118. నూటపదునెనిమిదవ అధ్యాయము
ఉశీనరుడు మాధవియందు శిబిని కనుట.
నారద ఉవాచ
తథైవ తాం శ్రియం త్యక్త్వా కన్యా భూత్వా యశస్వినీ।
మాధవీ గాలవం విప్రమ్ అభ్యయాత్ సత్యసంగరా॥ 1
నారదుడిలా అన్నాడు. యశస్వినియై, సత్యపాలనయందు ఆసక్తిగల ఆ మాధవి కాశీరాజ్యలక్ష్మిని వదలి కన్యయై విప్రవరుడైన గాలవునితో పాటు వెళ్ళింది. (1)
గాలవో విమృశన్నేవ స్వకార్యగతమానసః।
జగామ భోజనగరం ద్రష్టుమౌశీనరం నృపమ్॥ 2
గాలవుడు తన కార్యసాధనను గురించి ఆలోచిస్తూ ఉశీనరమహారాజును చూడదలచి భోజనగరానికి ప్రయాణం చేశాడు. (2)
తమునాచాథ గత్వా సః నృపతిం సత్యవిక్రమమ్।
ఇయం కన్యా సుతౌ ద్వౌ తే జనయిష్యతి పార్థినౌ॥ 3
గాలవుడు సత్యవిముక్రముడైన ఆ ఉశీనరమహారాజు దగ్గరకు పోయి "రాజా! ఈ కన్య నీకు భూపాలకులు కాగల ఇద్దరు కుమారులను ప్రసాదిస్తుంది" అని చెప్పాడు. (3)
అస్యాం భవానవాస్తార్థః భవితా ప్రేత్య చేహ చ।
సోమార్క ప్రతిసంకాశౌ జనయిత్వా సుతౌ నృప॥ 4
రాజా! ఈమె ద్వారా సూర్యచంద్ర సమానులైన ఇద్దరు కొడుకులను పొంది నీవు ఇహపరలోకాలలో పూర్ణకాముడవు కాగలవు. (4)
శుల్కం తు సర్వధర్మజ్ఞ హయానాం చంద్రవర్చసామ్।
ఏకతః శ్యామకర్ణానాం దేయం మహ్యం చతుశ్శతమ్॥ 5
సర్వధర్మజ్ఞా! చంద్రకాంతి గలిగి, ఒక వైపు చెవి నల్లగా ఉన్న నాలుగు వందల గుఱ్ఱాలను నాకివ్వటమే దీనికి తగిన శుల్కం. (5)
గుర్వర్థోఽయం సమారంభః న హయైః కృత్యమస్తి మే।
యది శక్యం మహారాజ క్రియతామవిచారితమ్॥ 6
మహారాజా! ఇది గురుదక్షిణను ఇవ్వటం కోసమే కానీ నాకు గుఱ్ఱాలతో పనిలేదు. ఈ శుల్కాన్ని ఇవ్వటం సాధ్యమయితే నిస్సందేహంగా ఉపక్రమించండి. (6)
అనపత్యోఽసి రాజర్షే పుత్రౌ జనయ పార్థివ।
పితౄన్ పుత్రప్లవేవ త్వమ్ ఆత్మానం చైవ ట్Hఆరయ॥ 7
రాజర్షీ! నీవు సంతానహీనుడవు. సంతానాన్ని పొందు. పుత్రుడనే నావతో నిన్ను, నీ పితురులను తరింప చెయ్యి. (7)
న పుత్రఫలభోక్తా హి రాజర్షే పాత్యతే దివః।
న యాతి నరకం ఘోరం యథా గచ్ఛంత్యనాత్మజాః॥ 8
రాజర్షీ! పుత్రోత్పత్తివలన కలిగిన పుణ్యాన్ని పొందినవాడు స్వర్గం నుండి నెట్టివేయబడడు. అంతేగాక సంతానహీనులు పోయే ఘోరనరకాలకు కూడా పోడు. (8)
ఏతచ్చాన్యచ్చ వివిధం శ్రుత్వా గాలవభాషితమ్।
ఉశీనరః ప్రతివచః దదౌ తస్య నరాధిపః॥ 9
అనేక విషయాలు చెప్పిన గాలవుని మాటలను విని ఉశీనరనరపాలుడు ఆయనకిలా సమాధానం చెప్పాడు. (9)
శ్రుతవానస్మి తే వాక్యం యథా వదసి గాలవ।
విధిస్తు బలవాన్ బ్రహ్మన్ ప్రవణం హి మనో మమ॥ 10
బ్రహ్మర్షీ! గాలవా! తమరు చెప్పినదంతా విన్నాను. విధి బలీయమైనది. ఈమె యందు సంతానాన్ని పొందాలని నా మనస్సు ఉవ్విళులూరుతోంది. (10)
శతౌ ద్వే తు మమాశ్వానామ్ ఈదృశానాం ద్విజోత్తమః।
ఇతరేషాం సహస్రాణి సుబహూని చరంతి మే॥ 11
ద్విజశ్రేష్ఠా! అటువంటి గుఱ్ఱాలు నా దగ్గర రెండు వందలు మాత్రమే ఉన్నాయి. ఇతర జాతులకు చెందినవి నేలకు వేలుగా ఉన్నాయి. (11)
