143. నూటనలువది మూడవ అధ్యాయము
కర్ణుడు పాండవ విజయమును సూచించు తన కలను వర్ణించుట.
సంజయ ఉవాచ
కేశవస్య తు తద్వాక్యం కర్ణః శ్రుత్వా హితం శుభమ్।
అబ్రవీదభిసంపూజ్య కృష్ణం తం మధుసూదనమ్॥ 1
సంజయుడు ఇలా చెపుతున్నాడు - తనను ప్రలోభపెట్టిన కృష్ణుని మాటవిని కర్ణుడు అతనిని గౌరవించి ఇలా అన్నాడు (1)
జానన్ మాం కిం మహాబాహో సంమోహయితు మిచ్ఛసి।
యోఽయం పృథివ్యాః కార్త్స్న్యేన వినాశః సముపస్థితః॥ 2
నిమిత్తం తత్ర శకునిః అహం దుశ్శాసన స్తథా।
దుర్యోధనశ్చ నృపతిః ధృతరాష్ట్రసుతోఽభవత్॥ 3
కృష్ణా! తెలిసికూడా నన్నెందుకు మోహపెట్టాలని అనుకొంటున్నావు? ఈ భూమి కంతటికీ వినాశం దాపురించింది. దానికి శకునీ, నేనూ, దుశ్శాసనుడూ, దుర్యోధనుడూ కారణం. (2,3)
అసంశయమిదం కృష్ణ మహద్యుద్ధముపస్థితమ్।
పాండవానాం కురూణాం చ ఘోరం రుధిరకర్దమమ్॥ 4
పాండవులకూ కౌరవులకూ ఘోర యుద్ధం రాబోతోంది. దానిలో రక్తపు బురద ఏర్పడుతుంది. సందేహం లేదు. (4)
రాజానో రాజపుత్రాశ్చ దుర్యోధనవశానుగాః।
రణే శస్త్రాగ్నినా దగ్ధాః ప్రాప్స్యంతి యమసాదనమ్॥ 5
దుర్యోధనుని వశవర్తులయిన రాజులూ, రాజ కుమారులూ ఆ యుద్ధంలో బాణాగ్నిలో దగ్ధమై యమలోకానికి చేరుతారు. (5)
స్వప్నా హి బహవో ఘోరాః దృశ్యంతే మధుసూదన।
నిమిత్తాని చ ఘోరాణి తథోత్పాతాః సుదారుణాః॥ 6
భయంకరములయిన పీడకలలూ, శకునాలూ, ఉత్పాతాలూ కనిపిస్తున్నాయి. (6)
పరాజయం ధార్తరాష్ట్రే విజయం చ యుధిష్ఠిరే।
శంసంత ఇవ వార్ష్ణేయ వివిధా రోమహర్షణాః॥ 7
దుర్యోధనునికి పరాజయమూ, యుధిష్ఠిరునికి విజయమూ చెపుతున్నట్లు, గగుర్పాటు కలిగించే కలలు వస్తున్నాయి. (7)
ప్రాజాపత్యం హి నక్షత్రం గ్రహస్తీక్ష్ణో మహాద్యుతిః।
శనైశ్చరః పీడయతి పీడయన్ ప్రాణినోఽధికమ్॥ 8
తీక్ష్ణగ్రహమైన శని ప్రాజాపత్య(రోహిణి) నక్షత్రాన్నీ ప్రాణులనూ మిక్కిలి పీడిస్తోంది. (8)
కృత్వా చాంగారకో వక్రం జ్యేష్ఠాయాం మధుసూదన।
అనూరాధాం ప్రార్థయతే మైత్రం సంగమయన్నివ॥ 9
అంగారక గ్రహం జ్యేష్ఠానక్షత్రంలో వక్రగతి పట్టింది. మిత్రులను సంహరిస్తూ అనూరాధా నక్షత్రాన్ని చేరుతోంది. (9)
నూనం మహద్భయం కృష్ణ కురూణాం సముపస్థితమ్।
విశేషేణ హి వార్ష్ణేయ చిత్రాం పీడయతే గ్రహః॥ 10
కృష్ణా! కౌరవులకు మహాభయం దాపురించింది. తప్పదు. చిత్రా నక్షత్రాన్ని గ్రహం మిక్కిలిగా పీడిస్తోంది. (10)
సోమస్య లక్ష్మ వ్యావృత్తం రాహురర్కముపైతి చ।
దివశ్చోల్కాః పతంత్యేతాః సనిర్ఘాతాః సకంపనాః॥ 11
