76. డెబ్బది ఆరవ అధ్యాయము
భీమసేనుని సమాధానము.
వైశంపాయన ఉవాచ
తథోక్తో వాసుదేవేన నిత్యమన్యురమర్షణః।
సదశ్వవత్ సమాధావద్ బభాషే తదనంతరమ్॥ 1
వైశంపాయనుడిట్లన్నాడు. జనమేజయా! శ్రీకృష్ణుడు ఆ విధంగా చెప్పిన తరువాత నిత్యకోపి, అసహనశీలి అయిన భీమసేనుడు మేలుజాతి గుర్రంలాగా మోరెత్తి మెల్లగా మాట్లాడనారంభించాడు. (1)
భీమసేన ఉవాచ
అన్యథా మాం చికీర్షంతమ్ అన్యథా మన్యసేఽచ్యుత।
ప్రణీత భావమత్యర్థం యుధి సత్యపరాక్రమమ్॥ 2
వేత్సి దాశార్హ సత్యం మే దీర్ఘకాలం సహోషితః।
భీమసేనుడిట్లన్నాడు - అచ్యుతా! నేను ఒకటి చెయ్యాలనుకొంటుంటే నీవు మరొకటి అనుకొంటున్నావు. దాశార్హా! ఎప్పటినుండో సన్నిహితంగా మసలుతున్నాం. నా గురించి నీకు బాగా తెలుసు. యుద్ధమంటే నాకెంతో ఇష్టం. నా పరాక్రమం కూడా డంబం మాత్రం కాదు. (2 1/2)
ఉత వా మాం న జానాసి ప్లవన్ హ్రద ఇవాప్లవే॥ 3
తస్మాదనభిరూపాభిః వాగ్భిః మాం త్వం సమర్చసి।
కాకపోతే తెప్పతోడు లేకుండా లోతైన సరస్సులో ఈదులాడేవారు దాని లోతు తెలిసికొనలేనట్లు నన్ను నీవు అర్థం చేసికొనటం లేదు. అందుకే తగని మాటలతో నన్ను ఆక్షేపిస్తున్నావు. (3 1/2)
కథం హి భీమసేనం మాం జానన్ కశ్చన మాధవ॥ 4
బ్రూయాదప్రతిరూపాణి యథా మాం వక్తుమర్హతి।
మాధవా! ఈ భీమసేనుని గురించి తెలిసిన వాడెవడైనా సరే ఇప్పుడు మాటాడుతున్నట్టు నాగురించి అను చితాలూ, అయోగ్యాలూ అయిన మాటలు పలుకగలడా? (4 1/2)
తస్మాదిదం ప్రవక్ష్యామి వచనం వృష్ణినందన॥ 5
ఆత్మనః పౌరుషం చైవ బలం చ న సమం పరైః।
కాబట్టి యదుకులనందనా! నేను నా పౌరుషాన్ని గురించీ, బలాన్ని గురించీ చెప్పవలసివస్తోంది. మరెవ్వరూ నాకు సాటిరారు. (5 1/2)
సర్వధానార్య కర్మైతత్ ప్రశంసా స్వయమాత్మనః॥ 6
అతివాదాపవిద్ధస్తు వక్ష్యామి బలమాత్మనః।
తనను తాను పొగడుకొనటం (తన గురించి తానే చెప్పుకొనటం) సర్వవిధాలా నీచమైన పనియే. కానీ నీవు నన్ను అధిక్షేపించి గాయపరిచావు కాబట్టి నా బలాన్ని నేనే చెప్పుకొనవలసివస్తోంది. (6 1/2)
పశ్యేమే రోదసీ కృష్ణ యయోరాసన్నిమాః ప్రజాః॥ 7
అచలే చాప్రతిష్ఠే చాప్యనంతే సర్వమాతరౌ।
కృష్ణా! నేలనూ, నింగినీ చూడు. ఈ ప్రజలందరూ వాటిమధ్యనే జీవిస్తున్నారు. అది అందరకూ తల్లిదండ్రుల వంటివి. అవి కదలనివి, అంతులేనివి, నిరాధారమైనవి కూడా. (7 1/2)
యదీమే సహసా క్రుద్ధే సమేయాతాం శిలే ఇవ॥ 8
అహమేతే నిగృహ్ణీయాం బాహుభ్యాం సచరాచరే।
ఒకవేళ ఈ నేలా, నింగీ కోపించి శిలలలాగా సంఘర్షించటం ప్రారంభిస్తే నేను చరాచర ప్రాణులతో సహా ఆ రెండింటిని నా చేతులతో నిలువరించగలను. (8 1/2)
పశ్యైతదంతరం బాహ్వోః మహాపరిఘయోరివ॥ 9
య ఏతత్ ప్రాప్య ముచ్యేత న తం పశ్యామి పూరుషమ్।
పెద్ద గడియలలాగా కనిపిస్తున్న నా బాహువుల మధ్య నున్న ఎడం గమనించు. వాటి మధ్యకు వచ్చి ప్రాణాలతో బయట పడగల వీరుడెవ్వడూ నా దృష్టికి రాలేదు. (9 1/2)
