136. నూట ముప్పది ఆరవ అధ్యాయము
విదులబోధతో సంజయుడు యుద్ధమునకు బయలు దేరుట.
మాతో వాచ
నైవ రాజ్ఞా దరః కార్యః జాతు కస్యాంచిదాపది।
అథ చేదపి దీర్ణః స్యాత్ నైవ వర్తేత దీర్ణవత్॥ 1
తల్లి ఇలా అంటున్నది. రాజు ఎన్నడూ ఆపదలో భయపడకూడదు. ఒకవేళ భయపడినా భయపడినట్లు ప్రవర్తించకూడదు. (1)
దీర్ణం హి దృష్ట్వా రాజానం సర్వమేవానుదీర్యతే।
రాష్ట్రం బలమమాత్యాశ్చ పృథక్ కుర్వంతి తే మతీః॥ 2
భయపడిన రాజును చూసి సేన అంతా చెల్లా చెదరు అయిపోతుంది. మంత్రులు కూడ బుద్ధి మార్చుకొని వేరైపోతారు. (2)
శత్రూనేకే ప్రపద్యంతే ప్రజహత్యపరే పునః।
అన్యే తు ప్రజిహీర్షంతి యే పురస్తాద్విమానితాః॥ 3
కొంతమంది శత్రువులలో చేరుతారు. మరి కొందరు నిన్ను వదలి ఎటో పోతారు. పూర్వం నీ చేత అవమానింపబడినవారు నిన్ను దెబ్బతీయాలని చూస్తారు. (3)
య ఏవాత్యంతసుహృదః త ఏవం పర్యుపాసతే।
అశక్తయః స్వస్తికామాః బద్ధవత్సా ఇడా ఇవ॥ 4
బాగా దగ్గరస్నేహితులు మాత్రం వానిని కొలుస్తూనే ఉంటారు. వారు కట్టివేయబడిన దూడల వలె అశక్తులయి, ఏమీ చేయలేక శుభాన్ని మాత్రం కోరుతారు. (4)
శోచంతమనుశోచంతి పతితానివ బాంధవాన్।
అపి తే పూజితాః పూర్వమ్ అపి తే సుహృదో మతాః॥ 5
పైగా చెడిన బంధువులను ఓదర్చినట్లు దుఃఖించే వారి దగ్గర ఏడుస్తూ ఉంటారు. నీచేత పూజింపబడిన స్నేహితులు నీకున్నారు గదా! (5)
యే రాష్ట్రమభిమన్యంతే రాజ్ఞో వ్యసనమీయుషః।
మా దీదరస్త్వం సుహృదః మా త్వాం దీర్ణం ప్రహాసిషుః॥ 6
ఆపద పొందిన రాజుయొక్క రాజ్యం తమదే అని అభిమానించే స్నేహితులు నీకూ ఉన్నారుకదా! భయపడకు నీవు. (6)
ప్రభావం పౌరుషం వృద్ధిం జిజ్ఞాసంత్యా మయా తవ।
విదధత్వా సమాశ్వాసమ్ ఉక్తం తేజో వివృద్ధయే॥ 7
నీప్రభావాన్ని, పౌరుషాన్ని, తెలివినీ తెలుసుకోవాలనీ, నీకు ధైర్యంచెప్పాలనీ, నీ పౌరుషం రెచ్చ గొట్టాలనీ ఇలా చెప్పాను. (7)
యదేతత్ సంవిజానాసి యది సమ్యక్ బ్రవీమ్యహమ్।
కృత్వాఽసౌమ్యమివాత్మానం జయాయోత్తిష్ఠ సంజయ॥ 8
సంజయా! ఈ విషయం నీకు చక్కగా తెలిస్తే, నేను చక్కగా చెప్పి ఉంటే గుండె దిటవు చేసికొని విజయం కోసం లేచి నిలబడు. (8)
అస్తి నః కోశనిచయః మహాన్ హ్యవిదితస్తవ।
తమహం వేద నాన్యస్తమ్ ఉపసంపాదయామి తే॥ 9
నీకు తెలియని గొప్పనిధి మనకు ఉంది. అది నాకు తెలుసును. ఇంకెవ్వరికీ తెలియదు. దానిని నీకు తెచ్చి పెడతాను. (9)
సంతి నైకతమా భూయః సుహృదస్తవ సంజయ।
సుఖదుఃఖసహా వీర సంగ్రామాదనివర్తినః॥ 10
సంజయా! నీకు చాలా మంది స్నేహితులున్నారు. వారంతా సుఖదుఃఖాలు సహింపగలవారు. యుద్ధం నుండి వెనుదిరగరు. (10)
తాదృశా హి సహాయా వై పురుషస్య బుభూషతః।
ఇష్టం జిహీర్షతః కించిత్ సచివాః శత్రుకర్శన॥ 11
శత్రుమర్దనా! నీకు మేలు కోరే స్నేహితులూ మంత్రులూ కొద్దిపాటి ఇష్టమయినా చేయాలనుకొంటారు. (11)
యస్యాస్త్వీదృశకం వాక్యం శ్రుత్వాఽపి స్వల్పచేతసః।
తమస్త్వపాగమత తస్య సుచిత్రార్థపదాక్షరమ్॥ 12
చక్కని పదాలు, చిత్రమయిన అర్థాలు, అక్షరాలు కల ఆమెమాట విన్న ఆకుమారునకు మనసులోని చీకటి తొలగిపోయింది. (12)
పుత్ర ఉవాచ
