91. తొంబదియొకటవ అధ్యాయము
శ్రీకృష్ణుడు దుర్యోధనుని ఇంటికేగుట, విదురుని ఇంట భోజనము చేయుట.
వైశంపాయన ఉవాచ
పృథామామంత్ర్య గోవిందః చాభిప్రదక్షిణమ్।
దుర్యోధనగృహం శౌరిః అభ్యగచ్ఛదరిందమః॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. జనమేజయా! అరిందముడూ, శూర నందనుడూ అయిన శ్రీకృష్ణుడు కుంతి దగ్గర సెలవు తీసికొని, ఆమెకు ప్రదక్షిణం చేసి దుర్యోధనుని ఇంటికి వెళ్ళాడు. (1)
లక్ష్మ్యా పరమయా యుక్తం పురందరగృహోపమమ్।
విచిత్రైరాసనైర్యుక్తం ప్రవివేశ జనార్దనః॥ 2
ఇంద్రభవనంతో సమానంగా పరమ శోభావంతమై, విచిత్రమైన ఆసనాలతో కూడి ఉన్న దుర్యోధనుని ఇంటిలోనికి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. (2)
తస్య కక్ష్వా వ్యతిక్రమ్య తిస్రో ద్వాఃస్థైరవారితః।
తతోఽభ్రఘనసంకాశం గిరికూటమివోచ్ఛ్రితమ్॥ 3
శ్రియా జ్వలంతం ప్రాసాదమ్ ఆరురోహ మహాయశాః।
ద్వారపాలకులు శ్రీకృష్ణుని అడ్డగించలేదు. ఆ భవనం యొక్క మూడు సింహద్వారాలను అతిక్రమించి ప్రాసాదంపైకి ఎక్కాడు శ్రీకృష్ణుడు. ఆ ప్రాసాదం ఆకాశంపై వ్యాపించిన శరత్కాలమేఘాలవలె తెల్లనై, పర్వత శిఖరం వలె ఉన్నతమై అద్భుతంగా ప్రకాశిస్తోంది. (3 1/2)
తత్ర రాజసహస్రైశ్చ కురుభిశ్చాభిసంవృతమ్॥ 4
ధార్తరాష్ట్రం మహాబాహుం దదర్శాసీనమాసనే।
ఆ ప్రాసాదంపై వేలకొలది రాజులు, కౌరవులు చుట్టుముట్టి ఉండగా సింహాసనంపై కూర్చొని ఉన్న మహాబాహువయిన దుర్యోధనుని చూశాడు. (4 1/2)
దుఃశాసనం చ కర్ణం చ శకునిం చాపి సౌబలమ్॥5
దుర్యోధనసమీపే తాన్ ఆసనస్థాన్ దదర్శ సః।
అక్కడే దుర్యోధనునకు దగ్గరగా ఆసనాలపై కూర్చొని ఉన్న దుశ్శాసనునీ, కర్ణునీ, సౌబలుడైన శకునిని కూడా చూశాడు. (5 1/2)
అభ్యాగచ్ఛతి దాశార్హే ధార్తరాష్ట్రో మహాయశాః॥ 6
ఉదతిష్ఠత్ సహామాత్యః పూజయన్ మధుసూదనమ్।
శ్రీ కృష్ణుడు వస్తుండగా యశస్సంపన్నుడైన దుర్యోధనుడు మధుసూదనుని గౌరవిస్తూ మంత్రులతో సహా లేచి నిలిచాడు. (6 1/2)
సమేత్య ధార్తరాష్ట్రేణ సహామాత్యేన కేశవః॥ 7
రాజణిస్తత్ర వార్ష్ణేయః సమాగచ్ఛద్ యథావయః।
మంత్రి సహితుడైన సుయోధనుని కలసిన తర్వాత వార్ష్ణేయుడయిన శ్రీకృష్ణుడు వయస్సులను బట్టి తగిన రీతిగా అక్కడున్న రాజులను కలిశాడు. (7 1/2)
తత్ర జాంబూనదమయం పర్యంకం సుపరిష్కృతమ్॥ 8
వివిధాస్తరణాస్తీర్ణమ్ అభ్యుపావిశదచ్యుతః।
