79. డెబ్బది తొమ్మిదవ అధ్యాయము

శ్రీకృష్ణుడు అర్జునునకు ప్రత్యుత్తరమిచ్చుట.

శ్రీభగవానువాచ
ఏవమేతన్మహాబాహో యథా వదసి పాంఢవ।
పాండవానాం కురూణాం చ ప్రతిపత్స్యే విరామయమ్॥ 1
శ్రీకృష్ణుడిలా అన్నాడు - మహాబాహుడవైన అర్జునా! నీవు చెప్పినట్లు చేయటం సముచితమే. పాండవులూ, కౌరవులూ ఇద్దరూ సుఖంగా ఉండేటట్లు ప్రయత్నం చేస్తాను. (1)
సర్వం త్విదం మమాయత్తం బీభత్సో కర్మణోర్ద్వయోః।
క్షేత్రం హి రసవచ్ఛుద్ధం కర్మణైవోపపాదితమ్॥ 2
ఋతే వర్షాన్న కౌంతేయ జాతు నిర్వర్తయేత్ ఫలమ్।
అర్జునా! శాంతి - యుద్ధం రెండింటిలో తగినదానిని భావించి చేయవలసిన భారాన్ని అంతా నా మీదనే ఉంచావు. అయినా కౌంతేయా! పొలాన్ని దున్ని, పదునుచేసి, నీటితో తడిపినా ఒక్కొక్కసారి వాన లేకపోతే సరిగా ఫలించదు. (2 1/2)
వి॥సం॥ ఇక్కడ రెండు కర్మలంటే శాంతి - యుద్ధము (నీల)
హితాహితములు (అర్జు) పూర్వజన్మ - ఈ జన్మలలోనివి(సర్వ)
తత్ర వై పౌరుషం బ్రూయుః ఆసేకం యత్ర కారితమ్।
తత్ర చాపి ధ్రువం పశ్యేత్ శోషణం దైవకారితమ్।
పొలాన్ని దున్ని పదును చేయటం మొదలయిన పని పురుషప్రయత్నం. అయితే దైవికంగా ఎండిపోతోంది. అది స్పష్టంగా కనిపిస్తోంది. (3 1/2)
తదిదం నిశ్చితం బుద్ధ్యా పూర్వైరపి మహాత్మభిః॥ 4
దైవే చ మానుషే చైవ సంయుక్తం లోకకారణమ్।
అందుకే ప్రాచీనకాలంలోని మహాత్ములంతా లోకహిత సాధనం దైవపురుషార్థాల రెండింటి మీదా ఆధారపడి ఉంటుందని తమ బుద్ధితో నిశ్చయించారు. (4 1/2)
అహం హి తత్ కరిష్యామి పరం పురుషకారతః॥ 5
దైవం తు న మయా శక్యం కర్మ కర్తుం కథంచన।
పురుష ప్రయత్నంగా నేను చేయగలిగినదంతా చేస్తాను. కానీ దైవికమైన ప్రారబ్ధఫలాన్ని నేను ఏ రీతిగానూ చేయలేను. ఫలితాన్ని కల్పించటం కానీ, మార్పు చేయటం కానీ నావల్లకాదు. (5 1/2)
స హి ధర్మం చ లోకం చ త్యక్త్వా చరతి దుర్మతి॥ 6
న హి సంతప్యతే తేన తథారూపేణ కర్మణా।
దుర్మతి అయిన ఆ సుయోధనుడు ధర్మాన్ని, లోకాచారాన్ని విడిచి ప్రవర్తిస్తుంటాడు. ఆ విధంగా ధర్మసదాచారాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ కూడా ఎప్పుడూ బాధపడకు. (6 1/2)
తథాపి బుద్ధిం పాపిష్ఠాం వర్ధయంత్యస్య మంత్రిణః॥ 7
శకునిః సూతపుత్రశ్చ భ్రాతా దుఃశాసన స్తథా।
అటువంటి స్థితిలో కూడా సుయోధనునకు మంత్రులైన శకునీ, కర్ణుడు, సోదరుడైన దుశ్శాసనుడు ఆయనలో చెడు తలపులను పెంచుతూనే ఉంటారు. (7 1/2)
స హి త్యాగేన రాజ్యస్య న శమం సముపైష్యతి॥ 8
అంతరేణ వధం పార్థ సానుబంధః సుయోధనః।
పార్థా! ఆ సుయోధనుడు తన సహచరులు అందరితో సహా చంపబడే దాకా రాజ్యభాగాన్ని ఇచ్చి సంధి చేసికొనడు. (8 1/2)
న చాపి ప్రణిపాతేన త్యక్తుమిచ్ఛతి ధర్మరాట్।
యాచ్యమానశ్చ రాజ్యం స న ప్రదాస్యతి దుర్మతిః॥ 9
వినయపూర్వకంగా లొంగిపోయినా రాజ్యాన్ని విడువటానికి యుధిష్ఠిరుడు కూడా అంగీకరించడు. దుర్బుద్ధి అయిన ఆ సుయోధనుడు మనం యాచించినంత మాత్రాన రాజ్యాన్ని ఇవ్వడు. (9)
న తు మన్యే స తద్ వాచ్యః యద్ యుధిష్ఠిర శాసనమ్।
ఉక్తం ప్రయోజనం యత్ తు ధర్మరాజేన భారత॥ 10
తథా పాపస్తు తత్ సర్వం న కరిష్యతి కౌరవః।
తస్మింశ్చాక్రియమాణేఽసౌ లోకే వధ్యో భవిష్యతి॥ 11
