104. నూట నాలుగవ అధ్యాయము

ఇంద్రుడు సుముఖునకు దీర్ఘాయ విచ్చుట; గుణకేశీ సుముఖుల వివాహము.

(కణ్వ ఉవాచ
(మాతలేర్వచనం శ్రుత్వా నారదో మునిసత్తమః।
అబ్రవీన్నాగరాజానమ్ ఆర్యకం కురునందన॥)
కణ్వుడిలా అన్నాడు - కురునందనా! మాతలి మాటవిని ముని పుంగవుడయిన నారదుడు నాగరాజయిన ఆర్యకునితో ఇలా అన్నాడు.
నారద ఉవాచ
సూతోఽయం మాతలిర్నామ శక్రస్య దయితః సుహృత్।
శుచిః శీలగుణోపేతః తేజస్వీ వీర్యవాన్ బలీ॥ 1
నారదుడిలా అన్నాడు - ఇతడు ఇంద్రుని ప్రియ మిత్రుడూ, సారథి అయిన మాతలి ఇతడు పవిత్రుడు, శీల గుణసంపన్నుడు తేజోవంతుడు, బలపరాక్రమ సంపన్నుడూ. (1)
శక్రస్యాయం సఖా చైవ మంత్రీ సారథిరేవ చ।
అల్పాంతరప్రభావశ్చ వాసవేన రణే రణే॥ 2
ఇంద్రునకు మిత్రుడూ, మంత్రి, సారథి కూడా ఇతడే. యుద్ధసమయంలో ఇంద్రునకు తోడుగా ఉంటాడు. దాదాపు ఇంద్రుని అంతటివాడు. (2)
అయం హరిసహస్రేణ యుక్తం జైత్రం రథోత్తమమ్।
దేవాసురేషు యుద్ధేషు మనసైవ నియచ్ఛతి॥ 3
ఇతడు దేవాసుర సమయంలో వేయి గుఱ్ఱాలను పూన్చిన జయశీలమైన శ్రేష్ఠమయిన రథాన్ని మనస్సుతోనే నియంత్రిస్తాడు. (3)
అనేన విజితానశ్యైః దోర్భ్యాం జయతి వాసవః।
అనేన బలభిత్ పూర్వం ప్రహృతే ప్రహరత్యుత॥ 4
మాతలి ముందుగా తన అశ్వాలతో గెలిచిన వారినే ఇంద్రుడు తన బాహుబలంతో జయిస్తాడు. శత్రువులను మాతలి దెబ్బకొట్టిన తరువాతనే ఇంద్రుడు దెబ్బకొడతాడు. (4)
అస్య కన్యా వరారోహా రూపేణాసదృశీ భువి।
సత్యశీలగుణోపేతా గుణకేశీతి విశ్రుతా॥ 5
ఈ మాతలి కుమార్తె గుణకేశి. ఎంతో అందమయినది. భూమండలంలో ఆమెవంటి అందగత్తెలు లేరు. సత్యమూ, శీలమూ మొదలగు సద్గుణాలు గలది. (5)
తస్యాస్య యత్నాచ్చరతః త్రైలోక్యమమరద్యుతే।
సుముఖో భవతః పౌత్రః రోచతే దుహితుః పతిః॥ 6
దేవకాంతికల నాగరాజా! ఆమెకు తగిన వరునకై ఎంతో పూనికతో మూడులోకాలను తిరుగుతున్న ఈ మాతలికి నీ పాత్రుడు సుముఖుడు తన కుమార్తెకు తగినవాడుగా నచ్చాడు. (6)
యది తే రోచతే సమ్యక్ భుజగోత్తమ మా చిరమ్।
క్రియతామార్యక క్షిప్రం బుద్ధిః కన్యాపరిగ్రహే॥ 7
సర్పశ్రేష్ఠా! ఆర్యకా! నీకు కూడా ఇష్టమైతే ఆలస్యం చేయకుండా వెంటనే ఈయన కుమార్తెను స్వీకరించటానికి నిశ్చయించు. (7)
యథా విష్ణుకులే లక్ష్మీః యథా స్వాహా విభావసోః।
కులే తవ తథైవాస్తు గుణకేశీ సుమధ్యమా॥ 8
విష్ణువు వంశంలో లక్ష్మిలాగా, అగ్నికి స్వాహాదేవిలాగా నీవంశంలో గుణకేశిని నిలుపుకో. (8)
పౌత్రస్యార్థే భవాంస్తస్మాద్ గుణకేశీం ప్రతీచ్ఛతు।
సదృశీం ప్రతిరూపస్య వాసవస్య శచీమివ॥ 9
కాబట్టి నీవు నీ పౌత్రుని కొరకు గుణకేశిని స్వీకరించు. ఇంద్రునికి శచీదేవిలాగా యోగ్యుడైన నీ పౌత్రునకు తగినది గుణకేశి. (9)
పితృహీనమపి హ్యేనం గుణతో వరయామహే।
బహుమానాచ్చ భవతః తథైవైరావతస్య చ॥ 10
సుముఖస్య గుణైశ్పైవ శీలశౌచదమాదిభిః।
