75. డెబ్బది అయిదవ అధ్యాయము
శ్రీకృష్ణుడు భీమసేనుని ఉత్తేజపరచుట.
వైశంపాయన ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా మహాబాహుః కేశవః ప్రహసన్నివ।
అభూతపూర్వం భీమస్య మార్దవోపహితం వచః॥ 1
గిరేరివ లఘుత్వం తత్ శీతత్వమివ పావకే।
మత్వా రామానుజః శౌరిః శార్ ఙ్గధన్వా వృకోదరమ్॥ 2
సంతేజయంస్తదా వాగ్భిః మాతరిశ్వేవ పావకమ్।
ఉవాచ భీమమాసీనం కృపయాభిపరిప్లుతమ్॥ 3
వైశంపాయనుడు ఇలా అన్నాడు - ఎప్పుడూ లేనట్లు కొత్తగా, మృదువుగా భీమసేనుడు పలికిన పలుకులు విని మహాబాహువైన శ్రీకృష్ణుడు నవ్వసాగాడు.
భీమసేనుని మార్దవాన్ని కొండలోని చిన్నతనంలాగా, నిప్పులోని చల్లదనంలాగా భావించాడు రామానుజుడూ, శార్ ఙ్గధన్వుడూ అయిన శ్రీకృష్ణుడు.
గాలి నిప్పును ఉద్దీపింపజేసినట్లు దయతో నిండిన భీమసేనుని రెచ్చగొడుతూ కృష్ణుడిలా మాట్లాడుతున్నాడు. (1,2,3)
త్వమన్యదా భీమసేన యుద్ధమేవ ప్రశంససి।
వధాభినందినః క్రూరాన్ ధార్తరాష్ట్రాన్ మిమర్దిషుః॥ 4
భీమసేనా! ఇంతకుముందెప్పుడయినా నీవు హింస వైపే మొగ్గుచూపుతూ క్రూరులైనా ధార్తరాష్ట్రులను చితక కొట్టాలని కోరుకొంటూ యుద్ధప్రసక్తినే చేసేవాడివి. (4)
న చ స్వపిషి జాగర్షి న్యుబ్జః శేషే పరంతప।
ఘోరా మశాంతాం రుషతీం సదా వాచం ప్రభాషసే॥ 5
పరంతపా! రాత్రులలో నీవు నిద్రించటమూ లేదు. మేల్కొని ఉండటమూ లేదు. కునికిపాట్లుపడుతూ పడుకొంటున్నావు. అశాంతితో, కోపంతో ఎప్పుడూ ఘోరంగా మాటాడేవాడివి. (5)
నిఃశ్వసన్నగ్నివత్ తేన సంతప్తః స్వేన మన్యునా।
అప్రశాంతమనా భీమ సధూమ ఇవ పావకః॥ 6
భీమా! నిట్టూర్పులు విడుస్తూ నిప్పులాగా నీకోపంతోనే నీవు తపించిపోయేవాడివి. పొగచూరిన నిప్పులాగా అశాంతికప్పిన మనస్సుతో మెదిలేవాడివి. (6)
ఏకాంతే నిఃశ్వసన్ శేషే భారార్త ఇవ దుర్బలః।
అపి త్వాం కేచిదున్మత్తం మన్యంతేఽతద్వితో జనాః॥ 7
బరువు నెత్తికెత్తుకొన్న బక్కమనిషిలాగా నిట్టూర్పులు విడుస్తూ ఒంటరిగా పడిఉండేవాడివి. అందుకే ఆ విషయం తెలియని కొందరు నిన్ను పిచ్చివా డనుకొనేవారు. (7)
ఆరుజ్య వృక్షాన్ నిర్మూలాన్ గజః పరిరుజన్నివ।
నిఘ్నన్ పద్భిః క్షితిం భీమ నిష్టవన్ పరిధావసి॥ 8
ఏనుగు చెట్లను కూకటివేళ్ళతో పెల్లగించి, పాదాలతో నలగదొక్కినట్టు నీవు వేళ్ళతో నేలను తాటిస్తూ పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టేవాడివి. (8)
నాస్మిన్ జనేనాభిరమసే రహః క్షిపసి పాండవ।
నాన్యం నిశి దివా చాపి కదాచిదభినందసి॥ 9
పాండుకుమారా! నీకు ఈ జనమంటే ఇష్టం లేదు. ఒంటరిగా కాలక్షేపం చేస్తుంటావు. పగలైనా రాత్రయినా ఎప్పుడూ ఎవ్వరినీ అభినందించవు/ఇష్టపడవు. (9)
అకస్మాత్ స్మయమానశ్చ రహస్యాస్సే రుదన్నివ।
జాన్వోర్మూర్ధానమాధాయ చిరమాస్సే ప్రమీలితః॥ 10
ఉన్నట్టుండి నవ్వుతావు. ఒంటరిగా ఏడుస్తున్నట్టు కనిపిస్తావు. మోకాళ్ళమధ్య తలపెట్టుకొని, కనులు మూసికొని ఎంతోసేపు అట్లాగే ఉండిపోతావు. (10)
భ్రుకుటిం చ పునః కుర్వన్ ఓష్ఠౌ చ విదశన్నివ।
అభీక్ష్ణం దృశ్యఏ భీమ సర్వం తన్మన్యుకారితమ్॥ 11
మాటమాటికి బొమముడివేస్తూ రెండు పెదవులనూ కొరికివేస్తూ కనిపిస్తూ ఉండ్ఱ్వాడివి. భీమసేనా! ఇదంతా నీలోని కోపం చేయిస్తున్న పని. (11)
యథా పురస్తాత్ సవితా దృశ్యతే శుక్రముచ్చరన్।
యథా చ పశ్చాన్నిర్ముక్తః ధ్రువం పర్యేతి రశ్మివాన్॥ 12
తథా సత్యం బ్రవీమ్యేతత్ నాస్తి తస్య వ్యతిక్రమః।
హంతాహం గదయాభ్యేత్య దుర్యోధనమమర్షణమ్॥ 13
ఇతి స్మ మధ్యే భ్రాతౄణాం సత్యేనాలభసే గదామ్।
తస్య తే ప్రశమే బుద్ధిః ధ్రియతేఽద్య పరంతప॥ 14
పరంతపా! 'సూర్యుడు తెలవారగానే తూర్పు దిక్కున తన తేజస్సును ప్రదర్శిస్తూ, సాయంకాలంలో పడమటి దిక్కును చేరి మేరుపర్వతాన్ని చుట్టివస్తాడు. ఈ నియమాన్ని ఎప్పుడూ తప్పడు, నేను కూడా అలాగే కోపిష్ఠి అయిన దుర్యోధనుడి దగ్గరకుపోయి నా గదతో చంపుతాను' అని సత్యప్రమాణం చేస్తూ సోదరుల మధ్యలో మాటాడేవాడివి.
