131. నూట ముప్పదియొకటవ అధ్యాయము
శ్రీకృష్ణుని విశ్వరూపప్రదర్శన - నిష్క్రమణ.
వైశంపాయన ఉవాచ
విదురేణైవముక్తస్తు కేశవః శత్రుపూగహా।
దుర్యోధనం ధార్తరాష్ట్రమ్ అభ్యభాషత వీర్యవాన్॥ 1
ఏకోఽహమితి యన్మోహాత్ మన్యసే మాం సుయోధన।
పరిభూయ సుదుర్బుద్ధే గ్రహీతుం మాం చికీర్షసి॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు - విదురుడిలా మాట్లాడగానే శత్రుసంహర్తా, పరాక్రమవంతుడూ, అయిన శ్రీకృష్ణుడు ధార్తరాష్ట్రుడైన దుర్యోధనునితో ఇలా అన్నాడు-
దుష్టబుద్ధీ! సుయోధనా! నీ మోహం వలన నన్ను ఒంటరివాడి ననుకొంటున్నావు. నన్ను పరాభవించి బంధించాలని కోరుకొంటున్నావు. (1-2)
ఇహైవ పాండవాః సర్వే తథైవాంధకవృష్ణయః।
ఇహాదిత్యాశ్చ రుద్రాశ్చ వసవశ్చ మహర్షిభిః॥ 3
పాండవులంతా ఇక్కడే ఉన్నారు. అంధక, వృష్ణివంశస్థులంతా, ఇక్కఏ ఉన్నారు. ఆదిత్యులూ, రుద్రులూ, వసువులూ, మహర్షులూ అంతా ఇక్కడే ఉన్నారు. (3)
ఏవముక్త్వా జహాసోచ్పైః కేశవః పరవీరహా।
తస్య సంస్మయతః శౌరేః విద్యుద్రూపా మహాత్మనః॥ 4
అంగుష్ఠమాత్రాస్త్రిదశాః ముముచుః పావకార్చిషః।
తస్య బ్రహ్మా లలాటస్థః రుద్రో వక్షసి చా భవత్॥ 5
శత్రుసంహారకుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా మాటాడి పెద్దగా నవ్వాడు. శౌరి ఆ విధంగా నవ్వినపుడు ఆయన
శరీరావయవాలలో మెరుపువంటి కాంతిగల మహాత్ములూ, అంగుష్ఠమాత్రులైన దేవతలూ అగ్నిజ్వాలలను వెదజల్లారు. ఆయన నుదుట బ్రహ్మదేవుడూ, వక్షః స్థలంపై రుద్రదేవుడూ ఉన్నారు. (4-5)
లోకపాలా భుజేష్వాసన్ అగ్నిరాస్యాదజాయత।
ఆదిత్యాశ్చైవ సాధ్యాశ్చ వసవోఽథాశ్వినావపి॥ 6
మరుతశ్చ సహేంద్రేణ విశ్వేదేవాస్తథైవ చ।
బభూవుశ్చైవ యక్షాశ్చ గంధర్వోరగరాక్షసాః॥ 7
