62. అరువది రెండవ అధ్యాయము

కర్ణ - భీష్మ సంవాదము.

వైశంపాయన ఉవాచ
తథా తు పృచ్ఛంత మతీవ పార్థం
వైచిత్రవీర్యం తమచింతయిత్వా।
ఉవాచ కర్ణో ధృతరాష్ట్రపుత్రం
ప్రహర్షయన్ సంసది కౌరవాణామ్॥ 1
వైశంపాయనుడు చెప్పాడు - అలా అర్జునుని గురించి అడుగుతున్న ధృతరాష్ట్రుని గురించి పట్టించుకోకుండా/ కర్ణుడు కురుసభలో దుర్యోధనుని సంతోషపరుస్తూ ఇలా అన్నాడు. (1)
మిథ్యా ప్రతిజ్ఞాయ మయా యదస్త్రం
రామాత్ కృతం బ్రహ్మమయం పురస్తాత్।
విజ్ఞాయ తేనాస్మి తదైవముక్తః
తే నాంతకాలే ప్రతిభాస్యతీతి॥ 2
అబద్ధం చెప్పి పరశురాముని నుండి నేను బ్రహ్మాస్త్రం పొందినపుడు అతడు తెలిసికొని ఇలా అన్నాడు. "చివరి సమయంలో నీకు స్ఫురించదు" అని. (2)
మహాపరాధే హ్యపి యన్న తేన
మహర్సిణాహం గురుణా చ శప్తః।
శక్తః ప్రదగ్ధుం హ్యపి తిగ్మతేజాః
ససాగరా మప్యవనిం మహర్షిః॥ 3
చాలా ఘోరమైన అపరాధం చేసినా మా గురువయిన మహర్షి నన్ను శపించలేదు. తీవ్రతేజస్వి అయిన ఆ మహర్షి సముద్రంతో సహా భూమినంతనూ దహించగలడు. (3)
ప్రసాదితం హ్యస్య మయా మనోఽభూత్
శుశ్రూషయా స్వేన చ పౌరుషేణ।
తదస్తి చాస్త్రం మమ సావశేషం
తస్మాత్ సమర్థోఽస్మి మమైష భారః॥ 4
నాశుశ్రూషచేతనూ, పౌరుషం చేతనూ తన మనస్సు ప్రసన్నమయింది. నాకింకా ఆయువు మిగిలి ఉంది. అందుచేత ఆ బ్రహ్మాస్త్రం నాకు ఉన్నట్లే. అందుచేత నేను సమర్థుడనే - ఈభారమంతా నాదే (4)
వి॥సం॥ పౌరుషేణ = భృత్యపురుషుని యొక్క స్వభావంతో (లక్షా)
నిమేషమాత్రాత్తమృషేః ప్రసాదమ్
అవాప్య పాంచాల కరూష మత్స్యాన్।
నిహత్య పార్థాన్ సహ పుత్రపౌత్రైః
లోకానహం శస్త్రజితాన్ ప్రపత్స్యే॥ 5
ఒక్క నిమిషంలో ఆ మహర్షి అనుగ్రహం పొంది, పాంచాల, కరూశ, మత్స్య రాజులనూ, పుత్రపౌత్రులతో పాండవులనూ చంపి శస్త్ర విజయంతో పొందే లోకాలను పొందుతాను. (5)
పితామహస్తిష్ఠతు తే సమీపే
ద్రోణశ్చ సర్వే చ నరేంద్రముఖ్యాః।
యథా ప్రధానేన బలేన గత్వా
పార్థాన్ హనిష్యామి మమైష భారః॥ 6
ఈ భీష్ముడు నీదగ్గరే ఉండుగాక - ద్రోణుడూ, రాజముఖ్యులంతా కూడా. (అక్కరలేదు) ప్రధాన సేనతో వెళ్లి పాండవులను చంపివేస్తాను. ఇది నా బాధ్యత. (6)
ఏవం బ్రువంతం తమువాచ భీష్మః
