129. నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము

ధృతరాష్ట్రుడు గాంధారిని పిలిపించుట; ఆమె దుర్యోధనునకు బోధచేయుట.

వైశంపాయన ఉవాచ
కృష్ణస్య తు వచః శ్రుత్వా ధృతరాష్ట్రో జనేశ్వరః।
విదురం సర్వధర్మజ్ఞం త్వరమాణో ఽభ్యభాషత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - శ్రీకృష్ణుని మాటవిని ధృతరాష్ట్రమహారాజు సర్వధర్మవేత్త అయిన విదురునితో వేగిరపాటుతో ఇలా అన్నారు. (1)
గచ్ఛ తాత మహాప్రాజ్ఞ గాంధారీం దీర్ఘదర్శినీమ్।
ఆనయేహ తయా సార్ధమ్ అనునేష్యామి దుర్మతిమ్॥ 2
నాయనా! వెళ్ళు, బుద్ధిమతీ, దీర్ఘదర్శిని అయిన గాంధారిని తీసికొనిరా. ఆమెను కలుపుకొని దుర్మతి అయిన సుయోధనునికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను. (2)
యది సాపి దురాత్మానం శమయేద్ దుష్టచేతసమ్।
అపి కృష్ణస్య సుహృదః తిష్ఠేమ వచనే వయమ్॥ 3
ఆమె అయిన దుష్టబుద్ధిగల ఈ దుర్మార్గుణ్ణి శాంతింపజేయగలిగితే మనమంతా మన మేలుకోరే శ్రీకృష్ణుని మాటను అనుసరిద్దాం. (3)
అపి లోభాభిభూతస్య పంథాన మనుదర్శయేత్।
దుర్బుద్ధేర్దుప్సహాయస్య శమార్థమ్ బ్రువతీ వచః॥ 4
దుర్యోధనుడు లోభానికి లోనయినవాడు. దుర్బుద్ధిగలవాడు. అతని సహాయకులు కూడా దుర్మార్గులే. గాంధారి శాంతికై తగిన మాటలు చెప్పి సుయోధనుని సరి అయిన మార్గంలో పెట్టవచ్చు. (4)
అపి నో వ్యసనం ఘోరం దుర్యోధనకృతం మహత్।
శమయేచ్చిరరాత్రాయ యోగక్షేమవదవ్యయమ్॥ 5
ఆ విధంగా జరిగితే దుర్యోధనుని కారణంగా కలిగిన ఈ మహాఘోరవిపత్తునుండి శాశ్వతంగా మనం బయటపడవచ్చు. చిరస్థాయులయిన యోగక్షేమాలను పొందవచ్చు. (5)
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా విదురో దీర్ఘదర్శినీమ్।
ఆనయామాస గాంధారీం ధృతరాష్ట్రస్య శాసనాత్॥ 6
ధృతరాష్ట్రుని మాటను విని రాజాదేశం మేరకు విదురుడు దీర్ఘదృష్టిగల గాంధారిని తీసికొనివచ్చాడు. (6)
ధృతరాష్ట్ర ఉవాచ
ఏష గాంధారి పుత్రస్తే దురాత్మా శాసనాతిగః।
ఐశ్వర్యలోభాదైశ్వర్యం జీవితం చ ప్రహాస్యతి॥ 7
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - గాంధారీ! ఈ నీ కొడుకు దురాత్ముడై పెద్దల ఆదేశాలన్ అతిక్రమిస్తున్నాడు. ఐశ్వర్యలోభం వలన ఉన్న ఐశ్వర్యాన్ని, ప్రాణాలనూ కూడా పొగొట్టుకొనబోతున్నాడు. (7)
అశిష్టవదమర్యాదః పాపైః సహ దురాత్మవాన్।