భుజాలపై లోకపాలకులంతా ఉన్నారు. ముఖం నుండి అగ్నిజ్వాలలు చిమ్ముతున్నాయి. ఆదిత్యులూ, సాధ్యులూ, వసువులు అశ్వినీ దేవతలూ, మరుత్తులూ, ఇంద్రుడూ, విశ్వేదేవులూ, యక్షులూ, గంధర్వులూ, నాగులూ, రాక్షసులూ అంతా శరీరంపై కనిపించారు. (6-7)
ప్రాదురాస్తాం తథా దోర్భ్యాం సంకర్షణధనంజయౌ।
దక్షిణేఽథార్జునో ధన్వీ హలీ రామశ్చ సవ్యతః॥ 8
ఆయన భుజాలనుండి బలరాముడూ, అర్జునుడూ ఉద్భవించారు. దక్షిణ భుజం నుండి ధనుర్ధారి అయిన అర్జునుడు, వామభుజం నుండీ నాగలిపట్టిన బలరాముడూ ఉద్భవించారు. (8)
భీమో యుధిష్ఠిరశ్పైవ మాద్రీపుత్రౌ చ పృష్ఠతః।
అంధకా వృష్ణయ శ్పైవ ప్రద్యుమ్నప్రముఖాస్తతః॥ 9
అగ్రే బభూవుః కృష్ణస్య సముద్యతమమహాయుధాః।
ఆయనవెనుక భీముడూ, యుధిష్ఠిరుడూ, నకుల సహదేవులూ ఉన్నారు అంధకులు, వృష్ణి వంశస్థులూ, ప్రద్యుమ్నుడూ మొదలయిన కృష్ణ వంశీయులూ ఆయుధాలనెత్తి శ్రీకృష్ణుని ముందు నిలిచి ఉన్నారు. (9 1/2)
శంఖచక్రగదాశక్తి శార్ ఙ్గ్ లాంగలనందకాః॥ 10
అదృశ్యంతోద్యతాన్యేవ సర్వప్రహరణాని చ।
నానాబాహుషు కృష్ణస్య దీప్యమానాని సర్వశః॥ 11
శంఖం, చక్రం, గద, శక్తి, శార్ ఙ్గ్, నాగలి, నందకం (కత్తి) మొదలైన సకలాయుధాలూ ఎత్తిపెట్టబడి అంతటా వెలుగులు చిమ్ముతూ శ్రీకృష్ణుని అనేకబాహువులలో కనిపించాయి. (10-11)
నేత్రాభ్యాం నస్తతశ్చైవ శ్రోత్రాభ్యాం చ సమంతతః।
ప్రాదురాసన్ మహారౌద్రాః సధూమాః పావకార్చిషః॥ 12
కళ్ళనుండీ, ముక్కులనుండీ, చెవుల నుండీ భీకరాగ్నిజ్వాలలు పిగతోపాటు అన్ని దిక్కులకూ వెలువడసాగాయి. (12)
రోమకూపేషు చ తథా సూర్యస్యేవ మరీచయః।
తం దృష్ట్వా ఘోరమాత్మానం కేశవస్య మహాత్మనః॥ 13
న్యమీలయంత నేత్రాణి రాజానస్త్రస్తచేతసః।
ఋతే ద్రోణం చ భీష్మం చ విదురం చ మహామతిమ్॥ 14
సంజయం చ మహాభాగమ్ ఋషీంశ్పైవ తపోధనాన్।
ప్రాదాత్ తేషాం స భగవాన్ దివ్యం చక్షుర్జనార్దనః॥ 15
రోమకూపాలనుండీ సూర్యకిరణాల వంటి కాంతులు వెలువడసాగాయి.
