112. నూటపదిరెండవ అధ్యాయము

గరుడునిపై కూర్చుండి గాలవుడు తూర్పువైపు ప్రయాణించుట.

గాలవ ఉవాచ
గరుత్మన్ భుజగేంద్రారే సుపర్ణ వినతాత్మజ।
నయ మాం తార్ క్ష్య పూర్వేణ యత్ర ధర్మస్య చక్షుషీ॥ 1
గాలవుడిలా అన్నాడు. - గరుత్మంతుడా! సర్పవిరోధీ! సుపర్ణా! వినతాసుతా! తారాక్ష్యా! ధర్మానికి కన్నులవంటి సూర్యచంద్రులు ప్రకాశించే తూర్పుదిక్కునకు నన్ను ముందుగా తీసికొనివెళ్లు. (1)
పూర్వమేతాం దిశం గచ్ఛ యా పూర్వం పరికీర్తితా।
దేవతానాం హి సాన్నిధ్యమ్ అత్ర కీర్తితవానసి॥ 2
అత్ర సత్యం చ ధర్మశ్చ త్వయా సమ్యక్ ప్రకీర్తితః।
ఇచ్ఛేయం తు సమాగంతుం సమస్తైర్దైవతైరహమ్।
భూయశ్చ తాన్ సురాన్ ద్రష్టుమ్ ఇచ్ఛేయమరుణానుజ॥ 3
నీవు ముందుగా చెప్పిన తూర్పువైపే పద. ఇక్కడ దేవతల సాన్నిధ్యం కూడా ఉందన్నావు. కదా! ఇక్కడ సత్యధర్మాల ఉనికిని గురించి చక్కగా చెప్పావు గదా! అరుణుని తమ్ముడవైన గరుడా! నేను ఆ దేవతలనందరినీ కలిసి మరల మరలా వారిదర్శనం చేయాలనుకొంటున్నాను. (2-3)
నారద ఉవాచ
తమాహ వినతాసూనుః ఆరోహస్వేతి వై ద్విజమ్।
ఆరురోహాథ స మునిః గరుడం గాలవస్తదా॥ 4
నారదుడిలా అన్నాడు. - గరుత్మంతుడు "నాపై ఎక్కికూర్చో" అని గాలవునితో అన్నాడు. గాలవుడు అప్పుడు గరుడునిపైకెక్కి కూర్చున్నాడు. (4)
గాలవ ఉవాచ
క్రమమాణస్య తే రూపం దృశ్యతే పన్నగాశన।
భాస్కరస్యేవ పూర్వాహ్ణే సహస్రాంశోర్వివస్వతః॥ 5
సర్పాశనా! గరుడా! ఆకాశంలో ఎగురుతున్న నీ రూపం తొలిజాములో సహస్ర కిరణాలతో ప్రకాశిస్తూ భువన భాస్కరమయిన సూర్యుని రూపంలాగా కనిపిస్తోంది. (5)
పక్షవాత ప్రణున్నానాం వృక్షాణామనుగామినామ్।
ప్రస్థితానామివ సమం పశ్యామీహ గతిం ఖగ॥ 6
ఖగా! నీ రెక్కలగాలికి పైకిలేచిన చెట్లు వెనక్కు వెనక్కు వస్తున్నాయి. వీటి తీవ్రమైన వేగాన్ని చూస్తుంటే మనతోపాటు రావటానికి బయలుదేరినట్టుంది. (6)
ససాగరవనాముర్వీం సశైలవనకాననామ్।
ఆకర్షన్నివ చాభాసి పక్షవాతేన ఖేచర॥ 7
ఖేచరా! నీ రెక్కలగాలితో సముద్రజలరాశి, పర్వతాలు, తోటలు, అరణ్యాలతో సహా ఈ సమస్త భూమిని పైకి లాగుతున్నట్లుంది. (7)
సమీననాగవక్రం చ ఖమివారోప్యతే జలమ్।
వాయునా చైవ మహతా పక్షవాతేన చానిశమ్॥ 8
నిరంతరంగా రెక్కలను ఊపటంవలన పుట్టిన పెనుగాలి చేపలు, ఏనుగులు, మొసళ్ళతో పాటు సముద్రజలాన్ని ఆకాశం మీదికి తెస్తున్నట్లు అనిపిస్తోంది. (8)
తుల్యరూపాననాన్ మత్స్యాన్ తథా తిమితిమింగిలాన్।
నాగాశ్వనరవక్త్రాంశ్చ పశ్యామ్యున్మథితానివ॥ 9
ఒకే రూపం, ఒకేవిధమైన ముఖం గల చేపలూ, తిమితిమింగలాలూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ, మనుష్యుల వంటి జలజంతువులు నలిగిపోతూ కనిపిస్తున్నాయి. (9)
మహార్ణవస్య చ రవైః శ్రోత్రే మే బధిరే కృతే।
న శృణోమి న పశ్యామి నాత్మనో వేద్మి కారణమ్॥ 10
మహాసముద్రపు ఘోషతో నా చెవులు దిమ్మెట్త్తిపోతున్నాయి. నాకేమీ వినిపించటం లేదు. కనిపించటం లేదు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియటం లేదు. (10)
శనైః స తు భవాన్ యాతు బ్రహ్మవధ్యామనుస్మరన్।
న దృశ్యతే రవిస్తాత్ర న దిశో న చ ఖం ఖగ॥ 11
నాయనా! గరుడా! నెమ్మదిగా పద, లేకపోతే బ్రహ్మహత్య జరిగిపోతుంది. ఇప్పుడు నాకు సూర్యుడు కానీ, దిక్కులు కానీ, ఆకాశం కానీ కనిపించటం లేదు. (11)
