87. ఎనుబది ఏడవ అధ్యాయము

శ్రీకృష్ణుని ఆజ్ఞను పాటింపుమని విదురుడు ధృతరాష్ట్రునకు జెప్పుట.

విదుర ఉవాచ
రాజన్ బహుమతశ్చాపి త్రైలోక్యస్యాపి సత్తమః।
సంభావితశ్చ లోకస్య సమ్మతశ్చాపి భారత॥ 1
విదురుడిలా అన్నాడు. రాజా! మూడులోకాలలోనూ నీవు శ్రేష్ఠతముడవు. అంతటా గౌరవం కలవాడవు. లోకంలో గొప్ప ప్రతిష్ఠ. సదభిప్రాయం గలవాడవు. (1)
యత్ త్వమేవంగతే బ్రూయాః పశ్చిమే వయసి స్థితః।
శాస్త్రాద్ వా సుప్రతర్కాద్వా సుస్థిరః స్థవిరో హ్యపి॥ 2
నీవు వార్థక్యంలో ఉన్నవాడవు. ఈ వయస్సులో నీవు చెప్పినదంతా శాస్త్ర సమ్మతమూ, తర్కసహమూకూడా! ఈ స్థిరభావన వలననే నీవు వృద్ధుడవు. (2)
లేఖా శశిని భాః సూర్యే మహోర్మిరివ సాగరే।
ధర్మస్త్వయి తథా రాజన్ ఇతి వ్యవసితాః ప్రజాః॥ 3
రాజా! చంద్రునిలో కళలవలె, సూర్యునిలో కాంతివలె, సముద్రంలో పెద్ద అలవలె నీలో ధర్మం సుస్థిరమని మన ప్రజల కందరకూ తెలిసినదే. (3)
సదైవ భావితో లోకః గుణౌఘైస్తవ పార్థివ।
గుణానాం రక్షణే నిత్యం ప్రయతస్వ సబాంధవః॥ 4
రాజా! నీ గుణసమూహం చేతనే ఈ లోకం ఎప్పుడూ మన్నింపబడుతోంది. అటువంటి నీవు బందువులతో సహా ఎల్లప్పుడూ సద్గుణసంరక్షణకై ప్రయత్నించాలి. (4)
ఆర్జవం ప్రతిపద్యస్వ మా బాల్యాద్ బహు నీనశః।
రాజన్ పుత్రాంశ్చ పౌత్రాంశ్చ సుహృదశ్పైవ సుప్రియాన్॥ 5
రాజా! ఋజుత్వాన్ని ప్రోదిచేసుకో. మూర్ఖత్వంతో కౌటిల్యాన్ని ఆశ్రయించి నీకు ప్రీతి పాత్రులైన పుత్రులకూ, పౌత్రులకూ, మిత్రులకూ కీడు కల్పించ వద్దు. (5)
యత్ త్త్వమిచ్ఛసి కృష్ణాయ రాజన్నతిథయే బహు।
ఏతదన్యచ్చ దాశార్హః పృథివీమపి చార్హతి॥ 6
రాజా! అతిథిగా రాబోతున్న శ్రీకృష్ణునకు ఎన్నో వస్తువులను ఇవ్వజూపుతున్నావు. ఈ వస్తువులకే గాదు, ఈ భూమినంతా శ్రీకృష్ణునకిచ్చినా దానికాయన తగినవారే. (6)
న తు త్వం ధర్మముద్దిశ్య తస్య వా ప్రియకారణాత్।
ఏతద్ దిత్ససి కృష్ణాయ సత్యేనాత్మాన మాలభే॥ 7
సత్యప్రమాణంగా నా మీద ఒట్టువేసికొని చెప్తున్నాను. నీవు ధర్మమార్గమన్న భావనతో కానీ, శ్రీకృష్ణుని మీద ప్రేమతో కానీ ఇవన్నీ శ్రీకృష్ణున కివ్వాలనుకోవటం లేదు. (7)
మాయైషా సత్యమేవైతత్ ఛద్మైతద్ భూరిదక్షిణ।
జానామి త్వన్మతం రాజన్ గూఢం బాహ్యేన కర్మణా॥ 8
భూరిదక్షిణల నిచ్చు రాజా! నేను సత్యం చెప్తున్నాను. ఇదంతా నీ నటన, వంచన మాత్రమే. బాహ్యవ్యవహారంతో కప్పిపుచ్చుకొంటున్న నీ అభిప్రాయం నాకు తెలుసు. (8)
పంచ పంచైవ లిప్సంతి గ్రామకాన్ పాండవా నృప।
న చ దిత్ససి తేభ్యస్తాన్ తచ్ఛమం న కరిష్యసి॥ 9
రాజా! పాండవులు అయిదే అయిదు చిన్న గ్రామాలను కోరుతున్నారు. నీవు మాత్రం వారికి వాటిని ఇవ్వదలచటంలేదు. వారితో సంధి చేసికోవాలని నీకున్నట్లు లేదు. (9)