రాజులందరూ మహాత్ముడైన శ్రీకృష్ణుని ఆ ఘోరస్వరూపాన్ని చూచి భయపడి కళ్ళు మూసికొన్నారు. ద్రోణుడూ, భీష్ముడూ, విద్వాంసుడైన విదురుడూ, మహాత్ముడయిన సంజయుడు, తపోధనులయిన మహర్షులు మాత్రం కళ్ళు మూయలేదు. శ్రీకృష్ణభగవానుడు వారికి దివ్యదృష్టి అనుగ్రహించాడు. (13-15)
తద్ దృష్ట్వా మహదాశ్చర్యం మాధవస్య సభాతలే।
దేవదుందుభయో నేదుః పుష్పవర్షం పపాత చ॥ 16
సభాస్థలంలో మహాశ్చర్యకరమైన ఆ శ్రీకృష్ణస్వరూపాన్ని చూచి దేవదుందుభులు మ్రోగసాగాయి. పూలవాన కురిసింది. (16)
ధృతరాష్ట్ర ఉవాచ
త్వమేవ పుండరీకాక్ష సర్వస్య జగతో హితః।
తస్మాత్ త్వం యాదవశ్రేష్ఠ ప్రసాదం కర్తిమర్హసి॥ 17
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - పుండరీకాక్ష! నీవే ఈ సమస్త ప్రపంచానికీ హితాన్ని కోరేవాడివి కాబట్టి యాదవ శ్రేష్ఠా! నీవే ప్రసన్నుడవు కావాలి. (17)
భగవన్ మమ నేత్రాణామ్ అంతర్ధానం వృణే పునః।
భవంతం ద్రష్టుమిచ్ఛామి వాన్యం ద్రష్టుమిహోత్సహే॥ 18
భగవంతుడా! నాకు కళ్ళు కనిపించవు. మరల నేను చూపు పోవాలని కోరుకొంటున్నాను. నిన్ను చూడాలని ఉంది. మరి దేనినీ చూడాలని నేను ఉత్సాహపడటం లేదు. (18)
తతో ఽబ్రవీన్మహాబాహుః ధృతరాష్ట్రం జనార్దనః।
అదృశ్యమానే నేత్రే ద్వే భవేతాం కురునందన॥ 19
అప్పుడు మహాబాహువయిన జనార్దనుడు "కురునందనా! నీకు పరులకు కనిపించని రెండు కళ్లనిస్తున్నాను" అని ధృతరాష్ట్రునితో అన్నాడు. (19)
తత్రాద్భుతం మహారాజ ధృతరాష్ట్రశ్చ చక్షుషీ।
లబ్ధవాన్ వాసుదేవాచ్చ విశ్వరూపదిదృక్షయా॥ 20
మహారాజా! అది ఆశ్చర్యకరం. ధృతరాష్ట్రుడు కూడా విశ్వరూప సందర్శనం కోసం శ్రీకృష్ణుని ద్వారా రెండు కళ్ళను పొందాడు. (20)
లబ్ధచక్షుషమాసీనం ధృతరాష్ట్రం నరాధిపాః।
విస్మితా ఋషిభిస్సార్ధం తుష్టువుర్మధుసూదనమ్॥ 21
సింహాసనాసీనుడైన ధృతరాష్ట్రునికి కళ్ళు వచ్చాయి. అది చూచి రాజులూ, మహర్షులూ ఆశ్చర్యపడి శ్రీకృష్ణుని స్తుతించారు. (21)
చచాల చ మహీ కృత్స్నా సాగరశ్చాపి చుక్షుభే।
విస్మయం పరమం జగ్ముః పార్థివా భరతర్షభ॥ 22
భరతశ్రేష్ఠా! సమస్త భూమండలం కంపించింది. సముద్రం క్షోభించింది. రాజులందరూ ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు. (22)
తతః స పురుషవ్యాఘ్రః సంజహార వపుః స్వకమ్।
తాం దివ్యామద్భుతాం చిత్రాం ఋద్ధిమత్తామరిందమః॥ 23
ఆ తరువాత శత్రుసంహారుడైన పురుషోత్తముడు తన శరీరాన్నీ, దివ్యాద్భుతమై, విచిత్రమైన తన ఐశ్వర్యాన్నీ ఉపసంహరించాడు. (23)
తతః సాత్యకిమాదాయ పాణౌ హార్దిక్యమేవ చ।
