85. ఎనుబది ఐదవ అధ్యాయము
శ్రీకృష్ణుని మార్గమున విశ్రాంతి స్థానముల నేర్పరచుట.
వైశంపాయన ఉవాచ
తథా దూతైః సమాజ్ఞాయ ప్రయాంతం మధుసూదనమ్।
ధృతరాష్ట్రోబ్రవీద్ భీష్మమ్ అర్చయిత్వా మహాభుజమ్॥ 1
ద్రోణం చ సంజయం చైవ విదురం చ మహామతిమ్।
దుర్యోధనం సహామాత్యం హృష్టరోమాబ్రవీదిదమ్॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - దూతల ద్వారా శ్రీకృష్ణుని రాకను తెలిసికొన్న ధృతరాష్ట్రుడు పులకించిపోయి, మహాబాహువయిన భీష్ముని, ద్రోణుని, సంజయుని, ధీమంతుడైన విదురుని యథోచితంగా సత్కరించి మంత్రి సహితుడైన దుర్యోధనునితో ఇలా అన్నాడు. (1-2)
అద్భుతం మహదాశ్చర్యం శ్రూయతే కురునందన।
స్త్రియో బాలాశ్చ వృద్ధాశ్చ కథయంతి గృహే గృహే॥ 3
సతృత్యాచక్షతే చాన్యే తథైవాన్యే సమాగతాః।
పృథగ్వాదాశ్చ వర్తంతే చత్వరేషు సభాసు చ॥ 4
కురునందనా! అద్భుతమై, మహాశ్చర్యాన్ని కల్గించే విషయం వినిపిస్తోంది. ఇంటింటా స్త్రీలూ, బాలురూ, వృద్ధులూ కూడా దానిని గురించి మాటాడుతున్నారు. నగరవాసులు, నగరానికై కార్యాంతరంతో వచ్చినవారుకూడా ఆదరపూర్వకంగా ఆ విషయాన్ని గురించియే చెప్తున్నారు. సభలలోనూ, రచ్చబండల మీదనూ ఆ విషయాన్ని గురించియే విడివిడిగా చర్చలు జరుగుతున్నాయి. (3-4)
ఉపాయాస్యతి దాశార్హః పాండవార్థే పరాక్రమీ।
స నో మాన్యాశ్చ పూజ్యశ్చ సర్వథా మధుసూదనః॥ 5
పరాక్రమశాలి అయిన శ్రీకృష్ణుడు పాండవుల పనిపై మన దగ్గరకు వస్తున్నాడు. ఆ మధుసూదనుడు సర్వవిధాల పూజ్యుడూ, మనం సత్కరింపవలసిన వాడునూ.(5)
తస్మిన్ హి యాత్రా లోకస్య భూతానామీశ్వరో హి సః।
తస్మిన్ ధృతిశ్చ వీర్యం చ ప్రజ్ఞా చౌజశ్చ మాధవే॥ 6
లోకుల జీవనయాత్ర ఆ మాధవుని అధీనంలోనిది. ప్రాణుల సంరక్షకుడు ఆయనయే. ధైర్యం, పరాక్రమం, ప్రజ్ఞ, తేజస్సు గలవాడు ఆ శ్రీకృష్ణుడు. (6)
స మాన్యతాం నరశ్రేష్ఠః స హి ధర్మః సనాతనః।
పూజితో హి సుఖాయ స్యాద్ అసుఖః స్యాదపూజితః॥ 7
ఆయన సనాతన ధర్మస్వరూపుడు. నరశ్రేష్ఠుడైన ఆయన పూజింపదగినవాడు. ఆయనను సత్కరించినచో మనకు సుఖం కలుగుతుంది. పూజింపకపోయినచో కష్టం కలుగుతుంది. (7)
స చేత్తుష్యతి దాశార్హః ఉపచారైరరిందమః।
కృష్ణాత్ సర్వానభిప్రాయాన్ ప్రాప్స్యామః సర్వరాజసు॥ 8
శత్రుసంహర్త అయిన శ్రీకృష్ణుడు మన సత్కారాలతో సంతోషపడితే ఆయన ద్వారా సమస్త రాజుల విషయంలో మన కోరికలను సఫలం చేసికొనవచ్చు. (8)
తస్య పూజార్థమద్యైవ సంవిధత్స్య పరంతప।
సభాః పథి విధీయంతాం సర్వకామసమన్వితాః॥ 9
కాబట్టి పరంతపా! ఆయన పూజకై నేడే ఏర్పాట్లు చేయి. మార్గంలో విశ్రాంతి స్థానాలను సమకూర్చు. అక్కడ సకల సౌకర్యాలనూ కల్పించు. (9)
