78. డెబ్బది ఎనిమిదవ అధ్యాయము
అర్జునుని మాటలు.
అర్జున ఉవాచ
ఉక్తం యుధిష్ఠిరేణైవ యావద్ వాచ్యం జనార్దన।
తవ వాక్యం తు మే శ్రుత్వా ప్రతిభాతి పరంతప॥ 1
నైవ ప్రశమమత్ర త్వం మన్యసే సుకరం ప్రభో।
లోభాద్ వా ధృతరాష్ట్రస్య దైన్యాద్ వా సముపస్థితాత్॥ 2
అర్జునుడిలా అంటున్నాడు. జనార్దనా నేను చెప్పవలసిన విషయమంతా ధర్మరాజే చెప్పాడు. పరంతపా! నీ మాటలు విన్న తరువాత ధృతరాష్ట్రుని లోభం, మా దీనస్థితి చూసి సంధి సాధ్యం కాదని నీవు అనుకొంటున్నట్లు నాకు అనిపిస్తోంది. (1,2)
అఫలం మన్యసే వాపి పురుషస్య పరాక్రమమ్।
న చాంతరేణ కర్మాణి పౌరుషేణ ఫలోదయః॥ 3
పురుషుని యొక్క పరాక్రమం నిష్ఫలం అని నీ భావన. పూర్వం చేసుకున్న కర్మలు లేకుండా కేవలం పౌరుషం వల్ల ఫలం లభించదని నీ ఊహ. (3)
తదిదం భాషితం వాక్యం తథా చ న తథైవ తత్।
న చైతదేవం ద్రష్టవ్యం అసాధ్యమపి కించన॥ 4
నీవన్న మాట (నేను యుద్ధంకోరటం లేదు అనేది కాదు) కూడ అటువంటిదే - అయినా శాంతిని సాధించటం నీకు కష్టం కాదు అని నాకు తోస్తోంది. (4)
కిం చైతన్మన్యసే కృచ్ఛ్రమ్ అస్మాక మవసాదకమ్।
కుర్వంతి తేషాం కర్మాణి యేషాం నాస్తి ఫలోదయః॥ 5
మేమంతా నశించిపోయే యుద్ధమనే సంకటం నీవు అంగీకరిస్తావా? ఏ ఫలితాన్నీ సాధించని మానవుల కర్మములు హింసించేవే అవుతాయి కదా. (5)
సంపాద్యమానం సమ్యక్ చ స్యాత్ కర్మ సఫలం ప్రభో।
స తథా కృష్ణ వర్తస్వ యథా శర్మ భవేత్ పరైః॥ 6
ప్రభూ! చక్కగా చేశిన ఏ పని అయినా సఫలమవుతుంది. కృష్ణా! శత్రువులతో మాకు సంధి జరగటానికి అనుకూలంగానే నీవు ప్రయత్నం చేయాలి. (6)
పాండవానాం కురూణాం చ భవాన్ నః ప్రథమః సుహృత్।
సురాణామసురాణాం చ యథా వీర ప్రజాపతిః॥ 7
వీరా! దేవతలకూ, రాక్షసులకూ కూడా బ్రహ్మ శ్రేయోభిలాషి అయిన విధంగా పాండవులకూ, కౌరవులకూ కూడా నీవే మొదటి మిత్రుడివి. (7)
కురూణాం పాండవానాం చ ప్రతిపత్స్య నిరామయమ్।
అస్మద్ధితమనుష్ఠానం మన్యే తవ న దుష్కరమ్॥ 8
కౌరవులకూ, పాండవులకూ కూడా బాధలు తొలగిపోయేటట్లుగా నీవు ప్రయత్నించి. మాకు మేలు చేయటం నీకు కష్టం కాదని నేను అనుకొంటున్నాను. (8)
ఏవం చ కార్యతామేతి కార్యం తవ జనార్దన।
గమనాదేవమేవ త్వం కరిష్యసి జనార్దన॥ 9
జనార్దనా! ఈ విధంగా చేసినప్పుడే నీవు చేసినట్లవుతుంది. కాబట్టి ఇదే నీ ప్రధాన కర్తవ్యం. నీవు అక్కడకు వెళ్లితే చాలు, కార్యం సఫలమయినట్టే. (9)
చికీర్షితమథాన్యత్ తే తస్మిన్ వీర దురాత్మని।
భవిష్యతి చ తత్ సర్వం యథా తవ చికీర్షితమ్॥ 10
వీరా! ఒకవేళ దుర్మార్గుడయిన ఆ దుర్యోధనుని విషయంలో నీవు మరో విధంగా చేయదలచుకొంటే కార్యమంతా అలాగే జరుగుతుంది. (10)
శర్మ తైః సహ వా నోఽస్తు తవ వా యచ్చికీర్షితమ్।
విచార్యమాణో యః కామః తవ కృష్ణ స నో గురుః।
న స నార్హతి దుష్టాత్మా వధం ససుతబాంధవః॥ 11
యేన ధర్మసుతే దృష్టా న సా శ్రీరుపమర్షితా।
యచ్చాప్యపశ్యతోపాయం ధర్మిష్ఠం మధుసూదన॥ 12
ఉపాయేన నృశంసేన హృతా దుర్ద్యూతదేవినా।
కృష్ణా! కౌరవులతో మాకు సంధి జరగవచ్చు లేదా నీకోరిక మేరకే జరుగవచ్చు. బాగా ఆలోచించి చూస్తే నీ కోరికయే మాకు శిరోధార్యం. ధర్మరాజు సాధించుకొన్న సంపదలను చూచి సహించలేకపోయిన ఆ దుష్టుడు - దుర్యోధనుడు కొడుకులు బంధువులతో సహా చంపదగినవాడే.
