102. నూటరెండవ అధ్యాయము
సురభిని, దాని సంతతిని, రసాతలసుఖమును వర్ణించుట.
నారద ఉవాచ
ఇదం రసాతలం నామ సప్తమం పృథివీతలమ్।
యత్రాస్తే సురభిర్మాతా గవామమృతసంభవా॥ 1
నారదుడిలా అన్నాడు - ఇది ఏడవదైన అధోలోకం. దీనిపేరు రసాతలం(పాతాళం). అమృతంలో పుట్టిన గోమాత సురభి ఇక్కడ నివసిస్తుంటుంది. (1)
క్షరంతీ సతతం క్షీరం పృథివీసారసంభవమ్।
షణ్ణాం రసానాం సారేణ రసమేకమనుత్తమమ్॥ 2
ఇది ఎల్లప్పుడూ తన పొదుగునుండి పాలను ప్రవహింపజేస్తుంది. అ పాలు పృథివీసారంగా పుట్టినవి. ఆరు రుచుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరసస్వరూపమైనవి. శ్రేష్ఠమైనవి. (2)
అమృతేనాభితృప్తస్య సారముద్గిరతః పురా।
పితామహస్య వదనాద్ ఉదతిష్ఠదనిందితా॥ 3
పూర్వం అమృతపానం చేసి తృప్తిపడిన బ్రహ్మ త్రేన్చగా, ఆ సమయంలో ఆయన నోటినుండి పుట్టిన పవిత్ర ఈ సురభి. (3)
యస్యాః క్షీరస్య ధారాయాః నిపతంత్యా మహీతలే।
హ్రదః కృతః క్షీరనిధిః పవిత్రం పరముచ్యతే॥ 4
నిరంతరంగా భూమిపై పడిన ఈ సురభిక్షీరధారతో ఏర్పడిన పెద్దమడుగే క్షీరసాగరం. అది పరమపవిత్రమైనది. (4)
పుష్పితస్యేవ ఫేనేన పర్యంతమనువేష్టితమ్।
పిబంతో నివసంత్యత్ర ఫేనపా మునిసత్తమాః॥ 5
ఈ క్షీరసాగరంనుండి వచ్చే నురుగు పువ్వులవలె కనిపిస్తుంది. అది తీరంపై వ్యాపిస్తుంది. దానిని త్రాగుతూ ఫేనపులని ప్రసిద్ధులయిన మహర్షులు ఈ రసాతలంలో నివసిస్తుంటారు. (5)
ఫేనసా నామ తే ఖ్యాతాః ఫేనాహారాశ్చ మాతలే।
ఉగ్రే తపసి వర్తంతే యేషాం బిభ్యతి దేవతాః॥ 6
మాతలీ! ఫేనాన్ని(నురుగును) ఆహారంగా చేసికొనినందువలన ఆ మహర్షులు ఫేనపులని ప్రసిద్ధికెక్కారు. వారు తీవ్రతపస్సులో లగ్నమై ఉంటారు. దేవతలు కూడా వారిని చూచి భయపడతారు. (6)
అస్యాశ్చతప్రో ధేన్వోఽన్యాః దిక్షు సర్వాసు మాతలే।
నివసంతి దిశాం పాల్యః ధారయంత్యో దిశః స్మ తాః॥ 7
మాతలీ! ఈ సురభికి కుమార్తెల వంటివి మరో నాలుగు ధేనువులున్నాయి. అవి అన్ని దిక్కులలో నివసిస్తాయి. ఆ దిక్కులలో ధారణ పోషణలను అవి కల్గిస్తాయి. (7)
పూర్వాం దిశం ధారయతే సురూపా నామ సౌరభీ।
దక్షిణాం హంసికా నామ ధారయత్యపరాం దిశమ్॥ 8
సురూప అనుపేరుగల సౌరభి తూర్పుదిక్కున ఉంటుంది. హంసిక అనే పేరుగల సౌరభీ దక్షిణ దిక్కున ఉంటుంది. (8)
పశ్చిమా వారుణీ దిక్ చ ధార్యతే వై సుభద్రయా।
మహానుభావయా నిత్యం మాతలే విశ్వరూపయా॥ 9
మాతలీ! గొప్పప్రభావంగలిగి విశ్వరూప అయిన సుభద్ర వరుణుని దిక్కయిన పశ్చిమాన్ని ధరించి ఉంటుంది. (9)
సర్వకామదుఘా నామ ధేనుర్ధారయతే దిశమ్।
ఉత్తరాం మాతలే ధర్మ్యాం తథైలబిలసంజ్ఞితామ్॥ 10
మాతలీ! నాలుగవ ధేనువుపేరు సర్వకామదుఘ. అది ధర్మయుక్తమై కుబేరునకు సంబంధించిన ఉత్తర దిక్కును ధరిస్తుంది. (10)
ఆసాం తు పయసా మిశ్రం పయో నిర్మథ్య సాగరే।
మంథానం మందరం కృత్వా దేవైరసురసంహితైః॥ 11
ఉద్ధృతా వారునీ లక్ష్మీః అమృతం చాపి మాతలే।
ఉచ్పైఃశ్రవాశ్చాశ్వరాజః మణిరత్నం చ కౌస్తుభమ్॥ 12
మాతలీ! దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి ఈ సురభిపాలతో కూడిన క్షీరసాగరాన్ని మథించారు. దాని నుండి వారుణి, లక్ష్మి, అమృతం, అశ్వశ్రేష్ఠమయిన ఉచ్చైశ్రవం, మణిరత్నమయిన కౌస్తుభం ఉద్భవించాయి. (11-12)
సుధాహారేషు చ సుధాం స్వధాభోజిషు చ స్వధామ్।
అమృతం చామృతాశేషు సురభీ క్షరతే పయః॥ 13
ఈ సురభి స్రవింపజేసే పాలు పాలుత్రాగే వారికి పాలుగానూ, స్వధను భిజించే పితరులకిఉ స్వధగానూ, అమృతాన్ని భుజించే దేవతలకు అమృతంగానూ ఉంటాయి. (13)
అత్ర గాథా పురా గీతా రసాతలనివాసిభిః।
పౌరాణీ శ్రూయతే లోకే గీయతే యా మనీషిభిః॥ 14
ఇక్కడున్న రసాతల నివాసులు పాడుకున్న పురాతన గీతం ఇప్పటికీ లోకంలో వినిపిస్తుంటుంది. ఇప్పటికీ ధీమంతులు దానిని చెప్పుకొంటూనే ఉంటారు. ఆ గాథ ఇది.
న నాగలోకే న స్వర్గే న విమానే త్రివిష్టపే।
పరివాసః సుఖస్తాదృగ్ రసాతలతలే యథా॥ 15
నాగలోకంలో కానీ, స్వర్గలోకంలో కానీ, స్వర్గలోక విమానంలో గానీ నివసించినా రసాతల నివాసంలోని సుఖం లభించదు. (15)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి మాతలివరాన్వేషణే ద్వ్యధికశతతమోఽధ్యాయః॥ 102 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణ మను నూట రెండవ అధ్యాయము. (102)