అక్కడ చక్కగా అలంకరింపబడి రకరకాల పరుపులు పరచిన స్వర్ణమయమైన మంచం ఉన్నది. శ్రీకృష్ణుడు దానిపై కూర్చున్నాడు. (8 1/2)
తస్మిన్ గాం మధుపర్కం చాప్యుదకం చ జనార్దనే॥ 9
నివేదయామాస తదా గృహాన్ రాజ్యం చ కౌరవః।
అప్పుడు దుర్యోధనుడు జనార్దనుని సత్కరిస్తూ గోవునూ, మధుపర్కాన్నీ, నీటిని, ఇంటినీ, రాజ్యాన్నీ కూడా నివేదించాడు. (9 1/2)
తత్ర గోవిందమాసీనం ప్రసన్నాదిత్యవర్చసమ్॥ 10
ఉపాసాంచక్రిరే సర్వే కురవో రాజభిః సహ।
నిర్మలమైన సూర్యతేజస్సువంటి తేజస్సుతో ఆ పర్యంకం మీద ఆసీనుడయిన శ్రీకృష్ణుని దగ్గర కౌరవులు రాజులందరితో వచ్చి కూర్చున్నారు. (10 1/2)
తత్ర దుర్యోధనో రాజా వార్ష్ణేయం జయతాం వరమ్॥ 11
న్యమంత్రయద్ భోజనేన నాభ్యనందచ్చ కేశవః।
ఆ తరువాత దుర్యోధనుడు జయశీలురలో శ్రేష్ఠుడైన శ్రీ కృష్ణుని భోజనానికి ఆహ్వాలించారు. కానీ శ్రీకృష్ణుడు అంగీకరించలేదు. (11 1/2)
తతో దుర్యోధనః కృష్ణమ్ అబ్రవీత్ కురుసంసది॥ 12
మృదుపూర్వం శఠోదర్కం కర్ణమాభాష్య కౌరవః।
అప్పుడు దుర్యోధనుడు కర్ణునితో సలహా పడి మాటల్లో మార్దవం, భావనలో కపటత్వం వ్యక్త మవుతుండగా ఆ కౌరవసభలో శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. (12 1/2)
కస్మాదన్నాని పానాని వాసాంసి శయనాని చ॥ 13
త్వదర్థముపనీతాని నాగ్రహీస్త్వం జనార్దన।
జనార్ధనా! నీకోసం సమకూర్చిన అన్నాన్ని, పానీయాలనూ, వస్త్రాలనూ, శయ్యలను నీవెందుకు స్వీకరించటంలేదు? (13 1/2)
ఉభయోశ్చాదదాః సాహ్యమ్ ఉభయోశ్చ హితే రతః॥ 14
సంబంధీ దయితశ్చాసి ధృతరాష్ట్రస్య మాధవ।
త్వం హి గోవింద ధర్మార్థౌ వేత్థ తత్త్వేన సర్వశః।
తత్ర కారణమిచ్ఛామి శ్రోతుం చక్రగదాధర॥ 15
చక్రగదాధరా! గోవిందా! నీవు ధర్మార్థాలను యథార్థంగా, పరిపూర్ణంగా తెలిసికొనినవాడవు. అయినా కూడా నా ఆతిథ్యాన్ని తిరస్కరించావు. దానికి కారణమేమిటి? వినాలని వుంది. (14-15)
వైశంపాయన ఉవాచ
స ఏవముక్తో గోవిందః ప్రత్యువాచ మహామనాః।
ఉద్యన్మేఘస్వనః కాలే ప్రగృహ్య విపులం భుజమ్॥ 16
అలఘూకృతమగ్రస్తమ్ అనిరస్తమసంకులమ్।
రాజీవనేత్రో రాజానం హేతుమద్ వాక్యముత్తమమ్॥ 17