మధుసూదనా! అంతేకాదు. ధర్మబద్ధమైన మరే మార్గంలోనూ మా సంపదలను కొల్లగొట్టటం చేతకాని ఆ క్రూరుడు - దుర్యోధనుడు కపటద్యూతంలో మా సంపదలను అపహరించాడు. (11, 12 1/2)
కథం హి పురుషో జాతః క్షత్రియేషు ధనుర్ధరః॥ 13
సమాహూతో నివర్తేత ప్రాణత్యాగే ఽప్యుపస్థితే।
క్షత్రియవంశంలో పుట్టి, విల్లు చేతబట్టిన తరువాత ప్రాణాలు పోయేటట్లున్నా సరే, ఎవరయినా పిలిస్తే యుద్ధానికి సిద్ధపడకుండా మరలిపోగలుగుతారా? (13 1/2)
అధర్మేణ జితాన్ దృష్ట్వా వనే ప్రవ్రజితాంస్తథా॥ 14
వధ్యతాం మమ వార్ష్ణేయ నిర్గతోఽసౌ సుయోధనః।
వృష్ణికులనందనా! ఆధర్మమార్గంలో మమ్ములను ఓడించి ఆవిధంగా అరణ్యాలకు పంపించిన రోజే సుయోధనుడు నేను చంపదగినవాడయినాడు.(నాకోపానికి లక్ష్యమయ్యాడు).(14 1/2)
న చైతదద్భుతం కృష్ణ మిత్రార్థే యచ్చికీర్షసి।
క్రియా కథం చ ముఖ్యా స్యాత్ మృదునా చేతరేణ వా॥ 15
కృష్ణా! నీ మిత్రులమైన మాకోసం ఏదో చేయాలని నీవు భావించటం ఆశ్చర్యకరమేమీ కాదు. నీవు సాధించి తీరాలను సంకల్పించితే (సాధకమైన) ఆ క్రియ మృదువైనా ఫరవాలేదు, కఠినమైన ఫరవాలేదు. (15)
అథవా మన్యసే జ్యాయాన్ వథస్తేషామనంతరమ్।
తదేవ క్రియతామాళు న విచార్యమతస్త్వయా॥ 16
ఒకవేళ కౌరవ సంహారమే తక్షణ కర్తవ్యమని నీవు భావిస్తే వెంటనే దానికి తగినరీతిగానే చెయ్యి. అది తప్ప మరే మాటను గురించి ఆలోచింపనవసరం లేదు. (16)
జానాసి హి యథైతేన ద్రౌపదీ పాపబుద్ధినా।
పరిక్లిష్టా సభామధ్యే తచ్చ తస్యోపమర్షితమ్॥ 17
నీకు తెలుసుగదా! పాపాత్ముడైన ఆ దుర్యోధనుడు కొలువుకూటంలో ద్రౌపదిని ఎంత కష్టపెట్టాడో! దానిని కూడా మేము సహించి మిన్నకుండి పోయాము. (17)
స నామ సమ్యగ్ వర్తేత పాండవేష్వితి మాధవ।
న మే సంజాయతే బుద్ధిః బీజ ముప్తామివోషరే॥ 18
మాధవా! ఆ సుయోధనుడు పాండవులతో చక్కగా ప్రవర్తిస్తాడని నాకనిపించటంలేదు. అలా ఆశ పడటం చవిటినేలలో విత్తనాలను నాటడం వంటిదే. (18)
తస్మాద్ యన్మన్యసే యుక్తం పాండవానాం హితం చ యత్।
తథాఽఽశు కురు వార్ష్ణేయ యన్నః కార్యమనంతరమ్॥ 19
వృష్ణివంశనందనా! పాండవులకు తగినదనీ, మేలు చేయదగినదనీ నివు దేనిని భావిస్తే దానినే వెంటనే చేయవలసినది. మా తక్షణ కర్తవ్యంగా దానినే నిర్ణయించు (19)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అర్జున వాక్యేఽష్టసప్తతితమోఽధ్యాయః॥ 78 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున అర్జునవాక్యమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము. (78)