్ఞాలు చేసి గోవులతో, గుర్రాలతో ధనంతో బ్రాహ్మణులను సంతృప్తి పరుస్తాను. (6)
యదా పరికరిష్యంతి ఐణేయానివ తంతునా।
అతరిత్రానివ జలే బాహుభిర్మామకా రణే॥ 7
పశ్యంతస్తే పరాంస్తత్ర రథనాగసమాకులాన్।
తదా దర్పం విమోక్ష్యంతి పాండవాః స చ కేశవః॥ 8
రక్షించే వాళ్లు లేక నీటిలో మునిగిపోయే లేడి పిల్లల్ని త్రాడుతో లాగి ఉద్ధరించినట్లు, రథగజాలతో మునిగిపోయే పాండవులను అంతా చూస్తూ ఉండగా నా వాళ్లు ఉద్ధరిస్తున్నపుడు పాండవులూ, ఆ కృష్ణుడూ గర్వాన్ని వదులుతారు. (7,8)
విదుర ఉవాచ
ఇహ నిఃశ్రేయసం ప్రాహుః వృద్ధా నిశ్చితదర్శినః।
బ్రాహ్మణస్య విశేషేణ దమో ధర్మః సనాతనః॥ 9
అపుడు విదురుడు ఇలా అన్నాడు. నిశ్చితమయిన జ్ఞానం కలవానికి ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం కలవానికి నిగ్రహం సనాతన ధర్మం అనీ పర(మ) సుఖాన్ని సుఖాన్ని ఇస్తుందనీ పెద్దలు చెపుతారు. (9)
తస్య దానం క్షమా సిద్ధిః యథావదుపపద్యతే।
దమో దానం తపో జ్ఞానమ్ అధీతం చానువర్తతే॥ 10
దమం కలవాని దానం, క్షమ, సిద్ధి యథార్థలాభం పొందుతాయి. ఎందుచేతనంటే దానం, తపస్సు, జ్ఞానం, స్వాధ్యాయం అనువానిని దమమే సంపాదిస్తుంది. (10)
దమస్తేజో వర్ధయంతి పవిత్రం దమ ఉత్తమమ్।
విపాప్మా వృద్ధతేజాస్తు పురుషో విందతే మహత్॥ 11
దమం తేజస్సును వృద్ధిపరుస్తుంది. దమం పవిత్రమైనది ఉత్తమమైనది. పాపరహితుడై, వృద్ధి నొందిన తేజస్సు కలవాడు మహత్త్వం పొందుతాడు. (11)
క్రవ్యాద్భ్య ఇవ భూతానామ్ అదాంతేభ్యః సదా భయమ్।
యేషాం చ ప్రతిషేధార్థం క్షత్రం సృష్టం స్వయంభువా॥ 12
క్రూరమృగాలవల్ల, ప్రాణులు భయపడినట్లు దమం లేని వారి వల్ల నిత్యమూ భయం కలుగుతుంది. వాటిని తొలగించటానికే బ్రహ్మ క్షత్రియజాతిని సృష్టించాడు. (12)
ఆశ్రమేషు చతుర్ప్యాహుః దమమేవోత్తమం వ్రతమ్।
తస్య లింగం ప్రవక్ష్యామి యేషాం సముదయో దమః॥ 13
నాలుగాశ్రమాల వారికీ దమమే ఉత్తమమైన వ్రతం. దమం యొక్క లక్షణాలు చెపుతున్నాను - ఇవి దమం కలగటానికి హేతువులు. (13)
క్షమా ధృతిరహింసా చ సమతా సత్యమార్జవమ్।
ఇంద్రియాభిజయో ధైర్యం మార్దవం హ్రీరచాపలమ్॥ 14
అకార్పణ్యమసంరంభః సంతోషః శ్రద్దధానతా।
ఏతాని యస్య రాజేంద్ర స దాంతః పురుషః స్మృతః॥ 15
సహనం, ధృతి, అహింస, సమత్వం, సత్యం, ఆర్జవం, ఇంద్రియజయం, ధైర్యం, మృదుత్వం, సిగ్గు, చాపల్యం లేకపోవడం, కార్పణ్యం లేకపోవడం, కోపం లేకపోవడం, సంతోషం, శ్రద్ధ... రాజేంద్రా! ఇవి కలవాడు దాంతుడు. (14,15)
కామో లోభశ్చ దర్పశ్చ మన్యుర్నిద్రా వికత్థనమ్।
మాన ఈర్ష్యాచ శోకశ్చ నైతత్ దాంతో నిషేవతే॥
అజిహ్మమశఠం శుద్ధమ్ ఏతద్దాంతస్య లక్షణమ్॥ 16