హిమవాంశ్చ సముద్రశ్చ వజ్రీ వా బలభిత్ స్వయమ్।
మయాభిపన్నం త్రాయేరన్ బలమాస్థాయ న త్రయః।
హిమవంతుడూ, సముద్రుడూ, వజ్రధారియయిన ఇంద్రుడీ ముగ్గురూ తమ బలాలను సమీకరించుకొని వచ్చినా నాకు చిక్కినవాడిని కాపాడలేరు. (10 1/2)
యుద్ధార్హాన్ క్షత్రియాన్ సర్వాన్ పాండవేష్వాతతాయినః॥ 11
అథః పాదతలేనైతాన్ అధిష్ఠాస్యామి భూతలే।
పాండవులకు ద్రోహంచేసి యుద్ధానికి ఎత్తి వచ్చిన సమస్త క్షత్రియులనూ క్రింద పడవేసి నా అరికాళ్ళతో భూమిలోనికి త్రొక్కివేయగలను. (11 1/2)
న హి త్వం నాభిజానాసి మమ విక్రమమచ్యుత॥ 12
యథా మయా వినిర్జిత్య రాజానో వశగాః కృతాః।
అచ్యుతా! నేను రాజులను ఓడించి లొంగ దీసుకొన్న విషయం, ఆ పరాక్రమం, ఆ పరాక్రమం నీకు తెలియనిది కాదు కదా!(12 1/2)
అథ చేన్మాం న జానాసి సూర్యస్యేవోద్యతః ప్రభామ్॥ 13
విగాఢే యుధి సంబంధే వేత్స్యసే మాం జనార్దన।
జనార్దనా! ఒకవేళ నా పరాక్రమం నీకు తెలియకపోతే భీకరంగా శత్రువులను మట్టుబెట్టే యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉదయించే సూర్యతేజస్సు వంటి నా పరాక్రమాన్ని తెలిసికొనగలుగుతావు. (13 1/2)
పరుషైరాక్షిపసి కిం వ్రణం పూతిమివోన్నయన్॥ 14
గాయాన్ని కెలికినట్టు నీ పరుష వాక్యాలతో నన్ను ఆక్షేపిస్తున్నావా? (14)
యథామితి బ్రవీమ్యేతద్ విద్ధి మామధికం తతః।
ద్రష్టాసి యుధి సంబాధే ప్రవృత్తే వైశసేఽహని॥ 15
ఇప్పుడు నా బుద్ధికి తోచినట్టు చెప్తున్నాను. వాస్తవంగా అంతకన్న ఎక్కువగానే నన్ను భావించుకో. భీకరమైన యుద్ధం జరుగుతుంటే అందరినీ నరికివేసే రోజు నేనంటే ఏమిటో చూడగలవు. (15)
మయా ప్రణున్నాన్ మాతంగాన్ రథినః సాదినస్తథా।
తథా నరానభీక్రుద్ధం నిఘ్నంతం క్షత్రియర్షభాన్॥ 16
ద్రష్టా మాం త్వం చ లోకశ్చ వికర్షంతం వరాన్ వరాన్।
భీకర యుద్ధంలో క్రోధంతో నేను ఏనుగులనూ, రథికులనూ, ఆశ్వికులనూ, క్షత్రియ శ్రేష్ఠులయిన నరులనూ, ఎగరగొట్టి క్రిందపడవేసి ఏరి ఏరి గొప్పవారినందరినీ సంహరించటం నీవూ, ఈ ప్రజలూ కూడా చూస్తారు. (16 1/2)
న మే సీదంతి మజ్జానః న మమోద్వేపతే మనః॥ 17
సర్వలోకాదభిక్రుద్ధాత్ న భయం విద్యతే మమ।
కిం తు సౌహృదమే వైతత్ కృపయా మధుసూదన।
సర్వాంస్తితిక్షే సంక్లేశాన్ మా స్మ నో భరతా నశన్॥ 18
నా ఎముకలసారం తరిగిపోవటమూ లేదు. నా మనస్సూ చలించటం లేదు. లోకమంతా కోపంతో చుట్టుముట్టినా నాకు భయంలేదు. కానీ మధుసూదనా! నేను శాంతిని గురించి మాట్లాడటం నా మంచితనానికి సంబంధించినది. దయతో సమస్తక్లేశాలనూ సహించగలను. మా కారణంగా భరతవంశవినాశనం జరుగకూడదు. (17,18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భీమసేనవాక్యే షట్ సప్తతితమోఽధ్యాయః॥ 76 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున భీమసేనవాక్యమను డెబ్బది ఆరవ అధ్యాయము. (76)