138. నూటముప్పది యెనిమిదవ అధ్యాయము
భీష్మద్రోణులు దుర్యోధనునకు బోధించుట.
వైశంపాయన ఉవాచ
కుంత్యాస్తు వచనం శ్రుత్వా భీష్మద్రోణౌ మహారథౌ।
దుర్యోధనమిదం వాక్యమ్ ఊచతుః శాసనాతిగమ్॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు. కుంతీదేవి మాట విని మహారథులయిన భీష్మద్రోణులు పెద్దల మాటలను అతిక్రమించే దుర్యోధనునితో ఇలా అన్నారు. (1)
శ్రుతం తే పురుషవ్యాఘ్ర కుంత్యాః కృష్ణస్య సన్నిధౌ।
వాక్యమర్థవదత్యుగ్రమ్ ఉక్తం ధర్మ్యమనుత్తమమ్॥ 2
పురుషవ్రాఘ్రా! కృష్ణుని దగ్గర కుంతి అర్థవంతమూ, ధర్మసహితమూ, ఉత్తమమూ అయిన మాట ఎంత భయంకరంగా మాట్లాడిందో విన్నావుగా। (2)
తత్కరిష్యంతి కౌంతేయాః వాసుదేవస్య సంమతమ్।
న హి తే జాతు శామ్యేరన్ ఋతే రాజ్యేన కౌరవ॥ 3
ఆ కుంతీపుత్రులు కృష్ణునికిష్టమైన ఆ పని పూర్తిచేస్తారు. దుర్యోధనా! రాజ్యం లేకుండా వారు ఎన్నటికీ శాంతించరు. (3)
క్లేశితా హి త్వయా పార్థాః ధర్మపాశసితాస్తదా।
సభాయాం ద్రౌపదీ చైవ తైశ్చ తన్మర్షితం తవ॥ 4
ధర్మపాశానికి కట్టుబడిన కుంతీపుత్రులను నీవు చాలా కష్టపెట్టావు. సభలో ద్రౌపదిని ఎంతగానో బాధించావు. అయినా వారు సహించారు. (4)
కృతాస్త్రం హ్యర్జునం ప్రాప్య భీమం చ కృతనిశ్చయమ్।
గాండీవం చేషుధీ చైవ రథం చ ధ్వజమేవ చ॥ 5
నకులం సహదేవం చ బలవీర్యసమన్వితౌ।
సహాయం వాసుదేవం చ న క్షంస్యతి యుధిష్ఠిరః॥ 6
అర్జునుడు అస్త్ర విద్యావిశారదుడు. ఎపుడో నిశ్చయం చేసుకొన్నవాడు భీముడు(మిమ్మల్ని సంహరించాలని). ఇక గాండీవం, అమ్ములపొదులూ, దివ్యరథమూ, కపి ధ్వజమూ అర్జునునికున్నాయి. బలపరాక్రమ సంపన్నులయిన నకుల సహదేవులున్నారు. వాసుదేవుని సహాయం ఉంది ఇన్నీ ఉండి ఆ యుధిష్ఠిరుడు నిన్ను క్షమించడు. (5,6)
ప్రత్యక్షం తే మహాబాహో యథా ప్రార్థేన ధీమతా।
విరాటనగరే పూర్వం సర్వే స్మ యుధి నిర్జితాః॥ 7
మొన్ననే విరాటనగరంలో ఆ అర్జునుని చేతిలో మనమంతా యుద్ధంలో ఓడిపోవడం నీవు కళ్లారా చూశావు గదా! (7)
దానవా ఘోరకర్మాణః నివాతకవచా యుధి।
రౌద్రమస్త్రం సమాదాయ దగ్ధా వానరకేతునా॥ 8
దారుణకృత్యాలు చేసే నివాతకవచుల్ని రౌద్రాస్త్రంతో అర్జునుడు దగ్ధం చేశాడు. (8)
కర్ణప్రభృతయశ్చేమే త్వం చాపి కవచీ రథీ।
మోక్షితో ఘోషయాత్రాయాం పర్యాస్తం తన్నిదర్శనమ్॥ 9
ప్రశామ్య భరతశ్రేష్ఠ భ్రాతృభిః సహ పాండవైః।
రక్షేమాం పృథివీం సర్వాం మృత్యోర్దంష్ట్రాంతరం గతామ్॥ 10
ఈ కర్ణాదులూ, కవచం తొడిగి రథమెక్కిన నీవూ ఘోషయాత్రలో అర్జునుని వల్లనే విడిపింపబడ్డారు. ఆ నిదర్శనం చాలును.
