74. డెబ్బది నాలుగవ అధ్యాయము

భీమసేనుడు సంధిని గురించి ప్రస్తావించుట.

భీమ ఉవాచ
యథా యథైవ శాంతిః స్యాత్ కురూణాం మధుసూదన।
తథా తథైవ భాషేథాః మా స్మ యుద్ధేన భీషయేః॥ 1
భీముడిలా అన్నాడు. మధుసూదనా! కౌరవుల మధ్య సంధి జరగటానికి అవసరమైన విధంగా మాట్లాడు. యుద్ధ ప్రసక్తి తెచ్చి భయపెట్టవద్దు. (1)
అమర్షీ జాతసంరంభః శ్రేయోద్వేషీ మహామనాః।
నోగ్రం దుర్యోధనో వాచ్యః సామ్నైవైనం సమాచరేః॥ 2
దుర్యోధనుడు సహనం లేనివాడు, ఆవేశపరుడు. శ్రేయస్సును వ్యతిరేకించేవాడు. మహామనస్వి. అటువంటి దుర్యోధనునితో సమానంగా మాట్లాడకు. సున్నితంగానే ప్రవర్తించు. (2)
ప్రకృత్వా పాపసత్త్వశ్చ తుల్యచేతాస్తు దస్యుభిః।
ఐశ్వర్యమదమత్తశ్చ కృతవైరశ్చ పాండవైః॥ 3
దుర్యోధనుడు సహజంగానే పాపాత్ముడు. దోపిడీ దారుల మనస్సు వంటి మనస్సు గలవాడు. ఐశ్వర్య మదంతో మత్తెక్కిన వాడు. పాండవులపై పగబూనినవాడు. (3)
అదీర్ఘదర్శీ నిష్ఠూరీ క్షేప్తా క్రూరపరాక్రమః।
దీర్ఘమన్యురనేయశ్చ పాపాత్మా నికృతిప్రియః॥ 4
దుర్యోధనుడు దీర్ఘదృష్టి లేనివాడు. నిష్ఠూరాలు పలికే వాడు. పరులను నిందించే వాడు, క్రూరమయిన పరాక్రమం కలవాడు. క్రోధాన్ని త్వరగా విడిచిపెట్టడు. మంచిదారిలో పెట్టటానికి వీలుకానివాడు. పాపాత్ముడు. మొండివాడు. (4)
మ్రియేతాపి న భజ్యేత నైవ జహ్యాత్ స్వకం మతమ్।
తాదృశేన శమః కృష్ణ మన్యే పరమదుష్కరః॥ 5
కృష్ణా! సుయోధనుడు చావనయినా చస్తాడు కానీ లొంగుబాటు నంగీకరింపడు. తన మతాన్ని విడిచిపెట్టడు. అటువంటి వాడితో సంధి చాలా కష్ట మనుకొంటున్నాను.(5)
సుహృదామప్యవాచీనః త్యక్తధర్మా ప్రియానృతః।
ప్రతిహంత్యేవ సుహృదాం వాచశ్చైవ మనాంసి చ॥ 6
సుయోధనుడు మిత్రులతో సైతం విపరీతంగా ప్రవర్తిస్తాడు. ధర్మాన్ని వీడినవాడు. అసత్యాలనే ఇష్టపడేవాడు. మిత్రుల మాటలనైనా ఖండించి వారి మనస్సులను గాయపరుస్తాడు. (6)
స మన్యువశమాపన్నః స్వభావం దుష్టమాస్థితః।
స్వభావాత్ పాప మభ్యేతి తృణైశ్ఛన్న ఇవోరగః॥ 7