వైశంపాయనుడిలా అన్నాడు. దుర్యోధనుడు ఆ విధంగా ప్రశ్నించగా మహామనస్వి, కనులనయనుడూ అయిన శ్రీకృష్ణుడు విశాలమైన తన భుజాన్ని పైకి లేపి నిండు మేఘాల ధ్వనివంటి కంఠస్వరంతో సుయోధనునకు ప్రత్యుత్తర మివ్వసాగాడు. ఆయనమాట ఉత్తమమై, తర్కసహమై, గంభీరమై, స్పష్టమై ఉంది. స్థానభ్రష్టత, సంకీర్ణత, మొదలగు దోషాలు లేవు. (16,17)
కృతార్థా భుంజతే దూతాః పూజాం గృహ్ణంతి చైవ హ।
కృతార్థం మాం సహామాత్యం సమర్చిష్యసి భారత॥ 18
దుర్యోధనా! దూతలు తాము వచ్చిన పనిలో కృతార్థులయినపుడు భోజన, పూజనాదులను స్వీకరిస్తారు. నీవుకూడా నా పని ముగిసినతర్వాత మంత్రులందరితో కలిసి నన్ను సత్కరించవచ్చు. (18)
ఏవముక్తః ప్రత్యువాచ ధార్తరాష్ట్రో జనార్దనమ్।
న యుక్తం భవతాస్మాసు ప్రతిపత్తుమసాంప్రతమ్॥ 19
జనార్దనుడీ విధంగా పలుకగానే ధార్తరాష్ట్రుడు శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు. మాతో ఈ తీరుగా అనుచితంగా మాటాడటం నీకు తగదు. (19)
కృతార్థం వాకృతార్థం చ త్వాం వయం మధుసూదన।
యతామహే పూజయితుం దాశార్హ న చ శక్నుమః॥ 20
దశార్హనందనా! మధుసూదనా! నీవు కృతార్థుడవు అయినా కాకపోయినా నిన్ను సత్కరించాలనే మేము ప్రయత్నిస్తున్నాము. కానీ సత్కరించలేక పోతున్నాము. (20)
న చ తత్ కారణం విద్మః యస్మిన్ నో మధుసూదన।
పూజాం కృతాం ప్రీయమాణైః నామంస్థాః పురుషోత్తమ॥ 21
మధుసూదనా! పురుషోత్తమా! నీపై ప్రీతితో మేము సమర్పిస్తున్న పూజను అంగీకరించక పోవటానికి కారణం మాకు తెలియడం లేదు. (21)
వైరం నో నాస్తి భవతా గోవింద న చ విగ్రహః।
స భవాన్ ప్రసమీక్ష్యైఅక్తత్ నేదృశం వక్తుమర్హతి॥ 22
గోవిందా! నీతో మాకు శత్రుత్వం లేదు. యుద్ధమూ లేదు. అదంతా నీవు ఆలోచించాలి. ఇటువంటి మాటలు పలుకదగదు. (22)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః ప్రత్యువాచ ధార్తరాష్ట్రం జనార్దనః।
అభివీక్ష్య సహామాత్యం దాశార్హః ప్రహసన్నివః॥ 23
వైశంపాయనుడిలా అన్నాడు. దుర్యోధనుని మాటలు విని దాశార్హుడైన జనార్దుడు దుర్యోధనునివైపూ, ఆయన మంత్రుల వైపూ చూచి నవ్వుతూ ఇలా ప్రత్యుత్తర మిచ్చాడు. (23)
నాహం కామాన్న సంరంభాత్ న ద్వేషాన్నార్థకారణాత్।
న హేతువాదాల్లోభాద్ వా ధర్మం జహ్యాం కథంచన॥ 24
నేను కామంవలన కానీ, క్రోధంవలన కానీ, ద్వేషం వలన కానీ, స్వార్థసిద్ధికోసం కానీ, లోభంవలన కానీ, హేతువాదదృష్టితో కానీ ధర్మాన్ని ఎప్పుడూ విడువను. (24)
సంప్రీతిభోజ్యాన్యన్నాని ఆపద్భోజ్యాని వా పునః।
