144. నూటనలువది నాలుగవ అధ్యాయము

కుంతి కర్ణుని కడ కరుగుట.

వైశంపాయన ఉవాచ
అసిద్ధానునయే కృష్ణే కురుభ్యః పాండవాన్ గతే।
అభిగమ్య పృథాం క్షత్తా శనైః శోచన్నివాబ్రవీత్॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - కౌరవుల దగ్గర తన అనునయ వాక్యాలు ఫలించక కృష్ణుడు పాండవుల దగ్గరకు వెళ్లిపోయాడు. తరువాత విదురుడు కుంతి దగ్గరకు వచ్చి బాధపడుతూ మెల్లగా ఇలా అన్నాడు. (1)
జానాసి మే జీవపుత్రి భావం నిత్యమవిగ్రహే।
క్రోశతో న చ గృహ్ణీతే వచనం మే సుయోధనః॥ 2
జీవపుత్రీ! యుద్ధం రాకుండా చెయ్యాలనే నాభావం నీకూ తెలుసును. నేనెంత మొత్తుకొంటున్నా ఆ దుర్యోధనుడు నామాట వినటం లేదు. (2)
ఉపపన్నో హ్యసౌ రాజా చేదిపాంచాలకేకయైః।
భీమార్జునాభ్యాం కృష్ణేన యుయుధానయమైరపి॥ 3
ఉపప్లవ్యే నివిష్టోఽపి ధర్మమేవ యుధిష్ఠిరః।
కాంక్షతే జ్ఞాతిసౌహార్దాద్ బలవాన్ దుర్బలో యథా॥ 4
ధర్మరాజు ఇపుడు చేది, పాంచాల, కేకయ రాజులతోనూ, భీమార్జునులతోనూ, కృష్ణునితోనూ, సాత్యకితోనూ, నకుల సహదేవులతోనూ కలిసి ఉపప్లావ్యంలో బలవంతుడై ఉన్నాడు. అయినా జ్ఞాతుల మీది సౌహార్దంతో బలంలేని వాని వలె ధర్మాన్నే కాంక్షిస్తున్నాడు. (3,4)
రాజా తు ధృతరాష్ట్రోఽ యం వయో వృద్ధో న శామ్యతి।
మత్తః పుత్రమదేనైన విధర్మే పథి వర్తతే॥ 5
ధృతరాష్ట్రుడయితే వయోవృద్ధుడయినా పుత్రమదంతో ఒళ్లు తెలియక అధర్మమార్గంలో ప్రవర్తిస్తున్నాడే తప్ప శాంతి కోరటం లేదు. (5)
జయద్రథస్య కర్ణస్య తథా దుశ్శాసనస్య చ।
సౌబలస్య చ దుర్బుద్ధ్యా మిథో భేదః ప్రపత్స్యతే॥ 6
సైంధవుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని... వీరి దుర్బుద్ధితో కురుపాండవుల మధ్య భేదమే పొందుతున్నాడు. (6)
అధర్మేణ హి ధర్మిష్ఠం కృతం వైకార్యమీదృశమ్।
యేషాం తేషామయం ధర్మః సానుబంధో భవిష్యతి॥ 7
అధర్మంతో చేసిన ఇటువంటి వికృతపు పని(14 వ ఏట రాజ్యం ఇవ్వకపోవడం) వీరికి ధర్మం అనిపిస్తోంది - ఆ ధర్మం త్వరలో ఫలవంత మవుతుంది. (7)
క్రియమాణే బలాద్ధర్మే కురుభిః కో న సంజ్వరేత్।
అశామ్నా కేశవే యాతే సముద్యోక్ష్యంతి పాండవాః॥ 8
కౌరవులు బలవంతాన అధర్మాన్ని ధర్మం చెయ్యాలనుకొంటే ఎవరికైనా బాధకలుగుతుంది. మంచితనం ఫలించక కృష్ణుడు వెళ్లవలసి వచ్చింది. ఇక పాండవులు యుద్ధానికే సిద్ధపడతారు. (8)
తతః కురూణామనయో భవితా వీరనాశనః।
చింతయన్న లభే నిద్రామ్ అహస్సు చ విశాసు చ॥ 9
దానివల్ల కౌరవ వీరులంతా చనిపోయే ఉపద్రవం వస్తోంది - ఈ విషయం తలచుకుంటుంటే నాకు రాత్రింబవళ్లు నిద్రపట్టటం లేదు. (9)
శ్రుత్వా తు కుంతీ తద్వాక్యమ్ అర్థకామేన భాషితమ్।
సా నిఃశ్వసంతీ దుఃఖార్తా మనసా విమమర్శ హ॥ 10
ప్రయోజన/పురుషార్థ దృష్టితో చెప్పిన విదురుని మాటవిని కుంతి నిట్టూర్పులు కలిగేటట్లు విచారిస్తూ మనసారా ఇలా ఆలోచించింది. (10)
ధిగస్త్వర్థం యత్కృతేఽయం మహాన్ జ్ఞాతివధః కృతః।
వర్త్స్యతే సుహృదాం చైవ యుద్ధేఽస్మిన్ వై పరాభవః॥ 11
ఛీ! ధనం చాలా నీచమైంది కదా! దీనివల్లనే కదా ఇంతమంది జ్ఞాతులు చనిపోవలసి వస్తోంది. ఈ యుద్ధంలో స్నేహితులు కూడా పరాభవం పొందవలసి వస్తోంది. (11)
