117. నూటపదునేడవ అధ్యాయము
దివోదాసు ప్రతర్దనుని కనుట.
గాలవ ఉవాచ
మహావీర్యో మహీపాలః కాశీనామీశ్వరః ప్రభుః।
దివోదాస ఇతి ఖ్యాతః భైమసేనిర్నరాధిపః॥1
తత్ర గచ్ఛావహే భద్రే శనైరాగచ్ఛ మా శుచః।
ధార్మికః సంయమే యుక్తః సత్యే చైవ జనేశ్వరః॥ 2
గాలవుడిలా అన్నాడు.
అమ్మా! కాశీరాజు భీమసేనుని కుమారుడు దివోదాసుఉడ్. ఆయన మహాపరాక్రమశాలి, ప్రఖ్యాతుడు. ఆయన దగ్గరకు వెళదాం. మెల్లగా నడు. బాధపడవద్దు. ఆ రాజు ధర్మాత్ముడూ సంయమనం గలవాడూ, సత్యపరాయణుడు కూడా. (1-2)
నారద ఉవాచ
తముపాగమ్య స మునిః న్యాయతస్తేన సత్కృతః।
గాలవః ప్రసవస్యార్థే తం నృపం ప్రత్యచోదయత్॥ 3
నారదుడిలా అన్నాడు.
గాలవమహర్షి ఆ దివోదాసు దగ్గరకు పోయి, శాస్త్రోక్తంగా ఆయన సత్కారాన్ని పొంది శుల్కాన్ని ఇచ్చి సంతానాన్ని పొందవలసినదిగ ఆయనను ప్రేరేపించాడు. (3)
దివోదాస ఉవాచ
శ్రుతమేతన్మయా పూర్వం కిముక్త్వా విస్తరం ద్విజ।
కాంక్షతో హి మయైషోఽర్థః శ్రుత్వైవ ద్విజసత్తమ॥ 4
దివోదాసు ఇలా అన్నాడు.
ద్విజశ్రేష్ఠా! ఈ విషయాన్ని నేను ఇంతకుముందే విని ఉన్నాను. వివరంగా చెప్పనవసరం లేదు. ఆ విషయాన్ని విన్నప్పుడే, నేను కూడా కుమారుని పొందాలని అభిలషించాను. (4)
ఏతచ్చ మే బహుమతం యదుత్సృజ్య నరాధిపాన్।
మామేవముపయాతోఽసి భావిచైతదసంశయమ్॥5
ఇతర మహారాజుల నందరినీ విడిచి నా దగ్గరకే తమరు రావటం నన్ను గౌరవించుటమే. తమ పని తప్పక జరుగుతుంది. (5)
స ఏవ విభవోఽస్మాకమ్ అశ్వానామపి గాలవ।
అహమప్యేకమేవాస్యాం జనయిష్యామి పార్థివమ్॥ 6
గాలవా! నా అశ్వసంపద కూడా ఆ పాటియే. కాబట్టి నేను కూడా ఈమెయందు ఒక్క కుమారునే కంటాను. (6)
తథేత్యుక్త్వా ద్విజశ్రేష్ఠః ప్రాదాత్ కన్యాం మహీపతేః।
విధిపూర్వం చ తాం రాజా కన్యాం ప్రతిగృహీతవాన్॥ 7
ద్విజశ్రేష్ఠుడైన గాలవుడు అలాగే అని అంగీకరించి, రాజుకు కన్య నిచ్చాడు. ఆ రాజు శాస్త్రోక్తంగా ఆ కన్యను ప్రతిగ్రహించాడు. (7)
రేమే స తస్యాం రాజర్షిః ప్రభావత్యాం యథా రవిః।
స్వాహాయాం చ యథా వహ్నిః యథా శర్యాం చ వాసవః॥ 8
యథా చంద్రశ్చ రోహిణ్యాం యథా ధూమోర్ణయా యమః।
వరుణశ్చ యథా గౌర్యాం యథా చర్ధ్యాం ధనేశ్వరః॥ 9
యథా నారాయణో లక్ష్మ్యాం జాహ్నవ్యాం చ యథోదధిః।
యథా రుద్రశ్చ రుద్రాణ్యాం యథా వేద్యాం పితామహః॥ 10
అదృశ్యంత్యాం చ వాసిష్ఠః వసిష్ఠశ్చాక్షమాలయా।
చ్యవనశ్చ సుకన్యాయాం పులస్త్యః సంధ్యయా యథా॥ 11
అగస్త్యశ్చాపి వైదర్భ్యాం సావిత్ర్యాం సత్యవాన్ యథా।
యథా భృగుః పులోమాయామ్ అదిత్యాం కశ్యపో యథా॥ 12
రేణుకాయాం యథార్చీకః హైమవత్యాం చ కౌశికః।
బృహస్పతిశ్చ తారాయాం శుక్రశ్చ శతపర్వణా॥ 13
యథా భూమ్యాం భూమిపతిః ఉర్వశ్యాం చ పురూరవాః।
