92. తొంబది రెండవ అధ్యాయము

కౌరవసభకు పోరాదని విదురుడు కృష్ణునితో చెప్పుట.

వైశంపాయన ఉవాచ
తం భుక్తవంతమాశ్వస్తమ్ నిశాయాం విదురోఽబ్రవీత్।
నేదం సమ్యగ్ వ్యవసితం కేశవాగమనం తవ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. రాత్రి శ్రీకృష్ణుడు భోజనం చేసి విశ్రమించిన తరువాత విదురుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. కేశవా! నీవు ఇక్కడకు రావటం నాకంత సమంజసంగా కనిపించటం లేదు. (1)
అర్థధర్మాతిగో మందః సంరంభీ న జనార్దన।
మానఘ్నీ మానకామశ్చ వృద్ధానాం శాసనాతిగః॥ 2
జనార్దనా! దుర్యోధనుడు మందమతి. ధర్మార్థాలను అతిక్రమించినవాడు. కోపిష్ఠి. ఇతరుల అభిమానాన్ని దెబ్బతీసేవాడు. తాను మాత్రం అభిమానాన్నే కోరుకొంటాడు. పెద్దల ఆదేశాలను అతిక్రమిస్తాడు. (2)
ధర్మశాస్త్రాతిగో మూఢః దురాత్మా ప్రగ్రహం గతః।
అనేయః శ్రేయసాం మందః ధార్తరాష్ట్రో జనార్దన॥ 3
జనార్దనా! ఆ సుయోధనుడు ధర్మాశాస్త్రాల విధులను కూడా అతిక్రమించేవాడు. మూఢుడు. దుర్మార్గుడు. మొండిపట్టు గలవాడు. శ్రేయోమార్గం వైపు అతనిని మళ్ళించటం సాధ్యం కాదు. (3)
కామాత్మా ప్రాజ్ఞమానీ చ మిత్రధ్రుక్ సర్వశంకితః।
అకర్తా చాకృతజ్ఞశ్చ త్యక్తధర్మా ప్రియానృతః॥ 4
జనార్దనా! సుయోధనుడు భోగాసక్తిగలవాడు, తనను తాను పండితునిగా భావించుకొనేవాడు, మిత్రద్రోహి, అందరినీ అనుమానించేవాడు. తాను ఎవ్వరికీ ఉపకారం చేయడు. తాను పొందిన ఉపకారాలను విస్మరించేవాడు, ధర్మాన్ని పరిత్యజించిన వాడు, అసత్యాలను ఇష్టపడేవాడు. (4)
మూఢశ్చాకృతబుద్ధిశ్చ ఇంద్రియాణామనీశ్వరః।
కామానుసారీ కృత్యేషు సర్వేష్వకృతనిశ్చయః॥ 5
ఆ సుయోధనుడు మూఢుడు, స్థిరచిత్తం లేనివాడు, ఇంద్రియాలను అదుపుచేసికొన లేనివాడు, స్వేచ్ఛననుసరించి పనులుచేసేవాడు. ఏవిషయంలోనూ స్థిరనిర్ణయం లేనివాడు. (5)
ఏతైశ్చాన్యైశ్చ బహుభిః దోషై రేవ సమన్వితః।
త్వయోచ్యమానః శ్రేయోఽపి సంరంభాన్న గ్రహీష్యతి॥ 6
ఇంతేకాదు. ఇంకా ఎన్నో దోషాలతో కూడినవాడు. నీవు హితవచనాలు చెప్పినా క్రోధవశుడై ఆ మాటలను స్వీకరించడు. (6)
భీష్మే ద్రోణే కృపే ద్రోణపుత్రే జయద్రథే।
భూయసీం వర్తతే వృత్తిం న శమే కురుతే మనః॥ 7
భీష్మ, ద్రోణ, కృప, కర్ణ, అశ్వత్థామ, సైంధవులపై గట్టి నమ్మకంతో ఉన్నవాడు. కాబట్టి మనస్సులో సంధి గురించి ఆలోచన కూడా చేయడు. (7)
నిశ్చితం ధార్తరాష్ట్రాణాం సకర్ణానాం జనార్దన।
భీష్మద్రోణముఖాన్ పార్థాః న శక్తాః ప్రతివీక్షితుమ్॥ 8
