126. నూట ఇరువదియారవ అధ్యాయము

భీష్మద్రోణులు దుర్యోధనునకు మరల నచ్చజెప్పుట.

వైశంపాయన ఉవాచ
ధృతరాష్ట్రవచః శ్రుత్వా భీష్మద్రోణౌ సమవ్యథౌ।
దుర్యోధనమిదం వాక్యమ్ ఊచతుః శాసనాతిగమ్॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - ధృతరాష్ట్రుని మాటలు విని భీష్మద్రోణులు ఒకే తీరున కలతపడుతూ పెద్దల మాటలను అతిక్రమిస్తున్న సుయోధనునితో ఇలా అన్నారు. (1)
యావత్ కృష్ణావసంనద్ధౌ యావత్ తిష్ఠతి గాండివమ్।
యావద్ ధౌమ్యో న మేధాగ్నౌ జుహోతీహ ద్విషద్బలమ్॥ 2
యావన్న ప్రేక్షతే క్రుద్ధః సేనాం తవ యుధిష్ఠిరః।
హ్రీనిషేవో మహేష్వాసః తావచ్ఛామ్యతు వైశసమ్॥ 3
నాయనా! కృష్ణార్జునులు యుద్ధానికి సంసిద్ధులు కాకముందే, గాండీవాన్ని ఎక్కుపెట్టక ముందే, ధౌమ్యుడు తన మేధాగ్ని తో శత్రుబలాన్ని వ్రేల్చకముందే, బిడియపడే స్వభావం గల మహాధనుర్ధరుడైన ధర్మరాజు కోపంతో నీ సేనను చూడకముందే జనవినాశనకారణం సమసిపోవాలి. (2-3)
యావన్న దృశ్నతే పార్థః స్వేఽప్యనీకే వ్యవస్థితః।
భీమసేనో మహేష్వాసః తావచ్ఛామ్యతు వైశసమ్॥ 4
గొప్పవిలుకాడైన భీమసేనుడు తన సేనకు ముందు నిలిచి కనిపించకముందే జనవినాశనసంకల్పం శమించాలి. (4)
గొప్పవిలుకాడైన భీమసేనుడు తన సేనకు ముందు నిలిచి కనిపించకముందే జనవినాశనసంకల్పం శమించాలి. (4)
యావన్న చరతే మార్గాన్ పృతనామభిధర్షయన్।
భీమసేనో గదాపాణిః తావత్ సంశామ్య పాండవైః॥ 5
చేత గదను పట్టిన భీమసేనుడు నీ సేనను సంహరిస్తూ రణభూమిలో వివిధగతులతో సంచరించక ముందే పాండవులతో సంధిచేసికో. (5)
యావన్న శాతయత్యాజౌ శిరాంసి గజయోధినామ్।
గదయా వీరఘాతిన్యా ఫలానీవ వనస్పతేః॥ 6
కాలేన పరిపక్వాని తావచ్ఛామ్యతు వైశసమ్।
భీమసేనుడు శత్రువులను తుదముట్టించగల గదతో ఏనుగులనెక్కి యుద్ధంచేస్తున్న వీరుల తలలను చెట్టున పండిన పండ్లను రాలగొట్టినట్టు రాలగొట్టుతున్నప్పుడు నీ రణాభిలాష నశిస్తుంది. (6 1/2)
నకులః సహ్దేవశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః॥ 7
విరాటశ్చ శిఖండీ చ శైసుపాలిశ్చ దంశితాః।
యావన్న ప్రవిశంత్యేతే నక్రా ఇవ మహార్ణవమ్॥ 8
కృతాస్త్రాః క్షిప్రమస్యంతః తావచ్ఛామ్యతు వైశసమ్।
నకులుడు, సహదేవుడు, ద్రుపదునికొడుకు ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, శిఖండి, శిశుపాలుని కొడుకు ధృష్టకేతువు - అస్త్రవిద్యానిపుణులయిన ఈ వీరులందరూ కవచాలు ధరించి మహాసముద్రంలో మొసళ్ళు ప్రవేశించినట్లు నీ సేనలలో ప్రవేశించకముందే నీ జనవినాశన సంకల్పం నశించాలి. (7-8 1/2)
యావన్న సుకుమారేషు శరీరేషు మహీక్షితామ్॥ 9
గార్ధపత్రాః పతంత్యుగ్రాః తావచ్ఛామ్యతు వైశసమ్।
ఈ రాజుల సుకుమార శరీరాలపై ఉగ్రస్వరూపం గల బాణాలు పడకముందే నీ యుద్ధసంకల్పం సమసిపోవాలి. (9 1/2)
చందనాగురుదిగ్ధేషు హారనిష్కధరేషు చ।
