137. నూటముప్పది ఏడవ అధ్యాయము
పాండవులకు కుంతి సందేశమిచ్చుట.
కుంత్యువాచ
అర్జునం కేశవ బ్రూయాః త్వయి జాతే స్మ సూతకే।
ఉపోపవిష్టా నారీభిః ఆశ్రమే పరివారితా॥ 1
అథాంతరిక్షే వాగాసీత్ దివ్యరూపా మనోరమా।
సహస్రాక్షసమః కుంతి భవిష్యత్యేష తే సుతః॥ 2
కుంతి ఇలా చెప్పింది - కేశవా! అర్జునునితో ఇలా చెప్పు. నీ పురిటి సమయంలో ఆశ్రమంలో స్త్రీలంతా నాచుట్టూ ఉండగా ఆకాశంలోంచి మనోహరమయిన ఒక దివ్యవాణి వినిపించింది. "కుంతీ! ఈ నీ కొడుకు దేవేంద్రునితో సమానుడవుతాడు. (1,2)
ఏష జేష్యతి సంగ్రామే కురూన్ సర్వాన్ సమాగతాన్।
భీమసేనద్వితీయశ్చ లోకముద్వర్తయిష్యతి॥ 3
యుద్ధంలో ఎదురు వచ్చిన కౌరవులందరినీ భీముని పాయంతో చెల్లాచెదరు చేస్తాడు. (3)
పుత్రస్తే పృథివీం జేతా యశశ్చాస్య దివం స్పృశేత్।
హత్వా కురూంశ్చ సంగ్రామే వాసుదేవసహాయవాన్॥ 4
పిత్ర్యమంశం ప్రణష్టం చ పునరప్యుద్ధరిష్యతి।
భ్రాతృభిః సహితః శ్రీమాన త్రీన్ మేధానాహరిష్యతి॥ 5
వాసుదేవుని సహాయంతో యుద్ధంలో కౌరవులను సంహరించి భూమిని జయిస్తాడు. వీని యశస్సు ఆకాశమంటుంది. పోయిన తండ్రి భాగాన్ని మళ్లీ సంపాదిస్తాడు. సోదరులతో కలిసి మూడు అశ్వమేధ యాగాలు చేస్తాడు" అని చెప్పింది. (4,5)
స సత్యసంధో బీభత్సుః సవ్యసాచీ యథాచ్యుత।
తథా త్వమేవ జానాసి బలవంతం దురాసదమ్॥ 6
అచ్యుతా! బీభత్సుడయిన ఆ సవ్యసాచి ఎంత సత్యసంధుడో, ఎంత బలవంతుడో, ఎంత దురాసదుడో నీకే తెలుసు. (6)
తథా తదస్తు దాశార్హ యథావాగభ్యభాషత।
ధర్మశ్చేదస్తి వార్ష్ణేయ తథా సత్యం భవిష్యతి॥ 7
కృష్ణా! అది అలాగే కావాలి. ధర్మం అనేది ఉంటే ఆకాశవాణి పలికిన పలుకు సత్యం అవుతుంది. (7)
త్వం చాపి తత్తథా కృష్ణ సర్వం సంపాదయిష్యసి।
నాహం తదభ్యసూయామి యథావాగభ్యభాషత॥ 8
కృష్ణా! ఆకాశవాణి మాటను శంకింపను కాని ఆ మాట అంతా నిజం చెయ్యటానికి నీవే తగుదువు. (8)
నమో ధర్మాయ మహతే ధర్మో ధారయతి ప్రజాః।
ఏతద్ధనంజయో వాచ్యః నిత్యోద్యుక్తో వృకోదరః॥ 9
యదర్థం క్షత్రియా సూతే తస్య కాలోఽయ మాగతః।
న హి వైరం సమాసాద్య సీదంతి పురుషర్షభాః॥ 10
గొప్పదైన ధర్మానికి నమస్కారం - ధర్మమే ప్రజలను ధరింపజేస్తుంది - ఈ విషయం అర్జునుడికీ, నిత్యసన్నద్ధుడైన భీమునికీ చెప్పు - రాజవనిత ఎందుకు పుత్రులను కంటుందో అందుకు తగిన సమయం ఆసన్నమయింది. పురుషశ్రేష్ఠులు ఒకసారి వైరం వహించాక దాని నుండి సడలిపోరు. (9,10)
విదిత తే సదా బుద్ధిః భీమస్య న స శామ్యతి।
యావదంతం న కురుతే శత్రూణాం శత్రుకర్శన॥ 11
కృష్ణా! నీకు భీముని మనస్సు తెలిసినదే కదా! శత్రువును అంతం చేయకుండా శాంతించడు. (11)
సర్వధర్మవిఏషజ్ఞాం స్నుషాం పాండోర్మహాత్మనః।