జనార్దనా! భీష్మ ద్రోణాదివీరుల వైపు పాండవులు కనీసం చూడలేరని ధార్తరాష్ట్రులు, కర్ణుడూ నిశ్చయంతో ఉన్నారు. (8)
సేనాసముదయం కృత్వా పార్థివం మధుసూదన।
కృతార్థం మన్యతే బాలః ఆత్మానమవిచక్షణః॥ 9
మధుసూదనా! మూర్ఖుడైన దుర్యోధనుడు రాజులసేనలన్నింటినీ సమీకరించి దానితోనే తనను కృతార్థునిగా భావించుకొంటున్నాడు. (9)
ఏకః కర్ణః పరాన్ జేతుం సమర్థ ఇతి నిశ్చితమ్।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః స శమం నోపయాస్యతి॥ 10
దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు కర్ణుడొక్కడే శత్రువులను జయించగల సమర్థుడని నమ్ముతున్నాడు. అందువలన అతడు సంధికి ఎప్పుడూ అంగీకరించడు. (10)
సంవిచ్చ ధార్తరాష్ట్రాణాం సర్వేషామేవ కేశవ।
శమే ప్రయతమానస్య తవ సౌభ్రాత్రకాంక్షిణః॥ 11
న పాండవానామస్యాభిః ప్రతిదేయం యథోచితమ్।
ఇతి వ్యవసితాస్తేషు వచనం స్యాన్నిరర్థకమ్॥ 12
పాండవులకు యథోచితరాజ్యభాగాన్ని ఇవ్వకూడదని ధార్తరాష్ట్రులందరూ భావిస్తున్నారు. అది వారి దృఢనిశ్చయం. ఆవిధంగా నిర్ణయించుకొన్న వారి దగ్గర సోదరుల మధ్య భ్రాతృభావాన్ని కోరుతూ సంధికి ప్రయత్నిస్తున్న నీ మాటలు నిరర్థకాలవుతాయి. (11-12)
యత్ర సూక్తం దురుక్తం చ సమం స్యాన్మధుసూదన।
న తత్ర ప్రలపేత్ ప్రాజ్ఞః బధిరేష్విన గాయనః॥ 13
మధుసూదనా! మంచి మాటనైనా, చెడ్డమాటనైనా సమానంగా భావించే వారి దగ్గర పండితుడు ఏమీ చెప్పకూడదు. చెప్తే అది చెవిటివారి ముందు రాగాలాపన చేయటం వంటిదే. (13)
అవిజానత్సు మూఢేషు నిర్మర్యాదేషు మాధవ।
న త్వం వాక్యం బ్రువన్ యుక్తః చాండాలేషు ద్విజో యథా॥ 14
మాధవా! చాండాలుర మధ్యలో బ్రాహ్మణుడు నిలిచి ఉపదేశించటం తగనట్లు హద్దులెరుగని మూర్ఖులు, అజ్ఞానులు అయిన ధార్తరాష్ట్రుల దగ్గర నీవు ప్రసంగించటం మంచిదికాదు. (14)
సోఽయం బలస్థో మూఢశ్చ న కరిష్యతి తే వచః।
తస్మిన్ నిరర్థకం వాక్యమ్ ఉక్తం సంపత్స్యతే తవ॥ 15
మూఢుడైన ఆ సుయోధనుడు సైన్యాన్ని సమీకరించుకొని తనను శక్తివంతునిగా భావించుకొంటున్నాడు. అతడు నీ మాట వినడు. అతని దగ్గర నీవు పలికే ప్రతిమాట నిరర్థకమే అవుతుంది. (15)
తేషాం సముపవిష్టానాం సర్వేషాం పాపచేతసామ్।
తవ మధ్యావతరణం మమ కృష్ణ న రోచతే॥ 16
దుర్బుద్ధీనామశిష్టానాం బహూనాం దుష్టచేతసామ్।
ప్రతీసం వచనం మధ్యే తవ కృష్ణ న రోచతే॥ 17
కృష్ణా! వారంతా పాపిష్ఠమైన ఆలోచనలు చేస్తూ కూర్చొని ఉన్నారు. వారి మధ్యకు నీవు వెళ్లటం నాకు రుచించటం లేదు.