నోరస్సు యావద్ యోధానాం మహేష్వాసైర్మహేషవః॥ 10
కృతాస్రైః క్షిప్రమస్యద్భిః దూరపాతిభిరాయసాః।
అభిలక్ష్యైర్నిపాత్యంతే తావచ్ఛామ్యతు వైశసమ్॥ 11
దగ్గర కాకముందే లక్ష్యాన్ని దెబ్బ తీయగలవారూ, వేగంగా బాణాలను ప్రయోగించగల్వారు సుదూరలక్ష్యాన్ని కూడా ఛేదించగలవారూ, అస్త్రవిద్యాధురంధరులూ, అయిన నీ శత్రువీరులు చందనాగరులేపనం గలిగి హారనిష్కాలతో ప్రవేశిస్తున్న నీ సేనల గుండెలపై పెద్ద పెద్ద బాణాల వర్షాన్ని కురిపించకముందే నీ యుద్ధాలోచనను విరమించాలి. (10-11)
అభివాదయమానం త్వాం శిరసా రాజకుంజరః।
పాణిభ్యాం ప్రతిగృహ్ణాతు ధర్మరాజో యుధిష్ఠిరః॥ 12
నీవు శిరస్సువంచి నమస్కరిస్తే రాజశ్రేష్ఠుడూ, ధర్మనందనుడూ అయిన యుధిష్ఠిరుడు నిన్ను చేతులతో దగ్గరకు తోసికోవాలని మేము ఆశిస్తున్నాము. (12)
ధ్వజాంకుశపతాకాంకం దక్షిణం తే సుదక్షిణః।
స్కంధే నిక్షిపతాం బాహుం శాంతయే భరతర్షభ॥ 13
భరతశ్రేష్ఠా! సుదక్షిణుడు అయిన ధర్మరాజు ధ్వజాంకుశ పతాకల గుర్తులుగల తన దక్షిణ బాహువును జగత్ప్రశాంతికై నీ భుజంపై వేయాలని మా ఆకాంక్ష. (13)
రత్నౌషధిసమేతేన రత్నాంగుళితలేన చ।
ఉపవిష్టస్య పృష్ఠం తే పాణినా పరిమార్జతు॥ 14
నీ దగ్గర కూర్చొని రత్నౌషధులతో కూడిన ఎఱ్ఱని తన అరచేతితో యుధిష్ఠిరుడు నీ వీపుపై మెల్లగా నిమరాలి. (14)
వి॥సం॥ రత్నౌషధిసమేత మనగా దాన సమయంలో పెట్టుకొనే శ్రేష్ఠమైన ఔషధులు, దర్భలు మొ॥. (లక్షా)
శాలస్కంధో మహాబాహుః త్వాం స్వజానో వృకోదరః।
సామ్నాభివదతాం చాపి శాంతయే భరతర్షభ॥ 15
భరతశ్రేష్ఠా! సాలవృక్షపు బోదెల వంటి భుజాలుగల మహాబాహువు వృకోదరుడు శాంతిస్థాపనకై నిన్ను దగ్గరకు తీసికొని సాంత్వన వచనాలు పలకాలి. (15)
అర్జునేన యమాభ్యాం చ త్రిభిస్తైరభివాదితః।
మూర్థ్ని తాన్ సముపాఘ్రాయ ప్రేమ్ణాభివద పార్థివ॥ 16
రాజా! అర్జున నకుల సహదేవుల ప్రణామాలు స్వీకరించి వారి శిరస్సుల నాఘ్రాణించి ప్రేమపూర్వకంగా వారితో నీవు మాటాడాలి. (16)
దృష్ట్వా త్వాం పాండవైర్వీరైః భ్రాతృభిః సహ సంగతమ్।
యావదానందజాశ్రూణి ప్రముంచంతు నరాధిపాః॥ 17
వీరులూ, నీ సోదరులూ అయిన పాండవులతో నీవు కలిసి ఉంటే చూచి రాజులంతా ఆనంద బాష్పాలను రాల్చాలి. (17)
ఘుష్యతాం రాజధానీషు సర్వసంపన్మహీక్షితామ్।
పృథివీ భ్రాతృభావేన భుజ్యతాం విజ్వరో భవ॥ 18
భూపాలుర రాజధాను లన్నింటిలో కౌరవపాండవ వ్యవహారం సుసంపన్నమైనట్లు ప్రకటింపజేయి. నీవూ, యుధిష్ఠిరుడు సోదర భవంతో రాజ్యాన్ని అనుభవించండి. నీ చింతలన్నీ తొలగించుకో. (18)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భీష్మద్రోణవాక్యే షడ్వింశత్యధికశతతమోఽధ్యాయః॥ 126 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున భగవద్వాక్యమను భీష్మద్రోణవాక్యమను నూట ఇరువది యారవ అధ్యాయము. (126)