యథా ప్రీతి ర్మహాబాహో త్వయి జాయేత తస్య వై।
తథా కురుష్వ గాంధారే కథం వా భీష్మ మన్యసే॥ 10
మహాబాహుడవైన గాంధారీకుమారా! ఆయనకు నీపై ప్రేమ కలగటానికి తగినవిధంగా ఏర్పాట్లన్నీ చేయి. భీష్మా! ఈ విషయంలో నీ అభిప్రాయమేమిటో? (10)
తతో భీష్మాదయః సర్వే ధృతరాష్ట్రం జనాధిపమ్।
ఊచుః పరమనిత్యేవం ఫూజయంతోఽస్య తద్ వచః॥ 11
అప్పుడు భీష్మ్డుఉ మొదలైనవారంతా ధృతరాష్ట్రమహారాజు మాటను మన్నించి "చాలా బాగుంది" అని పలికారు. (11)
తేషా మనుమతం జ్ఞాత్వా రాజా దుర్యోధనస్తదా।
సభావాస్తూని రమ్యాణి ప్రదేష్టుముపచక్రమే॥ 12
వారందరి ఆమోదాన్ని గ్రహించిన తర్వాత రాజు దుర్యోధనుడు అందమయిన సభామంటసాలనూ, విశ్రాంతి స్థానాలనూ నిర్మించవలసినదిగా ఆజ్ఞాపించాడు. (12)
తతో దేశేషు రమణీయేషు భాగశః।
సర్వరత్నసమాకీర్ణాః సభాశ్చక్రురనేకశః॥ 13
ఆపై శిల్పులు అనేకరమణీయ ప్రదేశాలలో విడివిడిగా సమస్తరత్న సంపన్నాలయిన సభలను ఎన్నింటినో నిర్మించారు. (13)
ఆసనాని విచిత్రాణి యుతాని వివిధైర్గుణైః।
స్త్రియో గంధానలంకారాన్ సూక్ష్మాణి వసనాని చ॥ 14
గుణవంత్యన్నపానాని భోజ్యాని వివిధాని చ।
మాల్యాని చ సుగంధీని తాని రాజా దదౌ తతః॥ 15
వివిధ సౌకర్యాలతో కూడిన విచిత్రాలయిన ఆసనాలనూ, స్త్రీలనూ, పరిమళద్రవ్యాలనూ, ఆభరణాలనూ, సన్నని వస్త్రాలనూ, గుణవంతాలయిన అన్నపానాలనూ, రకరకాల భోజ్యాలనూ, సుగంధభరుతమైన పుష్పమాలలను ఆయా విశ్రాంతి స్థానాలలో ఏర్పాటు చేశాడు సుయోధనుడు. (14-15)
విశేష వాసార్థం సభాం గ్రామే వృకస్థలే।
విదధే కౌరవో రాజా బహురత్నాం మనోరమామ్॥ 16
ప్రత్యేకించి వృకస్థలగ్రామంలో నివాసార్థం దుర్యోధనుడు అనేకరత్నాలతో కూడి మనోహరమైన విశ్రాంతి మంటపాన్ని నిర్మించాడు. (16)
ఏతద్ విధాయ వై సర్వం దేవార్హమతిమానుషమ్।
ఆచఖ్యౌ ధృతరాష్ట్రాయ రాజా దుర్యోధనస్తదా॥ 17
మానవులకు దుర్లభమై దేవతావాసయోగ్యంగా కనపడే ఈ వ్యవస్థను పూర్తిచేయించి దుర్యోధనుడు ధృతరాష్ట్రునకు తెలియజేశాడు. (17)
తాః సభాః కేశవః సర్వా రత్నాని వివిధాని చ।
అసమీక్ష్యైవ దాశార్హః ఉపాయాత్ కురుసద్మ తత్॥ 18
అయితే దాశార్హుడైన శ్రీకృష్ణుడు ఆ సభలను కానీ అక్కడ కల్పించిన వివిధ రత్నాలను కానీ కనీసం చూడనైనా చూడకుండా కౌరవ నివాసస్థానమైన హస్తినవైపు సాగిపోయాడు. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి మార్గే సభానిర్మాణే పంచాశీతితమోఽధ్యాయః॥ 85 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మార్గమున సభానిర్మాణమను ఎనుబది ఐదవ అధ్యాయము. (85)