110. నూటపదియవ అధ్యాయము

పశ్చిమ దిక్కును వర్ణించుట.

సుపర్ణ ఉవాచ
ఇయం దిగ్ దయితా రాజ్ఞః వరుణస్య తు గోపతేః।
సదా సలిలరాజస్య ప్రతిష్ఠా చాదిరేవ చ॥ 1
గరుడుడిలా అన్నాడు - ఇదిగో ఈ దిక్కు జలాధిపతి అయిన వరుణరాజునకు ఎప్పుడూ ఇష్టమైనది. ఆయన జన్మస్థానం. ఆయనకు ఆశ్రయం కూడా ఇదే. (1)
అత్ర పశ్చాదహః సూర్యః విసర్జయతి గాః స్వయమ్।
పశ్చిమేత్యభివిఖ్యాతా దిగియం ద్విజసత్తమ॥ 2
ద్విజశ్రేష్ఠా! పగటితర్వాత సూర్యుడు ఈ దిక్కుననే తన కిరణాలను స్వయంగా ఉపసంహరించుకొంటాడు. కాబట్టి ఇది పశ్చిమ దిక్కుఅని ప్రసిద్ధిచెందింది. (2)
యాదసామత్ర రాజ్యేన సలిలస్య చ గుప్తయే।
కశ్యపో భగవాన్ దేవః వరుణం స్మాభ్యషేచయత్॥ 3
పూజ్యుడైన కశ్యపప్రజాపతి జలాన్ని, జలజంతువులనూ రక్షించుక్టకై ఈ దిక్కున వరుణునకు పట్టాభిషేకం చేశాడు. (3)
అత్ర పీత్వా సమస్తాన్ వై వరుణస్య రసాంస్తు షట్।
జాయతే తరుణః సోమః శుక్లస్యాదౌ తమిస్రహా॥ 4
చీకట్లను తొలగించే చంద్రుడు ఈ వరుణుని సన్నిధిలో ఆరు రకాల రసాలను పూర్తిగా పానం చేసి శుక్లపక్షప్రారంభంలో నూతనత్వాన్ని పొంది ఈ దిక్కుననే ఉదయిస్తాడు. (4)
అత్ర పశ్చాత్కృతా దైత్యాః వాయునా సంయతాస్తదా।
నిఃశ్వసంతో మహావాతైః అర్దితా సుషుపుర్ద్విజః॥ 5
బ్రాహ్మణా! ఇక్కడే ఒకప్పుడు వాయుదేవుడు ప్రచండవేగంతో యుద్ధంచేసి దైత్యులను ఓడించి, బంధించి, పీడించాడు. వారు నిట్టూర్పులు విడుస్తూ పడిపోయారు. (5)
అత్ర సూర్యం ప్రణయినం ప్రతిగృహ్ణాతి పర్వతః।
అస్తో నామ యతః సంధ్యా పశ్చిమా ప్రతిసర్పతి॥ 6
ఇక్కడే అస్తాద్రి ఉన్నది. అది తనకు ప్రీతిపాత్రుడైన సూర్యుని ప్రతిదినమూ గ్రహిస్తుంది. అక్కడనుండి సంధ్య ప్రసరిస్తుంది. (6)
అతో రాత్రిశ్చ నిద్రా చ నిర్గతా డివసక్షయే।
జాయతే జీవలోకస్య హర్తుమర్ధమివాయుషః॥ 7
ఈ దిక్కుననే పగలుపూర్తి కాగానే రాత్రి, నిద్ర ఉద్భవిస్తాయి. సమస్త ప్రాణుల ఆయుష్షులోనూ సగభాగాన్ని ఇవి అపహరిస్తాయి. (7)
అత్ర దేవీం దితిం సుప్తామ్ ఆత్మప్రసవధారిణీమ్।
విగర్భామకరోచ్ఛక్రః యత్ర జాతో మరుద్గణః॥ 8
ఈ దిక్కులోనే ఇంద్రుడు గర్భవతియై నిద్రిస్తున్న దితి గర్భాన్ని విచ్ఛిన్నం చేశాడు. ఆ గర్భం నుండియే మరుత్తులు ఉద్భవించాయి. (8)
అత్ర మూలం హిమవతః మందరం యాతి శాశ్వతమ్।
అపి వర్షసహస్రేణ న చాస్యాంతోఽధిగమ్యతే॥ 9
ఈ దిక్కుననే హిమవంతుని మూలభాగం మందరాచలం దాకా వ్యాపించి, దానిని స్పృశిస్తుంది. వేల సంవత్సరాలు గడచినా అది ముగిసిపోయే పరిస్థితి లేదు. (9)
అత్ర కాంచనశైలస్య కాంచనాంబురుహస్య చ।
ఉదధేస్తీరమాసాద్య సురభిః క్షరతే పయః॥ 10
ఈ దిక్కుననే బంగారుకొండ, బంగారుతామరలు గల క్షీరసాగరం తీరాన్ని చేరి సురభి పాలను స్రవిస్తుంది. (10)
అత్ర మధ్యే సముద్రస్య కబంధః ప్రతిదృశ్యతే।
స్వర్భానోః సూర్యకల్పస్య సోమసూర్యౌ జిఘాంసతః॥ 11