బ్రూయా మాధవ కల్యాణీం కృష్ణ కృష్ణాం యశస్వినీమ్॥ 12
యుక్తమేతన్మహభాగే కులే జాతే యశస్విని।
యన్మే పుత్రేషు సర్వేషు యథావత్ త్వమవర్తిథాః॥ 13
కృష్ణా! సర్వధర్మాలూ తెలిసినదీ, పాండుమహా రాజుకోడలూ, అయిన ద్రౌపదితో ఇలా చెప్పు "సద్వంశంలో పుట్టిన యశస్వినీ! నా కొడుకులందరితో ధర్మం తప్పక ప్రవర్తిస్తావు - ఇది చాలా బాగుంది" - అని, (12,13)
మాద్రీపుత్రౌచ వక్తవ్యౌ క్షత్రధర్మరతావుభౌ।
విక్రమేణార్జితాన్ భోగాన్ వృణీతం జీవితాదపి॥ 14
విక్రమాధిగతా హ్యర్థాః క్షత్రధర్మేణ జీవతః।
మనో మనుష్యస్య సదా ప్రీణంతి పురుషోత్తమ॥ 15
జీవితం కాదు. పరాక్రమించిపొందే భోగాలను కోరుకొమ్మని రాజదర్మం మీద ఆసక్తి కల నకుల సహదేవులకు చెప్పు. విక్రమంతో పొందిన భోగాలు రాజధర్మంతో జీవించే వాని మనస్సుకు సదా తృప్తి నిస్తాయి. (14,15)
యచ్చ వః ప్రేక్షమాణానాం సర్వధర్మోపచాయినామ్।
పాంచాలీ పరుషాణ్యుక్తా కో మ తత్ క్షంతుమర్హతి॥ 16
సర్వధర్మాలనూ పోషించే మీరు చూస్తూ ఉండగా పాంచాలిని చాలా పరుషంగా (ఆనాడు సభలో) మాట్లాడారు - దానిని ఎవరు క్షమిస్తారు? (16)
న రాజ్యహరణం దుఃఖం ద్యూతే చాపి పరాజయః।
ప్రవ్రాజనం సుతానాం వా న మే తద్దుఃఖకారణమ్॥ 17
యత్ర సా బృహతీ శ్యామా సభాయాం రుదతీ తదా।
అశ్రౌషీత్ పరుషా వాచః తన్మే దుఃఖతరం మహత్॥ 18
రాజ్యాన్ని అపహరించినా, జూదంలో పరాజయం పొందినా, కొడుకులు అడవికి వెళ్లినా నాకు అవి దుఃఖం అనిపించలేదు. కాని ఆ సభలో వీరపత్ని ద్రౌపది ఎన్నో నిందలు పొందింది. అది నాకు చాలా దుఃఖం కలిగించింది. (17,18)
స్త్రీధర్మిణీ వరారోహా క్షత్రధర్మరతా సదా।
నాధ్యగచ్ఛత్తదా నాథం కృష్ణా నాథవతీ సతీ॥ 19
ఆమె స్త్రీ ధర్మాలు చక్కగా ఆచరిస్తుంది. రాజధర్మాసక్తి కల ఆమె అక్కడ భర్తలుండికూడా అనాథగా విలపించింది. (19)
తం వై బ్రూహి మహాబాహో సర్వశస్త్రభృతాం వరమ్।
అర్జునం పురుషవ్యాఘ్రం ద్రౌపద్యాః పదవీం చర॥ 20
కృష్ణా! అస్త్రశస్త్ర విశారదుడూ, పురుష శ్రేష్ఠుడూ అయిన అర్జునునితో చెప్పు - "ద్రౌపది మార్గం అనుసరించు" అని. (20)
విదితం హి తవాత్యంతం క్రుద్ధావివ యమాంతకౌ।
భీమార్జునౌ నయేతాం హి దేవానపి పరాం గతిమ్॥ 21
నీకు తెలుసు - కోపించిన యముడూ, మృత్యువూ లాంటి భీమార్జునులు దేవతలనైన చంపగలరు". (21)
తయోశ్పైతదవజ్ఞానం యత్ సా కృష్ణా సభాగతా।
దుశ్శాసనశ్చ యద్భీమం కటుకాన్యభ్యభాషత॥ 22
పశ్యతాం కురువీరాణాం తచ సంస్మరయేః పునః।
ద్రౌపది ఆ సభలోకి వచ్చిందంటే అది భీమార్జునులకు ఎంతో అవమానం. అంతేకాదు. ఆ దుశ్శాసనుడు భీముని చాలా పరుషంగా మాట్లాడాడు. కురువీరులంతా చూస్తూ ఉండగా అన్న ఆ మాటలను ఒక్కసారి వారికి గుర్తుచెయ్యి. (22 1/2)