అటువంటి నీ బుద్ధి ఇప్పుడు శాంతిపై నిలవటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. (12-14)
అహో యుద్ధాభికాంక్షాణాం యుద్ధకాల ఉపస్థితే।
చేతాంసి విప్రతీపాని యత్ త్వాం భీర్భీమ విందతి॥ 15
సరిగా యుద్ధం చేయవలసిన అవసరమేర్పడి నప్పుడు రణాభిలాష గలవారి మనస్సులు కూడా మారిపోయి దానికి భిన్నంగా ఆలోచిస్తాయి. భీమసేనా! నీవు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. (15)
అహో పార్థ! నిమిత్తాని విపరీతాని పశ్యసి।
స్వప్నాంతే జాగరాంతే చ త్స్మాత్ ప్రశమమిచ్ఛసి॥ 16
పార్థా! బహుశః నీవు మేల్కొని ఉన్నప్పుడూ, నిదిరిస్తున్నప్పుడూ కూడా విపరీత ఫలితాలనిచ్చే శకునాలనే చూస్తున్నావు. అందుకే కాబోలు శాంతిని/ సంధిని కోరుకొంటున్నావు. (16)
అహో నాశంససే కించిద్ పుంస్త్వం క్లీబ ఇవాత్మని।
కశ్మలేనాభిపన్నోఽపి తేన తే వికృతం మనః॥ 17
అహో! నపుంసకుడిలాగా నీవు ఇప్పుడు కొంచెంకూడా పౌరుషాన్ని నీలో గమనించలేకపోతున్నావు. ఏదో మోహం నిన్ను కప్పివేసింది. అందుకే నీ మనస్సు కలతపడుతోంది. (17)
ఉద్వేపతే తే హృదయం మనస్తే ప్రతిసీధతి।
ఊరుస్తంభగృహీతోఽసి తస్మాత్ ప్రశమమిచ్ఛసి॥ 18
నీ హృదయం చలిస్తోంది. నీ మనస్సు శిథిలమవుతోంది. నీ తొడలు పట్టేశాయి. అందుకే శాంతిని/ సంధిని కోరుకొంటున్నావు. (18)
అనిత్యం కిల మర్త్యస్య పార్థ చిత్తం చలాచలమ్।
వాతవేగప్రచలితా అష్టీలా శాల్మలే రివ॥ 19
మానవుని మనస్సు చాలా చంచలమైనది. గాలికి ఊగిసలాడే బూరుగు కాయ తొడిమలాగా మనసు ఊగులాడుతూ ఉంటుంది. (19)
తవైషాం వికృతా బుద్ధిః గవాం వాగివ మానుషీ।
మనాంసి పాండుపుత్రాణాం మజ్జయత్యప్లవానివ॥ 20
గోవులు మానవుల భాష మాటాడినట్టు నీ బుద్ధి వికృతమై ఆలోచిస్తోంది. ఇది పడవలు లేకుండా సముద్రంలో మునిగిన మనుష్యుల్లాగా పాండవుల మనస్సులను ఆలోచనల్లో ముంచివేస్తోంది. (20)
ఇదం మే మహదాశ్చర్యం పర్వతస్యేవ సర్పణమ్।
యదీదృశం ప్రభాషేథాః భీమసేనాసమం వచః॥ 21
భీమసేనా! పర్వతం చలించినట్లున్న ఈ నీప్రవర్తన నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విధంగా మాట్లాడటం భీమునికి తగినది కాదు. (21)
స దృష్ట్వా స్వాని కర్మాణి కులే జన్మ చ భారత।
ఉత్తిష్ఠస్వ విషాదం మా కృథా వీర స్థిరో భవ॥ 22
వీరుడా! పూర్వం నీవు చేసిన పనులను తలచుకో. ఎటువంటి వంశంలో పుట్టావో గమనించు. విచారించవద్దు. వీరుడవై నిశ్చలంగా నీ పని నీవు చెయ్యి. (22)
న చైత దనురూపం తే యత్ తే గ్లానిరరిందమ।
యదోజసా న లభతే క్షత్రియో న తదశ్నుతే॥ 23
అరిందమా! ఇప్పుడు నీలో కనిపిస్తున్న బలహీనత నీకు తగినది కాదు. తన పరాక్రమంతో సాధించని దానిని అనుభవించటానికి క్షత్రియుడు ఇష్టపడడు. (23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భీమోత్తేజక శ్రీకృష్ణవాక్యే పంచసప్తతితమోఽధ్యాయః॥ 75 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున భీమోత్తేజక శ్రీకృష్ణవాక్యమను డెబ్బది అయిదవ అధ్యాయము. (75)