130. నూట ముప్పదియవ అధ్యాయము

దుర్యోధనుని దురాలోచన సాత్యకి ద్వారా బయటపడుట.

వైశంపాయన ఉవాచ
తత్ తు వాక్యమనాదృత్య సోఽర్థవన్మాతృభాషితమ్।
పునః ప్రతస్థే సంరంభాత్ సకాశమకృతాత్మనామ్॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. - దుర్యోధనుడు అర్థవంతమయిన తల్లి మాటలను కూడా లెక్కచేయక పాపాత్ములైన తన సహచరుల దగ్గరకు కోపంగా మరలా బయలుదేరాడు. (1)
తతః సభాయా నిర్గమ్య మంత్రయామాస కౌరవః।
సౌబలేన మతాక్షేణ రాజ్ఞా శకునినా సహ॥ 2
సభ నుండి వెళ్లిపోయి దుర్యోధనుడు అక్షప్రియుడూ, సౌబలరాజు అయిన శకునితో ఆలోచించాడు. (2)
దుర్యోధనస్య కర్ణస్య శకునేః సౌబలస్య చ।
దుఃశాసనచతుర్థానామ్ ఇదమాసీద్ విచేష్టితమ్॥ 3
దుర్యోధనుడూ, కర్ణుడూ, సౌబలుడైన శకునీ, దుఃశాసనుడూ - ఈ నలుగురి నిర్ణయం ఈ విధంగా ఉంది. (3)
పురాయమస్మాన్ గృహ్ణాతి క్షిప్రకారీ జనార్దనః।
సహితో ధృతరాష్ట్రేణ రాజ్ఞా శాంతనవేన చ॥ 4
వయమేవ హృషీకేశం నిగృహ్ణీమ బలాదివ।
ప్రసహ్య పురుషవ్యాఘ్రమ్ ఇంద్రో వైరోచనిం యథా॥ 5
ధృతరాష్ట్రమహారాజుతో, భీష్మునితో కలిసి వేగంగా పనులు నిర్వహించగల శ్రీకృష్ణుడు ముందు మనలను బంధింపచేస్తాడు. కాబట్టి మనమే బలప్రయోగం చేసి ఇంద్రుడు బలిని బంధించినట్టు ఆ పురుష శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని బంధిద్దాము. (4-5)
శ్రుత్వా గృహీతం వార్ష్ణేయం పాండవా హతచేతసః।
నిరుత్సాహా భవిష్యంతి భగ్నదంష్ట్రా ఇవోరగాః॥ 6
శ్రీకృష్ణుడు బంధింపబడినట్లు తెలిసికొని పాండవులు కోరలు తీసిన పాములవలె నిశ్చేతనులై నిరుత్సాహులవుతారు. (6)
అయం హ్యేషాం మహాబాహుః సర్వేషాం శర్మ వర్మ చ।
అస్మిన్ గృహీతే వరదే ఋషభే సర్వసాత్వతామ్॥ 7
నిరుద్యమా భావిష్యంతి పాండవాః సోమకైః సహ।
పాండవులకు అందరకు మహాబాహువయిన కృష్ణుడే సంపదా, కవచం కూడా. యదువంశశ్రేష్ఠుడూ, వరదాత అయిన శ్రీకృష్ణుని బంధిస్తే పాండవులు సోమకులతో సహా ప్రయత్నరహితులవుతారు. (7 1/2)
తస్మాద్వయమిహైవైనం కేశవం క్షిప్రకారిణమ్॥ 8
క్రోశతో ధృతరాష్ట్రస్య బద్ధ్వా యోత్స్యమహే రిపూన్।
కాబట్టి మనం ఇక్కడ క్షిప్రకారి అయిన ఈ కేశపుని ధృతరాష్ట్రుడు ఆక్రోశిస్తున్నా సరే - బంధించి శత్రువులతో యుద్ధం చేద్దాం. (8 1/2)
తేషాం పాపమభిప్రాయం పాపానాం దుష్టచేతసామ్॥ 9
ఇంగితజ్ఞః కవిః క్షిప్రమ్ అన్వబుద్ధ్యత సాత్యకిః।
దుష్టస్వభావం గల ఆ పాపాత్ముల దురాలోచనను విద్వాంసుడయి పరుల ఇంగితము నెరుగగల సాత్యకి వెంటనే గ్రహించాడు. (9 1/2)
తదర్థమభినిష్క్రమ్య హార్దిక్యేన సహాస్థితః॥ 10
అబ్రవీత్ కృతవర్మాణం క్షిప్రం యోజయ ఽఆహినీమ్।
వ్యూఢానీకః సభాద్వారమ్ ఉపతిష్ఠస్వ దంశితః॥ 11
అందుకై వెంటనే సభనుండి నిష్క్రమించి కృతవర్మను కలిసి ఇలా అన్నాడు. వెంటనే సేనను సన్నద్ధం చేయి. కవచాన్ని ధరించి సేనను పన్ని సభాద్వారం దగ్గర నిలు. (10-11)
యావదాఖ్యామ్యహం చైతత్ కృష్ణాయాక్లిష్టకారిణే।
ఇంతలో నేనీ విషయాన్ని అనాయాసంగా కార్యసాధన చేయగల శ్రీకృష్ణునితో చెప్తాను.
