88. ఎనుబది ఎనిమిదవ అధ్యాయము
దుర్యోధనుని కుతంత్రమునకు కోపించి భీష్ముడు సభను వీడి పోవుట.
దుర్యోధన ఉవాచ
యదాహ విదురః కృష్ణే సర్వం తత్ సత్యమచ్యుతే।
అనురక్తో హ్యసంహార్యః పార్థాన్ ప్రతి జనార్దనః॥ 1
దుర్యోధనుడిలా అన్నాడు. అచ్యుతుడైన శ్రీకృష్ణుని విషయంలో విదురుడు చెప్పినదంతా సత్యమే. శ్రీకృష్ణుడు పాండవులపై అనురక్తి గలవాడు. వారినుండి ఆయనను వేరుచేయటం కుదరదు. (1)
యత్ తత్ సత్కారసంయుక్తం దేయం వసు జనార్దనే।
అనేకరూపం రాజేంద్ర న తద్ దేయం కదాచన॥ 2
రాజేంద్రా! శ్రీకృష్ణునకు సత్కారపూర్వకంగా వివిధ ధనరత్నాదులను ఇవ్వదలచుకొన్నారు. కానీ ఎప్పుడూ కూడా వాటి నివ్వవలసిన అవసరం లేదు. (2)
దేశః కాలస్తథాయుక్తః న హి నార్హతి కేశవః।
మంస్యత్యధోక్షజో రాజన్ భయాదర్చతి మామితి॥ 3
రాజా! శ్రీ కృష్ణుడు ఆ సత్కారానికి తగడని కాదు కానీ దేశకాల పరిస్థితులు ఇప్పుడు దానికి తగినవి కావు. తనను చూచి భయపడి పూజచేస్తున్నట్లుగా ఆయన భావించవచ్చు. (3)
అవమానశ్చ యత్ర స్యాత్ క్షత్రియస్య విశాంపతే।
న తత్ కుర్యాత్ బుధః కార్యమ్ ఇతి మే నిశ్చితా మతిః॥ 4
రాజా! తెలివిగల క్షత్రియుడు తనకు అవమానం కలిగే ఏ పనీ చేయరాదని నా నిర్ణయం. (4)
స హి పూజ్యతమో లోకే కృష్ణః పృథులలోచనః।
త్రయాణా మపి లోకానాం విదితం మమ సర్వథా॥ 5
విశాల నేత్రాలుగల శ్రీకృష్ణుడు ఈ లోకంలోనే కాదు, మూడులోకాలలో కూడా పూజ్యతముడు. ఆ విషయం సర్వవిధాలా నాకు తెలుసు. (5)
న తు తస్మై ప్రదేయం స్యాత్ తథా కార్యగతిః ప్రభో।
విగ్రహః సముపారబ్ధః న హి శామ్యత్యవిగ్రహాత్॥ 6
ప్రభూ! శ్రీ కృష్ణుడు అంతటివాడైనా ప్రస్తుతం ఆయనకు ఏమీ బహూకరించకూడదు. కార్యగతి ఆ విధంగా ఉంది. యుద్ధం ప్రారంభమయిన తర్వాత యుద్ధంతో తప్ప మరే ఇతరమార్గాలవలననూ శాంతి కుదరదు. (6)
వైశంపాయన ఉవాచ
తస్య తద్ వచనం శ్రుత్వా భీష్మః కురుపితామహః।
వైచిత్ర్యవీర్యం రాజానమ్ ఇదం వచనమబ్రవీత్॥ 7
వైశంపాయనుడిలా అన్నాడు. సుయోధనుని ఆమాటలు విని కురుపితామహుడైన భీష్ముడు విచిత్ర వీర్యకుమారుడైన ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. (7)
సతృతోఽసత్కృతో వాపి న క్రుద్ధ్యేత జనార్దనః।
నాలమేన మవజ్ఞాతుం నావజ్ఞేయో హి కేశవః॥ 8