ఋషిభిస్తైరనుజ్ఞాతః నిర్యయౌ మధుసూదనః॥ 24
ఆ తరువాత ఆ మధుసూదనుడు మహర్షుల అనుమతి తీసికొని సాత్యకి, కృతవర్మల చేతులు పట్టుకొని సభనుండి నిర్గమించాడు. (24)
ఋషయోఽంతర్హితా జగ్ముః తతస్తే నారదాదయః।
తస్మిన్ కోలాహలే వృత్తే తదద్భుతమివాభవత్॥ 25
ఆపై నారదారి మహర్షులు అక్కడే అంతర్ధానమయ్యారు. కోలాహలమంతా ఉపశమించింది. అదంతా అద్భుతంగా అనిపించింది. (25)
తం ప్రస్థితమభిప్రేక్ష్య కౌరవాః సహ రాజభిః।
అనుజగ్ముః నరవ్యాఘ్రం దేవా ఇవ శతక్రతుమ్॥ 26
ఆ శ్రీకృష్ణుడు బయలుదేరటం చూచి రాజులతో సహా కౌరవులంతా ఇంద్రుని దేవతలు అనుసరించినట్లు అనుసరించారు. (26)
అచింతయన్నమేయాత్మా సర్వం తద్ రాజమండలమ్।
నిశ్చక్రామ తతః శౌరిః సధూమ ఇవ పావకః॥ 27
అయితే అప్రమేయ(కొలత కందనిది) స్వరూపుడైన శ్రీకృష్ణుడు ఆ రాజసమూహాన్ని పట్టించుకొనకుండా పొగతోకూడిన అగ్నిలాగా సభనుండి నిష్క్రమించాడు. (27)
తతో రథేన శుభ్రేణ మహతా కింకిణీకినా।
హేమజాలవిచిత్రేణ లఘునా మేఘనాదినా॥ 28
సూపస్కరేణ శుభ్రేణ వైయాఘ్రేణ వరూథినా।
శైబ్యసుగ్రీవయుక్తేన ప్రత్యదృశ్యత దారుకః॥ 29
అప్పుడు - శ్రీకృష్ణుడు వెలుపలికి రాగానే - శైబ్య సుగ్రీవాలనే గుఱ్ఱాలను పూన్చిన రథంతో దారుకుడు కనిపించాడు. ఆ రథం ఉజ్జ్వలంగా విశాలంగా ఉన్నది. చిన్న చిన్న ఘంటికలు కనిపిస్తున్నాయి. బంగారు తోరణాలతో అది విచిత్రంగ ఉంది. దాని గమనధ్వని మేఘనాదంలా ఉన్నది. దానిలో అవసరమైన సామగ్రి అంతా ఉన్నది. దానిపై పులి తోలి పరవబడి ఉంది. రథ రక్షణ కవసరమైన ఏర్పాట్లు అక్కడున్నాయి. (28-29)
తథైవ రథమాస్థాయ కృతవర్మా మహారథః।
వృష్ణీనాం సమ్మతో వీరః హార్దిక్యః సమదృశ్యత॥ 30
అదే విధంగా వృష్ణివంశస్థులు మెచ్చిన వీరుడూ, హృదిక పుత్రుడూ, మహారథుడు అయిన కృతవర్మ మరొక రథంపై కూర్చొని కనిపించాడు. (30)
ఉపస్థితరథం శౌరిం ప్రయాస్యంత మరిందమమ్।
ధృతరాష్ట్రో మహారాజః పునరేవాభ్యభాషత॥ 31
అరిందముడైన శ్రీకృష్ణుడు రథమెక్కి బయలుదేరుతుంటే ధృతరాష్ట్రమహారాజు ఆయనతో మరలా ఇలా అన్నాడు. (31)
యావద్ బలం మే పుత్రేషు పశ్యస్యేతజ్జనార్దన।
ప్రత్యక్షం తే న తే కించిత్ పరోఖ్షం శత్రుకర్శన॥ 32
శత్రుకర్శనా! జనార్దనా! నా కుమారులపై నాకెంత పట్టున్నదో నీవే చూచావు. అంతా ప్రత్యక్షమే. నీనుండి దాచినదేమీ లేదు. (32)
కురూణాం శమమిచ్ఛంతం యతమానం చ కేశవ।
విదిత్వైతామవస్థాం మే నాభిశంకితుమర్హసి॥ 33
కేశవా! కౌరవపాండవుల మధ్య సంధిని కోరుతూ దానికై ప్రయత్నిస్తున్నాను. ఈ పరిస్థితిని గమనించు. నన్ను శంకించవద్దు. (33)