పాండవాన్ కుశలం పృచ్ఛేః సపుత్రాన్ కృష్ణయా సహ॥ 23
మాం చ కుశలినీం బ్రూయాః తేషు భూయో జనార్దన।
అరిష్టం గచ్ఛ పంథానం పుత్రాన్ మే ప్రతిపాలయ॥ 24
పాండవులనూ, పుత్రసహితమైన ద్రౌపదినీ క్షేమ మడిగినట్లు చెప్పు - నేను కుశలంగా ఉన్నట్లు వారికి మళ్లీ మళ్లీ చెప్పు - కృష్ణా! నీకు మార్గం సుగమమగుగాక! నా పుత్రులను రక్షించు. (23, 24)
వైశంపాయన ఉవాచ
అభివాద్యాథ తాం కృష్ణః కృత్వా చాపి ప్రదక్షిణమ్।
విశ్చక్రామ మహాబాహుః సింహఖేలగతిస్తతః॥ 25
వైశంపాయనుడిట్లు అన్నాడు. తరువాత కృష్ణుడు కుంతికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సింహంలా నడుస్తూ బయలుదేరాడు. (25)
తతో విసర్జయామాస భీష్మాదీన్ కురుపుంగవాన్।
ఆరోప్యాథ రథే కర్ణం ప్రాయాత్ సాత్యకినా సహ॥ 26
తరువాత కురుపుంగవులయిన భీష్మాదులను విడిచి, కర్ణుని తన రథం ఎక్కించుకొని సాత్యకితో బయలుదేరాడు. (26)
తతః ప్రయాతే దాశార్హే కురవః సంగతా మిథః।
జజల్పుర్మహదాశ్చర్యం కేశవే పరమాద్భుతమ్॥ 27
కృష్ణుడు వెళ్లాక కురువంశస్థులంతా అతనిని గూర్చి అతని అద్భుత కృత్యాలను గురించి ఆశ్చర్యంగా కలిసి చెప్పుకోసాగారు. (27)
ప్రమూఢా పృథివీ సర్వా మృత్యుపాశవశీకృతా।
దుర్యోధనస్య బాలిశ్యాత్ నైతదస్తీతి చాబ్రువన్॥ 28
'దుర్యోధనుని మంకుతనంతో ఈ భూమి అంతా మృత్యుపాశానికి వశమైపోయింది. ఇది ఇంక ఎంతోకాలం ఉండదు' అని అనుకొన్నారు. (28)
తతో నిర్యాయ నగరాత్ ప్రయయౌ పురుషోత్తమః।
మంత్రయామాస చ తదా కర్ణేన సుచిరం సహ॥ 29
తరువాత పురుషోత్తముడు నగరం నుండి బయటకు వచ్చి కర్ణునితో చాలాసేపు మంతనా లాడాడు. (29)
విసర్జయిత్వా రాధేయం సర్వయాదవనందనః।
తతో జవేన మహతా తూర్ణమశ్వానచోదయత్॥ 30
యాదవులకు ఆనందం కలిగించే కృష్ణుడు రాధేయుని వదలి, వెంటనే వేగంగా గుర్రాలను తోలించాడు. (30)
తే పిబంత ఇవాకాశం దారుకేణ ప్రచోదితాః।
హయా జగ్ముర్మహావేగాః మనో మారుతరంహసః॥ 31
దారుకుడు తోలుతున్న ఆ గుర్రాలు మనోమారుత వేగంతో ఆకాశాన్ని మింగేస్తున్నాయా అన్నట్లు దూకుతున్నాయి. (31)
తే వ్యతీత్య మహాధ్వానం క్షిప్రం శ్యేనా ఇవాశుగాః।
ఉచ్పైర్జగ్మురుపప్లవ్యం శార్ ఙ్గధన్వానమావహాన్॥ 32
వేగంగా వెళ్లే డేగల్లాగా ఆ గుర్రాలు చిటికెలో ఆ దారి అంతా గడిచి, కృష్ణుని తీసికొని ఉపప్లావ్య నగరం చేరాయి. (32)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కుంతీవాక్యే సప్తత్రింశదధిక శతతమోఽధ్యాయః॥ 137 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కుంతీవాక్యమను నూటముప్పది యేడవ అధ్యాయము. (137)