135. నూట ముప్పది అయిదవ అధ్యాయము

విదుల పుత్రునికి జయోపాయములను చెప్పుట.

పుత్ర ఉవాచ
కృష్ణాయసస్యేవ చ తే సంహత్య హృదయం కృత్మ్।
మమ మాతస్త్వకరుణే వీరప్రజ్ఞే హ్యమర్షణే॥ 1
తల్లి బోధ విని కొడుకు ఇలా అన్నాడు. తల్లీ నీ మనసున దయలేదు. కాని తెలివీ, కోపమూ నిండి ఉన్నాయి. అసలు నీ మనసును నల్లని ఇనుపముద్దగా చేశాడు. (1)
అహో క్షత్రసమాచారః యత్ర మామితరం యథా।
నియోజయసి యుద్ధాయ పరమాతేవ మాం తథా॥ 2
ఆహా! క్షత్రియ ధర్మం ఎంతటిదోకదా! ఆ క్షత్రియ ధర్మంకోసం పరాయివాడిని తోలినట్లు నన్ను నీవు యుద్ధానికి తోలుతున్నావు. (2)
ఈదృశం వచనం బ్రూయాత్ భవతీ పుత్రమేకజమ్।
కిం ను తే మామపశ్యంత్యాః పృథివ్యా అపి సర్వయా॥ 3
ఒక్కగానొక్క కొడుకును నేను నీకు. నీవు నన్ను ఇలా మాట్లాడుతున్నావు. నేను లేక పోయాక నీకీ భూమి అంతా వశమయినా ఏం లాభం? (3)
కిమాభరణకృత్యేన కింభోగైర్జీవితేన వా।
మయి వా సంగరహతే ప్రియపుత్రే విశేషతః॥ 4
నీకు ప్రియమైన కుమారుడను కదా! నేను పోయాక నీకు నగలు కాని భోగాలు కాని జీవితంకాని ఎందుకు? (4)
మాతోవాచ
సర్వావస్థా హి విదుషాం తాత ధర్మార్థకారణాత్।
తావేవాభిసమీక్ష్యాహం సంజయ త్వామచూచుదమ్॥ 5
అపుడు తల్లి ఇలా అన్నది. తండ్రీ! ధర్మమూ, అర్థమూ ఈ రెంటికారణంగానే పండితులకు కూడా అన్ని అవస్థలూ కలుగుతున్నాయి. సంజయా! ఆ రెండింటినే బాగా సమీక్షించి నిన్ను ప్రేరేపించాను. (5)
స సమీక్ష్యక్రమోపేతః ముఖ్యః కాలోఽయ మాగతః।
అస్మింశ్చేదాగతే కాలే కార్యం న ప్రతిపద్యసే॥ 6
అసంభావితరూపస్త్వమ్ ఆనృశంస్యం కరిష్యసి।
తం త్వామయశసా స్పృష్టం న బ్రూయాం యది సంజయ॥ 7
ఖరీవాత్సల్యమాహుస్తత్ నిఃసామర్థ్యమహేతుకమ్।
సద్భిర్విగర్హితం మార్గం త్యజ మూర్ఖనిషేవితమ్॥ 8
బాగా పరీక్షించి పరాక్రమింపదగిన సమయం వచ్చింది. ఇపుడు నీవు సముచితమయిన పని చేయకుండా శత్రువుమీద, దేహం మీద దయచూపిస్తున్నావు. ఇలా చేస్తే నీ మొగం ఎవ్వరూ చూడరు. సరికదా అపకీర్తి వస్తుంది. నేను ఈ విషయం చెప్పకపోతే ఇది గాడిద వాత్సల్యం అంటారు.(గాడిద తన పిల్లమీద చూపే ప్రేమ ఇహానికీ పరానికీ కూడా పనికిరాదు) ఈ మార్గాన్నీ మూర్ఖులు ఆదరిస్తారు. సజ్జనులు నిందిస్తారు. అందుచేత దాన్ని విడిచిపెట్టు. (6,7,8)
అవిద్యా వై మహత్యస్తి యామిహం సంశ్రితాః ప్రజాః।