నీ మీదా, ఐరావతుని మీదా మాకెంతో గౌరవం. సుముఖుడు శీలం, పవిత్రత, ఇంద్రియ సంయమనం మొదలయిన గుణాలు కలవాడు. కాబట్టి తండ్రిలేని వాడయినా గుణాల కారణంగా సుముఖుని వరిస్తున్నాము. (10 1/2)
అభిగమ్య స్వయం కన్యామ్ అయం దాతుం సముద్యతః॥ 11
మాతలిస్తస్య సమ్మానం కర్తుమర్హో భవానపి।
మాతలి తనంతతానుగా వచ్చి కన్య నివ్వటానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి నీవు కూడా అతని అభిప్రాయాన్ని మన్నించాలి. (11 1/2)
కణ్వ ఉవాచ
స తు దీనః ప్రహృష్టశ్చ ప్రాహ నారద మార్యకః॥ 12
కణ్వుడిలా అన్నాడు - ఆ ఆర్యకుడు ఆనందించి, దీనంగా నారదునితో ఇలా అన్నాడు. (12)
ఆర్యక ఉవాచ
వ్రియమాణే తథా పౌత్రే పుత్రే చ నిధనం గతే।
కథమిచ్ఛామి దేవర్షే గుణకేశీం స్నుషాం ప్రతి॥ 13
దేవర్షీ నారదా! పుత్రుడు మరణించాడు. పౌత్రుడు అదే విధంగా మృత్యువుచే వరింపబడి ఉన్నాడు. ఈ స్థితిలో గుణకేశిని కోడలుగా ఎలా స్వీకరించేది? (13)
న మే నైతద్ బహుమతం మహర్షే వచనం తవ।
సఖా శక్రస్య సంయుక్తః కస్యాయం నేప్సితో భవేత్॥ 14
మహర్షీ! నీమాట నాకు ఇష్టంలేదని కాదు. ఇంద్రునకు మిత్రుడైన ఈ మాతలితోడి సంబంధాన్ని ఎవరు ఇష్టపడరు? (14)
కారణస్య తు దౌర్బల్యాత్ చింతయామి మహామునే।
అస్య దేహకరస్తాత మమ పుత్రో మహాద్యుతే॥ 15
భక్షితో వైనతేయేన దుఃఖార్తాస్తేన వై వయమ్।
పునరేవ చ తేనోక్తం వైనతేయేన గచ్ఛతా।
మాసేనాన్యేన సుముఖం భక్షయిష్య ఇతి ప్రభో॥ 16
ధ్రువం తథా తద్భవితా జానీమస్తస్య నిశ్చయమ్।
తేన హర్షః ప్రణష్టో మే సుపర్ణవచనేన వై॥ 17
కానీ మహామునీ! తగిన కారణం వలన కలిగిన దౌర్బల్యంతో నేను ఆలోచించవలసి వస్తోంది. కాంతిమంతుడా! ఈ సుముఖునకు తండ్రి అయిన నా కుమారుని గరుత్మంతుడు భక్షించాడు. దానితో మేము దుఃఖంలో ఉన్నాం. మరలిపోతూ గరుడుడు "ఒక నెలలో సుముఖుని కూడా తింటా"నని చెప్పివెళ్ళాడు. స్వామి! అది తప్పక జరుగుతుంది. ఆ గరుత్మంతుని పట్టుదల అందరికీ తెలుసు. ఆ గరుత్మంతుని మాటతో నా ఆనందం నశించిపోయింది. (15-17)
కణ్వ ఉవాచ
మాతలిస్త్వబ్రవీదేనం బుద్ధిరత్ర కృతా మయా।
జామాతృభావేన వృతః సుముఖస్తవ పుత్రజః॥ 18
కణ్వుడిలా అన్నాడు - అప్పుడు మాతలి ఆర్యకునితో ఇలా అన్నాడు. నేను ఈ విషయాన్ని గురించి ఆలోచించాను. నీ పౌత్రుని - సుముఖుని - అల్లునిగా నేను వరించాను. (18)
సోఽయం మయా చ సహితః నారదేవ చ పన్నగః।
త్రిలోకేశం సురపతిం గత్వా పశ్యతు వాసవమ్॥ 19
కాబట్టి ఈ సుముఖుడు నాతో, నారద మహర్షితో కలిసి త్రిలోకాధిపతి, సురపతి అయిన ఇంద్రుని సందర్శిస్తాడు. (19)
శేషేణైవాస్య కార్యేణ ప్రజ్ఞాస్యామ్యహమయుషః।
సుపర్ణస్య విఘాతే చ ప్రయతిష్యామి సత్తమ॥ 20
సాధుశ్రేష్ఠా! ఆ తర్వాత నేను మరికొంత పని ముగించి ఇతని ఆయుష్షుకు హామీని తీసికొంటాను. సుపర్ణుడు ఇతనిని చంపలేనట్లుగా కూడా ప్రయత్నిస్తాను. (20)
సుముఖశ్చ మయా సార్ధం దేవేశమభిగచ్ఛతు।
