111. నూటపదునొకండవ అధ్యాయము
ఉత్తర దిక్కును వర్ణించుట.
సుపర్ణ ఉవాచ
యస్మాదుత్తార్యతే పాపాద్ యస్మాన్నిఃశ్రేయసో ఽశ్నుతే।
అస్మాదుత్తారణబలాద్ ఉత్తరేత్యుచ్యతే ద్విజ॥ 1
గరుడుడిలా అన్నాడు - బ్రాహ్మణా! ఈ దిక్కులో పయనం మనుష్యుని పాపాలనుండి ఉద్ధరిస్తుంది. మోక్షసుఖాన్ని కలిగిస్తుంది. ఇలా ఉద్ధరింపగల(ఉత్తారణ) బలం కారణంగా ఇది ఉత్తరదిక్కు అనబడుతోంది. (1)
ఉత్తరస్య హిరణ్యస్య పరివాపశ్చ గాలవ।
మార్గః పశ్చిమపూర్వాభ్యాం దిగ్భ్యాం వై మధ్యమః స్మృతః॥ 2
గాలవా! ఇది ఉత్కృష్ట నిధులకు నివాసస్థానం. తూర్పు పడమర దిక్కులకు మధ్యది కనుక మధ్యమ మనికూడా దీనినంటారు. (2)
అస్యాం దిశి వరిష్ఠాయామ్ ఉత్తరాయాం ద్విజర్షభ।
నాసౌమ్యో నావిధేయాత్మా నాధర్మో వసతే జనః॥ 3
ద్విజశ్రేష్ఠా! ఈ ఉత్తరదిక్కు శ్రేష్ఠమైనది. సౌమ్యస్వభావం లేనివారికి, మనోనిగ్రహంలేని వారికి, అధర్మపరులకు ఈ దిక్కున తావులేదు. (3)
అత్ర నారాయణః కృష్ణః జిష్ణుశ్చైవ నరోత్తమః।
బదర్యామాశ్రమపదే తథా బ్రహ్మా చ శాశ్వతః॥ 4
ఈ దిక్కుననే బదరికాశ్రమమున్నది. అక్కడ సచ్చిదానందరూపుడయిన నారాయణుడు జయశీలుడైన నరుడు, శాశ్వతుడైన బ్రహ్మ నివసిస్తారు. (4)
అత్ర వై హిమవత్పృష్ఠే నిత్యమాస్తే మహేశ్వరః।
ప్రకృత్వా పురుషః సార్ధం యుగాంతాగ్నిసమప్రభః॥ 5
ఈ దిక్కుననే హిమవత్పర్వతంపై ప్రళయాగ్నివంటి కాంతి గలవాడూ, అంతర్యామి అయిన మహేశ్వరుడు ఉమతో కలిసి నిత్యం నివాసముంటాడు. (5)
న స దృశ్యో మునిగణైః తథా దేవైః సవాసవైః।
గంధర్వయక్షసిద్ధైర్వా నరనారాయణాదృతే॥ 6
ఆ మహేశ్వరుడు నరనారాయణులకు తప్ప మరెవ్వరికీ కనిపించడు. మహర్షులు కానీ, దేవతలు కానీ, దేవేంద్రుడు కానీ గంధర్వయక్షసిద్ధులు కానీ ఆయనను చూడలేరు. (6)
అత్ర విష్ణుః సహస్రాక్షః సహస్రచరణోఽవ్యయః।
సహస్రశిరసః శ్రీమాన్ ఏకః పశ్యతి మాయయా॥ 7
ఇక్కడ సహస్రశీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రచరణుడు, అవ్యయుడు అయిన శ్రీమహావిష్ణువు మాత్రమే మాయావిశిష్టుడైన ఆ మహేశ్వరుని చూడగలడు. (7)
అత్ర రాజ్యేన విప్రాణాం చంద్రమాశ్చాభ్యషిచ్యత।
అత్ర గంగాం మహాదేవః పతంతీం గగనాచ్చ్యుతామ్॥ 8
ప్రతిగృహ్య దదౌ లోకే మానుషే బ్రహ్మవిత్తమ।
విప్రశ్రేష్ఠా! ఈ ఉత్తర దిక్కుననే చంద్రుడు ద్విజరాజుగా అభిషిక్తుడయ్యాడు. ఇక్కడే ఆకాశం నుండి పడుతున్న గంగను పరమేశ్వరుడు శిరసావహించి మానవలోకానికి అందించాడు. (8)
అత్ర దేవ్యా తపస్తప్తం మహేశ్వరపరీప్సయా॥ 9
అత్ర కామశ్చ రోషశ్చ శైలశ్చోమా చ సంబభుః।
ఇక్కడే పార్వతి పరమేశ్వరుని వివాహమాడగోరి తపస్సు చేసింది. ఈ దిక్కుననే మహేశ్వరుని మోహింపజేయదలచిన కాముడు నిలిచింది. ఆ మదనుని దహించిన క్రోధం ఇక్కడే పుట్టింది. ఆ సమయంలో హిమవంతుడు, పార్వతి కూడా ఇక్కడే ఉన్నారు. (9 1/2)