చంద్రరేఖ సన్నగిల్లి మరలింది. రాహువు సూర్యుని చేరుతున్నాడు. ఆకాశం నుండి ఉల్కలు పడుతున్నాయి. పిడుగులు పడుతున్నాయి. భూమి కంపిస్తోంది. (11)
నిష్టవంతి చ మాతంగాః ముంచంత్యశ్రూణి వాజినః।
పానీయం యవసం చాపి నాభినందంతి మాధవ॥ 12
ఏనుగులు అనిష్టంగా మూలుగుతున్నాయి. గుర్రాలు కన్నీరు కార్చుతున్నాయి. కృష్ణా! అవి నీరుత్రాగటానికి, గడ్డి తినటానికీ ఇష్టపడటం లేదు. (12)
ప్రాదుర్భూతేషు చైతేషు భయమాహురుపస్థితమ్।
నిమిత్తేషు మహాబాహో దారుణం ప్రాణినాశనమ్॥ 13
ఇటువంటి దుర్నిమిత్తాలు కలిగినపుడు ప్రాణులు నశించే దారుణభయం వస్తుందని ఫలితం చెపుతారు. (13)
అల్పే భుంక్తే పురీషం చ ప్రభూతమిహ దృశ్యతే।
వాజినాం వారణానాం చ మనుష్యాణాం చ కేశవ॥ 14
గుర్రాలకూ, ఏనుగులకూ, మానవులకూ కూడా తిండి తక్కువగానూ, మలం ఎక్కువగానూ కనపడుతోంది. (14)
ధార్తరాష్ట్రస్య సైన్యేషు సర్వేషు మధుసూదన।
పరాభవస్య తల్లింగమ్ ఇతి ప్రాహుర్మనీషిణః॥ 15
మధుసూదనా! దుర్యోధనుని సైన్యాలన్నిటా కనిపిస్తున్న ఈ లక్షణాలకు పరాభవమే ఫలితమని బుద్ధిమంతులంటారు. (15)
ప్రహృష్టం వాహనం కృష్ణ పాండవానాం ప్రచక్షతే।
ప్రదక్షిణా మృగాశ్పైవ తత్తేషాం జయలక్షణమ్॥ 16
పాండవుల వాహనాలు ఉత్సాహంతో గంతులు వేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. అక్కడి మృగాలు ప్రదక్షిణంగా తిరగడం వారికి జయ సూచకం. (16)
అపసవ్యా మృగాః సర్వే ధార్తరాష్ట్రస్య కేశవ।
వాచశ్చాప్యశరీరణ్యః తత్ పరాభవలక్షణమ్॥ 17
దుర్యోధనుని సేన దగ్గర మృగాలు అపసవ్యంగా తిరుగుతున్నాయి. రూపాలు కనపడకుండా మాటలు వినిపిస్తున్నాయి. అది పరాజయానికి గుర్తు. (17)
మయూరాః పుణ్యశకునాః హంససారసచాతకాః।
జీవంజీవకసంఘాశ్చా ప్యనుగచ్ఛంతి పాండవాన్॥ 18
మంచి శకునాలయిన నెమళ్లు, హంసలు, బెగ్గురు పక్షులు, చాతకాలు, చకోరాలు(వెన్నెల పులుగులు) వీని గుంపులు పాండవుల దగ్గర సంచరిస్తున్నాయి. (18)
గృధ్రాః కంకాః బకాః శ్యేనాః యాతుధానాస్తథా వృకాః।
మక్షికాణాం చ సంఘాతాః అనుధావంతి కౌరవాన్॥ 19
గద్దలు, రాబందులు, కొంగలు, డేగలు, రాక్షసులు, తోడేళ్లు, ఈగల గుంపులు - ఇవన్నీ కౌరవుల వెంట పరుగులు తీస్తున్నాయి. (19)
ధార్తరాష్ట్రస్య సైన్యేషు భేరీణాం నాస్తి నిఃస్వనః।
అనాహతాః పాండవానామ్ నదంతి పటహాః కిల॥ 20
దుర్యోధనుని సేనల్లో భేరుల మోత లేనే లేదు. పాండవుల సేనల్లో మోగింపకుండానే తప్పెటలు మ్రోగుతున్నాయి. (20)
ఉదపానాశ్చ నర్దంతి యథా గోవృషభాస్తథా।
ధార్తరాష్ట్రస్య సైన్యేషు తత్పరాభవలక్షణమ్॥ 21
