84. ఎనుబది నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు హస్తినకు చేరి విశ్రమించుట.

వైశంపాయన ఉవాచ
ప్రయాంతం దేవకీపుత్రం పరవీరరుజో దశ।
మహారథా మహాబాహుమ్ అన్వయుః శస్త్రపాణయః॥ 1
పదాతీనాం సహస్రం చ సాదినాం చ పరంతప।
భోజ్యం చ విపులం రాజన్ ప్రేష్యాశ్చ శతశోఽపరే॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - పరంతపా! దేవకీసుతుడు ప్రయాణమైన సమయంలో శత్రువీరులను పీడించగల మహారథులు మహాబాహువులు పదిమందీ, సైనికులు వేయిమందీ, అశ్వికులు వేయిమందీ, ఆయుధాలు ధరించి అనుసరించారు. విస్తారమైన భోజన సామగ్రి, వందల కొలదీ పరిచారకులు కూడా వెంటవచ్చారు. (1-2)
జనమేజయ ఉవాచ
కథం ప్రయాతో దాశార్హః మహాత్మా మధుసూదనః।
కాని వా వ్రజతస్తస్య నిమిత్తాని మహౌజసః॥
జనమేజయుడిలా అన్నాడు. దాశార్హుడు, మహాత్ముడూ అయిన మధుసూదనుడు ఎలా బయలు దేరాడు? ప్రయాణవేళలో ఆ తేజోమూర్తికి ఏఏ శకునాలు ఎదురయ్యాయి? (3)
వైశంపాయన ఉవాచ
తస్య ప్రయాణే యాన్యాసన్ నిమిత్తాని మహాత్మనః।
తాని మే శృణు సర్వాణి దైవాన్యౌత్పాతకాని చ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు - ఆ మహాత్ముని ప్రయాణకాలంలో ఎదురైన శుభాశుభశకునాలను చెప్తాను విను.
వి॥తె॥ దైవములనగా శకునాలు - ఔత్పాతికములనగా అపశకునాలు.
అనభ్రేశనినిర్ఘోష సవిద్యుత్ సమజాయత।
అనవ్గేవ చ పర్జన్యః ప్రావర్షద్ విఘనే భృశమ్॥ 5
మేఘాలు లేకపోయినా ఆకాశంలో మెరుపుతో కూడిన పిడిగుపాటు చప్పుడు వినిపించింది. వెంటనే మేఘాలు లేకపోయినా పర్జన్యుడు వాన కురిపించాడు. (5)
ప్రత్యగూహుర్మహానద్యః ప్రాఙ్ ముఖాః సింధుసప్తమాః।
విపరీతాః దిశః సర్వాః న ప్రాజ్ఞాయత కించన॥ 6
తూర్పుదిక్కుగా ప్రవహిస్తున్న సింధువు మొదలయిన ఏడు నదులు ప్రవాహదిశను మార్చుకొని పడమటివైపునకు ప్రవహించాయి. దిక్కులన్నీ విపరీతమై దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. (6)
ప్రాజ్వలన్నగ్నయో రాజన్ పృథివీ సమకంపత।
ఉదపానాశ్చ కుంభాశ్చ ప్రాసించన్ శతశో జలమ్॥ 7
రాజా! అంతటా మంటలు చెలరేగాయి. భూమి కంపించింది. వందలకొలది జలాశయాలు, కలశాలు నీటిని క్రుమ్మరించసాగాయి. (7)
తమః సంవృతతమప్యాసీత్ సర్వం జగదిదం తథా।
న దిశో నాదిశో రాజన్ ప్రజ్ఞాయంతే స్మ రేణునా॥ 8
రాజా! విశ్వమంతా చీకటి క్రమ్మింది. ధూళితో దిక్కులు, మూలలూ తెలియకుండా పోయాయి. (8)
ప్రాదురాసీన్మహాన్ శబ్దః ఖే శరీరమదృశ్యత।
సర్వేషు రాజన్ దేశేషు తదద్భుతమివాభవత్॥ 9
రాజా! పెద్దపెద్ద ధ్వనులు వినిపించసాగాయి. ఆకాశంలో మానవాకృతులు కనిపిస్తున్నాయి. అన్ని ప్రదేశాలలో అది ఆస్చర్యకరమవుతుంది. (9)
ప్రామథ్నాద్దాస్తినపురం వాతో దక్షిణపశ్చిమః।