సత్కరించినా, సత్కరించకపోయినా శ్రీ కృష్ణుడు కోపించడు. కానీ ఆయనను అవమానించటం తగదు. అవమానింపదగినవాడు కాదు శ్రీకృష్ణుడు. (8)
యత్ తు కార్యం మహాబాహో మనసా కార్యతాం గతమ్।
సర్వోపాయైర్న తచ్ఛక్యం కేనచిత్ కర్తిమన్యథా॥ 9
మహాబాహూ! శ్రీ కృష్ణుడు ఏదైనా చేయాలని సంకల్పించితే మరెవ్వరూ కూడా ఎన్ని ఉపాయాలు ప్రయోగించినా దానిని మార్చలేరు. (9)
స యద్ బ్రూయాన్మహాబాహుః తత్ కార్యమవిశంకయా।
వాసుదేవేన తీర్థేన క్షిప్రం సంశామ్య పాండవైః॥ 10
మహాబాహువయిన ఆ శ్రీకృష్ణుడు చెప్పిన దానిని సంశయించకుండా చేయటం మంచిది. వాసుదేవుని మధ్యస్థునిగా చేసి వెంటనే పాండవులతో సంధి చేసికొనవలసినది. (10)
ధర్మ్యమర్థ్యం చ ధర్మాత్మా ధ్రువం వక్తా జనార్ధనః।
తస్మిన్ వాచ్యాః ప్రియా వాచః భవతా బాంధవైః సహ॥ 11
ధర్మాత్ముడైన జనార్దనుడు ధర్మార్థాలకు అనుకూలం గానే మాటాడుతాడు. కాబట్టి నీవూ, నీ బంధువులూనూ ఆయనతో ప్రియమైన మాటలనే పలకాలి. (11)
దుర్యోధన ఉవాచ
న పర్యాయోఽస్తి యద్ రాజన్ శ్రియం నిష్కేవలామహమ్।
తైః సహేమాముపాశ్నీయాం యావజ్జీవం పితామహ॥ 12
దుర్యోధనుడిలా అన్నాడు. పితామహా! రాజా! నేను జీవితాంతమూ పాండవులతో కలిసి ఈ రాజ్యసంపదలన్నీ అనుభవిస్తావనే మాటకు ఎటువంటి అవకాశమూ లేదు. (12)
ఇదం తు సుమహత్ కార్యం శృణు మే తత్ సమర్థితమ్।
పరాయణం పాండవానాం నియచ్ఛామి జనార్దనమ్॥ 13
ప్రస్తుతం నేను చేయదలచుకొన్న గొప్పపనిని చెపుతాను విను. పాండవులకు పెద్ద దిక్కైన జనార్దనుని ఇక్కడ బంధిస్తాను. (13)
తస్మిన్ బద్ధే భవిష్యంతి వృష్ణయః పృథివీ తథా।
పాండవాశ్చ విధేయా మే స చ ప్రాతరిహైష్యతి॥ 14
ఆ శ్రీ కృష్ణుని బంధిస్తే యదువంశస్థులు, సమస్తభూమండలమూ, పాండవులూ నాకు విధేయులవుతారు. శ్రీకృష్ణుడు రేపుఉదయమే ఇక్కడకు రాబోతున్నాడు గదా! (14)
అత్రోపాయాన్ యథా సమ్యక్ న బుద్ధ్యేత జనార్దనః।
న చాపాయో భవేత్ కశ్చిత్ తద్ భవాన్ ప్రబ్రవీతు మే॥ 15
ఈ ఆలోచనను శ్రీకృష్ణుడు గ్రహించకుండునట్లూ మనకు ఏ అపాయం లేకుండునట్లు మంచి ఉపాయాలను తమరు నాకు చెప్పండి. (15)
వైశంపాయన ఉవాచ
తస్య తద్ వచనం శ్రుత్వా ఘోరం కృష్ణాభిసంహితమ్।
ధృతరాష్ట్రః సహామాత్యః వ్యథితో విమనాభవత్॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు. శ్రీకృష్ణుని వంచింపదలపెట్టిన ఆ సుయోధనుని ఘోరమైన మాటను విని ధృతరాష్ట్రుడు అమాత్యులతో సహా కలతపడి ఖిన్నుడయ్యాడు. (16)