అహమప్యేకమేవాస్యాం జనయిష్యామి గాలవ।
పుత్రం ద్విజ గతం మార్గం గమిష్యామి పరైరహమ్॥ 12
బ్రాహ్మణా! గాలవా! నేను కూడా ఈమె యందు ఒక్క కుమారునే పొందగలను. ఇతరులు నడచిన బాటలోనే నేనూ నడుస్తాను. (12)
మూల్యేనాపి సమం కుర్యాం తవాహం ద్విజసత్తమ్।
పారజానపదార్థం తు మమార్థో నాత్మభోగతః॥ 13
బ్రాహ్మణోత్తమా! నేను గుఱ్ఱాలకు వెలను చెల్లించి తమ ఋణాన్ని మొత్తం తీర్చివేయగలను. కానీ నా సంపదలు పౌరజానపదుల కొరకే. నా సుఖాల కొరకు కాదు గదా. (13)
కామతో హి ధనం రాజా పారక్యం యః ప్రయచ్ఛతి।
న స ధర్మేణ ధర్మాత్మన్ యుజ్యతే యశసా న చ॥ 14
ధర్మాత్మా! ఇతరుల ధనాన్ని తన ఇచ్చివచ్చినట్లు దానం చేసిన రాజు ధర్మానికీ, కీర్తికీ కూడా దూరమవుతాడు. (14)
సోఽహం ప్రతిగృహీష్యామి దదాత్వేతాం భవాన్ మమ।
కుమారీం దేవగర్భాభామ్ ఏకపుత్రభవాయ మే॥ 15
కాబట్టి దేవకాంతులవలె సౌందర్యవతి అయిన ఈమెను ఒక్క కుమారుని పొందటానికే ఇవ్వండి. నేను పరిగ్రహిస్తాను. (15)
తథా తు బహుథా కన్యామ్ ఉక్తవంతం నరాధిపమ్।
ఉశీనరం ద్విజశ్రేష్ఠః గాలవః ప్రత్యపూజయత్॥ 16
ఈ విధంగా కన్యను గురించి అనేక విధాలుగా(న్యాయ బద్ధంగా) మాటాడుతున్న ఉశీనర మహారాజు మాటలు విని గాలవుడు ఆయననెంతో ప్రశంసించారు. (16)
ఉశీనరం ప్రతిగ్రాహ్య గాలవః ప్రయయౌ వనమ్।
రేమే స తాం సమాసాద్య కృతపుణ్య ఇవ శ్రియమ్॥ 17
ఉశీనరునకు మాధవిని ఇచ్చి గాలవుడు వనాలకు వెళ్ళిపోయాడు. ఉశీనరుడును ఆమెను స్వీకరించి, పుణ్యాత్ముడు సంపదల ననుభవించినట్లుగా ఆమెతో క్రీడించాడు. (17)
కందరేషు చ శైలానాం నదీనాం నిర్ఘరేషు చ।
ఉద్యానేషు విచిత్రేషు వనేషూపననేషు చ॥ 15
హర్మ్యేషు రమణీయేషు ప్రాసాదశిఖరేషు చ।
వాతాయనవిమానేషు తథా గర్భగృహేషు చ॥ 19
పర్వతగుహలలో, నదీతీరాల్లో, సెలయేళ్లలో, విచిత్రమైన ఉద్యానవనాలలో, అరణ్యాలలో, తోటల్లో, అందమైన భవనాలలో, మేడలపైభాగాలలో, గాలిలో ఎగిరే విమానాలలో, భూమిలో నిర్మించిన గర్భగృహాలలో ఆ ఉశీనరుడు మాధవితో క్రీడించాడు. (18-19)
తతోఽస్య సమయే జజ్ఞౌ పుత్రో బాలరవిప్రభః।
శిబిర్నామ్నాభివిఖ్యాతః యః స పార్థివసత్తమః॥ 20
ఆ తర్వాత తగిన సమయంలో బాలభానుని వంటి తేజస్సు గల కుమారుడు కలిగాడు. పెరిగి పెద్దయిన తర్వాత శ్బిపేరున ప్రసిద్ధి వహించిన రాజశ్రేష్ఠుడు అతడే. (20)
ఉపస్థాయ స తం విప్రః గాలవః ప్రతిగృహ్య చ।
కన్యాం ప్రయాతస్తాం రాజన్ దృష్టవాన్ వివతాత్మజమ్॥ 21
ఆ విప్రుడు గాలవుడు ఉశీనరుని సన్నిధికి వచ్చి మాధవిని తీసికొని ప్రయాణమయ్యాడు. రాజా! ఆ సమయంలో వైనతేయుడు కన్పించాడు. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే అష్టాదశాధికశతతమోఽధ్యాయః॥ 118 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదునెనిమిదవ అధ్యాయము. (118)