సూర్యచంద్రులను సంహరించాలని సంకల్పించిన సూర్యసమానుడైన రాహువు యొక్క కబంధం(మొండెం) ఈ దిక్కులోనే సముద్రంలో ఉంటుంది. (11)
సువర్ణశిరసోఽప్యత్ర హరిరోమ్ణః ప్రగాయతః।
అదృశ్యస్యాప్రమేయస్య శ్రూయతే విపులో ధ్వనిః॥ 12
ఈ దిక్కునందే పింగళవర్ణంతో ప్రకాశించే వెండ్రుకలు కలిగి, అప్రమేయప్రభావశాలి అయిన సువర్ణశిరస్క మహర్షి అదృశ్య రూపుడై సామగానం చేస్తుంటాడు. ఆ ధ్వని స్పష్టంగా వినిపిస్తుంటుంది. (12)
అత్ర ధ్వజవతీ నామ కుమారీ హరిమేధసః।
ఆకాశే తిష్ఠ తిష్ఠేతి తస్థౌ సూర్యస్య శాసనాత్॥ 13
ఇక్కడే హరిమేధసుని పుత్రి ధ్వజవతి ఉంటుంది. "నిలు - నిలు" అన్న సూర్యుని ఆదేశం మేరకు ఆమె అక్కడే నిలిచిఉంటుంది. (13)
అత్ర వాయుస్తథా వహ్నిః ఆపః ఖం చాపి గాలవ।
ఆహ్నికం చైవ నైశం చ దుఃఖం స్పర్శం విముంచతి॥ 14
గాలవా! గాలి, అగ్ని, నీరు, ఆకాశం, ఇవన్నీ రాత్రింబ వళ్ళయొక్క దుఃఖకరమైన స్పర్శను పరిత్యజిస్తాయి. (14)
వి॥సం॥ ఇక్కడి గాలి, అగ్ని, నీరు, ఆకాశం, ఎల్లప్పుడూ సుఖ స్పర్శ కలిగి ఉంటాయి. (నీల)
అతః ప్రభృతి సూర్యస్య తిర్యగావర్తతే గతిః।
అత్ర జ్యోతీంషి సర్వాణి విశంత్యాదిత్య మండలమ్॥ 15
ఇక్కడ నుండియే సూర్యుని తిరోగతి ప్రారంభ మవుతుంది. ఈ దిక్కుననే తారకలన్నీ సూర్యమండలంలో ప్రవేశించేది. (15)
అష్టావింశతి రాష్ట్రం చ చంక్రమ్య సహ భానునా।
నిష్పతంతిః పునః సూర్యాత్ సోమసంయోగయోగతః॥ 16
అభిజిత్తుతో కూడిన 28 నక్షత్రాలు ఒక్కొక్కటిగా 28 రోజులు సూర్యునితో కలిసి సంచర్రించి అమావాస్య తర్వాత మరల సూర్యమండలంనుండి విడిపోతాయి. (16)
అత్ర నిత్యం స్రవంతీనాం ప్రభవః సాగరోదయః।
అత్ర లోకత్రయస్యాపః తిష్ఠంతి వరుణాలయే॥ 17
ఈ దిక్కుననే నిరంతరంగా నదులు పుట్టి తమనీటితో సాగరాన్ని నింపుతుంటాయి. ఇక్కడే వరుణాలయంలో మూడు లోకాలకూ ఉపయోగపడే నీరు నిలువ చేయబడుతుంది. (17)
అత్ర పన్నగరాజస్యాప్యనంతస్య నివేశనమ్।
అనాదినిధనస్యాత్ర విష్ణోః స్థానమనుత్తమమ్॥ 18
ఈ దిక్కుననే నాగరాజయిన అనంతుని నివాసం.
ఆద్యంత రహితుడైన విష్ణువు యొక్క ఉత్తమస్థానం కూడా ఇదే. (18)
అత్రానలసఖస్యాపి పవనస్య నివేశనమ్।
మహర్షేః కశ్యపస్యాత్ర మారీచస్య నివేశనమ్॥ 19
అగ్నికి మిత్రుడైన వాయువు నివాసమూ ఇక్కడే. మరీచి కొడుకైన కశ్యపుని నివాసమూ ఇక్కడే. (19)
ఏష తే పశ్చిమో మార్గః దిగ్ ద్వారేణ ప్రకీర్తితః।
బ్రూహి గాలవ గచ్ఛావః బుద్ధిః కా ద్విజసత్తమ॥ 20
ద్విజశ్రేష్ఠా! నీకీ పశ్చిమ దిక్కును గూర్చి సంక్షేపంగా తెలియజేశాను. గాలవా! చెప్పు. నీ అభిప్రాయమేమిటి? ఎటు వెళ్దాం? (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే దశాధికశతతమోఽధ్యాయః॥ 110 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూట నూటపదియవ అధ్యాయము. (110)