125. నూట ఇరువది అయిదవ అధ్యాయము

భీష్మద్రోణవిదుర ధృతరాష్ట్రులు దుర్యోధనునకు నచ్చజెప్పుట.

వైశంపాయన ఉవాచ
తతః శాంతనవో భీష్మః దుర్యోధనమమర్షణమ్।
కేసవస్య వచః శ్రుత్వా ప్రోవాచ భరతర్షభ॥ 1
వైశంపాయను డిలా అన్నాడు.
భరతర్షభా1 శ్రీకృష్ణుని మాటలు విని శంతనుసుతుడైన భీష్ముడు అసహనశీలి అయిన దుర్యోధనునితో ఇలా అన్నాడు. (1)
కృష్ణేన వాక్యముక్తోఽసి సుహృదాం శమమిచ్ఛతా।
అన్వపద్యస్వ తత్ తాత మా మన్యువశమన్వగాః॥ 2
నాయనా! సోదరుల మధ్య సంధిని కోరుతీ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను స్వీకరించు. క్రోధానికి లొంగిపోవద్దు. (2)
అకృత్వా వచనం తాత కేశవస్య మహాత్మనః।
శ్రేయో న జాతు న సుఖం న కళ్యాణమవాప్స్ససి॥ 3
నాయనా! మహాత్ముడైన శ్రీకృష్ణుని మాటలను తిరస్కరించి శ్రేయస్సును కానీ, సుఖాన్ని కానీ, శుభాన్ని కానీ ఎప్పుడూ పొందలేవు. (3)
ధర్మ్యమర్థ్యం మహాబాహుః ఆహ త్వాం తాత కేశవః।
తదర్థమభిపద్య్స్య మా రాజన్ నీవశః ప్రజాః॥ 4
నాయనా! మహాబాహువయిన శ్రీకృష్ణుడు ధర్మార్థసమ్మతమయిన మాట చెప్పాడు. రాజా! దాన్ని పాటించు. ప్రజావినాశనం చేయవద్దు. (4)
జ్వలితాం త్వమిమాం లక్ష్మీం భారతీం సర్వరాజసు।
జీవతో ధృతరాష్ట్రస్య దౌరాత్మ్యాద్ భ్రంశయిష్యసి॥ 5
ఈ భారతవంశరాజ్యలక్ష్మి సమస్త రాజలోకంలో ప్రకాశిస్తున్నది. కానీ నీవు, దృతరాష్ట్రమహారాజు జీవించి ఉండగానే నీ దుర్మార్గంలో పతనం చేస్తున్నావు. (5)
ఆత్మానం చ సహామాత్యం సపుత్రభ్రాతృబాంధవమ్।
అహమిత్యనయా బుద్ధ్యా జీవితాద్ భ్రంశయిష్యసి॥ 6
నీ అహంకారబుద్ధి కారణంగా నీవు, పుత్రులు, సోదరులు, బంధువులు, అమాత్యులతో సహా జీవితాన్ని పతనం చేసికొంటున్నావు. (6)
అతిక్రామన్ కేశవస్య తథ్యం వచనమర్థవత్।
పితుశ్చ భరతశ్రేష్ఠ విదురస్య చ ధీమతః॥ 7
మా కులఘ్నః కుపురుషః దుర్మతిః కాపథం గమః।
మాతరం పితరం చైవ మా మజ్జీః శోకసాగరే॥ 8
భారతశ్రేష్ఠా! శ్రీకృష్ణుని మాట సత్యమూ, సార్థకమూ కూడా. దానినీ, నీ తండ్రి మాటనూ, ధీమంతుడైన విదురుని మాటనూ కాదని దారితప్పవద్దు. వంశనాశకుడవై, కుపురుషుడనై, దుర్మతినై తల్లిదండ్రులను కూడా శోకసాగరంలో ముంచవద్దు. (7-8)
అథ ద్రోణోఽబ్రవీత్ తత్ర దుర్యోధనమిదం వచః।
అమర్షవశమాపన్నం నిఃశ్వసంతం పునః పునః॥ 9
అప్పుడు అసహనానికిలోనై, పదే పదే నిట్టూరుస్తున్న దుర్యోధనునితో ద్రోణుడు ఇలా అన్నాడు. (9)
ధర్మార్థయుక్తం వచనమ్ ఆహ త్వాం తాత కేశవః।