స ప్రవిశ్య సభాం వీరః సింహీ గిరిగుహామివ॥ 12
ఆచష్ట తమభిప్రాయం కేశవాయ మహాత్మనే।
ధృతరాష్ట్రం తతశ్పైవ విదురం చాన్వభాషత॥ 13
కృతవర్మతో ఆ విధంగా చెప్పి వీరుడైన ఆ సాత్యకి సింహం కొండగుహలోనికి ప్రవేశించినట్టు సభలోనికి ప్రవేశించి మహాత్ముడైన శ్రీకృష్ణునకు సుయోధనాదుల అభిప్రాయాన్ని తెలియ జేశాడు.
ఆ తరువాత ధృతరాష్ట్రునకూ, విదురునకూ కూడా ఆ విషయాన్ని తెలిపాడు. (12-13)
తేషామేతమభిప్రాయమ్ ఆచచక్షే స్మయన్మివ।
ధర్మాదర్థాచ్చ కామాచ్చ కర్మ సాధువిగర్హితమ్॥ 14
మందాః కర్తుమిహేచ్ఛంతి న చావాప్యం కథంచన।
సాత్యకి తేలికగా నవ్వుతూ సుయోధనాదుల ఆలోచనను ఈ విధంగా వివరించాడు.
ధర్మార్థకామాల దృష్టితో సజ్జనులంతా నిందించే పనిని మూర్ఖులయిన ఆ సుయోధనాదులు చేస్తున్నారు. కాని ఏ రీతిగానూ వారు సఫలులు కాలేరు. (14 1/2)
పురా వికుర్వతే మూఢాః పాపాత్మానః సమాగతాః॥ 15
ధర్షితాః కామమన్యుభ్యాం క్రోధలోభవశానుగాః।
లోభక్రోధాలకు లోనయి, కామక్రోధాలచే కొట్టబడిన పాపాత్ములు, మూఢులు కొందరు ఇక్కడ కలిసి పెద్ద తగాదా లేవనెత్తబోతున్నారు. (15 1/2)
ఇమం హి పుండరీకాక్షం జిఘృక్షంత్యల్పచేతసః॥ 16
పటేనాగ్నిం ప్రజ్వలితం యథా బాలా యథా జడాః।
బాలురో, మూర్ఖులో మండుతున్న అగ్నిని వస్త్రంతో బంధించాలని ప్రయత్నించినట్లు అల్పబుద్ధులయిన వారు ఈ పుండరీకాక్షుని బంధింపగోరుతున్నారు. (16 1/2)
సాత్యకేస్తద్వచః శ్రుత్వా విదురో దీర్ఘదర్శివాన్॥ 17
ధృతరాష్ట్రం మహాబాహుమ్ అబ్రవీత్ కురుసంసది।
రాజన్ పరీతకాలాస్తే పుత్రాః సర్వే పరంతప॥ 18
అశక్యమయశస్యం చ కర్తుం కర్మ సముద్యతాః।
సాత్యకి పలికిన ఆ మాటలు విని దీర్ఘదృష్టిగల విదురుడు మహాబాహువయిన ధృతరాష్ట్రునితో కౌరవసభలో ఇలా అన్నాడు.