తవ స్యాద్యది సద్వృత్తం తేన మే త్వం ప్రియో భవేః॥ 9
ఈ మార్గమనుసరించిన వారికి చాలా అజ్ఞానం ఉంది. కాక నీకు సత్ప్రవర్తన ఉంటే నాకు ఇష్టుడ వవుతావు. (9)
ధర్మార్థగుణయుక్తేన నేతరేణ కథంచన।
దైవమానుషయుక్తేన సద్భిరాచరితేన చ॥ 10
ధర్మ, అర్థములతో కూడినదీ, సజ్జనులు ఆచరించేదీ, దైవ మానుషాలు రెండూ కూడినదీ అయిన మార్గాన్నే అనుసరించు. మరోమార్గం ఎన్నడూ ఆచరించకు. (10)
యో హ్యేవమవినీతేన రమతే పుత్ర నప్తృణా।
అనుత్థానవతా చాపి దుర్వినీతేన దుర్ధియా॥ 11
రమతే యస్తు పుత్రేణ మోఘం తస్య ప్రజాఫలమ్।
అకుర్వంతో హి కర్మాణి కుర్వంతో నిందితాని చ॥12
సుఖం నైవేహ నాముత్ర లభంతే పురుషాధమాః।
వినయంలేని, సోమరియైన దుర్బుద్ధి కొడుకయినా ముని మనుమడయినా వాడిని చూసి మురిసిపోతే అది సంతాన ఫలం దక్కినట్లు కాదు. మంచి పనులు చేయకుండా, తప్పుపనులు చేస్తూ ఉండే పురుషాధములు ఇహ పరాలు రెండిటా సుఖం పొందరు. (11,12 1/2)
యుద్ధాయ క్షత్రియో సృష్టః సంజయేహ జయాయ చ॥ 13
జయన్ వా వధ్యమానో వా ప్రాప్నోతీంద్రసలోకతామ్।
న శక్రభవనే పుణ్యే దివి తద్విద్యతే సుఖమ్।
యదమిత్రాన్ వశే కృత్వా క్షత్రియః సుఖమశ్నుతే॥ 14
సంజయా! క్షత్రియుడు యుద్ధంకోసం, జయంకోసమే సృష్టింపబడినాడు. యుద్ధంలో జయించినా, చనిపోయినా కూడా ఇంద్రునితో సమానస్థితిని పొందుతాడు. శత్రువులను వశపరచుకొని పొందేసుఖం స్వర్గంలో ఇంద్రభవనంలో కూడా లేదు. (13,14)
మన్యున్ దహ్యమానేన పురుషేణ మనస్వినా।
నికృతేనేహ బహుశః శత్రూన్ ప్రతిజిగీషయా॥ 15
ఆత్మానం వా పరిత్యజ్య శత్రుం వా వినిపాత్య చ।
అతోఽన్యేన ప్రకారేణ శాంతిరస్య కుతో భవేత్॥ 16
అభిమానం కల క్షత్రియుడు అపకారంతో కోపంతో దహించుకొని పోతూ శత్రువులను జయించాలనే పట్టుదలతో దండెత్తి, తాను చచ్చి అయినా సరే శత్రువును చంపి అయినా సరే శాంతి పొందుతాడు. అంతేకాని క్షత్రియుడు శాంతి పొందటానికి మరో మార్గం లేదు. (15, 16)
ఇహ ప్రాజ్ఞో హి పురుషః స్వల్పమప్రియమిచ్ఛతి।
యస్య స్వలం ప్రియం లోకే ధ్రువం తస్యాల్పమప్రియమ్॥ 17
బుద్ధిమంతుడయిన మానవుడు తనకు అప్రియమయినది చాల తక్కువ ఉండాలనికోరుతాడు. స్వల్పమయిన ప్రియం ఉండే వారికి అప్రియం తప్పక తక్కువగానే ఉంటుంది. (17)
ప్రియాభావాచ్చ పురుషః నైవ ప్రాప్నోతి శోభనమ్।