ఉదకే భూరియం ధార్యా మర్తవ్యం ప్రవణే మయా।
యస్య మే భవతీ నేత్రీ భవిష్యద్భూతిదర్శినీ॥ 13
వెంటనే కొడుకు ఇలా అన్నాడు. అమ్మా! మునిగిపోయే ఈ భూమిని నేను ఉద్ధరించాలి. లేదా యుద్ధమనే లోయలోపడి మరణించాలి. ఏమయినా నా భవిష్యత్సంపదను చూపించి నన్ను నడిపించుతున్నావు. (13)
అహం హి వచనం త్వత్తః శుశ్రూషురపరాపరమ్।
కించిత్ కించిత్ ప్రతివదన్ తూష్ణీమాసం ముహుర్ముహుః॥ 14
అమ్మా! నీ మాటలు ఒక దానికంటే మరొకటి చాలా బాగుగా ఉండటం చేత పూర్తిగా వినాలని కొద్ది కొద్దిగా ఊరికే ఎదురు చెపుతూ వచ్చాను. (14)
అతృప్యన్నమృతస్యేవ కృచ్ఛ్రాల్లబ్ధస్య బాంధవాత్।
ఉద్యచ్ఛామ్యేష శత్రూణాం నియమార్థం జయాయ చ॥ 15
మాతృబంధంతో చాలా కష్టపడి పొందిన అమృతం వంటి ఈ మాటలతో తృప్తి కలగటంలేదు. శత్రువులను నిలిపేందుకు, జయం పొందటానికి ఇదిగో బయలు దేరుతున్నాను. (15)
కుంత్యువాచ
సదశ్వ ఇవ స క్షిప్తః ప్రణున్నో వాక్యసాయకైః।
తచ్చకార తథా సర్వం యథావదనుశాసనమ్॥ 16
కుంతీదేవి ఇట్లు చెప్పింది. మాటల బాణాలు బాగా నాటుకొని, అతడు(సంజయుడు) జాతి గుర్రంలా ఉరికి మాట ప్రకారం అంతా చేశాడు. (16)
ఇదముద్ధర్షణం భీమం తేజోవర్ధన ముత్తమమ్।
రాజానం శ్రావయేన్మంత్రీ సీదంతం శత్రుపీడితమ్॥ 17
ఈ కథ ఉత్సాహం కలిగిస్తుంది. భయం కరమయినది. పౌరుషం కలిగిస్తుంది. ఉత్తమ మయినది. శత్రుపీడతో మునిగిపోతున్న రాజుకు మంత్రి దీన్ని వినిపించాలి. (ధర్మరాజుకు మంత్రి వంటి కృష్ణా! వినిపించు) (17)
జయో నామేతిహాసోఽయం శ్రోతవ్యో విజిగీషుణా।
మహీం విజయతే క్షిప్రం శ్రుత్వా శత్రూంశ్చ మర్ధతి॥ 18
జయ మనే పేరుగల ఈ ఇతిహాసాన్ని జయం పొందాలనుకొన్నవాడు వినాలి. దీన్ని వింటే వెంటనే శత్రుసంహారం చేసి భూమిని జయిస్తాడు. (18)
ఇదం పుంసవనం చైవ వీరాజననమేవ చ।
అభీక్ష్ణం గర్భిణీ శ్రుత్వా ధ్రువం వీరం ప్రజాయతే॥ 19
ఇది వీరుడయిన పుత్రుని ఇచ్చే యజ్ఞం. గర్భవతి వింటే తప్పక వీరుని కంటుంది. (19)
విద్యాశూరమ్ తపఃశూరం దానశూరం తపస్వినమ్।
బ్రాహ్మ్యా శ్రియా దీప్యమానం సాధువాదే చ సంమతమ్॥ 20
విద్యలో తపస్సులో దానంలో చురుకైన వానిని, తపస్విని, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించే వానిని, సజ్జన సమ్మతుడయినవానిని కంటుంది. (20)
అర్బిష్మంతం బలోపేతం మహాభాగం మహారథమ్।
ధృతిమంతమనాధృష్యం జేతారమపరాజితమ్॥ 21
నియంతారమసాధూనాం గోప్తారం ధర్మచారిణామ్।
ఈదృశం క్షత్రియా సూతే వీరం సత్యపరాక్రమమ్॥ 22
అగ్నివంటి తేజస్సు కలవానిని, బలవంతుని, మహానుభావుని, మహారథుని, పుత్రునిగా పొందుతుంది. ఎవరికీ లొంగని ధైర్యం కలవానిని, పరాజయం ఎరుగని జయశీలుని పుత్రునిగా పొందుతుంది. దుష్టులను శిక్షిస్తూ, ధార్మికులను రక్షిస్తూ, సత్యపరాక్రమం కల వీరుని కుమారునిగా పొందుతుంది. (21-22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి విదులా పుత్రానుశాసనసమాప్తౌ షట్ త్రింశ దధిక శతతమోఽధ్యాయః॥ 136 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున విదుల పుత్రుని శాసించుట అను నూట ముప్పది ఆరవ అధ్యాయము. (136)