అత్ర రాక్షసయక్షాణాం గంధర్వాణాం చ గాలవ॥ 10
ఆధిపత్యేన కైలాసే ధనదోఽప్యభిషేచితః।
అత్ర చైత్రరథం రమ్యమ్ అత్ర వైఖానసాశ్రమః॥ 11
గాలవా! ఈ దిక్కుననే కైలాస పర్వతం మీద రాక్షసయక్షగంధర్వాధిపతిగా కుబేరునకు పట్టాభిషేకం జరిగింది. రమణీయమయిన చైత్రరథమనే ఉద్యానవనం, వైఖానసమహర్షుల ఆశ్రమం ఇక్కడే ఉన్నాయి. (10-11)
అత్ర మందాకినీ చైవ మందరశ్చ ద్విజర్షభ।
అత్ర సౌగంధికవనం నైరృతైరభిరక్ష్యతే॥ 12
ద్విజశ్రేష్ఠా! ఇక్కడే ఆకాశ గంగ - మందాకినీ - మందరపర్వతం ఉంటాయి. ఈ దిక్కుననే సౌగంధికవనాన్ని రాక్షసులు రక్షిస్తుంటారు. (12)
శాద్వలం కదలీస్కంధమ్ అత్ర సంతానకా నగాః।
అత్ర సంయమనిత్యానాం సిద్ధానాం స్వైరచారిణామ్॥ 13
విమానాన్యనురూపాణి కామభోగ్యాని గాలవ।
పచ్చపచ్చని ఆకులతో ప్రకాశించే కదలీవనమూ, కల్పవృక్షమూ ఇక్కడే ఉంటాయి. గాలవా! ఇక్కడే నిరంతరమూ నిగ్రహాన్ని పాటిస్తూ స్వేచ్ఛాచరులయిన సిద్ధుల విమానాలు తిరుగుతుంటాయి. అవి వారికి అనుకూలమయినవీ, స్వేచ్ఛగా అనుభవింపదగినవి కూడా. (13)
అత్ర తే ఋషయః సప్త దేవీ చారుంధతీ తతా॥ 14
అత్ర తిష్ఠతి వై స్వాతిః అత్రాస్యా ఉదయః స్మృతః।
ఇక్కడే సప్తర్షులు, వసిష్ఠ పత్ని అరుంధతి ప్రకాశిస్తుంటారు. స్వాతి నక్షత్రం ఇక్కడే ఉదయిస్తుంది. ఇక్కడే ఉంటుంది. (14)
అత్ర యజ్ఞం సమాసాద్య ధ్రువం స్థాతా పితామహః॥ 15
జ్యోతీంషి చంద్రసూర్యౌ చ పరివర్తంతి నిత్యశః।
బ్రహ్మ యజ్ఞాన్ని చేస్తూ స్థిరంగా ఇక్కడ నివసిస్తాడు. నక్షత్రాలూ, చంద్రసూర్యులూ ఇక్కడ నిత్యం పరిభ్రమిస్తుంటాయి. (15)
అత్ర గంగా మహాద్వారం రక్షంతి ద్విజసత్తమ॥ 16
ధామా నామ మహాత్మానః మునయః సత్యవాదినః।
న తేషాం జ్ఞాయతే మూర్తిః నాకృతిర్న తపశ్చితమ్॥ 17
పరివర్తసహస్రాణి కామభోజ్యాని గాలవ।
విప్రోత్తమా! ఈ దిక్కుననే సత్యవాదులుగా ప్రసిద్ధికెక్కిన మహాత్ములు 'ధామ'నామకులు అయిన మహర్షులు గంగా మహాద్వారాన్ని సంరక్షిస్తుంటారు. వారి రూపం కానీ, ఆకారం కానీ, తపోబలం కానీ ఎవ్వరికీ తెలియవు. వేలకొలది ప్రళయాలు ముగిసి పోయినా వారి ఆయుస్సు వారి అధీనంలోనే ఉంటుంది. (16-17 1/2)
యథా యథా ప్రవిశతి తస్మాత్ పరతరం నరః॥ 18
తథా తథా ద్విజశ్రేష్ఠ ప్రవిలీయతి గాలవ।
నైతత్ కేనచిదన్యేన గతపూర్వం ద్విజర్షభ॥ 19
ఋతే నారాయణం దేవం నరం వా జిష్ణుమవ్యయమ్।
అత్ర కైలాసమిత్యుక్తం స్థానమైలవిలస్య తత్॥ 20
ద్విజశ్రేష్ఠా! మనుష్యుడు ఏయే గంగామహాద్వారం ముందుకు వెళతారో ఆయా ద్వారాల దగ్గరున్న హిమరాశిలో లీనమవుతాడు. ద్విజర్షభా! భగవంతుడైన నారాయణుడు, విజయశీలి, అవ్యయుడు అయిన నరుడు తప్ప మరే మనుష్యుడూ గంగామహాద్వారం దాటి ముందుకు పోలేడు. ఈ దిక్కుననే కుబేరనివాసమైన కైలాసగిరి ఉన్నది. (18-20)