సభాయా నిర్గతో మూఢః వ్యతిక్రమ్య సుహృద్వచః॥ 8
మర్యాదలనతిక్రమించిన ఆ దురాత్ముడు నీ కొడుకు శ్రేయోభిలాషులయిన మంచివారి మాటలను కూడా లెక్కచేయక పాపాత్ములయిన తన అనుచరులతో కలిసి మూఢుడై సభ నుండి వెళ్ళిపోయాడు. (8)
వైశంపాయన ఉవాచ
సా భర్తృవచనం శ్రుత్వా రాజపుత్రీ యశస్వినీ।
అన్విచ్ఛంతీ మహచ్ఛ్రేయః గాంధారీ వాక్యమబ్రవీత్॥ 9
వైశంపాయనుడిలా అన్నాడు - భర్తమాటను విని యశస్విని, రాజపుత్రి అయిన గాంధారి మహాశ్రేయస్సును కాంక్షిస్తూ ఇలా అన్నది. (9)
గాంధార్యువాచ
ఆనాయయ సుతం క్షిప్రం రాజ్యకాముకమాతురమ్।
న హి రాజ్యమశిష్టేన శక్యం ధర్మార్థలోపినా॥ 10
ఆప్తుమాప్తం తథాపీదమ్ అవినీతేన సర్వథా।
గాంధారి ఇలా అన్నాది. - రాజ్యముకుడై వేగిరపడుతున్న కుమారుని వెంటనే పిలిపించండి. ధర్మార్థాలు లోపించిన చెడ్డవాడెవ్వడూ రాజ్యాన్ని పొందలేడు. అయినా కూడా సర్వవిధాలా అవినీతుడయిన ఆ సుయోధనుడు రాజ్యపీఠాన్ని పొందాడు. (10 1/2)
త్వం హ్యేవాత్ర భృశం గర్హ్యః ధృతరాష్ట్ర సుతప్రియః॥ 11
యో జానన్ పాపతామస్య తత్ప్రజ్ఞామనువర్తసే।
మహారాజా! ధృతరాష్ట్రా! ఈ విషయంలో పుత్రప్రేమగల నిన్నే ఎక్కువగా నిందించాలి. వాడు దుర్మార్గుడని తెలిసి కూడా వాడి ఆలోచనలనే అనుసరిస్తున్నారు. (11 1/2)
స ఏష కామమన్యుభ్యాం ప్రలబ్దో లోభమాస్థితః॥ 12
అశక్యోఽద్య త్వయా రాజన్ వినివర్తయితుం బలాత్।
రాజా! అటువంటి సుయోధనుడు కామక్రోధాలకు లోనయి ఉన్నాడిప్పుడు. లోభంలో చిక్కుకొని ఉన్నాడు. బలపూర్వకంగా ఇప్పుడు వెనుకకు మరలించటం వీలుకాదు. (12 1/2)
రాష్ట్రప్రదానే మూఢస్య బాలిశస్య దురాత్మనః॥ 13
దుఃసహాయస్య లుబ్ధస్య దృతరాష్ట్రో ఽశ్నుతే ఫలమ్।
మూఢుడూ, అజ్ఞానీ, దుర్మార్గుడూ, లుబ్ధుడూ, దుష్టమిత్రులుగలవాడూ అయిన దుర్యోధనునకు రాజ్యప్రదానం చేసిన దాని ఫలితాన్ని ధృతరాష్ట్రుడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. (13 1/2)
కథం హి స్వజనే భేదమ్ ఉపేక్షేత మహీపతిః।
భిన్నం హి స్వజనేన త్వాం ప్రహసిష్యంతి శత్రవః॥ 14
యా హి శక్యా మహారాజ సామ్నా భేదేన వా పునః।
విస్తర్తుమాపదః స్వేషు దండం కస్తత్ర పాతయేత్॥ 13
ఏ రాజయినా తనవారిలోనే విభేదాలు రావటాన్ని ఎలా ఉపేక్షించగలడు. తన వారితో విభేదాలు తెచ్చుకొన్న నిన్ను శత్రువులు అపహాస్యం చేస్తారు.