దుర్యోధనుని సైన్యాల దగ్గరున్న జలాశయాలు ఆవులూ, ఎద్దులూ రంకెలు వేస్తున్నట్లు శబ్దిస్తున్నాయి - అది పరాజయ లక్షణం. (21)
మాంసశోణితవర్షం చ వృష్టం దేవేన మాధవ।
తథా గంధర్వనగరం భానుమత్ సముపస్థితమ్॥ 22
సప్రాకారం సపరిఖం సవస్రం చారుతోరణమ్।
వరుణదేవుడు, మాంసంతోనూ, రక్తంతోనూ, వర్షం కురిపించాడు. అలాగే సూర్యుడు గుడికట్టాడు. ఆ గుడి ప్రాకారంతోనూ, అగడ్తతోనూ, కోటతోను తోరణాలతోనూ కూడా కనిపిస్తోంది. (22 1/2)
కృష్ణశ్చ పరిఘస్తత్ర భానుమావృత్య తిష్ఠతి॥ 23
ఉదయాస్తమనే సంధ్యే వేదయంతీ మహద్భయమ్।
శివా చ వాశతే ఘోరం తత్పరాభవలక్షణమ్॥ 24
సూర్యుని చుట్టూ నల్లని గుడి కట్టింది. ఉదయ సమయంలోనూ, అస్తమయ సమయంలోనూ చాలా భయం కలుగుతోంది. నక్క భయంకరంగా అరుస్తోంది. అది పరాజయ లక్షణం. (23,24)
ఏకపక్షాక్షిచరణాః పక్షిణో మధుసూదన।
ఉత్సృజంతి మహద్ఘోరం తత్ పరాభవలక్షణమ్॥ 25
ఒకే రెక్క, ఒకే కన్ను, ఒకే కాలు కలిగిన పక్షులు అసహ్యంగా రెట్టలు వేస్తున్నాయి. అది పరాజయ లక్షణం. (25)
కృష్ణగ్రీవాశ్చ శకునాః రక్తపాదా భయానకాః।
సంధ్యామభిముఖా యాంతి తత్ పరాభవలక్షణమ్॥ 26
నల్లని కంఠాలతో, ఎర్రని పాదాలతో పక్షులు భయంకరంగా సంజవేళ ఎదురుగా పోతున్నాయి - అది పరాజయ లక్షణం. (26)
బ్రాహ్మణాన్ ప్రథమం ద్వేష్టి గురూంశ్చ మధుసూదన।
భృత్యాన్ భక్తిమతశ్చాపి తత్ పరాభవలక్షణమ్॥ 27
కృష్ణా! మానవుడు ముందు బ్రాహ్మణులను (బ్రహ్మవేత్తలను), గురువులనూ ద్వేషిస్తాడు. భక్తి కల సేవకులనూ ద్వేషిస్తాడు. అది పరాభవ లక్షణం. (27)
పూర్వా దిగ్ లోహితాకారా శస్త్రవర్ణా చ దక్షిణా।
ఆమపాత్రప్రతీకాశా పశ్చిమా మధుసూదన।
ఉత్తరా శంఖవర్ణాభా దిశాం వర్ణా ఉదాహృతాః॥ 28
తూర్పు దిక్కు ఎర్రగానూ, దక్షిణ దిక్కు నల్లగానూ, పడమర దిక్కు పచ్చికుండ రంగులోనూ, ఉత్తర దిక్కు శంఖం రంగులోనూ ఉంటాయని ప్రసిద్ధి. (28)
ప్రదీప్తాశ్చ దిశాః సర్వా ధార్తరాష్ట్రస్య మాధవ।
మహద్భయం వేదయంతి తస్మిన్నుత్పాతదర్శనే॥ 29
కాని దుర్యోధనుని సేనకు దిక్కులన్నీ మండిపోతున్నట్లు కనపడుతూ మహాభయం కలుగబోతోందని తెలుపుతున్నాయి. (29)
సహస్రపాదం ప్రాసాదం స్వప్నాంతే స్మ యుధిష్ఠిరః।
అధిరోహన్మయా దృష్టః సహ భ్రాతృభిరచ్యుత॥ 30
అచ్యుతా! ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి వేయిస్తంభాల భవనం ఎక్కుతూ నాకు కల చివరలో కనిపించాడు. (30)
శ్వేతోష్ణీషాశ్చ దృశ్యంతే సర్వే వై శుక్లవాససః।
ఆసనాని చ శుభ్రాణి సర్వేషా ముపలక్షయే॥ 31