కామం, లోభం, గర్వం, కోపం, నిద్ర, ఆత్మస్తుతి, దురభిమానం, ఈర్ష్య, శోకం - ఇవి దాంతునికి కలగవు. దాంతుని లక్షణం ఏమంటే నిష్కపటత, మొండిపట్టుదల లేకపోవడం, దోషరాహిత్యం. (16)
అలోలుపస్తథాల్పేప్సుః కామానా మవిచింతితా।
సముద్రకల్పః పురుషః స దాంతః పరికీర్తితః॥ 17
అనాసక్తి, అత్యాశలేకపోవడం, కామ సంకల్పాలు లేకపోవడం, సముద్రం వంటి గాంభీర్యం - ఇవి కలవాడు దాంతుడని కీర్తింపబడతాడు. (17)
సువృత్తః శీలసంపన్నః ప్రసన్నాత్మాఽఽత్మవిద్భుధః।
ప్రాప్యేహ లోకే సమ్మానం సుగతిం ప్రేత్య గచ్ఛతి॥ 18
సత్ప్రవర్తన, శీలసంపద, ప్రసన్నమైన మనస్సు కలిగి ఆత్మవేత్త అయిన పడితుడు ఇహలోకంలో సమ్మానం పొంది మరణించాక సుగతిని పొందుతాడు. (18)
అభయం యస్య భూతేభ్యః సర్వేషామభయం యతః।
స వై పరిణతప్రజ్ఞః ప్రఖ్యాతో మనుజోతమః॥ 19
ఇతర ప్రాణుల వల్ల తనకు భయం లేనివాడు, తనవల్ల ఇతరులకు భయం కల్గించని మానవోత్తముడు పరిణత ప్రజ్ఞుడని ప్రసిద్ధి కెక్కుతాడు. (19)
సర్వభూతహితో మైత్రః తస్మాన్నోద్విజతే జనః।
సముద్ర ఇవ గంభీరః ప్రజ్ఞాతృప్తః ప్రశామ్యతి॥ 20
సర్వప్రాణుల పట్ల హితంగా మెలిగేవాడు. మిత్రుడు, ఇతరులకు భయం కలిగించనివాడు, సముద్రంలా గంభీరుడు అయిన ప్రజ్ఞావంతుడు తృప్తుడై శాంతిస్తాడు. (20)
వి॥సం॥ ప్రజ్ఞాతృప్తః = ఆత్మసాక్షాత్కారంలో తృప్తుడు (అర్జు)
కర్మణాఽఽచరితం పూర్వం సద్భిరాచరితం చ యత్।
తదేవాస్థాయ మోదంతే దాంతాః శమపరాయణాః॥ 21
తన పూర్వ సుకృతం వల్ల కలిగిన దానిని స్వీకరిస్తూ, సదాచారం పాటిస్తూ, సంతోషం పొందే వారే దాంతులు, వారే శమ పరాయణులు. (21)
నైష్కర్మ్యం వా సమాస్థాయ జ్ఞానతృప్తో జితేంద్రియః।
కాలాకాంక్షీ చరన్ లోకే బ్రహ్మభూయాయ కల్పతే॥ 22
నైష్కర్మ్యం పాటించి, జ్ఞానంతో సంతృప్తిపడి, జితేంద్రియుడై, కాలం కోసం ఎదురుచూసేవాడు బ్రహ్మభావం పొందుతాడు. (22)
శకునీనామివాకాశే పదం నైవోపలభ్యతే।
ఏవం ప్రజ్ఞానతృప్తస్య మునే ర్వర్త్మ న దృశ్యతే॥ 23
ఆకాశంలో ఎగిరే పక్షుల పాదచిహ్నాలు కనపడనట్లే జ్ఞానానందం చేత సంతృప్తినొందిన మునియొక్క మార్గం కూడా కనపడదు. (23)
ఉత్సృజ్యైవ గృహాన్ యస్తు మోక్షమేవాభిమన్యతే।
లోకాస్తేజోమయాస్తస్య కల్పంతే శాశ్వతా దివి॥ 24
గృహస్థాశ్రమ ధర్మాలు విడిచి మోక్షంమాత్రమే ఆదరించేవాడు ఊర్ధ్వలోకాల్లో తేజోమయమయిన సనాతన స్థానం పొందుతాడు. (24)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి విదుర వాక్యే త్రిషష్టితమోఽధ్యాయ॥ 63 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున విదుర వాక్యమను అరువది మూడవ అధ్యాయము. (63)