కిం కత్థసే కాలపరీతబుద్ధే।
న కర్ణ జానాసి యథా ప్రధానే
హతే హతాః స్యు ర్ధృతరాష్ట్రపుత్రాః॥ 7
ఇలా అంటున్న కర్ణునితో భీష్ముడిలా అన్నాడు. ఆయువు మూడిన బుద్ధికల కర్ణా! ఎందుకట్లా ప్రగల్భాలు పలుకుతున్నావు? ప్రధానుడు చనిపోతే కౌరవులు చనిపోతారని ఎరుగనా? (7)
వి॥సం॥ ప్రధానుడనగా కర్ణుడు(నీల)
యత్ ఖాండవం దాహయతా కృతం హి
కృష్ణద్వితీయేన ధనంజయేన।
శ్రుత్వైవ తత్కర్మ నియంతుమాత్మా
యుక్తస్త్వయా వై సహ బాంధవేన॥ 8
ఖాండవ దహన సమయంలో కృష్ణునితో కలిసిన అర్జునుడు చేసిన పనిని విన్నాక అయినా బాంధవులతో కలిసి నీవు నీ మనసును అదుపులో పెట్టుకోవడం మంచిది. (8)
యాం చాపి శక్తిం త్రిదశాధిపస్తే
దదౌ మహాత్మా భగవాన్ మహేంద్రః।
భస్మీకృతాం తాం సమరే విశీర్ణాం
చక్రాహతాం ద్రక్ష్యసి కేశవేన॥ 9
స్వర్గాధిపతి అయిన మహేంద్రుడు నీకిచ్చిన ఆశక్తి శ్రీకృష్ణుని చక్రంతో ముక్కలు ముక్కలయి యుద్ధంలో భస్మమయిపోతుంది. (9)
యస్తే శరం సర్పముఖో విభాతి
సదాగ్ర్యమాల్యైర్మహితః ప్రయత్నాత్।
స పాండుపుత్రాభిహతః శరౌఘైః
సహ త్వయా యాస్యతి కర్ణ నాశమ్॥ 10
ఇక నీకున్నది సర్పముఖి బాణం - దాన్ని చక్కని పూలమాలలతో శ్రద్ధగా పూజిస్తున్నావు. కాని అది అర్జునుని బాణాల దెబ్బతిని నీతో సహా అది వ్యర్థం అవుతుంది/(పనిచేయదు). (10)
బాణస్య భౌమస్య చ కర్ణ హంతా
కిరీటినం రక్షతి వాసుదేవః।
యస్త్వాదృశానాం చ వరీయసాం చ
హంతా రిపూణాం తుములే ప్రగాఢే॥ 11
బాణుని, భూమి పుత్రుడయిన నరకుని సంహరించిన కృష్ణుడు అర్జునుని రక్షిస్తాడు. అతడు నిన్నేకాదని నిన్ను మించిన శత్రువులనయినా తుముల యుద్ధంలో చంపగలడు. (11)
కర్ణ ఉవాచ
అసంశయం వృష్ణిపతిర్యథోక్తః
తథా చ భూయాంశ్చ తతో మహాత్మా।
అహం యదుక్తః పరుషం తు కించిత్
పితామహస్తస్య ఫలం శృణోతు॥ 12
ఆమాటలు విని కర్ణుడిలా అన్నాడు. నిజమే, కృష్ణుడు అంతటివాడే - కాదు అంతకన్న ఎక్కువ వాడు కూడా. కాని భీష్మ్డు నన్ను కొన్ని పరుషవాక్కులు పలికాడు. దాని ఫలితమేమిటో వినాలి. (12)
న్యస్యామి శస్త్రాణి న జాతు సంఖ్యే
పితామహో ద్రక్ష్యతి మాం సభాయామ్।
త్వయి ప్రశాంతే తు మమ ప్రభావం
ద్రక్ష్యంతి సర్వే భువి భూమిపాలాః॥ 13