న చ సంప్రీయసే రాజన్ న చైవాపద్గతా వయమ్॥ 25
రాజా! ప్రీతికారణంగా కానీ, ఆపద కారణంగా కానీ ఇతరుల ఇంట భోజనం చేస్తాం. నీకు నాపై ప్రేమలేదు. నేను ఏ ఇబ్బందిలోనూ చిక్కుకొనలేదు. (25)
అకస్మాద్ ద్వేష్టి వై రాజన్ జన్మప్రభృతి పాండవాన్।
ప్రియానువర్తినో భ్రాతౄన్ సర్వైః సముదితాన్ గుణైః॥ 26
పాండవులు నీ సోదరులు, సర్వసద్గుణ సంపన్నులు. ఇష్టమైన వారిని వెన్నంటి ఉండేవారు. అటువంటి వారిని నీవు పుట్టిననాటి నుండీ నిష్కారణంగా ద్వేషిస్తున్నావు. (26)
అకస్మాచ్చైవ పార్థానాం ద్వేషణం నోపపద్యతే।
ధర్మే స్థితాః పాండవేయాః కస్తాన్ కిం వక్తుమర్హతి॥ 27
నిష్కారణంగా పాండవులను ద్వేషించటం తగదు. వారు స్వధర్మమందే నిలిచేవారు. వారిని గురించి మరొక విధంగా ఎవ్వరూ మాటాడలేరు. (27)
యస్తాన్ ద్వేష్టి స మాం ద్వేష్టి యస్తానను స మామను।
ఐకాత్మ్యం మాం గతం విద్ధి పాండవైర్ధర్మచారిభిః॥ 28
పాండవులను ద్వేషించినవారు నన్ను కూడా ద్వేషించినట్టే. పాండవులకు అనుకూలంగా ఉన్నవారు నాకూ అనుకూలంగా ఉన్నట్లే. ధర్మానువర్తులయిన ఆ పాండవులతో ఏకాత్మ భావాన్ని పొందిన వానినిగా నన్ను తెలుసుకో. (28)
కామక్రోధానువర్తీ హీ యో మోహాద్ విరురుత్సతి।
గుణవంతం చ యో ద్వేష్టి తమాహుః పురుషాధమమ్॥ 29
కామక్రోధాలను ఆశ్రయించి మోహంతో యుద్ధం చేయాలని కోరినా, గుణవంతులను ద్వేషించినా వాడు పురుషాధముడుగా వ్యవహరింపబడతాడు. (29)
యః కల్యాణగుణాన్ జ్ఞాతీన్ మోహాల్లోభాద్ దిదృక్షతే।
సోఽజితాత్మా జితక్రోధః న చిరం తిష్ఠతి శ్రియమ్॥ 30
సద్గుణవంతులయిన దాయాదులను కూడా మోహలోభదృష్టితో చూస్తుంటే, తన మనస్సునూ కోపాన్నీ అదుపులో నుంచుకొనలేని ఆ మనుష్యుని వద్ద రాజ్యలక్ష్మి ఎక్కువ కాలం నిలవదు. (30)
అథ యో గుణసంపన్నాన్ హృదయస్యాప్రియానపి।
ప్రియేణ కురుతే వశ్యాన్ చిరం యశసి తిష్ఠతి॥ 31
తనకు నచ్చక పోయినా గుణసంపన్నులను ప్రేమతో లోబరుచుకొన్న వాడు చిరకీర్తిని పొందగలడు. (31)
(ద్విషదన్నం న భోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్।
పాండవాన్ ద్విషసే రాజన్ మమ ప్రాణా హి పాండవాః॥)
ద్వేషించేవాని అన్నాన్ని తినకూడదు. ద్వేషబుద్ధి గలవానికి అన్నం పెట్టకూడదు. నీవు పాండవులను ద్వేషిస్తున్నావు. కానీ వారు నాకు ప్రాణాలు.