న ఏ పాపోఽస్త్వభిప్రాయః పాండవాన్ ప్రతి కేశవ।
జ్ఞాతమేవ హితం వాక్యం యన్మయోక్తః సుయోధనః॥ 34
కేశవా! నాకు పాండవుల విషయంలో ఎటువంటి దురాలోచనా లేదు. నేను సుయోధనునితో చెప్పిన హితవచనాలు నీ వెరిగినవే గదా! (34)
జానాంతి కురవః సర్వే రాజానశ్చైవ పార్థివాః।
శమే ప్రయతమానం మాం సర్వయత్నేన మాధవ॥ 35
మాధవా! అన్ని విధాలుగా నేను సంధికోసం ప్రయత్నిస్తున్న విషయం పాండవులకూ, కౌరవులకూ, రాజులందరికీ కూడా తెలుసు. (35)
వైశంపాయన ఉవాచ
తతోఽబ్రవీన్మహాబాహుః ధృతరాష్ట్రం జనార్దనః।
ద్రోణం పితామహం భీష్మం క్షత్తారం బాహ్లికం కృపమ్॥ 36
వైశంపాయనుడిలా అన్నాడు - అప్పుడు మహాబాహువయిన జనార్దునుడు ధృతరాష్ట్రునితో, ద్రోణ భీష్మ, విదుర, బాహ్లికులతో, కృపునితో ఇలా అన్నాడు. (36)
ప్రత్యక్షమేతద్భవతాం యద్ వృత్తం కురుసంసది।
యథా చాశిష్టవన్మందః రోషదద్య సముత్థితః॥ 37
కౌరవసభలో జరిగినది మీరంతా చూచారు. మూర్ఖుడైన దుర్యోధనుడు అమర్యాదగా రోషంతో సభనుండి నిష్క్రమించటం గమనించారు. (37)
వదత్యనీశమాత్మానం ధృతరాష్ట్రో మహీపతిః।
ఆపృచ్ఛే భవతః సర్వాన్ గమిష్యామి యుధిష్ఠిరమ్॥ 38
మాహారాజైన ధృతరాష్ట్రుడు తాను అసమర్థుడ నని చెప్తున్నాడు. మీ అందరి దగ్గరా సెలవు తీసికొని యుధిష్ఠిరాదుల దగ్గరకు వెళ్తాను. (38)
ఆమంత్ర్య ప్రస్థితం శౌరిం రథస్థం పురుషర్షభ।
అనుజగ్ముర్మహేష్వాసః ప్రవీరా భరతర్షభాః॥ 39
పురుషశ్రేష్ఠా! ఆ విధంగా వీడ్కొని రథమెక్కి బయలుదేరిన శ్రీకృష్ణుని భరత వంశంలోని గొప్ప విలుకాండ్రూ, మహావీరులూ అనుసరించారు. (39)
భీష్మో ద్రోణః కృపః క్షత్తా ధృతరాష్ట్రోఽథ బాహ్లికః।
అశ్వత్థామా వికర్ణశ్చ యుయుత్సుశ్చ మహారథః॥ 40
భీష్ముడూ, ద్రోణుడూ, కృపుడూ, విదురుడూ, ధృతరాష్ట్రుడూ, బాహ్లికుడూ, అశ్వత్థామ, వికర్ణుడు, యుయుత్సువు, వీరంతా శ్రీకృష్ణుని అనుసరించిన వీరులు. (40)
తతో రథేన శుభ్రేణ మహతా కింకిణీకినా।
కురూణాం పశ్యతాం ద్రష్టుం స్వసారం స పితుర్యయౌ॥ 41
ఆపై కింకిణులచే అలంకరింపబడి ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఆ విశాలరథంపై శ్రీకృష్ణుడు కౌరవులు చూస్తుండగానే మేనత్త అయిన కుంతిని చూడటానికి వెళ్ళాడు. (41)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి విశ్వరూపదర్శనే ఏకత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 131 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున విశ్వరూపదర్శనమను నూటముప్పది యొకటవ అధ్యాయము. (131)