దుర్బుద్ధులు, దుష్టచిత్తులు, చెడ్డవారు అయిన అంతమంది మధ్యకు పోయి వారికి నచ్చని మాటలను నీవు చెప్పబూనటం నాకు నచ్చటం లేదు. (16-17)
అనుపాసితవృద్ధత్వాత్ శ్రియో దర్పాచ్చ మోహితః।
వయోదర్పాదమర్షాచ్చ న తే శ్రేయో గ్రహీష్యతి॥ 18
దుర్యోధనుడు ఎప్పుడూ పెద్దలను సేవించినవాడు కాదు. రాజ్యలక్ష్మిని అనుభవిస్తున్న గర్వంతో మత్తు క్రమ్మిన వాడు. యౌవనగర్వం వలనా, పాండవులపైనున్న అసహనభావం వలనా నీవు మంచి చెప్పినా తాను స్వీకరించడు. (18)
బలం బలవదప్యస్య యది వక్ష్యసి మాధవ।
త్వయ్యస్య మహతీ శంకా న కరిష్యతి తే వచః॥ 19
మాధవా! దుర్యోధనుని ప్రబలమైన సేన ఉంది. పైగా నీ మీద అతనికెప్పుడూ సందేహమే. అందుకే నీవు మంచి మాట చెప్పినా కూడా అతడు దానిని పరిగణించడు. (19)
నేదమద్య యుధా శక్యమ్ ఇంద్రేణాపి సహామరైః।
ఇతి వ్యవసితాః సర్వే ధార్తరాష్ట్రా జనార్దన॥ 20
జనార్దనా! దేవతలందరితో కలిసి ఇంద్రుడే ఎత్తివచ్చినా ప్రస్తుతం తమ దగ్గరున్న సేనను యుద్ధంలో ఓడించలేడని ధార్తరాష్ట్రులు అందరూ విశ్వసిస్తున్నారు. (20)
తేష్వేవముపపన్నేషు కామక్రోధానువర్తిషు।
సమర్థమపి తే వాక్యమ్ అసమర్థం భవిష్యతి॥ 21
కామక్రోధాధిదుష్టభావాల వెంట నడుస్తున్న ఆ ధార్తరాష్ట్రులు ఆవిధంగా నిశ్చయించుకొని ఉంటే నీ మాట యుక్తియుక్తమైనా అది నిరర్థక మవుతుంది. (21)
మధ్యే తిష్ఠన్ హస్త్వనీకస్య మందః।
రథాశ్వయుక్తస్య బలస్య మూఢః।
దుర్యోధనో మన్యతే వీతభీతిః
కృత్స్నామయేయం పృథివీ జితేతి॥ 22
రథిక - ఆశ్విక - గజ - పదాతి సేనల మధ్యలో నిలిచి భయరహితుడై మూఢుడూ, మందమతి అయిన దుర్యోధనుడు ఈ భూమండలమంతా తన చేత జయింపబడినట్లు భావిస్తున్నాడు. (22)
ఆశంసతే వై ధృతరాష్ట్రస్య పుత్రః
మహారాజ్యమసపత్నం పృథివ్యామ్।
తస్మిన్ శమః కేవలో నోపలభ్యః
బద్ధం సంతం మన్యతే లబ్ధమర్థమ్॥ 23
దుర్యోధనుడు సమస్త భూమండలాన్ని శత్రురహిత సామ్రాజ్యాన్ని చేసికోవాలని ఆశపడుతున్నాడు. ద్యూతంలో గెలిచికొన్న ధనం, రాజ్యం ప్రస్తుతం తన అధీనంలోనే ఉన్నాయన్న భావనతో ఉన్న దుర్యోధనునితో సంధికై చేసే ప్రయత్నం సఫలం కాదు. (23)
పర్యస్తేయం పృథివీ కాలపక్వా
దుర్యోధనార్థే పాండవాన్ యోద్ధుకామాః।
సమాగతాః సర్వయోధాః పృథివ్యాం