ఇక యుద్ధంలో శస్త్రం ముట్టను. విడిచిపెడుతున్నాను. సభలో మాత్రమే భీష్మునికి కనిపిస్తాను. భీష్మా! నీవు అణగారిన తరువాతనే నా ప్రభావాన్ని రాజులంతా చూస్తారు. (13)
వైశంపాయన ఉవాచ
ఇత్యేవముక్త్వా స మహాధనుష్మాన్
హిత్వా సభాం స్వం భవనం జగామ।
భీష్మస్తు దుర్యోధనమేవ రాజన్
మధ్యే కురూణాం ప్రహసన్నువాచ॥ 14
వైశంపాయనుడిట్లన్నాడు. ఇలా అని కర్ణుడు మహాధనుశ్శాలి సభను విడిచి తన భవనానికి వెళ్లిపోయాడు. భీష్ముడు కురుసభలో నవ్వుతూ దుర్యోధనునితో ఇలా అన్నాడు. (14)
సత్యప్రతిజ్ఞః కిల సూతపుత్రః
తథా స భారం విషహేత కస్మాత్।
వ్యూహం ప్రతివ్యూహ్య శిరాంసి భిత్త్వా
లోకక్షయం పశ్యత భీమసేనాత్॥ 15
ఈ సూతపుత్రుడు సత్యప్రతిజ్ఞుడు కదా! ఈ భారం అంతా ఎలా మోస్తాడో! వ్యూహానికి ప్రతివ్యూహం పన్ని భీముడు అందలి తలలు పగులగొట్టి చేసే లోకవినాశం చూద్దురుగాని. (15)
ఆవంత్య కాళింగ జయద్రథేషు
చేదిధ్వజే తిష్ఠతి బాహ్లికే చ।
అహం హనిష్యామి సదా పరేషాం
సహస్రశశ్చాయుతశశ్చ యోధాన్॥ 16
అవంతిరాజులు, కళింగరాజులు, సైంధవుడు, చేదిరాజు, బాహ్లికుడు - అంతా ఉండగా వేలకొద్దీ, పదివేల కొద్దీ శత్రు యోధులను చంపుతాను. (16)
యదైవ రామే భగవత్యనింద్యే
బ్రహ్మబ్రువాణః కృతవాన్ తదస్త్రమ్।
తదైవ ధర్మశ్చ తపశ్చ నష్టం
వైకర్తనస్యాధమపూరుషస్య॥ 17
మచ్చలేని వాడు, భగవంతుడు అయిన పరశురాముని నుండి 'బ్రాహ్మణుడనని చెప్పుకొని' బ్రహ్మాస్త్రం పొందిన రోజునే ఈ అధముని యొక్క ధర్మమూ, తపస్సూ నశించిపోయాయి. (17)
వైశంపాయన ఉవాచ
తథోక్తవాక్యే నృపతీంద్ర భీష్మే
నిక్షిప్య శస్త్రాణి గతే చ కర్ణే।
వచిత్రవీర్యస్య సుతోఽల్పబుద్ధిః
దుర్యోధనః శాంతనవం బభాషే॥ 18
వైశంపాయనుడు అన్నాడు. రాజా! భీష్ముడట్లా అనగానే కర్ణుడు అస్త్ర సన్యాసం చేసివెళ్లాక, ధృతరాష్ట్రపుత్రుడు, అల్పబుద్ధి అయిన దుర్యోధనుడు భీష్మునితో ఇలా అన్నాడు. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి యానసంధి పర్వణి కర్ణభీష్మ వాక్యే ద్విషష్టితమోఽధ్యాయ॥ 62 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున యానసంధి పర్వమను ఉపపర్వమున కర్ణ భీష్మసంవాదమను అరువది రెండవ అధ్యాయము. (62)