తమ ఏవ తు పశ్యామి శరీరం తే న లక్షయే।
మణీవ జాత్యౌ పశ్యామి చక్షుషీ తేఽహ మండజ॥ 12
పక్షిరాజా! చీకటి తప్ప మరేమీ కనిపించటంలేదు. నీ శరీరం కూడా కనిపించటం లేదు. నీ కళ్ళు రెండు జాతి రత్నాలవలె నాకు కనిపిస్తున్నాయి. (12)
శరీరం తు న పశ్యామి తవ చైవాత్మనశ్చ హ।
పదే పదే తు పశ్యామి శరీరాదగ్నిముత్థితమ్॥ 13
నీ శరీరంకానీ నా శరీరం కానీ కనిపించటం లేదు. పదే పదే నీ శరీరం నుండి వెలువడుతున్న పైకెగసిన నిప్పు మాత్రమే కనిపిస్తోంది. (13)
స మే నిర్వాప్య సహసా చక్షుషీ శామ్యతే పునః।
తన్నియచ్ఛ మహావేగం గమనే వినతాత్మజ॥ 14
ఆ నిప్పు కన్నులకు మిరుమిట్లు గొలిపి వెంటనే ఆరిపోతోంది. వినతా కుమారా! గమనంలోని మహావేగాన్ని నియంత్రించు. (14)
న మే ప్రయోజనం కించిద్ గమనే పన్నగాశన।
సంనివర్త మహాభాగ న వేగం విషహామి తే॥ 15
పన్నగాశనా! మహానుభావా! ఇంత వేగంగా వెళ్ళటంలో నాకేమీ ప్రయోజనం కన్పించటం లేదు. వెనకకు మరలు. నీ వేగాన్ని నేను సహించలేను. (15)
గురవే సంశ్రుతానీహ శతాన్యష్టౌ హి వాజినామ్।
ఏకతః శ్యామకర్ణానాం శుభ్రాణాం చంద్రవర్చసామ్॥ 16
చంద్రునివలె తెల్లగా ఉండి, ఒకవైపు చెవి నల్లగా ఉన్న ఎనిమిదివందల గుఱ్ఱాలను ఇస్తానని గురువుగారికి మాట ఇచ్చాను. (16)
తేషాం చైవాపవర్గాయ మార్గం పశ్యామి నాండజ।
తతోఽయం జీవితత్యాగే దృష్టో మార్గో మయాత్మనః॥ 17
అండజా! ఆ గుఱ్ఱాలను ఇచ్చివేసే దారి నాకేదీ కనిపించటం లేదు. కాబట్టి నేను నాజీవితాన్ని పరిత్యజించే దారిని ఎన్నుకొన్నాను. (17)
నైవ మేఽస్తి ధనం కించిత్ న ధనేనాన్వితః సుహృత్।
న చార్థేనాపి మహతా శక్యమేతద్ వ్యపోహితుమ్॥ 18
నా దగ్గర కొంచెం కూడా ధనం లేదు. పోనీ డబ్బున్న మిత్రుడూ నాకు లేడు. ఇదేమో ధనరాశి లేకుండా అయ్యే పనీ కాదు. (18)
నారద ఉవాచ
ఏవం బహు చ దీనం చ బ్రువాణం గాలవం తదా।
ప్రత్యువాచ వ్రజన్నేవ ప్రహసన్ వినతాత్మజః॥ 19
నారదుడిలా అన్నాడు - ఈ విధంగా ఎంతో దీనంగా మాటాడుతున్న గాలవుని మాటలు విని గరుత్మంతుడు ప్రయాణం కొనసాగిస్తూనే నవ్వుతూ ఇలా అన్నాడు. (19)
నాతిప్రజ్ఞోఽసి విప్రర్షే యోఽత్మానం త్యక్తుమిచ్ఛసి।
న చాపి కృత్రిమః కాలః కాలో హి పరమేశ్వరః॥ 20
ద్విజశ్రేష్ఠా! నీవు ప్రాణత్యాగం చేయాలనుకొంటున్నావంటే అమాయకుడివని అర్థం. ఎందుకంటే మృత్యువు పరమేశ్వర స్వరూపమే కానీ ఎవరూ కృత్రిమంగా కల్పించేది కాదు. (20)
ద్విజశ్రేష్ఠా! నీవు ప్రాణత్యాగం చేయాలనుకొంటున్నావంటే అమాయకుడివని అర్థం. ఎందుకంటే మృత్యువు పరమేశ్వర స్వరూపమే కానీ ఎవరూ కృత్రిమంగా కల్పించేది కాదు. (20)
కిమహం పూర్వమేవేహ భవతా నాభిచోదితః।
ఉపాయోఽత్ర మహానస్తి యేనైతదుపపద్యతే॥ 21
నీవు ఇంతకుముందే నాకీ విషయమెందుకు చెప్పలేదు? నీ కార్యం సిద్ధించే గొప్ప ఉపాయమొకటుంది. (21)
తదేష ఋషభో నామ పర్వతః సాగరాంతికే।
అత్ర విశ్రమ్య భుక్త్వా చ నివర్తిష్యావ గాలవ॥ 22
గాలవా! ఇదిగో ఇది సముద్రానికి దగ్గరగా ఉన్న ఋషభ పర్వతం. ఇక్కడ విశ్రమించి భుజించి వెనుకకు మరలుదాం. (22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే ద్వాదశాధికశతతమోఽధ్యాయః॥ 112 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదిరెండవ అధ్యాయము. (112)