ధ్రువం చాభావమభ్యేతి గత్వా గంగేవ సాగరమ్॥ 18
ప్రీతి లేని పురుషుడు శుభాన్ని పొందడు. సముద్రంలో కలిసిన గంగ లాగా వాడు తప్పక అభావాన్ని (నాశాన్ని) పొందుతాడు. (18)
పుత్ర ఉవాచ
నేయం మతిస్త్వయా వాచ్యా మాతః పుత్రే విశేషతః।
కారుణ్యమేవాత్ర పశ్య భూత్వేహ జడమూకవత్॥ 19
అపుడు కొడుకు ఇట్లన్నాడు. తల్లీ! నీవిటువంటి బోధ చేయకూడదు. ముఖ్యంగా పుత్రునికి అసలే చెప్పరాదు. ఈ సందర్భంలో మూఢునిలా, మూగివానిలా కారుణ్యమునే వహించు. (19)
అపుడు కొడుకు ఇట్లన్నాడు. తల్లీ! నీవిటువంటి బోధ చేయకూడదు. ముఖ్యంగా పుత్రునికి అసలే చెప్పరాదు. ఈ సందర్భంలో మూఢునిలా, మూగివానిలా కారుణ్యమునే వహించు. (19)
మాతోవాచ
అతో మే భూయసీ నందిః యదేవమనుపశ్యసి।
చోద్యం మాం చోదయస్యేతత్ భృశం వై చోదయామి తే॥ 20
తల్లి యిట్లన్నది. ఇలా ఆలోచన చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నీకేది చేయాలో నాకు నీవు చెపుతున్నావు. నేను అందుకే నీ కర్తవ్యాన్ని సూటిగా మిక్కిలిగా చెపుతున్నాను. (20)
అథ త్వాం పూజయిష్యామి హత్వ వై సర్వసైంధవాన్।
అహం పశ్యామి విజయం కృచ్ఛ్రభావితమేవ తే॥ 21
సింధుదేసపు రాజులందరినీ చంపి, నీవు కష్టంగా భావించిన విజయం చూస్తేనే నేను నిన్ను ప్రశంసిస్తాను. (21)
పుత్ర ఉవాచ
అకోశస్యాసహాయస్య కుతస్సిద్ధిర్జయో మమ।
ఇత్యవస్థాం విదిత్వైతామ్ ఆత్మనాత్మని దారుణామ్॥ 22
రాజ్యాద్భావో నివృత్తో మే త్రిదివాదివ దుష్కృతేః।
ఈదృశం భవతీ కంచిత్ ఉపాయమనుపశ్యతి॥ 23
అపుడు కొడుకు ఇలా అన్నాడు. నాకు కోశాగారం లేదు. సహాయులు లేరు. ఇక విజయం ఎలా సిద్ధిస్తుంది? ఈ దారుణ మయిన పరిస్థితిని నా అంతట నేను తెలుసుకొన్నాను. పాపి స్వర్గం నుండి వెడల గొట్ట బడినట్లు నా మనసు రాజ్యం నుండి మరలింపబడింది. (22,23)
తన్మే పరిణతప్రజ్ఞే సమ్యక్ ప్రబ్రూహి పృచ్ఛతే।
కరిష్యామి హి తత్సర్వం యథావదనుశాసనమ్॥ 24
తల్లీ! నీకు పండిన తెలివి ఉంది. నీకు తోచిన ఉపాయం చెప్పు. నీవు చెప్పినట్లు అంతా చేస్తాను. (24)
మాతోవాచ
పుత్ర నాఽత్మానమంతవ్యః పూర్వాభిరసమృద్ధిభిః।
అభూత్వా హి భవంత్యర్థాః భూత్వా నశ్యంతి చాపరే।
అమర్షేణైవ చాప్యర్థాః నారబ్ధవ్యాః సుబాలిశైః॥ 25