భారతా! కేవలం అయిది ఊళ్ళు ఇస్తే చాలునని చెప్పమనీ, వినయపూర్వకంగా సంధిని గురించి ప్రస్తావించమనీ ధర్మరాజు చెప్పిన మాటలను సుయోధనునితో చెప్పటం మంచిది కాదని నాకనిపిస్తోంది. పాపాత్ముడైన ఆ సుయోధనుడు ఆ మాటలను బొత్తిగా లెక్కచేయడు. మన ప్రతిపాదనను అంగీకరించనందువలన ఆయన చంపదగినవాడని లోకం కూడా భావిస్తుంది.(10,11)
మమ చాపి స వధ్యో హి జగతశ్చాపి భారత।
యేన కౌమారకే యూయం సర్వే విప్రకృతాః సదా॥ 12
విప్రలుస్తం చ వో రాజ్యం నృశంసేన దురాత్మనా।
న చోపశామ్యతే పాపః శ్రియం దృష్ట్వా యుధిష్ఠిరే॥ 13
భారతా! చిన్నవాడు ఎప్పుడూ మిమ్ములను అందరమూ బాధించి, దురాత్ముడై, క్రూరుడై మీ రాజ్యాన్ని అపహరించాడు. ధర్మరాజు సంపదలను చూచి సహించలేని ఆ పాపాత్ముడు - సుయోధనుడు చంపదగిన వాడని నాకే కాదు లోకానికంతకూ అనిపిస్తోంది. (12,13)
అసకృచ్చాప్యహం తేన త్వత్కృతే పార్థ భేదితః।
న మయా తద్ గృహీతం చ పాపం తస్య చికీర్షితమ్॥ 14
పార్థా! నన్ను కూడా మీనుండి దూరం చేయాలని ఆ సుయోధనుడు ఎన్నోసార్లు ప్రయత్నించాడు. అయితే నేను పాపపంకిలమైన ఆ సుయోధనుని కోరికను అంగీకరించలేదు. (14)
జానాసి హి మహాబాహో త్వమప్యస్య పరం మతమ్।
ప్రియం చికీర్షమాణం చ ధర్మరాజస్య మామపి॥ 15
మహాబాహూ! నేను ధర్మరాజుకు మేలు చేకూర్చటానికే ఇష్టపడుతున్నట్టు ఆ సుయోధనుడు గట్టిగా అభిప్రాయపడుతున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. (15)
సంజానంస్తస్య చాత్మానం మమ చైవ పరం మతమ్।
అజానన్నివ మాం కస్మాత్ అర్జునాద్యాభిశంకసే॥ 16
అర్జునా! ఆ సుయోధనుని అభిప్రాయం నా నిర్ణయం తెలిసికూడా, తెలియనివాడిలాగా నేడు నన్ను నీవు అనుమానిస్తున్నావెందుకు? (16)
యచ్చాపి పరమం దివ్యం తచ్చాప్యనుగతం త్వయా।
విధానం విహితం పార్థ కథం శర్మ భవేత్ పరైః॥ 17
పార్థా! పరమమూ, నిత్యమూ అయిన దేవతల విధాన నిర్ణయం కూడా నీకు తెలుసు. ఇక శత్రువులతో సంధి జరుగుతుందని ఎలా అనుకొంటున్నావు. (17)
యత్ తు వాచా మయా శక్యం కర్మణా వాపి పాండవ।
కరిష్యే తదహం పార్థ న త్వాశంసే శమం పరైః॥ 18
పాండవా! నా మాటలతో, నా చేతులతో నేను చేయగలిగినదంతా చేస్తాను. కానీ శత్రువులతో సంధి జరుగుతుందని మాత్రం అనుకోవటం లేదు. (18)
కథం గోహరణే హ్యుక్తః నైతచ్ఛర్మ తథా హితమ్।
యాచ్యమానో హి భీష్మేణ సంవత్సర గతే ఽధ్వని॥ 19
మీరు సంవత్సరకాలం అజ్ఞాతవాసం ముగించిన తర్వాత గీహరణ సందర్భంలో మార్గమధ్యంలో భీష్ముడు మీ రాజ్యాన్ని మీకిమ్మని సుయోధనుని యాచించాడు. అయినా శుభకరం, హితకరం అయిన ఆ అభ్యర్థనను సుయోధనుడు పట్టించుకొనలేదు. (19)
తదైవ తే పరాభూతా యదా సంకల్పితాస్త్వయా।
లవశః క్షణశశ్చాపి న చ తుష్టః సుయోధనః॥ 20
కౌరవులను ఓడించాలని నీవు సంకల్పించినప్పుడే కౌరవులు ఓడిపోయినట్లు, సుయోధనుడు క్షణకాలమైనా కొంచెమైన ఆనందాన్ని కూడా పొందలేదు. (20)
సర్వథా తు మయా కార్యం ధర్మరాజస్య శాసనమ్।
విభావ్యం తస్య భూయశ్చ కర్మ పాపం దురాత్మనః॥ 21
ధర్మరాజు ఆదేశాన్ని నేను సర్వవిధాల మన్నించాలి. (సంధి విఫలమయితే) దుర్మార్గుడైన ఆ సుయోధనుని పాపకర్మలకు తగిన శిక్షను కూడా ఆలోచించాలి. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి శ్రీకృష్ణవాక్యే ఏకోనాశీతితమోఽధ్యాయః॥ 79 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణవాక్యమను డెబ్బది తొమ్మిదవ అధ్యాయము. (79)