అర్థేన తు మహాబాహుం వార్ష్ణేయం త్వం జిహీర్షసి।
అనేన చాప్యుపాయేన పాండవేభ్యో బిభేత్స్యసి॥ 10
మహాబాహువయిన శ్రీకృష్ణుని నీవు డబ్బుతో లొంగదీసుకోవాలనుకుంటున్నారు. ఈ ఉపాయంతో పాండవులనుండి ఆయనను వేరు చేయాలనుకొంటున్నావు. (10)
న చ విత్తేన శక్యోఽసౌ నోద్యమేన న గర్హయా।
అన్యో ధనంజయాత్ కర్తుమ్ ఏతత్ తత్త్వం బ్రవీమి తే॥ 11
నీకొక వాస్తవాన్ని చెపుతున్నాను. డబ్బుఇచ్చి కానీ, మరోవిధంగా ప్రయత్నించి కానీ, నిందించ కానీ అర్జునుని నుండి శ్రీకృష్ణుని వేరు చేయటం వీలుకానిది. (11)
వేద కృష్ణస్య మాహాత్మ్యం వేదాస్య దృఢభక్తితామ్।
అత్యాజ్యమస్య జానామి ప్రాణైస్తుల్యం ధనంజయమ్॥ 12
శ్రీ కృష్ణుని మాహాత్మ్యం నాకు తెలుసు. శ్రీ కృష్ణునిపై అర్జునునకున్న దృఢభక్తి కూడా నాకు తెలుసు, ప్రాణ సమానుడైన అర్జునుని శ్రీకృష్ణుడెప్పుడూ విడువడని కూడా నాకు తెలుసు. (12)
అన్యత్ కుంభాదపాం పూర్ణాద్ అన్యత్ పాదావసేచనాత్।
అన్యత్ కుశల సంప్రశ్నాత్ నైషిష్యతి జనార్దనః॥ 13
కాబట్టి నీవిచ్చేవస్తువులలో జలపూర్ణమైన కలశాన్నీ, పాదోదకాన్నీ,కుశలప్రశ్నలనూ తప్ప మరి దేనినీ శ్రీకృష్ణుడు స్వీకరించడు. (13)
యత్ త్వస్య ప్రియమాతిథ్యం మానార్హస్య మహాత్మనః।
తదస్మై క్రియతాం రాజన్ మానార్హోఽసౌ జనార్దనః॥ 14
రాజా! పూజనీయుడైన మహాత్ముడు జనార్దనుడు. ఆయన కిష్టమైన అతిథ్యాన్ని సమకూర్చు. ఆయన అందరిచేతనూ అర్చింపదగినవాడు. (14)
ఆశంసమానః కళ్యాణం కురూనభ్యేతి కేశవః।
యేనైవ రాజన్నర్థేన తదేవాస్మా ఉపాకురు॥ 15
రాజా! ఉభయపక్షాలకూ క్షేమాన్ని కోరుతూ శ్రీకృష్ణుడు కురురాజ్యానికి వస్తున్నాడు. కాబట్టి ఆయన కోరుతున్న ప్రయోజనాన్నే ఆయనకు కానుకగా ఇయ్యి. (15)
శమైచ్ఛతి దాశార్హః తవ దుర్యోధనస్య చ।
పాండవానాం చ రాజేంద్ర తదస్య వచనం కురు॥ 16
రాజేంద్రా! శ్రీకృష్ణుడు నీకూ, దుర్యోధనునకూ పాండవులకు మధ్య సంధిచేసి శాంతిని స్థాపించాలనుకొటున్నాడు. కాబట్టి ఆయన మాటను పాటించు. (16)
పితాసి రాజన్ పుత్రాస్తే వృద్ధస్త్వం శిశవః పరే।
వర్తస్వ పితృవత్తేషు వర్తంతే తే హి పుత్రవత్॥ 17
రాజా! నీవు తండ్రివి, వారు పుత్రులు. నీవు వృద్ధుడవు. వారు శిశువులు. తండ్రిలా నీవు ప్రవర్తించు. పుత్రులవలె వారు ప్రవర్తిస్తున్నారు కదా! (17)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి విదురవాక్యే సప్తాశీతితమోఽధ్యాయః॥ 87 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున విదురవాక్యమను ఎనుబది రెండవ అధ్యాయము. (87)