తల్లి ఇట్లంది. కుమారా! తన్ను తాను ఎవరూ అవమానపరచుకోరాదు. సంపదలు పూర్వం లేకపోయినా వస్తాయి. పూర్వం ఉన్నా ఇపుడు నష్టమయిపోతాయి. తెలివి తక్కువవారు తొందరపాటుతో ధర్మార్థాలను ప్రారంభించరాదు. (25)
సర్వేషాం కర్మణాం తాత ఫలే నిత్యమనిత్యతా।
అనిత్యమితి జానంతః న భవంతి భవంతి చ॥ 26
తండ్రీ! మనం చేసే కర్మలన్నిటికీ ఫలం వస్తుందో లేదో చెప్పలేము. ఫలం అనిత్యం అని తెలిసిన పండితులు ఆ ఫలితాన్ని పొందవచ్చు పొందలేక పోవచ్చు. (26)
అథ యే నైవ కుర్వంతి నైవ జాతు భవంతి తే।
ఐకమత్యమనీహాయామ్ అభావః కర్మణాం ఫలమ్॥ 27
అథ ద్వైగుణ్యమీహాయాం ఫలం భవతి వా న వా॥
కార్యం చేయనివారికి ఎన్నడూ ఫలితం రాదు. కర్మముల పట్ల ఆసక్తి లేకపోతే ఒకటే గుణం. అదిఫలం నశించటమే. ఆసక్తి ఉంటే ఫలం రావడమో రాకపోవడమో అని రెండు గుణాలు(సందేహం.) (27 1/2)
యస్య ప్రాగేన విదితా సర్వార్థానామనిత్యతా॥ 28
నుదేద్ వృద్ధ్యసమృద్ధీ స ప్రతికూలే నృపాత్మజ।
మన ఇష్టాన్ని బట్టి కార్యఫలాలు సిద్ధించవని తెలిసినవాడు ప్రతికూలాలయిన ఆత్మహానిని కాని శత్రుసమృద్ధిని కాని లెక్క చేయడు. (28 1/2)
వి॥సం॥ వృద్ధి = వృధు హింసాయామ్ = పీడ(నీల)
ఉత్థాతవ్యం జాగృతవ్యం యోక్త్వ్యం భూతికర్మసు॥ 29
భవిష్యతీత్యేవ మనః కృత్వా సతతమవ్యథైః।
మానవుడు సదా దుఃఖరహితుడై తప్పక సాధించగలమని మనసు దృఢపరచుకొని మేలు కలిగించే పనులలో ఉద్యమించాలి, మేల్కొని శుభకర్మలలో ఆసక్తుడై ఉండాలి. (29 1/2)
మంగలాని పురస్కృత్య బ్రాహ్మణాంశ్చేశ్వరైః సహ॥ 30
ప్రాజ్ఞస్య నృపతేరాశు వృద్ధిర్భవతి పుత్రక।
అభివర్తతి లక్ష్మీస్తం ప్రాచీమివ దివాకరః॥ 31
పుత్రా! దేవబ్రాహ్మణులను, మంగళ కృత్యాలను ముందిడుకొని ప్రవర్తించే రాజుకు త్వరగా అభివృద్ధి కల్గుతుంది. తూర్పు దిక్కును సూర్యుడు పొందినట్లుగా లక్ష్మీదేవి అట్టివానిని చేరుతుంది. (30,31)
విదర్శనాన్యుపాయాంశ్చ బహూన్యుద్ధర్షణాని చ।
అనుదర్శితరూపోఽసి పశ్యామి కురు పౌరుషమ్॥ 32
నీకు చాలా నిదర్శనాలూ, ఉపాయాలూ, ప్రోత్సాహకాలూ, లోకపుతీరులూ చూపించాను. నీవు పౌరుషం చూపించు. చూస్తాను. (32)
పురుషార్థమభిప్రేతం సమాహర్తుమిహార్హసి।
క్రుద్ధాన్ లుబ్ధాన్ పరిక్షీణాన్ అవలిస్తాన్ విమానితాన్॥ 33
స్పర్థినశ్పైవ యే కేచిత్ తాన్ యుక్త ఉపధారయ।
ఏతేన త్వం ప్రకారేణ మహతో భేత్స్యసే గణాన్॥ 34
మహావేగ ఇవోద్భూతః మాతరిశ్వా వలాహకాన్।