తథా భీష్మః శాంతనవః తజ్జుషస్వ నరాధిప॥ 10
నాయనా! శ్రీకృష్ణుడు నీకు ధర్మార్థసంగతమయిన మాట చెప్పాడు. రాజా! శంతనుసుతుడు భీష్ముడు కూడా ఆ విధంగానే చెప్పాడు. దానిని విను. (10)
ప్రాజ్ఞౌ మేధావినౌ దాంతౌ అర్థకామౌ బహుశ్రుతౌ।
ఆహతుస్త్వాం హితం వాక్యం తజ్జుషస్వ నరాధిప॥ 11
రాజా! ప్రాజ్ఞులూ, మేధావులూ, జితేంద్రియులూ, పండితులూ, నీ హితాన్ని కోరేవారూ అయిన శ్రీకృష్ణభీష్ములు హితకరమైన మాట చెప్పారు. దానిని గ్రహించు. (11)
అనుతిష్ఠ మహాప్రాజ్ఞ కృష్ణభీష్మౌ యదూచతుః।
(మా వచో లఘుబుద్ధీనాం సమాస్థాస్త్వం పరంతప)
మాధవం బుద్ధిమోహేన మావమంస్థాః పరంతప॥ 12
మహాప్రాజ్ఞా! కృష్ణ భీష్ములు చెప్పిన మాటలను ఆచరించు. (అల్పబుద్ధుల మాటలపై ఆధారపడవద్దు). పరంతపా! బుద్ధి చలించి శ్రీకృష్ణుని అవమానించవద్దు. (12)
యే త్వాం ప్రోత్సాహయంత్యేతే నైతే కృత్యాయ కర్హిచిత్।
వైరం పరేషాం గ్రీవాయాం ప్రతిమోక్ష్యంతి సంయుగే॥ 13
నిన్ను యుద్ధానికి ప్రోత్సహిస్తున్న వారెవరూ ఎన్నడూ పనికి వచ్చేవారు కాదు. యుద్ధకాలంలో శత్రుత్వభారాన్ని ఇతరులమెడలపై పడవేసేవారే. (13)
మా జీఘనః ప్రజాః సర్వాః పుత్రాన్ భ్రాతౄన్ తథైవ చ।
వాసుదేవార్జునౌ యత్ర విద్ధ్యజేయానలం హి తాన్॥ 14
సమస్త ప్రజలనూ, పుత్రులనూ, సోదరులనూ చంపుకోవద్దు. శ్రీకృష్ణార్జునులు ఉన్న పక్షం యుద్ధంలో అజేయమని గ్రహించు. (14)
ఏతచ్చైవ మతం సత్యం సుహృదోః కృష్ణభీష్మయోః।
యది నాదాస్యసే తాత పశ్చాత్ తప్స్యసి భారత॥ 15
నాయనా! భారతా! నిజంగా నీ హితాన్ని కోరుతున్న కృష్ణభీష్ముల అభిప్రాయమిదే. ఇప్పుడు స్వీకరించకపోతే తరువాత బాధపడవలసివషుంది. (15)
యథోక్తం జామదగ్న్యేన భూయానేష తతోఽర్జునః।
కృష్ణో హి దేవకీపుత్రః దేవైరపి సుదుస్సహః।
కింతే సుఖప్రియేణేహ ప్రోక్తేన భరతర్షభ॥ 16
ఏతత్ తే సర్వమాఖ్యాతం యథేచ్ఛసి తథా కురు।
న హి త్వాముత్సహే వక్తుం భూయో భరతసత్తమ॥ 17
అర్జునుడు పరశురాముడు చెప్పిన దానికన్నా ఎక్కువే. దేవకీసుతుడైన శ్రీకృష్ణుడు దేవతలకు కూడా సహింపరానివాడు. భరతర్షభా! నీకు సుఖాన్ని, మేలునూ కల్గించే మాటలు చెప్పి ఏం లాభం. చెప్పవలసినదంతా చెప్పాను. నీకు ఎలా తోస్తే అలా చేసికో. భరతసత్తమా! నీకు ఇంతకు మించి చెప్పటానికి నాకు ఉత్సాహం లేదు. (16-17)
వైశంపాయన ఉవాచ
తస్మిన్ వాక్యాంతరే వాక్యం క్షత్తాపి విదురోఽబ్రవీత్।
దుర్యోధనమభిప్రేక్ష్య ధార్తరాష్ట్రమమర్షణమ్॥ 18
వైశంపాయనుడిలా అన్నాడు.