ఆ దుర్ర్యోధనుడు క్రోధానికి లోనయి దుర్మార్గాన్ని ఆశ్రయించి ఉన్నాడు. గడ్డి మాటున దాగిఉన్న పాములాగా స్వాభావికంగానే పాపపు పనులు చేస్తుంటాడు. ఇతరులను హింసిస్తాడు. (7)
దుర్యోధనో హి యత్సేనః సర్వథా విదితస్తవ।
యచ్ఛీలో యత్స్యభావశ్చ యద్బలో యత్పరాక్రమః॥ 8
దుర్యోధనుని సైన్యమెంతో, నడవడి ఎటువంటిదో, స్వభావమేమిటో, బలమెంతో, పరాక్రమం ఎటువంటిదో నీకు సర్వవిధాలా తెలుసును. (8)
పురా ప్రసన్నాః కురవః సహపుత్రాస్తథా వయమ్।
ఇంద్రజ్యేష్ఠా ఇవాభూమి మోదమానాః సబాంధవాః॥ 9
గతంలో మేమూ, కౌరవులూకూడా పుత్రులతో బంధువులతో కలిసి ఇంద్రాది దేవతలవలె కలసి మెలసి ప్రశాంతంగా ఆనందంగా ఉండేవాళ్ళం (9)
దుర్యోధనస్య క్రోధేన భరతా మధుసూదన।
ధక్ష్యంతే శిశిరాపాయే వనానీవ హుతాశనైః॥ 10
కానీ కృష్ణా! దుర్యోధనుడి క్రోధం కారణంగా ప్రస్తుతం శిశిరఋతువు ముగిసిన తర్వాత గ్రీష్మంలో అరణ్యాలు అగ్నితో దహింపబడినట్లు మండుతున్నాం. (10)
అష్టాదశేమే రాజానః ప్రఖ్యాతా మధుసూదన।
యే సముచ్చిచ్ఛిదుః జ్ఞాతీన్ సుహృదశ్చ సబాంధవాన్॥ 11
మధుసూదన! ఈ పద్దెనిమిది మంది రాజులు బంధువులను, దాయాదులను, మిత్రులను కూడా నాశనం చేసి ప్రసిద్ధి కెక్కిన వారు. (11)
అసురాణాం సమృద్ధానాం జ్వలతామివ తేజసా।
పర్యాయకాలే ధర్మస్య ప్రాప్తే కలిరజాయత॥ 12
హైహయానాం ముదావర్తః నీపానాం జనమేజయః।
బహులస్తాలజంఘానాం కృమీణాముద్ధతో వసుః॥ 13
అజబిందుః సువీరాణాం సురాష్ట్రాణాం రుషర్థికః।
అర్కజశ్చ బలీహానాం చీనానాం ధౌతమూలకః॥ 14
హయగ్రీవో విదేహానాం వరయుశ్చ మహౌజసామ్।
బాహుః సుందరవంశానాం దీప్తాక్షాణాం పురూరవాః॥ 15
సహజశ్చేదిమత్స్యానాం ప్రవీరాణాం వృషధ్వజః।
ధారణశ్చంద్రవత్సానాం ముకుటానాం విగాహనః॥ 16
శమశ్చ నందివేగానామ్ ఇత్యేతే కులపాంసనాః।
యుగాంతే కృష్ణ సంభూతాః కులే కుపురుషాధమాః॥ 17
కృష్ణా! ధర్మవిప్లవ కాలం సంభవించినప్పుడు తేజోవంతులై సమృద్ధి చెంది ఉన్న రాక్షసులమధ్య భయంకరమైన కలహం ఏర్పడింది.