ఆరుజన్ గణశో వృక్షాన్ పరుషోఽశని నిస్వనః॥ 10
నైరుతి వైపునుండి వీచినగాలి హస్తినాపురాన్ని కలచివేసింది. అది కుప్పలు కుప్పలుగా చెట్లను కూల్చివేసింది. పరుషంగా పిడుగుపాటుగా చప్పుడు వినిపించింది. (10)
యత్ర యత్ర చ వార్ష్ణేయః వర్తతే పథి భారత।
తత్ర తత్ర సుఖో వాయుః సర్వం చాసీత్ ప్రదక్షిణమ్॥ 11
శ్రీకృష్ణుడు సంచరిస్తున్న ప్రాంతంలో మాత్రం గాలి సుఖకరంగా ఉన్నది. అన్ని శకునాలూ దక్షిణదిశగా ఏర్పడుతూ అనుకూలంగా నిలిచాయి. (11)
వవర్ష పుష్పవర్షం చ కమలాని చ భూరిశః।
సమశ్చ పన్థాః నిర్దుఃఖః వ్యపేతకుశకంటకః॥ 12
పుష్పవృష్టి కురిసింది మిక్కిలిగా తామరలు కురిశాయి. బాట దర్భలు, ముళ్ళు లేనిదై సమతులమై సుఖకరంగా ఉన్నది. (12)
సంస్తుతో బ్రాహ్మణైర్గీర్భిః తత్ర తత్ర సహస్రశః।
అర్చ్యతే మధుపర్కైశ్చ వసుభిశ్చ వసుప్రదః॥ 13
వేలకొలదిగ బ్రాహ్మణులు అక్కడక్కడ నిలిచి శ్రీకృష్ణుని స్తుతిస్తున్నారు. మధుపర్కాలతో పూజిస్తున్నారు. ధనసత్కృతుడై శ్రీకృష్ణుడు వారికి ధనాన్ని ఇచ్చాడు. (13)
తం కిరంతి మహాత్మానం వన్యైః పుష్పైః సుగంధిభిః।
స్త్రియః పథి సమాగమ్య సర్వభుతహితే రత్మ్॥ 14
స్త్రీలు మార్గంలో గుమిగూడి సర్వభూత హితాన్ని కోరే ఆ మహాత్ములైన పరిమళభరితమైన వనపుష్పాలను చల్లారు. (14)
స శాలిభవనం రమ్యం సర్వసస్యసమాచితమ్।
సుఖం పరమధర్మిష్ఠమ్ అభ్యగాద్ భరతర్షభ॥ 15
భరతశ్రేష్ఠా! ఆ శ్రీకృష్ణుడు ధర్మకార్యాలకు ఉపయోగపడే సర్వసస్యాలతో నిండిన పంటపొలాలను చూస్తూ హాయిగా ప్రయాణించాడు. (15)
పశ్యన్ బహుపశూన్ గ్రామాన్ రమ్యాన్ హృదయతోషణాన్।
పురాణి చ వ్యతిక్రామన్ రాష్ట్రాణి వివిధాని చ॥ 16
పశుసంపదగలిగి రమణీయమై మనస్సున కానందాన్ని కల్గిస్తున్న అనేక గ్రామాలను నగరాలను వివిధరాష్ట్రాలనూ గమనిస్తూ ముందుకు పోయాడు. (16)
నిత్యం హృష్టాః సుమనసః భారతైరభిరక్షితాః।
నోద్విగ్నాః పరచక్రాణాం వ్యసనానామకోవిదాః॥ 17
ఉపప్లవ్యాదథాయాంతం జనాః పురనివాసినః।
పథ్యతిష్ఠంత సహితాః విష్వక్సేనదిదృక్షయా॥ 18
ఉపప్లవ్యం నుండి వస్తున్న శ్రీకృష్ణుని చూడాలన్న కోరికతో నగరవాసులంతా గుమిగూడి దారిలో నిలిచారు. వీరు భరతవంశస్థుల రక్షణలో ఎల్లప్పుడూ ఆనందంగా జీవిస్తున్నవారు మంచివారు. శత్రుసేనలను చూచి భయపడనవసరం లేనివారు. బాధలంటే తెలియనివారు. (17-18)
తే తు సర్వే సమాయాంతమ్ అగ్నిమిద్ధమివ ప్రభుమ్।
అర్చయామాసురర్చార్హం దేశాతిథిముపస్థితమ్॥ 19
వారంతా మండుతున్న అగ్నివలె తేజోమూర్తి అయి తమ దేశానికి అతిథిగా వస్తున్న, పూజనీయుడైన ఆ శ్రీకృష్ణుని పూజించారు. (19)
వృకస్థలం సమాసాద్య కేశవః పరవీరహా।
ప్రకీర్ణరశ్మావాదిత్యే వ్యోమ్ని వై లోహితాయతి॥ 20
అవతీర్య రథాత్ తూర్ణం కృత్వా శౌచం యథావిధి।