ద్రోణుని మాటలు ముగియగానే అసహనశీలి అయిన దుర్యోధనునితో విదురుడిలా అన్నాడు. (18)
దుర్యోధన న శోచామి త్వామహం భరతర్షభ।
ఇమౌ తు వృద్ధౌ శోచామి గాంధారీం పితరం చ తే॥ 19
భరతశ్రేష్ఠా! దుర్యోధనా! నీ గురించి నాకు చింత లేదు. కానీ వృద్ధులయిన నీ తల్లిదండ్రులను గురించి ఆలోచిస్తున్నాను. (19)
యావనాథౌ చరిష్యేథే త్వయా నాథేన దుర్హృదా।
హతమిత్రౌ హతామాత్యౌ లూనపక్షావివాండజౌ॥ 20
నీ వంటి దుష్టబుద్ధి సహాయంతో జీవించవలసివచ్చిన వీరు, మిత్రులూ, మంత్రులూ అందరూ మరణించిన తర్వాత అనాథలై రెక్కలు తెగిన పక్షులవుతారు. (20)
భిక్షుకౌ విచరిష్యేతే శోచంతౌ పృథివీమిమామ్।
కలఘ్నమీదృశం పాపం జనయిత్వా కుపూరుషమ్॥ 21
వంశనాశకుడవు, పాపాత్ముడవూ అయిన నీవంటి చెడ్డకొడుకును కన్నందుకు బాధపడుతూ భీక్షకులవలె అడుక్కు తింటూ లోకమంతా తిరగవలసివస్తుంది. (21)
అథ దుర్యోధనం రాజా ధృతరాష్ట్రోఽభ్యభాషత।
ఆసీనం భ్రాతృభిః సార్ధం రాజభిః పరివారితమ్॥ 22
అప్పుడు సోదరులతో కలసి రాజుల మధ్యలో కూర్చొని ఉన్న దుర్యోధనునితో ధృతరాష్ట్రమహారాజు ఇలా అన్నాడు. (22)
దుర్యోధన నిబోధేదం శౌరిణోక్తం మహాత్మనా।
ఆదత్స్వ శివమత్యంతం యోగక్షేమవదవ్యయమ్॥ 23
దుర్యోధనా! మహాత్ముడైన శ్రీకృష్ణుడు చెప్పినది విను అది శుభంకరమూ, Yఒగక్షేమకరమూ, ఎప్పటికైనా ఉపయోగపడునదీ. (23)
అనేన హి సహాయేన కృష్ణేనాక్లిష్టకర్మణా।
ఇష్టాన్ సర్వానభిప్రాయాన్ ప్రాప్స్యామః సర్వరాజషు॥ 24
అనాయాసంగా ఎంతపనినైనా సాధించగల ఈ శ్రీకృష్ణుని సహకారంతో, సమస్త రాజులచేతనూ మన్నింపబడి మన కోరికలను సఫలం చేసికొనవచ్చు. (24)
సుసంహతః కేశవేన తాత గచ్ఛ యుధిష్ఠిరమ్।
చర స్వస్త్యయనం కృత్స్నం భారతానాం అనామయమ్॥ 25
నాయనా! శ్రీకృష్ణునితో కలిసి ధర్మరాజు దగ్గరకు వెళ్ళు. భారతవంశానికి ఏ వినాశనమూ లేకుండా పరిపూర్ణశుభాలను సాధించుకో. (25)
వాసుదేవేన తీర్థేన తాత గచ్ఛస్వ సంశమమ్।
కాలప్రాప్తమిదం మన్యే మా త్వం దుర్యోధనాతిగాః॥ 26
నాయనా! శ్రీకృష్ణుని సాధనం చేసుకొని సంధి కుదుర్చుకో. ఇదే నీకు ఇప్పట్కి తగిన పనిగా నేననుకొంటున్నాను. నా ఆదేశాన్ని అతిక్రమించవద్దు. (26)
శమం చేద్ యాచమానం త్వం ప్రత్యాఖ్యాస్యసి కేశవమ్।
త్వదర్థమభిజల్పంతం న తవాస్త్యపరాభవః॥ 27
నీవొక వేళ నీ హితాన్ని కోరియే, సంధిని అభ్యర్థిస్తూ మాటాడుతున్న శ్రీకృష్ణుని మాటలను తిరస్కరిస్తే, నీకు పరాభవం తప్పదు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భీష్మాదివాక్యే పంచవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 125 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున భీష్మాదివాక్యమను నూట ఇరువది అయిదవ అధ్యాయము. (125)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకము కలుపుకొని మొత్తం 27 1/2 శ్లోకములు)