పాండవులంతా తెల్లని తలపాగలూ, తెల్లని వస్త్రాలూ ధరించి కనిపించారు. వారి అందరి ఆసనాలూ కూడా శుభ్రంగా స్వచ్ఛంగా కనిపించాయి. (31)
తవ చాపి మయా కృష్ణ స్వప్నాంతే రుధిరావిలా।
అస్త్రేణ పృథివీ దృష్టా పరిక్షిప్తా జనార్దన॥ 32
జనార్దనా! కల చివరలో నీ యీ భూమి (శరీరం) రక్తంతో తడిసి ఆయుధాలతో చుట్టబడి కనిపించింది. (ఇక్కడ 'ఆంత్రేణ'అని పాఠం ఉంది. అపుడు ఆంత్రసముదాయంతో ప్రేగులతో అని అర్థం.) (32)
అస్థిసంచయమారూఢ శ్చామితౌజా యుధిష్ఠిరః।
సువర్ణపాత్ర్యాం సంహృష్టః భుక్తవాన్ ఘృతపాయసమ్॥ 33
అమిత శక్తికల యుధిష్ఠిరుడు ఎముకల గుట్టనెక్కి బంగరు పాత్రలో సంతోషంగా నేతిపాయసం తిన్నట్లు కనపడ్డాడు. (33)
యుధిష్ఠిరో మయా దృష్టః గ్రసమానో వసుంధరామ్।
త్వయా దత్తామిమాం వ్యక్తం భోక్ష్యతే స వసుంధరామ్॥ 34
యుధిష్ఠిరుడు భూమిని మ్రింగివేస్తూ కనపడ్డాడు. నీ విచ్చిన ఈ భూమిని స్పష్టంగా అతడు అనుభవిస్తాడన్నమాట. (34)
ఉచ్చం పర్వతమారూఢః భీమకర్మా వృకోదరః।
గదాపాణిర్నరవ్యాఘ్రః గ్రసన్నివ మహీమిమామ్॥ 35
భయంకరుడయిన భీముడు గద ధరించి ఎత్తయిన పర్వతం ఎక్కి ఈ భూమి నంతటినీ మ్రింగివేస్తున్నట్లు కనిపించాడు. (35)
క్షపయిష్యతి నః సర్వాన్ స సువ్యక్తం మహారణే।
విదితం మే హృషీకేశ యతో ధర్మస్తతో జయః॥ 36
ఆ భీముడు ఈ మహా సంగ్రామంలో మమ్మందరినీ చంపి పారేస్తాడని స్పష్టమవుతోంది. హృషీకేశా! ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం ఉంటుందని నాకు తెలుసును. (36)
పాండురం గజమారూఢః గాండీవీ స ధనంజయః।
త్వయా సార్ధం హృషీకేశః శ్రియా పరమయా జ్వలన్॥ 37
గాండీవం దాల్చిన ఆ అర్జునుడు తెల్లని ఏనుగునెక్కి నీతో పరమ శోభతో వెలిగిపోతూ కలలో కనపడ్డాడు. (37)
యూయం సర్వే వధిష్యధ్వం తత్ర మే నాస్తి సంశయః।
పార్థివాన్ సమరే కృష్ణ దుర్యోధనపురోగమాన్॥ 38
కృష్ణా! దుర్యోధనాది రాజులందరినీ మీరంతా యుద్ధంలో చంపేస్తారు. అందులో నాకు సందేహం లేదు. (38)
నకులః సహదేవశ్చ సాత్యకిశ్చ మహారథః।
శుక్లకేయూరకంఠత్రాః శుక్లమాల్యాంబరావృతాః॥ 39
అధిరూఢా నరవ్యాఘ్రాః నరవాహనముత్తమమ్।
త్రయ ఏతే మయా దృష్టాః పాండురచ్ఛాత్రవాససః॥ 40
నకుల సహదేవులూ మహారథుడయిన సాత్యకీ ముగ్గురూ తెల్లని కేయూరాలు, కంఠాభరణాలు, పూలమాలలు, ఉత్తరీయాలు వేసుకొని నరవాహనం ఎక్కి తెల్లని గొడుగూ, వస్త్రాలూ దాల్చి కనపడ్డారు.(39,40)
శ్వేతోష్ణీషాశ్చ దృశ్యంతే త్రయ ఏతే జనార్దన।
తెల్లని తలపాగాలు దాల్చి ఈ ముగ్గురూ కనపడ్డారు.