సర్వమేతన్న భోక్తవ్యమ్ అన్నం దుష్టాభిసంహితమ్।
క్షత్తురేకస్య భోక్తవ్యమ్ ఇతి మే ధీయతే మతిః॥ 32
నీ అన్నమంతా దుర్భావాలచే కలుషితమైంది. కాబట్టి నేను నీ అన్నం తినలేదు. విదురుని ఇంట అన్నాన్నే నేను తింటాను. ఇది నా నిర్ణయం. (32)
ఏవముక్త్వా మహాబాహుః దుర్యోధన మమర్షణమ్।
నిశ్చక్రామ తతః శుభ్రాత్ ధార్తరాష్ట్రనివేశనాత్॥ 33
అమర్షశీలుడైన దుర్యోధనునితో ఆ రీతిగా పలికి ఆ సుయోధనుని భవనం నుండి నిష్క్రమించాడు శ్రీకృష్ణుడు. (33)
నిర్యాయ చ మహాబాహుః వాసుదేవో మహామనాః।
నివేశాయ యయౌ వేశ్మ విదురస్య మహాత్మనః॥ 34
మహాబాహువు, మహామనస్కుడూ అయిన వాసుదేవుడు అక్కడనుండి బయటపడి విడిదికై మహాత్ముడైన విదురుని ఇంటివైపు బయలు దేరాడు. (34)
తమభ్యగచ్ఛద్ ద్రోణశ్చ కృపో భీష్మోఽథ బాహ్లికః।
కురవశ్చ మహాబాహుం విదురస్య గృహే స్థితమ్॥ 35
త ఊచుర్మాధవం వీరం కురవో మధుసూదనమ్।
వివేదయామో వార్ష్ణేయ సరత్నాంస్తే గృహాన్ వయమ్॥ 36
ద్రోణుడు, కృపు, భీష్ముడు, బాహ్లికుడు ఇతరకౌరవులు మహాబాహువయిన శ్రీకృష్ణుని అనుసరించారు. విదురగృహంలో ఉన్న యదువంశ వీరుడు - శ్రీకృష్ణునితో ఆ కౌరవులిల్ అన్నారు. శ్రీకృష్ణా! రత్నాదులతో పాటు మా ఇండ్లను నీకు నివేదిస్తాము. (35-36)
తానువాచ మహాతేజాః కౌరవాన్ మధుసూదనః।
సర్వే భవంతో గచ్ఛంతు సర్వా మేఽ పచితిః కృతా॥ 37
మహాతేజస్విఅయిన మధుసూదనుడు "మీరు నాకు చేయవలసిన సత్కారం ముగిసినట్టే. ఇక మీరంతా ఇళ్ళకు వెళ్ళండి" అని వారితో అన్నాడు. (37)
యాతేషు కురుషు క్షత్తా దాశార్హమపరాజితమ్।
అభ్యర్చయామాస తదా సర్వకామైః ప్రయత్నవాన్॥ 38
కౌరవులంతా నిష్క్రమించగానే విదురుడు ప్రయత్నపూర్వకంగా జయశీలుడైన ఆ శ్రీకృష్ణుని కోరిన వన్నీ ఇచ్చి సత్కరించాడు. (38)
తతః క్షత్తాన్నపానాని శుచీని గుణవంతి చ।
ఉపాహరదనేకాని కేశవాయ మహాత్మనే॥ 39
ఆ తరువాత విదురుడు రుచి, శుచి గల ఎన్నోరకాల అన్నపానాదులను మహాత్ముడయిన కేశవునికి నివేదించాడు. (39)
తైస్తర్పయిత్వా ప్రథమం బ్రాహ్మణాన్ మధుసూదనః।
వేదవిద్భ్యో దదౌ కృష్ణః పరమద్రవిణాన్యపి॥ 40
మధుసూదనుడు అన్నపానాదులతో ముందు బ్రాహ్మణులను తృప్తి పరచాడు. ఆ వేదవేత్తలకు గొప్పధనాలను కూడా దానం చేశాడు. (40)
తతోమయాయిభిః సార్ధం మరుద్భిరివ వాసవః।
విదురాన్నాని బుభుజే శుచీని గుణవంతి చ॥ 41
ఆ తరువాత దేవతలతో కూడిన ఇంద్రునిలాగా తన అనుయాయులతో కలిసి విదురుడు నివేదించిన శుచి, రుచిగల ఆ అన్నపానాలను శ్రీకృష్ణుడు భుజించాడు. (41)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి శ్రీకృష్ణ దుర్యోధన సంవాదే ఏకనవతితమోఽధ్యాయః॥ 91 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణదుర్యోధన సంవాదమను తొంబదియొకటవ అధ్యాయము. (91)