రాజానశ్చ క్షితిపాలైః సమేతాః॥ 24
ఈ నేల కాలపరిపక్వమై నశించి పోయే రోజు వచ్చింది. కాకపోతే భూమండలంలోని సమస్త రాజులూ, క్షత్రియసేనలు దుర్యోధనుని కోసం పాండవులతో యుద్ధం చేయటానికి సకకూడుతారా? (24)
సర్వే చైతే కృతవైరాః పురస్తాత్
త్వయా రాజానో హృతసారాశ్చ కృష్ణ।
తవోద్వేగాత్ సంశ్రితా ధార్తరాష్ట్రాన్
సుసంహతాః సహ కర్ణేన వీరాః॥ 25
కృష్ణా! ఇక్కడ చేరిన రాజులు దాదాపు అందరూ గతంలో నీకు శత్రువులై తమ సంపదలన్నీ నీవల్ల పోగొట్టుకొన్నవాళ్ళు. నీవంటే ఉన్న భయంతో ధార్తరాష్ట్రుల నాశ్రయించారు. కర్ణునితో కలిసి ఒక్కటై పరాక్రమాన్ని ప్రదర్శించబోతున్నారు. (25)
త్యక్తాత్మానః సహ దుర్యోధనేన
హృష్టా యోద్ధుం పాండవాన్ సర్వయోధాః।
తేషాం మధ్యే ప్రవిశేథా యది త్వం
న తన్మతం తవ దాశార్హవీర॥ 26
దాశార్హవంశవీరుడా! కృష్ణా! ఈ యోధులందరూ తమ ప్రాణాలపై ఆశవిడచి హర్షోత్సాహాలతో పాండవులతో యుద్ధం చేయటానికి సన్నద్ధులయ్యారు. అటువంటి వారి మధ్యకు నీవు వెళ్ళటం నాకు నచ్చటం లేదు. (26)
తేషాం సముపవిష్టానాం బహూనాం దుష్టచేతసామ్।
కథం మధ్యం ప్రపద్యేథాః శత్రూణాం శత్రుకర్శన॥ 27
సర్వథా త్వం మహాబాహీ దేవైరపి దురుత్సహః।
ప్రభావం పౌరుషం బుద్ధిం జానామి తవ శత్రుహన్॥ 28
యా మే ప్రీతిః పాండవేషు భూయః సా త్వయి మాధవ।
ప్రేమ్ణా బహుమానాచ్చ సౌహృదాచ్చ బ్రవీమ్యహమ్॥ 29
శత్రుసంహారా! దుష్టమైన ఆలోచనలతో కూర్చొని ఉన్న ఆ శత్రువుల మధ్యకు ఎలా వెళతావు?మహాబాహూ! కృష్ణా! దేవతలందరూ కలిసినా నీ ఎదుట నిలవలేరు. నీ ప్రభావం, నీ పౌరుషం, నీ బుద్ధి కుశలత నాకు తెలుసు. నాకు పాండవులపై ఉన్నంత ప్రేమ నీ మీద కూడా ఉంది. ఆ ప్రేమతో గౌరవంతో ఆదర భావంతో నేనిలా చెప్తున్నాను. (27-29)
యా మే ప్రీతిః పుష్కరాక్ష త్వద్దర్శనసముద్భవా।
సా కిమాఖ్యాయతే తుభ్యమ్ అంతరాత్మాఽసి దేహినామ్॥ 30
పుండరీకనయనా! నీ దర్శనం వలన నాలో కలిగిన ఆనందాన్ని నీకేమని వివరించగలను? సమస్త ప్రాణులకూ అంతరాత్మవు నీవే కదా! (30)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి శ్రీకృష్ణ విదుర సంవాదే ద్వినవతితమోఽధ్యాయః॥ 92 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున శ్రీకృష్ణ విదురసంవాదమను తొంబది రెండవ అధ్యాయము. (92)