తతో దుర్యోధనమిదం ధృతరాష్ట్రోఽబ్రవీద్ వచః।
మైవం వోచః ప్రజాపాల నైష ధర్మసనాతనః॥ 17
అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనునితో ఇలా అన్నాడు - ప్రజాపాలకా! అలా మాటాడవద్దు. ఇది సనాతన ధర్మం కాదు. (17)
దూతశ్చ హి హృషీకేశః సంబంధీ చ ప్రియశ్చ నః।
అపాపః కౌరవేయేషు స కథం బందమర్హతి॥ 18
శ్రీకృష్ణుడు దూత, మనకు బంధువూ, ప్రియమైన వాడు కూడా, కౌరవులకు ఎటువంటి కీడూ చేసిన వాడుకాదు. ఆయనను బంధింపబూనటం అసంబద్ధం. (18)
భీష్మ ఉవాచ
పరీతస్తవ పుత్రోఽయం ధృతరాష్ట్ర సుమందధీః।
వృణోత్యనర్థం నైవార్థం యాచ్యమానః సుహృజ్జనైః॥ 19
భీష్ముడిలా అన్నాడు. ధృతరాష్ట్రా! బుద్ధిహీనుడైన నీ కుమారుడు కాలపాశంలో చిక్కుకొనినాడు. శ్రేయోభిలాషులైన మిత్రులు ఎంతచెప్పినా వినకుండా ప్రయోజనాలను వదలి అనర్థాలనే కొని తెచ్చుకొంటున్నాడు. (19)
ఇమముత్పథి వర్తంతం పాపం పాపానుబంధినమ్।
వాక్యాని సుహృదాం హిత్వా త్వమప్యస్యానువర్తసే॥ 20
నీవు కూడా హితైషుల మాటలను వినకుండా పాపులతో కూడి పాపానురక్తి కలిగి దారి తప్పిన నీకొడుకు మాటలనే అనుసరిస్తున్నావు. (20)
కృష్ణక్లిష్టకర్మాణమ్ ఆసాద్యాయం సుదుర్మతిః।
తవ పుత్రః సహామాత్యః క్షణేన న భవిష్యతి॥ 21
తేలికగా పనులను చక్కబెట్టుకొనగల శ్రీకృష్ణుని ఎదిరిస్తే దుర్మార్గుడయిన నీ కొడుకు మంత్రులతో సహా క్షణంలో నశిస్తాడు. (21)
పాపస్యాస్య నృశంసస్య త్యక్తధర్మస్య దుర్మతేః।
నోత్సహే నర్థసంయుక్తాః శ్రోతుం వాచః కథంచన॥ 22
ఈ సుయోధనుడు ధర్మాన్ని విడిచాడు. పాపబుద్ధితో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. అనర్థహేతువులైన ఇతని మాటలను ఏవిధంగానూ నేను ఇక వినదలచుకొనలేదు. (22)
ఇత్యుక్త్వా భరతశ్రేష్ఠః వృద్ధః పరమమన్యుమాన్।
ఉత్థాయ తస్మాత్ ప్రాతిష్ఠద్ భీష్మః సత్యపరాక్రమః॥ 23
ఈ విధంగా పలికి భరతశ్రేష్ఠుడూ, వృద్ధుడూ, సత్యపరాక్రముడూ అయిన భీష్ముడు చాలా కోపించి, లేచి అక్కడనుండి వెళ్ళిపోయాడు. (23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి దుర్యోధన వాక్యే అష్టాశీతతమోఽధ్యాయః॥ 88 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున దుర్యోధనవాక్యమను ఎనుబది ఎనిమిదవ అధ్యాయము. (88)