మహారాజా! సామభేదోపాయాలలో ఒకదానితో దాటిపోగల ఆపద విషయంలో తన వారిపై దండోపాయాన్ని ఎవరైనా ప్రయోగిస్తారా? (14-15)
వైశంపాయన ఉవాచ
శాసనాద్ ధృతరాష్ట్రస్య దుర్యోధనమమర్షణమ్।
మాతుశ్చ వచనాత్ క్షత్తా సభాం ప్రావేశయత్ పునః॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు - తల్లిదండ్రులయిన గాంధారీ ధృతరాష్ట్రుల ఆజ్ఞమేరకు విదురుడు అసహనశీలి అయిన దుర్యోధనుని మరల సభలో ప్రవేశపెట్టాడు. (16)
స మాతుర్వచనాకాంక్షీ ప్రవివేశ పునః సభామ్।
అభితామ్రేక్షణః క్రోధాత్ నిఃశ్వసన్నివ పన్నగః॥ 17
దుర్యోధనుని కళ్ళు కోపంతో ఎఱ్ఱబారి ఉన్నాయి. పాములాగా బుసకొడుతూ కూడా తల్లిమాట వినాలని మరల సభలో ప్రవేశించాడు. (17)
తం ప్రవిష్టమభిప్రేక్ష్య పుత్రముత్పథమాస్థితమ్।
విగర్హమాణా గాంధారీ శమార్థం వాక్యమబ్రవీత్॥ 18
దారితప్పిన తన కొడుకు మరల సభలో ప్రవేశించటాన్ని చూచి గాంధారి అతనిని అభిశంసిస్తూ శాంతిస్థాపనకై ఇలా అన్నది. (18)
దుర్యోధన నిబోధేదం వచనం మమ పుత్రక।
హితం తే సానుబంధస్య తథాయత్యాం సుఖోదయమ్॥ 19
వత్సా! దుర్యోధనా! నా మాట విను. ఇది నీకూ, నీవారికీ కూడా హితాన్ని కల్గించగలది. భవిష్యత్తులో కూడా సుఖాన్ని కల్పించగలది. (19)
దుర్యోధన యదాహ త్వాం పితా భరతసత్తమ।
భీష్మో ద్రోణః కృపః క్షత్తా సుహృదాం కురు తద్వచః॥ 20
భరతసత్తమా! మీ తండ్రీ, భీష్ముడూ, ద్రోణుడూ, కృపుడూ, విదురుడూ చెప్పినట్టు చేయి. ఈ నీ హితైషుల మాటలను పాటించు. (20)
భీష్మస్య తు పితుశ్చైవ మమ చాపచితిః కృతా।
భవేద్ ద్రోణముఖానాం చ సుహృదాం శామ్యతా త్వయా॥ 21
నీవు శాంతించితే భీష్మునీ, మీ తండ్రినీ, నన్నూ ద్రోణాదులయిన హితాభిలాషులనూ సత్కరించినట్లే. (21)
న హి రాజ్యం మహాప్రాజ్ఞ స్వేన కామేన శక్యతే।
అవాప్తుం రక్షితుం వాపి భోక్తుం భరతసత్తమ॥ 22
భరతశ్రేష్ఠా! మహామతీ! రాజ్యాన్ని మన ఇష్టం వచ్చినట్లు పొందటం కానీ, రక్షించటం కానీ అనుభవించటం కానీ కుదిరేది కాదు. (22)
న హ్యవశ్యేంద్రియో రాజ్యమ్ అశ్నీయాద్ దీర్ఘమంతరమ్।
విజితాత్మా తు మేధావీ స రాజ్యమభిపాలయేత్॥ 23
జితేంద్రియుడు కానివాడు చిరకాలం రాజ్యాన్ని అనుభవించలేడు. కాబట్టి తనను తాను జయించిన మేధావియే రాజ్యపాలన చేయాలి. (23)