ఋచీకః సత్యవత్యాం చ సరస్వత్యాం యథా మనుః॥ 14
శకుంతలాయాం దుష్యంతః ధృత్యాం ధర్మశ్చ శాశ్వతః।
దమయంత్యాం నలశ్చైవ సత్యవత్యాం చ నారదః॥ 15
జరత్కారుర్జరత్కార్వాం పులస్త్యశ్చ ప్రతీచ్యయా।
మేనకాయాం యథోర్ణాయః తుంబురుశ్చైవ రంభయా॥ 16
వాసుకిః శతశీర్షాయాం కుమార్యాం చ ధనంజయః।
వైదేహ్యాం చ యథా రామః రుక్మిణ్యాం చ జనార్దనః॥ 17
తథా తు రమమాణస్య దివోషాసస్య భూపతేః।
మాధవీ జనయామాస పుత్రమేకం ప్రతర్దనమ్॥ 18
ప్రభావతితో సూర్యునివలె, స్వాహాదేవితో అగ్నిదేవునివలె, శచితో ఇంద్రునివలె, రోహిణితో చంద్రునివలె, ధూమోర్ణతో యమునివలె, గౌరితో వరుణునివలె, ఋద్ధితో కుబేరునివలె, లక్ష్మితో నారాయణువలె, జాహ్నవితో సముద్రునివలె, పార్వతితో శివునివలె, వేదితో పితామహునివలె, అదృశ్యంతితో వాసిష్ఠునివలె, అక్షమాలతో(అరుంధతితో) వసిష్ఠునివలె, సుకన్యతో చ్యవనునివలె, సంధ్యతో పులస్త్యునివలె, వైదర్భితో (లోపాముద్రతో) అగస్త్యునివలె, సావిత్రితో సత్యవంతునివలె, పులోమతో భృగువువలె, అదితితో కశ్యపునివలె, రేణుకతో జమదగ్నివలె, హైమవతితో కౌశికునివలె, తారతో బృహస్పతివలె, శతపర్వతో శుక్రునివలె, భూమితో భూమిపతివలె, ఊర్వశితో పురూరవునివలె, సత్యవతితో ఋచీకునివలె, సరస్వతితో మనువువలె, శకుంతలతో దుష్యంతునివలె, దమయంతితో నలునివలె, సత్యవతితో నారదునివలె, జరుత్కారువుతో జరత్కారునివలె, ప్రతీచితో పులస్త్యునివలె, మేనకతో ఊర్ణాయువువలె, రంభతో తుంబురునివలె, శతశీర్షతో వాసుకివలె, కుమారితో ధనంజయునివలె, సీతతో రామునివలె, రుక్మిణితో శ్రీకృష్ణునివలె ఆమెతో దివోదాసు క్రీడించాడు. ఆ విధంగా క్రీడించిన దివోదాసునకు మాధవి ప్రతర్దనుడను కొడుకును కన్నది. (8-18)
అథాజగామ భగవాన్ దివోదాసం స గాలవః।
సమయే సమనుప్రాప్తే వచనం చేదమబ్రవీత్॥ 19
ఆ తరువాత తగిన సమయంలో ఆ గలమహర్షి దివోదాసు దగ్గరకు పోయి ఇలా అన్నాడు. (19)
నిర్యాతయతు మే కన్యాం భవాంస్తిష్ఠంతు వాజినః।
యావదన్యత్ర గచ్ఛామి శుల్కార్థం పృథివీపతే॥ 20
మహారాజా! రాజకన్య మాధ్వినిని తిరిగి ఇవ్వండి. గుఱ్ఱాలను తమ దగ్గరే ఉంచండి. గురుదక్షిణకు తగిన శుల్కానికై మరోచోటికి వెళ్తాను. (20)
దివోదాసోఽథ ధర్మాత్మా సమయే సమయే గాలవస్య తామ్।
కన్యాం నిర్యాతయామాస స్థితః సత్యే మహీపతిః॥ 21
ధర్మాత్ముడూ, సత్యనిష్ఠుడు అయిన దివోదాసు అనుకొన్న సమయానికి గాలవునకు మాధవిని తిరిగి ఇచ్చాడు. (21)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే సప్తదశాధికశతతమోఽధ్యాయః॥ 117 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదునేడవ అధ్యాయము. (117)