మహారాజా! పరంతపా! నీ కుమారులందరూ కాలానికి లొంగిపోయినట్లుంది. కాకపోతే అసాధ్యం, అపకీర్తిహేతువూ అయిన పనిని చేయటానికి సిద్ధపడతారా? (17-18 1/2)
ఇమం హి పుండరీకాక్షమ్ అభిభూయ ప్రసహ్య చ॥ 19
నిగ్రహీతుం కిలేచ్ఛంతి సహితా వాసవానుజమ్।
ఇమం పురుషశార్దూలమ్ అప్రధృష్యం దురాసదమ్॥ 20
ఆసాద్య న భవిష్యంతి పతంగా ఇవ పావకమ్।
దేవేంద్రసోదరుడైన ఈ పుండరీకాక్షుని ఒక్కటై ఎదిరించి వలవంతంగా బంధించాలని అనుకొంటున్నారు గదా! ఈయనను ఎదిరించటం కాదు గదా, సమీపించటం కూడా కష్టం. దగ్గరకు వస్తే విరోధులెవరైనా నిప్పుమీద పడిన మిడతల వలె మాడిపోతారు. (19-20 1/2)
అయమిచ్ఛన్ హి తాన్ సర్వాన్ యుధ్యమానాన్ జనార్ధనః॥ 21
సింహో నాగానివ క్రుద్ధః గమయేద్యమసాదనమ్।
ఈ జనార్దనుడు తలచుకొంటే కోపించిన సింహం ఏనుగులను చంపినట్లు యుద్ధం చేస్తున్న వారి నందరినీ యమసదనానికి పంపగలడు. (21 1/2)
న త్వయం నిందితం కర్మ కుర్యాత్ పాపం కథంచన॥ 22
న చ ధర్మాదపక్రామేద్ అచ్యుతః పురుషోత్తమః।
అయితే అచ్యుతుడయిన ఈ పురుషోత్తముడు ఎప్పుడూ నిందింపదగిన పని కానీ, పాపం కానీ చేయడు. ధర్మాన్ని ఎప్పుడూ తప్పడు. (22 1/2)
(యథా వారాణసీ దగ్ధా సాశ్వా సరథకుంజటా।
సానుబంధస్తు కృష్ణేన కాశీనామృషభో హతః॥
తథా నాగపురం దగ్ధ్వా శంఖచక్రగదాధరః।
స్వయం కాలేశ్వరో భూత్వా నాశయిష్యతి కౌరవాన్॥
అశ్వాలు, రథాలు, ఏనుగులతో పాటు వారణాసిని దహించినట్లు, కాశిరాజును బంధువులతో పాటు సంహరించినట్లు శంఖచక్రగదాధరుడైన శ్రీకృష్ణుడు హస్తినాపురాన్ని తగులబెట్టి, స్వయంగా తాను కాలేశ్వరుడై కౌరవుల నందరినీ నాశనం చేయగలడు.
పారిజాతహరం హ్యేనమ్ ఏకం యదుసుఖావహమ్।
నాభ్యవర్తత సంరబ్ధః వృత్రహా వసుభిః సహ॥
యాదవులకు సుఖాన్ని కల్గించే ఈ కృష్ణుడు పారిజాతాన్ని అపహరించినప్పుడు వసువులందరితో సహా ఇంద్రుడు కోపంగా ఎదిరించినా ఏమీ చేయలేకపోయాడు.
ప్రాప్య నిర్మోచనే పాశాన్ షట్ సహస్రాంస్తరస్వినః।
హృతాస్తే వాసుదేవేన హ్యుపసంక్రమ్య మౌరవాన్॥
నిర్మోచనమనే ప్రదేశంలో మురాసురుడు ఆరువేల పాశాలను అడ్డుపెట్టుకొన్నా శ్రీకృష్ణుడు వాటిదగ్గరకు పోయి అన్నింటినీ త్రెంపివేశాడు.