అత్ర విద్యుత్ప్రభా నామ జిజ్ఞిరేఽప్సరసో దశ।
అత్ర విష్ణుపదం నామ క్రమతా విష్ణునా కృతమ్॥ 21
త్రిలోకవిక్రమే బ్రహ్మన్ ఉత్తరాం దిశమాశ్రితమ్।
అత్ర రాజ్ఞా మరుత్తేన యజ్ఞేనేష్టం ద్విజోత్తమ॥ 22
ఉశీరబీజే విప్రర్షే యత్ర జంబూనదం సరః।
ఈ దిక్కుననే విద్యుత్ప్రభలు అనుపేరుగల పదిమంది అప్సరలు పుట్టారు. బ్రాహ్మణా! మూడులోకాలనూ ఆక్రమించే వేళలో నారాయణుడు ఈ దిక్కున పాదం మోపాడు. ఆ విష్ణుపాద చిహ్నం. ఈ నాటికీ ఈ దిక్కున కనిపిస్తోంది. ద్విజోత్తమా! ఇక్కడే సువర్ణసరస్సుగల 'ఉశీరబీజ' ప్రాంతంలో మరుత్త మహారాజు యజ్ఞం చేశాడు. (21-22 1/2)
జీమూతస్యాత్ర విప్రర్షేః ఉపతస్థే మహాత్మనః॥ 23
సాక్షాద్ధైమవతః పుణ్యః విమలః కనకాకరః।
బ్రహ్మర్షి, మహాత్ముడు అయిన జీమూతుని సమక్షంలోనే హిమాలయంలో పవిత్రమూ, నిర్మలమూ అయిన స్వర్ణనిధి ఈ దిక్కుననే లభించింది. (23 1/2)
బ్రాహ్మణేషు చ యత్ కృత్స్నం స్వంతం కృత్వా ధనం మహత్॥ 24
వవ్రే ధనం మహర్షిః సః జైమూతం తద్ధనం తతః।
ఆ సంపూర్ణధనరాశిని ఆయన బ్రాహ్మణులకు బహూకరించి సద్వినియోగం చేశాడు. అయితే ఆ నిధి తనపేర వ్యవహరింపబడాలని మాత్రం కోరాడు. అందుకే ఆ నిధికి జైమూతమని పేరు. (24 1/2)
అత్ర నిత్యం దిశాంపాలాః సాయం ప్రాతర్ద్విజర్షభ॥ 25
కస్య కార్యం కిమితి వై పరిక్రోశంతి గాలవ।
ద్విజశ్రేష్ఠా! గాలవా! ఈ దిక్కుననే లోకపాలకులందరూ ప్రతినిత్యమూ ఉదయమూ, సాయంకాలమూ సమావేశమై ఎవరికి ఏ అవసరమున్నదో చర్చించుకొంటారు. (25 1/2)
ఏవమేషా ద్విజశ్రేష్ఠ గుణైరన్యైర్దిగుత్తరా॥ 26
ఉత్తరేతి పరిఖ్యాతా సర్వకర్మసు చోత్తరా।
ద్విజశ్రేష్ఠా! ఈ కారణాల చేతనూ, ఇతరేతర గుణాల చేతనూ కూడా ఈ దిక్కు శ్రేష్ఠమయినది. సమస్త శుభకర్మలకు కూడా ఇది మంచిది. కాబట్టే దీనికి ఉత్తర అనిపేరు. (26 1/2)
ఏతా విస్తరశస్తాత తవ సంకీర్తితా దిశః॥ 27
చతప్రః క్రమయోగేన కామాశాం గంతుమిచ్ఛసి।
నాయనా! ఈ విధంగా నాలుగు దిక్కులను గురించి క్రమంగా వివరంగా నీకు చెప్పాను. ఏ దిక్కునకు వెళ్ళదలచుకొన్నావో చెప్పు. (27 1/2)
ఉద్యతోఽహం ద్విజశ్రేష్ఠ తవ దర్శయితుం దిశః।
పృథివీం చాఖిలాం బ్రహ్మన్ తస్మాదారోహ మాం ద్విజ॥ 28
ద్విజశ్రేష్ఠా! నీకు దిక్కులనూ, సమస్తభూమండలాన్ని కూడా చూపించటానికి నేను సిద్ధపడి ఉన్నాను. నామీద కూర్చో. (28)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే ఏకాదశాధికశతతమోఽధ్యాయః॥ 111 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదునొకండవ అధ్యాయము. (111)