కురుపుంగవా! సోదరులయిన పాండవులతో స్నేహం చెయ్యి - మృత్యువు కోరల్లో చిక్కుకున్న ఈ భూమినంతటినీ రక్షించు. (9,10)
జ్యేష్ఠో భ్రాతా ధర్మశీలః వత్సలః శ్లక్ష్ణవాక్కవిః।
తం గచ్ఛ పురుషవ్యాఘ్రం వ్యపనీయేహ కిల్బిషమ్॥ 11
నీకు అన్న, ధర్మశీలుడు ధర్మరాజు. నీ మీద వాత్సల్యం కలవాడు. ప్రియంగా మాట్లాడేవాడు. మేధావి. (నీ మనసులోని) కల్మషం విడిచి ఆ ధర్మరాజును ఆశ్రయించు. (11)
దృష్టశ్చ త్వం పాండవేన వ్యపనీతశరాసనః।
ధనుర్బాణాలు పోగొట్టుకొన్న సమయంలో నీవు ధర్మరాజు చేత చూడబడ్డావు. (11 1/2)
ప్రశాంతభ్రుకుటిః శ్రీమాన కృతా శాంతిః కులస్య నః॥ 12
తమభ్యేత్య సహామాత్యః పరిష్వజ్య నృపాత్మజమ్।
అభివాద్య రాజానం యథాపూర్వమరిందమ॥ 13
బొమలు ముడివడని ధర్మరాజు మన వంశానికి ప్రశాంతి చేకూర్చాడు. మంత్రులతో సహా అతని చేరి, కౌగిలించుకొని పూర్వం వలె గౌరవంతో నమస్కరించు. (12,13)
అభివాదయమానం త్వాం పాణిభ్యాం భీమపూర్వజః।
ప్రతిగృహ్ణాతు సౌహార్దాత్ కుంతీపుత్రో యుధిష్ఠిరః॥ 14
నమస్కరించే నిన్ను ధర్మరాజు సౌహార్దంతో స్వీకరించాలి. (14)
సింహస్కంధోరుబాహుస్త్వాం వృత్తాయతమహాభుజః।
పరిష్వజతు బాహుభ్యాం భీమః ప్రహరతాం వరః॥ 15
సింహం మూపులాంటి ఎగుబుజాలూ, కండలు తిరిగిన పొడు గాటి చేతులూ కల భీముడు నిన్ను ఆలింగనం చేసుకోవాలి. (15)
కంబుగ్రీవో గుడాకేశః తతస్త్వాం పుష్కరేక్షణః।
అభివాదయతాం పార్థః కుంతీపుత్రో ధనంజయః॥ 16
శంఖం వంటి మెడ, పద్మాలవంటి కనులు కల ధనుర్విద్యావేత్త అర్జునుడు నీకు నమస్కరించాలి. (16)
ఆశ్వినేయౌ నరవ్యాఘ్రౌ రూపేణాప్రతిమౌ భువి।
తే చ త్వాం గురువత్ ప్రేమ్లా పూజయా ప్రత్యుదీయతామ్॥ 17
నరశ్రేష్ఠులూ, చక్కని సౌందర్యం కలవారు నకుల సహదేవులు. వారు నిన్ను ప్రేమతో గౌరవంతో ఎదురువచ్చి స్వాగతించాలి. (17)
ముంచంత్వానందజాశ్రూణి దాశార్హప్రముఖా నృపాః।
సంగచ్ఛ భ్రాతృభిః మానం సంత్యజ్య పార్థివ॥ 18
కృష్ణాదులయిన రాజులు ఆనందబాష్పాలు వదలాలి - రాజా! అహంకారం విడిచి సోదరులతో కలిసిఉండు. (18)
ప్రశాధి పృథివీం కృత్స్నామ్ తతస్త్వం భ్రాతృభిస్సహ।
సమాలింగ్య చ హర్షేణ నృపా యాంతు పరస్పరమ్॥ 19
తరువాత సోదరులతో కలిసి భూమినంతా ప్ ఆలింగనం చేసికొని మరలిపో(తారు) వుదురుగాక. (19)
అలం యుద్ధేన రాజేంద్ర సుహృదాం శృణు వారణమ్।