కామక్రోధౌ హి పురుషమ్ అర్థేభ్యో వ్యపకర్షతః।
తౌ తు శత్రూ వినిర్జిత్య రాజా విజయతే మహీమ్॥ 24
కామక్రోధాలు పురుషుని అర్థసిద్ధికి దూరం చేస్తాయి. ఆ ఇద్దరు శత్రువులను జయించిన రాజే భూమిపై గెలుపు పొందగలడు. (24)
లోకేశ్వర ప్రభుత్వం హి మహదేతద్ దురాత్మభిః।
రాజ్యం నామేప్సితం స్థానం న శక్యమభిరక్షితుమ్॥ 25
జనేశ్వరా! ప్రభుత్వం అన్నది చాలా గొప్పది. రాజ్యమన్న పేరుతో దురాత్ములు ఆ స్థానాన్ని అభిలషిస్తారు. కానీ ఆ రాజ్యాన్ని రక్షించటం వీలుకాని విషయం. (25)
ఇంద్రియాణి మహత్ప్రేప్సుః నియచ్ఛేదర్థదర్మయోః।
ఇంద్రియైర్నియతైర్బుద్ధిః వర్ధతేఽగ్నిరివేంధనైః॥ 26
మహాస్థానాలను పొందదలచినవాడు తన ఇంద్రియాలను అర్థధర్మాల విషయంలో నియంత్రించాలి. ఇంద్రియాలను అదుపుచేసినప్పుడే ఇంధనంతో అగ్ని మండినట్లు బుద్ధి ప్రజ్వరిల్లుతుంది. (26)
అవిధేయాని హీమాని వ్యాపాదయితుమప్యలమ్।
అవిధేయా ఇవాదాంతాః హయాః పథి కుసారథిమ్॥ 27
పొగరెక్కిన గుఱ్ఱాలను అదుపుచేయలేని కుసారథిని అవి మార్గమధ్యంలోనే చంపగలిగినట్టు ఇంద్రియాలు నియంత్రణలో లేకపోతే మనుష్యుని నశింపజేస్తాయి. (27)
అవిజిత్య య ఆత్మానమ్ అమాత్యాన్ విజిగీషతే।
అమిత్రాన్ వాజితామాత్యః సోఽవశః పరిహీయతే॥ 28
తననుతాను గెలువక అమాత్యులను జయించగోరేవాడు, మంత్రులను గెలవకుండా శత్రువులను గెలువగోరేవాడు వివశుడై వంచితుడు అవుతాడు. (28)
ఆత్మానమేవ ప్రథమం ద్వేష్యరూపేణ యోజయేత్।
తతోఽమాత్యానమిత్రాంశ్చ న మోఘం విజిగీషతే॥ 29
ముందుగా తాను తననే శత్రువుగా ప్రకల్పించుకోవాలి. గెలవాలి. ఆ తరువాత అమాత్యులనూ, శత్రువులనూ గెలవాలి. అప్పుడే జయించాలన్న కోరిక వ్యర్థం కాదు. (29)
వశ్యేంద్రియం జితామాత్యం ధృతదండం వికారిషు।
పరీక్ష్యకారిణం ధీరమ్ అత్యర్థం శ్రీర్నిషేవతే॥ 30
ఇంద్రియాలను అదుపు చేసికొని, అమాత్యులను వశంలో ఉంచుకొని, అపరాధులను దండించగలుగుతూ, చక్కగా ఆలోచించి పనిచేసే ధీరునికి లక్ష్యం చక్కగా చేకూరుతుంది. (30)
క్షుద్రాక్షేణేవ జాలేన ఝుషామపిహితావుభౌ।
కామక్రోధౌ శరీరస్థౌ ప్రజ్ఞానం తౌ విలుంపతః॥ 31
చిన్న చిల్లులు గల వలలో చిక్కుపడిపోయిన రెండు చేపలవలె కామక్రోధాలు శరీరంలో నిలిచి మనుష్యుని జ్ఞానాన్ని లోపింపజేస్తాయి. (31)