ద్వారమాసాద్య సౌభస్య విధూయ గదయా గిరిమ్।
ద్యుమత్సేనః సహామాత్యః కృష్ణేన వినిపాతితః॥
శ్రీకృష్ణుడు సౌభుని ద్వారాన్ని సమీపించి తన గదతో పర్వతాన్ని బ్రద్దలు చేసి అమాత్యులతో సహా ద్యుమత్సేనుని సంహరించాడు.
శేషత్త్వాత్ కురూణాం తు ధర్మాపేక్షీ తథాచ్యుతః।
క్షమతే పుండరీకాక్షః శక్తః సన్ పాపకర్మణామ్॥
ఏతే హి యది గోవిందమ్ ఇచ్ఛంతి సహరాజభిః।
అద్యైవాతిథయః సర్వే భావిష్యంతి యమస్య తే॥
కౌరవులకు ఇంకా ఆయువు మిగిలి ఉన్నది కాబట్టి ధర్మాసక్తుడూ పుండరీకనేత్రుడూ అయిన శ్రీకృష్ణుడు సమర్థుడై కూడా పాపకృత్యాలను సహిస్తున్నాడు. ఒకవేళా కౌరవులు తమ సహచర నరపాలురతో కలిసి గోవిందుని బంధించాలనుకొంటే వారంతా ఇప్పుడే యమసదనానికి అతిథులవుతారు.
యథా వాయోస్తృణాగ్రాణి వశం యాంతి బలీయసః।
తథా చక్రభృతః సర్వే వశమేష్యంతి కౌరవాః॥)
బలీయమైన గాలికి గడ్డిపరకలన్నీ వశమైనట్లు చక్రధారి అయిన శ్రీకృష్ణునకు కౌరవులంతా లొంగిపోతారు.
విదురేణైవముక్తే తు కేశవో వాక్యమబ్రవీత్॥ 23
ధృతరాష్ట్రమభిప్రేక్ష్య సుహృదాం శృణ్వతాం మిథః।
రాజన్నేతే యది క్రుద్ధాః మాం నిగృహ్ణీయురోజసా॥ 24
ఏతే వా మామహం వైనాన్ అనుజానీహి పార్థివ।
విదురుడిలా అనగా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని చూచి పెద్దలంతా వింటుండగా ఆయనతో ఇలా అన్నాడు.
రాజా! ఈ దుష్టకౌరవులు కోపంతో బలవంతంగా నన్ను పట్టుకొనగలరో లేక నేనే వారిని బంధిస్తానో చూడవచ్చు. వారికి అనుజ్ఞ ఇవ్వు. (23-24 1/2)
ఏతాన్ హి సర్వాన్ సంరబ్ధాన్ నియంతుమహముత్సహే॥ 25
న త్వహం నిందితం కర్మ కుర్యాం పాపం కథంచన।
కోపంతో ఎగిరిపడుతున్న వీరినందరినీ నేను నియంత్రించగలను. కానీ నిందింపదగిన పనిని కానీ, పాపకృత్యాన్ని కానీ నేనెప్పుడూ చేయను. (25 1/2)
పాండవార్థే హి లుభ్యంతః స్వార్థాన్ హాస్యంతి తే సుతాః॥ 26
ఏతే చేదేవమిచ్ఛంతి కృతకార్యో యుధిష్ఠిరః।
పాండవుల సంపదలను ఆశిస్తూ నీ కొడుకులు తమ సంపదలను సయితం కోల్పోగలరు. వారదే కోరుకొంటే ధర్మరాజు పని నెరవేరినట్లే. (26 1/2)
అద్యైవ హ్యహమేనాంశ్చ యే చైనానను భారత॥ 27
నిగృహ్య రాజన్ పార్థేభ్యః దద్యాం కిం దుష్కృతం భవేత్।
భారతా! నేడు నేను ఈ కౌరవులనూ, వారి అనుచరులనూ బంధించి కౌంతేయుల వశం చేస్తాను. అదేమీ పాపం కాదు. (27 1/2)
ఇదం తు న ప్రవర్తేయం నిందితం కర్మ భారత॥28
సంనిధౌ తే మహారాజ క్రోధజం పాపబుద్ధిజమ్।
