103. నూట మూడవ అధ్యాయము

సుముఖుడను నాగకుమారునకు మాతలి కూతురునిచ్చుటకు నిర్ణయించుట.

నారద ఉవాచ
ఇయం భోగవతీ నామ పురీ వాసుకిపాలితా।
యాదృశీ దేవరాజస్య పురీవర్యామరావతీ॥ 1
నారదుడిలా అన్నాడు. ఇది వాసుకి పరిపాలించే భోగవతీ పురం. దేవేంద్రునకు అమరావతి ఎటువంటిదో వాసుకికి ఈ భోగవతి అటువంటిది. (1)
ఏష శేషః స్థితో నాగః యేనేయం ధార్యతే సదా।
తపసా లోకముఖ్యేన ప్రభావసహితా మహీ॥ 2
ఇది ఆదిశేషుడనే సర్పం. లోకప్రసిద్ధమైన తన తపోబలంతో ప్రభావభరితమయిన ఈ సమస్తభూమినీ ఎప్పుడూ ధరించి ఉంటుంది. (2)
శ్వేతాచలనిభాకారః దివ్యాభరణభూషితః।
సహస్రం ధారయన్ మూర్ధ్నా జ్వాలాజిహ్వో మహాబలః॥ 3
ఈ శేషుని శరీరం కైలాసపర్వతం వంటిది. తలలు వేయి, నాలుకలు అగ్నిజ్వాలల వంటివి. మహాబలుడైన ఈ శేషుడు దివ్యమయిన ఆభరణాలు ధరించి ఉంటాడు. (3)
ఇహ నానావిధాకారాః నానావిధవిభూషణాః।
సురసాయాః సుతా నాగాః నివసంతి గతవ్యథాః॥ 4
ఇక్కడ వివిధాకారాలతో, వివిధాలంకారాలతో సురసకొడుకులయిన నాగులు నిశ్చింతగా జీవిస్తుంటారు. (4)
మణిస్వస్తుకచక్రాంకాః కమండలుకలక్షణాః।
సహస్రసంఖ్యా బలినః సర్వే రౌద్రాః స్వభావతః॥ 5
ఆ నాగులు వేలకొలదిగా ఉన్నారు. వీరంతా బలవంతులు, స్వాభావికంగానే భయంకరమయిన వారు. వీరిలో కొందరి శరీరాలపై మణుల గుర్తులు, కొందరి శరీరాలపై స్వస్తిక చిహ్నాలు, మరికొందరి శరీరాలపై చక్ర చిహ్నాలు, మరికొందరి శరీరాలపై కమండలుచిహ్నాలు ఉంటాయి. (5)
సహస్ర శిరసః కేచిత్ కేచిత్ పంచశతాననాః।
శతశీర్షాస్తథా కేచిత్ కేచిత్ త్రిశిరసోఽపి చ॥ 6
వీరిలో కొందరు వేయి తలలవారు, మరికొందరు అయిదువందల తలలు గలవారు. వంద తలలు గలవారు కొందరు. మూడే తలలు గలవారు కొందరు. (6)
ద్విపంచశిరసః కెచిత్ కెచిత్ సప్తముఖాస్తథా।
మహాభోగా మహాకాయాః పర్వతాభోగభోగినః॥ 7
కొందరు పదితలలు గలవారు. మరికొందరు ఏడుముఖాళు గలవారు. కొందరు పెద్దపడగగలవారు. కొందరు పెద్దశరీరం గలవారు. మరికొందరు కొండంత స్థూలశరీరం గలవారు. (7)
బహూనీహ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ।
నాగానామేకవంశానాం యథాశ్రేష్ఠం తు మే శృణు॥ 8
వీటిలో ఒక్కొక్క వంశంలో వేలకొలదిగ, ఒక్కొక్క వంశంలో లక్షలకొలదిగ, ఒక్కొక్క వంశంలో అర్బుదాల కొలదిగ నాగాలుంటాయి. పైస్థాయినుండి వాటిని పరిచయం చేస్తాను విను. (8)