రథమోచనమాదిశ్య సంధ్యాముపవివేశ హ॥ 21
శత్రుసంహారకుడు అయిన ఆ శ్రీకృష్ణుడు హస్తినను సమీపించి, సంధ్యాకాలంలో రథం నుండి దిగి, గుఱ్ఱాలను విప్పమని ఆదేశించి యథావిధిగా శుచియై సంధ్యోపాసన చేశాడు. (20-21)
దారుకోఽపి హయాన్ ముక్త్వా పరిచర్య చ శాస్త్రతః।
ముమోచ సర్వయోక్త్రాది ముక్త్వా చైతా నవాసృజత్॥ 22
దారుకుడు కూడా గుఱ్ఱాలను విడిపించి, యథావిధిగా వాటికి పరిచర్యలు చేసి కళ్ళెం మొదలయిన వాటిని ఊడదీసి వాటిని వదిలివేశాడు. (22)
అభ్యతీత్య తు తత్సర్వమ్ ఉవాచ మధుసూదనః।
యుధిష్ఠిరస్య కార్యార్థమ్ ఇహ వత్స్యామహే క్షపామ్॥ 23
శ్రీకృష్ణుడు సంధ్యావందనాది కార్యాలను ముగించి "యుధిష్ఠిరుని కార్యసిద్ధికై ఈ రాత్రి ఇక్కడే విడిది చేద్దామని" పలికాడు. (23)
తస్య తన్మతమాజ్ఞాయ చక్రురావసథం నరాః।
క్షణేన చాన్నపానాని గుణవంతి సమార్జయన్॥ 24
శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని గమనించి సేవకులు అక్కడే శిబిరం ఏర్పాటు చేశారు. క్షణకాలంలో మధురమైన అన్నపానాదులను సమకూర్చారు.(24)
తస్మిన్ గ్రామే ప్రధానాస్తు య ఆసన్ బ్రాహ్మణా నృప।
ఆర్యాః కులీనా హ్రీమంతః బ్రాహ్మీం వృత్తిమనుష్ఠితాః॥ 25
రాజా! ఆ గ్రామంలోని ప్రముఖ బ్రాహ్మణులందరూ పూజ్యులు, కులీనులు, బిడియపడేవారు, బ్రాహ్మణోచితమైన వృత్తి నాశ్రయించినవారు. (25)
తేఽభిగమ్య మహాత్మానం హృషీకేశమరిందమమ్।
పూజాం చక్రుర్యథాన్యాయమ్ ఆశీర్మంగలసంయుతామ్॥ 26
వారు అరిందముడూ, మహాత్ముడూ అయిన శ్రీకృష్ణుని సమీపించి ఆశీర్వాదాలతో మంగళ పాఠలతో యథోచితంగా ఆయనను అర్చించారు. (26)
తే పూజయిత్వా దాశార్హం సర్వలోకేషు పూజితమ్।
న్యవేదయంత వేశ్మాని రత్నవంతి మహాత్మనే॥ 27
సర్వలోక పూజితుడైన శ్రీకృష్ణుని పూజించి ఆ బ్రాహ్మణులు రత్నసంపన్నాలైన తమ నివాసగృహాలను ఆ మహాత్మునకు విడిదిగా నివేదించారు. (27)
తాన్ ప్రభుః కృతమిత్యుక్త్వా సత్కృత్య చ యథార్హతః।
అభ్యేత్య చైషాం వేశ్మాని పునరాయాత్ సహైవ తైః॥ 28
అప్పుడు శ్రీకృష్ణుడు వారి మాటలే చాలునని వారితో అని వారి ఆనందంకోసం వారి ఇండ్లకుపోయి మరలా వారితో కూడా తిరిగి వచ్చాడు. (28)
సుమృష్టం భోజయిత్వా చ బ్రాహ్మణాంస్తత్ర కేశవ।
భుక్త్వా చ సహ తైః సర్వైః అవసత్ తాం క్షపాం సుఖమ్॥ 29
అక్కడ శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణులకు మృష్టాన్నాలను పెట్టి, వారితో కూడా తానూ భుజించి, ఆ రాత్రి సుఖంగా గడిపాడు. (29)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి శ్రీకృష్ణప్రయాణే చతురశీతితమోఽధ్యాయః॥ 84 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణప్రయాణమను ఎనుబది నాలుగవ అధ్యాయము. (84)