కానీ మహారాజా! నీ సన్నిధిలో కోపంతోనో, పాపబుద్ధితోనో జరిగే ఈ నిందితకృత్యాన్ని నేను ఆచరించలేను. (28 1/2)
ఏష దుర్యోధనో రాజన్ యథేచ్ఛతి తథాస్తు తత్॥ 29
అహం తు సర్వాంస్తనయాన్ అనుజానామి తే నృప।
రాజా! ఈ దుర్యోధనుడు ఎలా కోరుకుంటే అలాగే జరగనీ! నేను మాత్రం నీ కుమారులందరికీ అనుమతి ఇస్తున్నాను. (29 1/2)
ఏతచ్ఛ్రుత్వా తు విదురం ధృతరాష్ట్రో భ్యభాషత।
క్షిప్రమానయ తం పాపం రాజ్యలుబ్ధం సుయోధనమ్॥ 30
సహమిత్రం సహామాత్యం ససోదర్యం సహానుగమ్।
శక్నుయాం యది పంథానమ్ అవతారయితుం పునః॥ 31
ఈ మాటలు విని ధృతరాష్ట్రుడు విదురునితో ఇలా అన్నాడు - రాజ్యలోభంతో పాపాత్ముడైన ఆ సుయోధనుని వెంటనే తీసికొనిరా. మిత్రులతో, మంత్రులతో, సోదరులతో, అనుచరులతో సహా వానిని సరియైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిద్దాం. కుదిరితే మంచిదే. (30-31)
తతో దుర్యోధనం క్షత్తా పునః ప్రావేశయత్ సభామ్।
అకామం భ్రాతృభిః సార్ధమ్ రాజభిః పరివారితమ్॥ 32
ఆ తరువాత విదురుడు సోదరులూ, అనుచర రాజులతో సహా ఇష్టంలేకపోయినా సుయోధనుని మరలా సభలో ప్రవేశపెట్టాడు. (32)
అథ దుర్యోధనం రాజా ధృతరాష్ట్రోఽభ్యభాషత।
కర్ణదుఃశాసనాభ్యాం చ రాజభిశ్చాపి సంవృతమ్॥ 33
అప్పుడు కర్ణదుశ్శాసనులతోనూ, ఇతర రాజులతోనూ కూడివచ్చిన దుర్యోధనునితో ధృతరాష్ట్రుడిలా అన్నాడు(33)
నృశంస పాపభూయిష్ఠ క్షుద్రకర్మసహాయవాన్।
పాపైః సహాయైః సంహత్య పాపం కర్మ చికీర్షసి॥ 34
క్రూరుడా! పాపాత్ముడా! నీచపు పనులు చేసేవారే నీకు సహాయకులు. అటువంటి దుష్టసహాయకులతో కూడి పాపకార్యాలు చేయాలనుకొంటున్నావు. (34)
అశక్యమయశస్యం చ సద్భిశ్చాపి విగర్హితమ్।
యథా త్వాదృశకో మూఢః వ్యవస్యేత్ కులపాంసనః॥ 35
సజ్జనులనిందకు గురియై, అపకీర్తి హేతువై, అసాధ్యమయిన పనులు కులనాశకుడూ, మూర్ఖుడూ అయిన నీవంటివాడు తప్ప మరెవ్వరూ చేయరు. (35)
త్వమిమం పుండరీకాక్షమ్ అప్రధృష్యం దురాసదమ్।
పాపైః సహాయైః సంహత్య నిగ్రహీతుం కిలేచ్ఛసి॥ 36
పాపులయిన సహాయకులతో కలిసి నీవు ఎదిరించటానికి కనీసం సమీపించటానికి కూడా వీలుకాని శ్రీకృష్ణుని బంధించాలనుకొంటున్నావు. (36)
యో న శక్యో బలాత్కర్తుం దేవైరపి సవాసవైః।
తం త్వం ప్రార్థయసే మంద బాలశ్చంద్రమసం యథా॥ 37
బాలుడు చంద్రుని పట్టుకోవాలని కోరినట్లు నీవు మూఢుడవై దేవతలూ, ఇంద్రుడూ కూడా లొంగదీయలేని శ్రీకృష్ణుని బంధించాలని అనుకొంటున్నావు. (37)