ధార్తరాష్ట్రేషు సైన్యేషు తాన్ విజానీహి కేశవ॥ 41
ఇక దుర్యోధన సేనలోని వారిని గురించి చెపుతా..(41)
అశ్వత్థామా కృపశ్పైవ కృతవర్మా చ సాత్త్వతః।
రక్షోష్ణీషాశ్చ దృశ్యంతే సర్వే మాధవ పార్థివాః॥ 42
మాధవా! అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, ఇంకా మిగిలిన రాజులంతా ఎర్రని తలపాగలతో కనిపిస్తున్నారు. (42)
ఉష్ట్రప్రయుక్తమారూఢౌ భీష్మద్రోణౌ మహారథౌ।
మయా సార్దం మహాబాహో ధార్తరాష్ట్రేణ వా విభో॥ 43
మహారథులైన భీష్మద్రోణులు ఒంటెల రథాన్ని ఎక్కి నాతోనో, దుర్యోధనునితోనో కలిసి కనిపిస్తున్నారు. (43)
అగస్త్యశాస్తాం చ దిశం ప్రయాతాః సమ జనార్దన।
అచిరేణైవ కాలేన ప్రాప్స్యామో యమసాదనమ్॥ 44
ఇలా మేమంతా దక్షిణ దిక్కుకు వెళుతున్నాము. అచిరకాలంలో మేమంతా యమలోకానికి చేరుతాము. (44)
అహం చాన్యే చ రాజానః యచ్చ తత్ క్షత్రమండలమ్।
గాండీవాగ్నిం ప్రవేక్ష్యామః ఇతి మే నాస్తి సంశయః॥ 45
నేనూ, ఈ రాజుల సముదాయమూ అంతా గాండీవాగ్నిలో ప్రవేశిస్తాము. ఇందులో నాకు ఏమీ సందేహం లేదు. (45)
కృష్ణ ఉవాచ
ఉపస్థితవినాశోఽయం నూనమద్య వసుంధరాః।
యథా హి మే వచః కర్ణ నోపైతి హృదయం తవ॥ 46
కృష్ణుడన్నాడు - కర్ణా! నా మాట నీమనసుకు ఎక్కటం లేదు. నిజంగానే ఈ భూమికి వినాశం దాపురించింది. (46)
సర్వేషాం తాత భూతానాం వినాశే ప్రత్యుపస్థితే।
అనయో నయసంకాశః హృదయాన్నాపసర్పతి॥ 47
చావు మూడితే ప్రాణులన్నిటికీ అవినీతి కూడా నీతిగానే అనిపిస్తుంది. మనసులోంచి తొలగదు. (47)
కర్ణ ఉవాచ
అపి త్వాం కృష్ణ పశ్యామః జీవంతోఽస్మా న్మహారణాత్।
సముత్తీర్ణా మహాబాహో వీరక్షత్రవినాశనాత్॥ 48
అపుడు కర్ణుడిలా అన్నాడు. ఈ క్షత్రియ వీరుల వినాశానికి కారణమయిన ఈ మహారణం నుండి బయట పడి నిన్ను చూడగలుగుతామో కృష్ణా! (48)
అథవా సంగమః కృష్ణ స్వర్గే నో భవితా ధ్రువమ్।
తత్రేదానీం సమేష్యామః పునః సార్ధం త్వయాఽనఘ॥ 49
లేదా మనకు స్వర్గంలో నయినా కలయిక తప్పదు. అక్కడ మేము నిన్ను కలుస్తాము. (49)
సంజయ ఉవాచ
ఇత్యుక్త్వా మాధవం కర్ణః పరిష్వజ్య చ పీడితమ్।
విసర్జితః కేశవేన రథోపస్థాదవాతరత్॥ 50
సంజయుడు ఇలా అన్నాడు - కర్ణుడిలా చెప్పి గాఢంగా కృష్ణుని కౌగిలించుకొని, సెలవు తీసికొని రథం దిగాడు. (50)
తతః స్వరథమాస్థాయ జాంబూనదవిభూషితమ్।
సహాస్మాభిర్నివవృతే రాధేయో దీనమానసః॥ 51
తరువాత కర్ణుడు దీనమయిన మనస్సుతో తన కాంచన రథం ఎక్కి మాతో పాటు వెనుదిరిగాడు. (51)
తతః శీఘ్రతరం ప్రాయాత్ కేశవః సహసాత్యకిః।
పునరుచ్చారయన్ వాణీం యాహి యాహీతి సారథిమ్॥ 52
తరువాత కేశవుడు నడునడు అంటూ సారథిని హెచ్చరిస్తూ సాత్యకితో బయలు దేరాడు. (52)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కర్ణోపనివాదే కృష్ణకర్ణసంవాదే త్రిచత్వారింశదధిక శతతమోఽధ్యాయః॥ 143 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కృష్ణ కర్ణ సంవాదమను నూటనలువది మూడవ అధ్యాయము. (143)