యాభ్యాం హి దేవాః స్వర్యాతుః స్వర్గస్య పిదధుర్ముఖమ్।
బిభ్యతోఽనుపరాగస్య కామక్రోధౌ స్మ వర్ధితౌ॥ 32
కామక్రోధాలనే ఈ రెండింటి ద్వారానే దేవతలు స్వర్గానికి వెళ్ళదలచిన వారికై ద్వారాలను మూసి ఉంచుతున్నారు. వీతరాగులంతా స్వర్గానికి వస్తారని భయపడి, స్వర్గప్రాప్తి ప్రతిబంధకాలయిన కామక్రోధాలను దేవతలు వృద్ధిచేశారు. (32)
కామం క్రోధం చ లోభం చ దంభం దర్పం చ భూమిపః।
సమ్యగ్ విజేతుం యో వేద స మహీమభిజాయతే॥ 33
కామ, క్రోధ, లోభ, దంభ, దర్పాలను చక్కగా గెలవటం తెలిసిన రాజే భూమండలాన్ని పరిపాలించగలుగుతాడు. (33)
సతతం నిగ్రహే యుక్తః ఇంద్రియాణాం భవేన్నృపః।
ఈప్సన్నర్థం చ ధర్మంచ ద్విషతాం చ పరాభవమ్॥ 34
అర్థధర్మాలను, శత్రువుల పరాభవాన్ని కోరుకొంటున్న రాజు ఎల్లప్పుడూ ఇంద్రియాలను అదుపులో ఉంచగలగాలి. (34)
కామాభిభూతః క్రోధాద్వా యో మిథ్యా ప్రతిపద్యతే।
స్వేషు చాన్యేషు వా తస్య న సహాయా భవంత్యుత॥ 35
కామానికి కానీ క్రోధానికీ కానీ లొంగి తన వారితో అయినా, ఇతరులతో అయినా కపటంగా ప్రవర్తించే వాడికి సహాయం చేసే వాడెవ్వడూ ఉండడు. (35)
ఏకీభూతైర్మహాప్రాజ్ఞైః శూరైరరినిబర్హణైః।
పాండవైః పృథివీం తాత భోక్ష్యసే సహితః సుఖీ॥ 36
నాయనా! పాండవులు ఒక్కటిగా ఉన్నారు. బుద్ధిమంతులూ, శూరులూ, శత్రువులను సంహరింపగలవారు. వారితో కలిసి సుఖంగా రాజ్యాన్ని అనుభవించు. (36)
యథా భీష్మః శాంతనవః ద్రోణశ్చాపి మహారథః।
ఆహతుస్తాత తత్ సత్యమ్ అజేయౌ కృష్ణపాండవౌ॥ 37
శంతనుసుతుడైన భీష్ముడూ, మహారథుడైన ద్రోణుడూ చెప్పినది సత్యమే. శ్రీకృష్ణపాండవులు అజేయులు. (37)
ప్రపద్యస్వ మహాబాహుం కృష్ణమక్లిష్టకారిణమ్।
ప్రసన్నో హి సుఖాయ స్యాద్ ఉభయోరేవ కేశవః॥ 38
అనాయాసంగా మాహాకార్యాలు సాధించ గల మహాబాహువైన కృష్ణుని ఆశ్రయించు. ఆయన ప్రసన్నుడైతే ఉభయపక్షాలకూ సుఖాన్ని కల్పించగలడు. (38)
సుహృదామర్థకామానాం యో న తిష్ఠతి శాసనే।
ప్రజ్ఞానాం కృతవిద్యానాం స నరః శత్రునందనః॥ 39
తన శ్రేయోభిలాషులైన జ్ఞానులమాట, పండితుల మాట విననివాడు, తదనుగుణంగా నిలువనివాడు కేవలం శత్రువులకు ఆనందాన్ని కల్గిస్తాడు. (39)
న యుద్ధే జాత కళ్యాణం న ధర్మార్థౌ కుతః సుఖమ్।