దేవై ర్మనుష్యై ర్గంధర్వైః అసురై రురగైశ్చ యః।
న సోఢుం సమరే శక్యః తం న బుద్ద్యసి కేశవమ్॥ 38
దేవతలు, మనుష్యులు, గంధర్వులు అసురులు, నాగులు కూడా రణభూమిలో శ్రీకృష్ణుని దాడిని సహింపలేరు. అటువంటి శ్రీకృష్ణుని నీవు తెలిసికొనటం లేదు. (38)
దుర్గ్రాహ్యః పాణినా వాయుః దుఃస్పర్శః పాణినా శశీ।
దుర్ధరా పృథివీ మూర్ధ్నా దుర్గ్రాహ్యః కేశవో బలాత్॥ 39
గాలిని చేతితోపట్టలేము చేతితో చంద్రుని తాకలేము. భూమి తలకెత్తుకొనలేము. అదే విధంగా బలవంతంగా శ్రీకృష్ణుని బంధించలేము. (39)
ఇత్యుక్తే ధృతరాష్ట్రేణ క్షత్తాఽపి విదురోఽబ్రవీత్।
దుర్యోధన మభిప్రేత్య ధార్తరాష్ట్రమమర్షణమ్॥ 40
ధృతరాష్ట్రుడిలా అనగానే అసహనశీలి అయిన దుర్యోధనునితో విదురుడిలా అన్నాడు. (40)
విదుర ఉవాచ
దుర్యోధన నిబోధేదం వచనం మమ సాంప్రతమ్।
సౌభద్వారే దానవేంద్రః ద్వివిదో నామ నామతః।
శిలావర్షేణ మహతా ఛాదయామాస కేశవమ్॥ 41
విదురుడిలా అన్నాడు - దుర్యోధనా! నేనిప్పుడు చెపుతున్న మాటలను గ్రహించు. ద్వివిదుడనే రాక్షసరాజు సౌభద్వారంలో పెద్దరాళ్ళవానతో శ్రీకృష్ణుని కప్పి వేశాడు. (41)
గ్రహీతుకామో విక్రమ్య సర్వయత్నేన మాధవమ్।
గ్రహీతుం నాశకచ్చైనం తం త్వం ప్రార్థయసే బలాత్॥ 42
పరాక్రమించి అన్నివిధాలా ప్రయత్నించి శ్రీకృష్ణుని బంధించాలనుకొన్నాడు. కానీ బంధించలేకపోయాడు. అటువంటి వానిని నీవు బలవంతంగా బంధించాలనుకొంటున్నావు. (42)
ప్రాగ్జ్యోతిషగతం శౌరిం నరకః సహ దానవైః।
గ్రహీతుం నాశకత్ తత్ర తం త్వ్స్M ప్రార్థయసే బలాత్॥ 43
శౌరి, ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళినపుడు నరకాసురుడు దానవులతో కలిసి ఆయనను బంధించాలనుకొన్నాడు. కానీ వీలు కాలేదు. అటువంటి వానిని నీవు బలవంతంగా బంధించాలనుకొంటున్నావు. (43)
అనేకయుగవర్షాయుః నిహత్య నరకం మృధే।
నీత్వా కన్యాసహస్రాణి ఉపయేమే యథావిధి॥ 44
అనేకయుగాలూ, సంవత్సరాలూ ఆయుష్షు గల నరకుని యుద్ధంలో చంపి వేలకొలదిగ ఉన్న రాజకన్యలను కొనిపోయి యథావిధిగా పరిణయం చేసికొన్నాడు. (44)
నిర్మోచనే షట్ సహస్రాః పాశైర్బద్ధా మహాసురాః।
గ్రహీతుం నాశకంశ్చైనం తం త్వమ్ ప్రార్థయసే బలాత్॥ 45
నిర్మోచనంలో పెద్దపెద్ద రాక్షసులు ఆరువేల పాశాలను ప్రయోగించి కూడా శ్రీకృష్ణుని పట్టుకొనలేకపోయారు. వానిని నీవు బలవంతంగా బంధించాలనుకొంటున్నావు. (45)
అనేన హి హతా బాల్యే పూతనా శకునీ తథా।