కొరిన పురుషార్థాన్ని సమీకరించుకో, నీ మీద కోపం కలవారినీ, లోభులనూ, క్షీణించినవారినీ గర్వితులనూ, అవమానితులనూ, పోటీదారులనూ తెలివితో కూడగట్టుకో. వేగం కల గాలి మేఘాలను చెదరగొట్టినట్లు, నీవు శత్రుసేనలను ఛేదించ గలవు. చీల్చి వేయగలుగుతావు. (33,34)
తేషా మగ్రప్రదాయీ స్యాః కల్పోత్థాయీ ప్రియంవదః॥ 35
తే త్వాం ప్రియం కరిష్యంతి పురో ధాస్యంతి చ ధ్రువమ్।
పై వారికి ముందు అన్నీ ఇమ్ము(భోజనమూ, వేతనమూ మొదలయినవి) న్యాయాన్ని నిలెబెట్టు. ప్రియంగా మాట్లాడు. అపుడు వారు నీకు ప్రియం చేస్తారు. బాగ గౌరవిస్తారు. ఇది నిజం. (35 1/2)
వి॥సం॥ ఇచట కల్యోత్థాయి అని పాఠమున్నది. దానిని వేకువనే లేచువాడని అర్థం.
యదైవ శత్రుర్జానీయాత్ సపత్నం త్యక్తజీవితమ్।
తదైవాస్మాదుద్విజతే సర్పాద్వేశ్మగతాదివ॥ 36
తన శత్రువు ప్రాణాలకు తెగించి పోరాడుతాడని తెలిసిన వెంటనే శత్రువు భయపెడతాడు, ఇంట్లో ఉన్న పాముకు భయపడినట్లు. (36)
తం విదిత్వా పరాక్రాంతం వశే న కురుతే యది।
నిర్వాదైర్నిర్వదేదేనం అంతతస్తద్భవిష్యతి॥ 37
పరాక్రమించే శత్రువును వశపరచుకొనలేకపోతే మంచి మాటలతో వానిని విజృంభించకుండా చెయ్యాలి. చివరకు (సామోపాయంతో) అలా లొంగదీసుకోవాలి. (37)
నిర్వాదాదాస్పదం లబ్ధ్వా ధనవృద్ధిర్భవిష్యతి।
ధనవంతం హి మిత్రాణి భజంతే చాశ్రయంతి చ॥ 38
మంచి మాటలతో స్థానం సంపాదిస్తే ధనం వృద్ధి చెందుతుంది. ధనవంతుడినే మిత్రులు సేవిస్తారు. ఆశ్రయిస్తారు. (38)
స్థలితార్థం పునస్తాత సంత్యజంతి చ బాంధవాః।
అప్యస్మిన్ నాశ్వసంతే చ జుగుప్సంతే చ తాదృశమ్॥ 39
ధనం కోల్పోయిన వానిని బంధువులు కూడా వదిలివేస్తారు. అంతేకాదు వాని మీద విశ్వాసం ఉంచరు. అసహ్యించుకొంటారు కూడా. (39)
శత్రుం కృత్వా యః సహాయం విస్వాసముపగచ్ఛతి।
స న సంభావ్యమేవైతద్ యద్రాజ్యం ప్రాప్నుయాదితి॥ 40
శత్రువు సహాయంపొంది, అతనిని నమ్మితే ఇక రాజ్యం దక్కుతుందనేది ఏమాత్రం సంభవం కాదు. (దక్కనే దక్కదు) (40)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి విదులాపుత్రానుశాసనే పంచత్రింశ దధిక శతతమోఽధ్యాయః॥ 135 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున విదులా పుత్రానుశాసనమను నూటముప్పది అయిదవ అధ్యాయము. (135)