న చాపి విజయో నిత్యం మా యుద్ధే చేత ఆధిథాః॥ 40
వత్సా! యుద్ధం చేయటంలో శుభం లేదు. ధర్మార్థాలు లేవు. ఇక సుఖానికి తానెక్కడ? యుద్ధంలో అన్నివేళలా గెలుపే లభిస్తుందన్న నమ్మకం లేదు. కాబట్టి యుద్ధమ్ మీదకు మనస్సు పోనీకు. (40)
భీష్మేణ హి మహాప్రాజ్ఞ పిత్రా తే బాహ్లికేన చ।
దత్తోఽంశః పాండుపుత్రాణాం భేదాద్ భీతైరరిందమ॥ 41
అరిందమా! మహాప్రాజ్ఞా! అన్యోన్యమైత్రి చెడుతుందన్న భయంతో భీష్ముడూ, మీ తండ్రీ, బాహ్లికుడు పాండుకుమారులకు రాజ్యభాగాన్ని ఇచ్చారు. (41)
తస్య చైతత్ప్రదానస్య ఫలమద్యానుపశ్యసి।
యద్ భుంక్షే పృథివీం కృత్స్నాం శూరైర్నిహతకంటకామ్॥42
వారికి రాజ్యభాగమిచ్చిన ఫలితాన్ని ఇప్పుడు నీవు చూస్తున్నావుగదా! శూరులైన పాండవుల ద్వారా నిష్కంటకంగా చేయబడిన ఈ సమస్త భూమండలాన్నీ అనుభవిస్తున్నావు. (42)
ప్రయచ్ఛ పాండుపుత్రాణాం యథోచితమరిందమ।
యదీచ్ఛసి సహామాత్యః భోక్తుమర్ధం ప్రదీయతామ్॥ 43
అరిందమా! నీవు నీమంత్రులతో కలిసి రాజ్యాన్ని అనుభవించాలనుకొంటే పాండుకుమారులకు యథోచితంగా అర్ధరాజ్యాన్ని ఇవ్వు. (43)
అలమర్ధం పృథివ్యాస్తే సహామాత్యస్య జీవితుమ్।
సుహృదాం వచనే తిష్ఠన్ యశః ప్రాప్స్యసి భారత॥ 44
భారతా! నీవు, నీ అమాత్యులూ జీవించటానికి నీకు రాజ్యంలోని అర్ధభాగం చాలు. హితైషుల మాటలు విని కీర్తిని కూడా పొందగలవు. (44)
శ్రీమద్భిరాత్మవద్భిస్తైః బుద్ధిమద్భిర్జితేంద్రియైః।
పాండవైర్విగ్రహస్తాత భ్రంశయేన్మహతస్సుఖాత్॥ 45
నాయనా! శ్రీమంతులు, మనస్వులు, బుద్ధిమంతులు, జితేంద్రియులూ అయిన పాండవులతో యుద్ధం గొప్ప సుఖాలనుండి నిన్ను పతనం చేస్తుంది. (45)
నిగృహ్య సుహృదాం మన్యుం శాధి రాజ్యం యథోచితమ్।
స్వమంశం పాండుపుత్రేభ్యః ప్రదాయ భరతర్షభ॥ 46
భరతశ్రేష్ఠా! పాండుకుమారులకు వారి అర్ధరాజ్యాన్ని ఇచ్చి నీ శ్రేయోభిలాషులలో కలుగుతున్న కోపాన్ని ఉపశమింపజేసి నీ రాజ్యభాగాన్ని నీవు యథోచితంగా పరిపాలించు. (46)
అలమంగ నికారోఽయం త్రయోదశ సమాః కృతః।
శమయైనం మహాప్రాజ్ఞ కామక్రోధసమేధితమ్॥ 47
మహాప్రాజ్ఞా! పదమూడు సంవత్సరాలు పాండవులను రాజ్యహీనులను చేయటమే మహాపకారం. అది నీ కామక్రోధాల వల్ల ఇంకా పెరిగింది. ఇప్పుడు సంధితో దాన్ని ఉపశమింపజేయి. (47)