వాసుకిస్తక్షక శ్పైవ కర్కోటక ధనంజయౌ।
కాలియో నహుషశ్పైవ కంబలాశ్వతరావుభౌ॥ 9
బాహ్యకుండో మణిర్నాగః తథైవాపూరణః ఖగః।
వామనశ్పైలపత్రశ్చ కుకురః కుకుణ స్తథా॥ 10
ఆర్యకో నందక శ్పైవ తథా కలశపోతకౌ।
కైలాసకః పింజరకః నాగ శ్పైరావత స్తథా॥ 11
సుమనోముఖో దధిముఖః శంఖో నందోపనందకౌ।
ఆప్తః కోటరక శ్పైవ శిఖీ నిష్ఠూరికస్తథా॥ 12
తిత్తిరిర్హస్తిభద్రశ్చ కుముదో మాల్యపిండకః।
ద్వౌ పద్మౌ పుండరీకశ్చ పుష్పో ముద్గరపర్ణకః॥ 13
కరవీరః పీఠరకః సంవృత్తో వృత్త ఏవ చ।
పిండారో బిల్వపత్రశ్చ మూషికాదః శిరీషకః॥ 14
దిలీపః శంఖశీర్షశ్చ జ్యోతిష్కోఽథాపరాజితః।
కౌరవ్యో ధృతరాష్ట్రశ్చ కుహురః కృశకస్తథా॥ 15
విరజా ధారణశ్పైవ సుబాహుర్ముఖరో జయః।
బధిరాంధౌ విశుండిశ్చ విరసః సురసస్తథా॥ 16
ఏతే చాన్యే చ బహవః కశ్యపస్యాత్మజాః స్మృతాః।
మాతలే పశ్య యద్యత్ర కశ్చిత్ తే రోచతే వరః॥ 17
వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాలియుడు, నహుషుడు, కంబలుడు, అశ్వతరుడు, బాహ్యకుండుడు, ఆపూరణుడు, ఖగుడు, వామనుడు, ఏలపుత్రుడు, కుకురుడు, కుకుణుడు, ఆర్యకుడు, నందకుడు, కలశుడు, పోతకుడు, కైలాసకుడు, పింజరకుడు, ఐరావతుడు, సుమనోముఖుడు, దధిముఖుడు, శంఖుడు, నందుడు, ఉపనందుడు, ఆప్తుడు, కోటరకుడు, శిఖి, నిష్ఠూరికుడు, తిత్తిరి, హస్తిభద్రుడు, కుముదుడు, మాల్య పిండకుడు, పద్ముడు అనుపేర ఇద్దరూ, పుండరీకుడు, పుష్పుడు, ముద్గరపర్ణకుడు, కరవీరుడు, పీఠరకుడు, సంవృత్తుడు, వృత్తుడు, పిండారుడు, బిల్వపత్రుడు, మూషికాదుడు, శిరీషకుడు, దిలీపుడు, శంఖశీర్షుడు, జ్యోతిష్కుడు, అపరాజితుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు, కుహురుడు, కృశకుడు, విరజుడు, ధారణుడు, సుబాహుడు, ముఖరుడు, జయుడు, బధిరుడు, అంధుడు, విశుండి, విరసుడు, సురసుడు - మరెంతోమంది కశ్యపుని కుమారులు. వీరిలో ఎవరైనా నచ్చుతారేమో చూడు. (9-17)
కణ్వ ఉవాచ
మాతలిస్త్వేకమవ్యగ్రః సతతం సంనిరీక్ష్య వై।
పప్రచ్ఛ నారదం తత్ర ప్రీతిమానివ చాభవత్॥ 18
కణ్వుడిలా అన్నాడు - అప్పుడు మాతలి స్థిరంగా ఒక నాగునివైపు అదే పనిగా చూచి, ప్రసన్నుడై, లేచి నారదునితో ఇలా అన్నాడు. (18)