కార్యసంసాధనార్థాయ స్వస్తి తేఽస్తు భుజంగమ॥ 21
నాగరాజా! నీకు మేలు కలుగుతుంది. సుముఖుడు మాకభీష్టమైన కార్యసంసిద్ధికోసం మాతో దేవేంద్రుని దగ్గరకు రావాలి. (21)
తతస్తే సుముఖం గృహ్య సర్వ ఏవ మహౌజసః।
దదృశుః శక్రమాసీనం దేవరాజం మహాద్యుతిమ్॥ 22
ఆ తరువాత తేజోమూర్తులయిన వారందరూ సుముఖుని తీసికొని కాంతిమంతుడై, సింహాసనాసీనుడై ఉన్న దేవేంద్రుని సందర్శించారు. (22)
సంగత్యా తత్ర భగవాన్ విష్ణురాసీ చ్చతుర్భుజః।
తతస్తత్ సర్వమాచఖ్యౌ నారదో మాతలిం ప్రతి॥ 23
దైవికంగా అక్కడే చతుర్భుజుడైన విష్ణువు కూడా ఉన్నాడు. అప్పుడు నారదుడు మాతలికి సంబంధించిన ఆ సమస్త వృత్తాంతాన్ని అక్కడ చెప్పాడు. (23)
వైశంపాయన ఉవాచ
తతః పురందరం విష్ణుః ఉవాచ భువనేశ్వరమ్।
అమృతం దీయతా మస్మై క్రియతా మమరై స్సమః॥ 24
వైశంపాయనుడిలా అన్నాడు - అప్పుడు విష్ణువు త్రిలోకాధిపతి అయిన ఇంద్రునితో ఇలా అన్నాడు - ఈ సుముఖునకు అమృతాన్ని ఇచ్చి అమరులతో సమానుని చెయ్యి. (24)
మాతలిర్నారదశ్పైవ సుముఖశ్పైవ వాసవ।
లభంతాం భవతః కామాత్ కామమేతం యథేప్సితమ్॥ 25
వాసవా! మాతలి, నారదుడు, సుముఖుడూ వీరంత నీ అభిష్టాన్ని అనుసరించి అమృతదానాన్ని పొంది తమ మనోరథాన్ని సఫలం చేసికోవాలి. (25)
పురందరోఽథ సంచింత్య వైనతేయపరాక్రమమ్।
విష్ణువేవాబ్రవీదేనం భవానేవ దదాత్వితి॥ 26
అపుడు దేవేంద్రుడు గరుత్మంతుని పరాక్రమాన్ని తలచుకొని "తమరే ఇవ్వండి" అని విష్ణువుతో అన్నాడు. (26)
విష్ణురువాచ
ఈశస్త్వం సర్వలోకానాం చరాణామచరాశ్చ యే।
త్వయా దత్తమదత్తం కః కర్తుముత్సహతే విభో॥ 27
విష్ణువు ఇలా అన్నాడు - స్వామీ! సర్వలోకాలలోని చరాచర ప్రాణులకన్నింటికీ నీవే పాలకుడవు. నీవు ఇచ్చిన దానిని కాదనటానికి ఎవడు సాహసించగలడు? (27)
ప్రాదాచ్ఛక్రస్తతస్తస్మై పన్నగాయాయురుత్తమమ్।
న త్వేనమమృతప్రాశం చకార బలవృత్రహా॥ 28
అప్పుడు బలాసుర వృత్రాసురులను సంహరించిన దేవేంద్రుడు సుముఖునకు మంచి ఆయువును అనుగ్రహించాడు. కానీ అమృతాన్ని ఆరగించనీయలేదు. (28)
లబ్ధ్వా వరం తు సుముఖః సుముఖః సంబభూవ హ।
కృతదారో యథాకామం జగామ చ గృహాన్ ప్రతి॥ 29
ఇంద్రుని వరాన్ని పొంది సుముఖుడు సుముఖుడయ్యాడు. పెండ్లి చేసికొని స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళిపోయాడు. (29)
నారదస్త్వార్యకశ్పైవ కృతకార్యౌ ముదా యుతౌ।
అభిజగ్మతు రభ్యర్చ్య దేవరాజం మహాద్యుతిమ్॥ 30
నారదుడూ, ఆర్యకుడూ కూడా కృతకృత్యులై ఆనందంతో కాంతిమంతుడైన దేవేంద్రుని అర్చించి వెళ్ళిపోయారు. (30)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి మాతలివరాన్వేషణే చతురధికశతతమోఽధ్యాయః॥ 104 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున మాతలి వరాన్వేషణ మను నూట నాలుగవ అధ్యాయము. (104)
(దాక్షిణాత్యధికపాఠము ఒక శ్లోకము కలుపుకొని మొత్తము 31 శ్లోకములు)