హైహయవంశస్థుడైన ముదావర్తుడు, నీప వంశస్థుడైన జనమేజయుడు, తాలజంఘవంశస్థుడైన బహులుడు, కృమివంశ శ్రేష్ఠుడు వసువు, సువీర వంశస్థుడైన అజబిందువు, సురాష్ట్రవంశస్థుడు రుషర్థికుడు, బలీహవంశస్థుడు అర్కజుడు, చీనవంశస్థుడు ధౌతమూలకుడు, విదేహ వంశస్థుడు హయగ్రీవుడు బాహువు, దీప్తాక్షవంశస్థుడు పురూరవుడు, చేదిమత్స్యదేశాల్లో సహజుడు, ప్రవీర వంశంలో వృషధ్వజుడు, చంద్ర వత్స వంశాల్లో ధారణుడు, ముకుట వంశస్థుడు విగాహనుడు, నందివేగవంశస్థుడు శముడు వీరంతా నరాధములైన క్షత్రియులు. ప్రళయకాలం రాబోతోంది. కాబట్టి వంశనాశనం కోసం ఆయావంశాలలో పుట్టినవారు. (12-17)
అప్యయం నః కురూణాం స్యాద్ యుగాంతే కాలసంభృతః।
దుర్యోధనః కులాంగారః జఘన్యః పాపపూరుషః॥18
ఈ రాజులలాగా వంశదాహకుడూ, నీచుడూ, పాపాత్ముడూ అయిన దుర్యోధనుడు ద్వాపర యుగాంతంలో కాల ప్రేరితుడై కురువంశనాశనానికై పుట్టినవాడు. (18)
తస్మాన్మృదు శనైర్బ్రూయాః ధర్మార్థసహితం హితమ్।
కామానుబంధబహులం నోఘ్రముగ్రపరాక్రమ॥ 19
కాబట్టి తీవ్రపరాక్రమశాలి అయిన కృష్ణా! దుర్యోధనునితో మృదువుగా నెమ్మదిగానే మాట్లాడాలి. ధర్మార్థ సహితంగా హితకరంగా మాట్లాడాలి కానీ తీవ్రంగా మాట్లాడకూడదు. నీ మాటలు అతని కోరికకు అనుగుణంగానే వినిపించాలి. (19)
అపి దుర్యోధనం కృష్ణ సర్వే వయమధశ్చరాః।
నీచైర్భూత్వానుయాస్యామః మా స్మ నో భరతానశన్॥ 20
కృష్ణా! అవసరమయితే మేమందరమూ క్రిందువడి, నమ్రులమై దుర్యోధనుని అనుసరించటానికయినా సిద్ధమే. అంతే కానీ మా వలన భరతవంశం నశించకూడదు. (20)
అప్యుదాసీనవృత్తిః స్యాద్ యథా నః కురుభిః సహ।
వాసుదేవ తథా కార్యం న కురూననయః స్పృశేత్॥ 21
వాసుదేవా! మాకు కౌరవులతో ఉదాసీన భావం తటస్థస్థితి కలగటానికి అనువుగానే నీవు ప్రయత్నం చేయాలి. అంతే కాని కురువంశానికి అన్యాయం జరిగేటట్లు చూడకూడదు. (21)
వాచ్యః పితామహో వృద్ధః యే చ కృష్ణ సభాసదః।
భ్రాతౄణామస్తు సౌభ్రాత్రం ధార్తరాష్ట్రః ప్రశామ్యతామ్॥ 22
కృష్ణా! సోదరులతో సౌహార్దం వెల్లివిరిసేటట్టు. సుయోధనుడు శాంతించేటట్లు ప్రయత్నించవలసినదిగా పెద్దవాడైన భీష్మునకూ, అక్కడున్న సభాసదులకూ కూడా నీవు చెప్పాలి. (22)
అహమేతద్ బ్రవీమ్యేవం రాజా చైవ ప్రశంసతి।
అర్జునో నైవ యుద్ధార్థీ భూయసీ హి దయార్జునే॥ 23
నేను ఈ విధంగా శాంతికోసం మాట్లాడుతున్నాను. రాజైన యుధిష్ఠిరుడు కూడా శాంతిని గూర్చియే మాట్లాడుతున్నాడు. అర్జునుడు కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదు. అర్జునుడు ఎంతో దయామయుడు. (23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భీమవాక్యే చతుస్సప్తతితమోఽధ్యాయ॥ 74 ॥
ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున భీమవాక్యమను డెబ్బది నాలుగవ అధ్యాయము. (74)