ధ్రువం వినాశో యుద్ధే హి క్షత్రియాణాం ప్రదృశ్యతే॥ 20
నీ స్నేహితులంతా యుద్ధం వద్దు అంటున్నారు. యుద్ధం వల్ల రాజులకు నిశ్చయంగా వినాశమే కలుగుతుంది. అందుచేత యుద్ధం వద్దు. (20)
జ్యోతీంషి ప్రతికూలాని దారుణా మృగపక్షిణః।
ఉత్పాతా వివిధా వీర దృశ్యంతే క్షత్రనాశనాః॥ 21
నక్షత్రాలు ప్రతికూలంగా ఉన్నాయి. మృగాలూ, పక్షులూ భయంకరంగా ఉన్నాయి. రాజుల వినాశాన్ని సూచించే ఎన్నో శకునాలు కనపడుతున్నాయి. (21)
విశేషత ఇహాస్మాకం నిమిత్తాని నివేశనే।
ఉల్కాభిర్హి ప్రదీప్తాభిః బాధ్యతే పృతనా ఇవ॥ 22
ముఖ్యంగా మన సేనలో ఈ దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. నీ సైన్యంలో మంటలతో కూడిన ఉల్కలు కనిపిస్తున్నాయి. (22)
వాహనాన్యప్రహృష్టాని రుదంతీవ విశాంపతే।
గృధ్రాస్తే పర్యుపాసంతే సైన్యాని చ సమంతతః॥ 23
నీ వాహనాలు(గుర్రాలు, ఏనుగులూ) ఏడుస్తున్నట్లుగా మొగాలు వ్రేలాడ వేసుకొని కనిపిస్తున్నాయి. నీ సైన్యాల చుట్టూ గద్దలు తిరుగుతున్నాయి. (23)
నగరం న యథాపూర్వం తథా రాజనివేశనమ్।
శివాశ్చాశివనిర్ఘోషాః దీప్తాం సేవంతి వై దిశమ్॥ 24
నీ నగరమూ రాజభవనమూ పూర్వంలా కనపడటంలేదు - మండే దిక్కుకు మొగంపెట్టి నక్కలు అశుభచూచకంగా ఏడుస్తున్నాయి. (24)
కురు వాక్యం పితుర్మాతుః అస్మాకం చ హితౌషిణామ్।
త్వయ్యాయత్తో మహాబాహో శమో వ్యాయామ ఏవ చ॥ 25
నీ తండ్రీ, తల్లీ, నీ హితం కోరే మేమూ, చెప్పిన మాట విను - శాంతి కాని, శ్రమకాని నీ చేతిలోనే ఉంది. (25)
న చేత కరిష్యసి వచః సుహృదామరికర్శన।
తప్స్యసే వాహినీం దృష్ట్వా పార్థబాణప్రపీడితామ్॥ 26
శత్రుమర్దనా! స్నేహితుల మాటలు నీవు వినకపోతే(యుద్ధంలో) అర్జునుని బాణపు దెబ్బలు తిన్న సైన్యాన్ని చూసి పరితపించక మానవు. (26)
భీమస్య చ మహానాదం నదతః శుష్మిణో రణే।
శ్రుత్వా స్మర్తాసి మే వాక్యం గాండీవస్య చ నిస్వనమ్।
యద్యేతదపసవ్యం తే వచో మమ భవిష్యతి॥ 27
నేను చెప్పినమాట నీకు సవ్యంగా అనిపించకపోతే బలవంతుడయిన భీముని మహానాదమూ, గాండీవ ఘోషనూ విని నామాటలు గుర్తు తెచ్చుకుంటావు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి భీష్మద్రోణవాక్యే అష్టాత్రింశ దధికశతతమోఽధ్యాయః॥ 138 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున భీష్మద్రోణుల వాక్యమను నూటముప్పది ఎనిమిదవ అధ్యాయము. (138)