గోవర్ధనో ధారితశ్చ గవార్థే భరతర్షభ॥ 46
భరతశ్రేష్ఠా! ఈ శ్రీకృష్ణుడు బాల్యంలోనే పూతననూ, ఆడకొంగను సంహరించాడు. గోరక్షణకై గోవర్ధనగిరిని ఎత్తాడు. (46)
అరిష్టో ధేనుకశ్పైవ చాణూరశ్చ మహాబలః।
అశ్వరాజశ్చ నిహతః కంసశ్చారిష్టమాచరన్॥ 47
అరిష్టాసురుని, ధేనుకాసురునీ, మహాబలుడైన బాణాసురునీ, అశ్వరాజైన కేశిని, లోకకల్యాణానికి ప్రతిబంధకంగా ఉన్న కంసునీ సంహరించాడు. (47)
జరాసంధశ్చ వక్త్రశ్చ శిశుపాలశ్చ వీర్యవాన్।
బాణశ్చ నిహతః సంఖ్యే రాజానశ్చ నిషూదితాః॥ 48
జరాసంధుడూ, దంతవక్త్రుడూ, పరాక్రమశాలి అయిన శిశుపాలుడూ, బాణాసురుడూ శ్రీకృష్ణుని చేతనే మరణించారు. యుద్ధంలో ఎందరో రాజులను అతడు సంహరించాడు. (48)
వరుణో నిర్జితో రాజా పావకశ్చామితౌజసా।
పారిజాతం చ హరతా జితః సాక్షాచ్ఛచీపతిః॥ 49
అమితతేజోవంతుడైన శ్రీకృష్ణుడు వరుణుని జయించాడు. అగ్నిని ఓడించాడు. పారిజాతాన్ని అపహరించేవేళ సాక్షాత్తూ ఇంద్రునికూడా ఓడించాడు. (49)
ఏకార్ణవే చ స్వపతా నిహతౌ మధుకైటభాఉ।
జన్మాంతరముపాగమ్య హయగ్రీవస్తథాహతః॥ 50
ఏకార్ణవంలో నిదురిస్తూ మధుకైటభులను సంహరించాడు. మరో అవతారమెత్తి హయగ్రీవుడనే రాక్షసుని సంహరించాడు. (50)
అయం కర్తా న క్రియతే కారణం చాపి పౌరుషే।
యద్ యదిచ్ఛేదయం శౌరిః తత్ తత్ కుర్యాదయత్నతః॥ 51
అన్నింటికీ కర్త శ్రీకృష్ణుడే. మరొక కర్త లేడు. పురుషార్థసిద్ధిలో కారణం కూడా ఈయనయే. తాను చేయదలచినదేదయినా అప్రయత్నంగా ఈయన చేయగలడు. (51)
తం న బుద్ధ్యసి గోవిందం ఘోరవిక్రమమచ్యుతమ్।
ఆశీవిషమివ క్రుద్ధం తేజోరాశిమనిందితామ్॥ 52
తీవ్రపరాక్రమంగలవాడు, జితేంద్రియుడు, అనిందితుడూ, తేజోరాశి అయిన శ్రీకృష్ణుని తెలిసికొనలేకపోతున్నావు. కోపించిన మహాసర్పంవలె భయంకరు డీయన. (52)
ప్రధర్షయన్ మహాబాహుం కృష్నమక్లిష్టకారిణమ్।
పతంగో ఽగ్నిమివాసాద్య సామాత్యో న భవిష్యసి॥ 53
అనాయాసంగా పనులు సాధించగల మహాబాహువయిన శ్రీకృష్ణుని ఎదిరిస్తే మంటలో పడిన మిడతలా అయిపోతావు. నీవూ, నీ అమాత్యులు కూడా మిగలరు. (53)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి విదురవాక్యే త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 130 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున విదురవాక్యమను నూట ఇరువది ముప్పదియవ అధ్యాయము. (130)
(దాక్షిణాత్య అధికపాఠము 8 శ్లోకాలతో కలిసి 61 శ్లోకాలు)