మాతలిరువాచ
స్థితో య ఏష పురతః కౌరవ్యస్యార్యకస్య తు।
ద్యుతిమాన్ దర్శనీయశ్చ కస్యైష కులనందనః॥ 19
మాతలి ఇలా అన్నాడు - అదిగో ఆ కౌరవ్యార్యకుల ముందు నిలబడి ఉన్న నాగకుమారుడు కాంతిమంతుడూ, చూడముచ్చటయిన వాడూ. అతడు ఏ వంశానికి చెందినవాడు? (19)
కః పితా జననీ చాస్య కతమస్యైష భోగినః।
వంశస్య కస్యైష మహాన్ కేతుభూత ఇవ స్థితః॥ 20
అతని తండ్రి ఎవరు? తల్లి ఎవరు? తాత ఎవరు? వంశానికి పతాకాయమానుడై నిలిచిన ఇతని వంశమేది? (20)
ప్రణిధానేన ధైర్యేణ రూపేణ వయసా చ మే।
మనః ప్రవిష్టో దేవర్షే గుణకేశ్యాః పతిర్వరః॥ 21
దేవర్షీ! తన ఏకాగ్రత, ధైర్యం, రూపం, వయస్సూ నా మనస్సుకు బాగా నచ్చాయి. ఇతడే గుణకేశికి తగిన వరుడు. (21)
కణ్వ ఉవాచ
మాతలిం ప్రీతమనసం దృష్ట్వా సుముఖదర్శనాత్।
నివేదయామాస తదా మాహాత్మ్యం జన్మ కర్మ చ॥ 22
కణ్వుడిలా అన్నాడు - మాతలి సుముఖుని చూచి ఆనందించటాన్ని చూచి నారదమహర్షి అప్పుడు ఆ సుముఖుని జన్మ, కర్మ, మాహాత్మ్యాలను వివరించ నారంభించాడు. (22)
నారద ఉవాచ
ఐరావతకులే జాతః సుముఖో నామ నాగరాట్।
ఆర్యకస్య మతః పౌత్రః దైహిత్రో వామనస్య చ॥ 23
నారదుడిలా అన్నాడు. ఇతడు ఐరావత వంశంలో పుట్టిన నాగరాజు. పేరు సుముఖుడు, ఆర్యకుని పౌత్రుడు, వామనుని దౌహిత్రుడు. (23)
ఏతస్య హి పితా నాగః చికురో నామ మాతలే।
న చిరాద్ వైనతేయేన పంచత్వముపపాదితః॥ 24
మా తలీ! చికురుడను పేరుగల నాగుడు ఇతని తండ్రి. ఈ మధ్యనే ఆయన గరుడునకు ఆహారమయ్యాడు. (24)
తతోఽబ్రవీత్ ప్రీతమనాః మాతలిర్నారదం వచః।
ఏష మే రుచితస్తాత జామాతా భుజగోత్తమః॥ 25
ఆ మాటలు విని ఆనందించిన మాతలి నారదునితో ఇలా అన్నాడు. తండ్రీ! ఈ సుముఖుడు నాగర్శ్రేష్ఠుడు. నా అల్లుడు కాదగినవాడుఫా నాకు నచ్చాడు. (25)
క్రియతామత్ర యత్నో వై ప్రీతిమానస్మ్యనేన వై।
అస్మై నాగాయ వై దాతుం ప్రియాం దిహితరం మునే॥ 26
మహర్షీ! ఇతను బాగా నచ్చాడు. ఇతనికోసమే ప్రయత్నించు. మా అమ్మాయిని ఈ సుముఖుడనే ఇవ్వాలనుకొంటున్నాను. (26)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి మాతలివరాన్వేషణే త్ర్యధికశతతమోఽధ్యాయః॥ 103 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణ మను నూట మూడవ అధ్యాయము. (103)