న చైష శక్తః పార్థానాం యస్త్వమర్థమభీప్ససి।
సూతపుత్రో దృఢక్రోధః భ్రాతా దుఃశాసనశ్చ తే॥ 48
కౌంతేయుల సంపదలను నీవు కోరుకొనినా వాటిని సాధించుకొనటం నీవలన కాదు. స్థిరక్రోధంగల కర్ణుడూ, నీ సోదరుడు దుశ్శాసనుడు కూడా సాధించలేరు. (48)
భీష్మే ద్రోణే కృపే కర్ణే భీమసేనే ధనంజయే।
ధృష్టద్యుమ్నే చ సంక్రుద్ధే న స్యుః సర్వాః ప్రజా ధ్రువమ్॥ 49
భీష్ముడూ, ద్రోణుడూ, కృపుడూ, కర్ణుడూ, భీమసేనుడూ, అర్జునుడూ, ధృష్టద్యుమ్నుడూ వీరంతా అలిగితే ప్రజలలో ఎవ్వరూ మిగలరు. ఇది నిశ్చయం. (49)
అమర్షవశమాపన్నః మా కురూంస్తాత జీఘనః।
ఏషా హి పృథివీ కృత్స్నా మాగమత్ త్వత్కృతే వధమ్॥ 50
వత్సా! క్రోధానికి లోనయి సమస్త కౌరవవినాశనానికి పల్పడకు. నీ కోసం ఈ భూమండలమంతా ఊచకోతకు గురి కారాదు. (50)
యచ్చ త్వం మన్యసే మూఢ భీష్మద్రోణకృపాదయః।
యోత్స్యంతే సర్వశక్త్యేతి నైతదద్యోపపద్యతే॥ 51
మూర్ఖుడా! భీష్మద్రోణ కృపాదులు సర్వశక్తులూ ఒడ్డి యుద్ధం చేస్తారని నీవనుకొంటున్నావు. అది ఇపుడు కుదిరే పనికాదు. (51)
సమం హి రాజ్యం ప్రీతిశ్చ స్థానం హి విదితాత్మనామ్।
పాండవేష్వథ యుష్మాసు ధర్మస్త్వభ్యధికస్తతః॥ 52
ఆత్మజ్ఞానులయిన వీరిదృష్టిలో రాజ్యం మీదైనా వారిదైనా ఒకటే. మీమీద, పాండవుల మీదా ప్రేమ కూడా వారికి సమానమే. కానీ పాండవుల వైపు ధర్మం మొగ్గుగా ఉంది. (52)
రాజపిండభయాదేతే యది హాస్యంతి జీవితమ్।
న హి శక్ష్యంతి రాజానం యుధిష్ఠిరముదీక్షితుమ్॥ 53
నీ అన్నం తిన్నారు కాబట్టి వీరంతా నీకోసం ప్రాణాల నయితే ఇవ్వగలరు కానీ యుధిష్ఠిరుని వక్రదృష్టితో మాత్రం చూడలేరు. (53)
న లోభాదర్థసంపత్తిః నరాణామిహ దృశ్యతే।
తదలం తాత లోభేన ప్రశామ్య భరతర్షభ॥ 54
లోభంతో అర్థసంపదలను పొందిన నరులెవ్వరూ లేరు. కాబట్టి నాయనా! భరతశ్రేష్ఠా! లోభాన్ని విడిచిపెట్టు. (54)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాంధారీవాక్యే ఏకోనత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 129 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాంధారీ వాక్యమను నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (129)