పాండవాశ్చేదిపంచాలాః యాదవాశ్చ సమాగతాః।
భారతైః సహ యోత్స్యంతి కిం ను దుఃమతః పరమ్॥ 12
పాండవులూ, చేది పాంచాలరాజులూ, యాదవులూ కలసి భరత వంశస్థులతో యుద్ధం చేస్తారు. ఇంతకంటె దుఃఖం ఏముంటుంది? (12)
పశ్యే దోషం ధ్రువం యుద్ధే తథాయుద్ధే పరాభవమ్।
అధనస్య మృతం శ్రేయః న హి జ్ఞాతిక్షయో జయః॥ 13
యుద్ధంలో దోషం నిశ్చయంగా కనిపిస్తోంది. యుద్ధం లేకపోతే పరాభవం తప్పదు. ధనంలేని వానికి మరణమే మంచిది - కాని జ్ఞాతుల మరణం మాత్రం విజయం కాదు. (13)
ఇతి మే చింతయంత్యా వై హృది దుఃఖం ప్రవర్తతే।
పితామహః శాంతనవః ఆచార్యశ్చ యుధాం పతిః॥ 14
కర్ణశ్చ ధార్తరాష్ట్రార్థం వర్ధయంతి భయం మమ।
ఇలా భావిస్తూ ఉంటేనే మనసులో దుఃఖం కలుగుతోంది. పితామహుడైన భీష్ముడూ, యుద్ధనాయకుడు ద్రోణాచార్యుడూ, కర్ణుడూ దుర్యోధనుని కోసం ప్రవర్తిస్తూ నా భయం పెంచుతున్నారు. (14 1/2)
నాచార్యః కామవాన్ శిష్యైః ద్రోణో యుధ్యేత జాతుచిత్॥ 15
పాండవేషు కథం హార్దం కుర్యాన్న చ పితామహః।
ద్రోణుడు హితం చేయాలనే కోరిక గలవాడు. అందుచేత శిష్యులతో ఎన్నడూ యుద్ధం చేయడు. భీష్ముడు కూడా పాండవుల మీద మెత్తని మనసు వహించకుండా ఎలా ఉంటాడు? (15 1/2)
అయం త్వేకో వృథాదృష్టిః ధార్తరాష్ట్రస్య దుర్మతేః॥ 16
మోహానువర్తీ సతతం పాపో ద్వేష్టి చ పాండవాన్।
ఇక కర్ణుడొక్కడే వ్యర్థభావాలతో దుర్మతియైన దుర్యోధనుని మోహాన్ననుసరించి సదా ప్రవర్తిస్తాడు. అంతేకాదు పండవులను ద్వేషిస్తాడు కూడా. (16 1/2)
మహత్యనర్థే నిర్బంధీ బలవాంశ్చ విశేషతః॥ 17
కర్ణః సదా పాండవానాం తన్మే దహతి సంప్రతి।
పాండవులకు పెద్దకష్టం కలగాలని పట్టుబట్టి ఉన్నాడు కర్ణుడు. పైగా బలవంతుడు. అదే ఇపుడు నా మనస్సును దహించివేస్తోంది. (17 1/2)
ఆశంసే త్వద్య కర్ణస్య మనోఽహం పాండవాన్ ప్రతి॥ 18
ప్రసాదయితుమాసాద్య దర్శయంతీ యథాతథమ్।
పాండవుల పట్ల కర్ణుని మనస్సు ప్రసన్న మవటానికి ఎలాగో అలా అతడిని దర్శించి చెపుతాను. (18 1/2)
తోషితో భగవాన్ యత్ర దుర్వాసా మే వరం దదౌ॥ 19
ఆహ్వానం మంత్రసంయుక్తం వసంత్యాః పితృవేశ్మని।
నేను తండ్రి యింట్లో ఉండగా దుర్వాసుడనే మహర్షి నాకు మంత్రసహితంగా దేవతలను ఆహ్వానింపగల వరం ఇచ్చాడు. (19 1/2)
సాహమంతః పురే రాజ్ఞః కుంతిభోఝపురస్కృతా॥ 20
చింతయంతీ బహువిధం హృదయేన విదూయతా।
కుంతిభోజమహారాజు యొక్క అంతః పురంలో నేను ఉండేదాన్ని. అనేక విధాల ఊహలతో మనసులో ఆలోచించేదాన్ని. (20 1/2)
బలాబలం చ మంత్రాణాం బ్రాహ్మణస్య చ వాగ్బలమ్॥ 21
స్త్రీభావా ద్బాలభావాచ్చ చింతయంతీ పునః పునః।
స్త్రీని కావడం వల్లనూ, చిన్నతనం వల్లనూ "మంత్రాలకు బలం ఉందా లేదా? అనీ బ్రాహ్మణుని మాటలకు బలం ఉందా లేదా? అనీ పరిపరి విధాల ఆలోచించేదాన్ని. (21 1/2)
ధాత్ర్యా విస్రబ్ధయా గుప్తా సఖీజనవృతా తదా॥ 22
దోషం పరిహరంతీ చ పితుశ్చారిత్ర్యరక్షిణీ।
నమ్మకం గల దాది నన్ను రక్షించేది - చుట్టూరా సఖీజనులుండేవారు. దోషాన్ని తొలగించుకొంటూ తండ్రి పేరు, శీలమూ రక్షించేదాన్ని. (22 1/2)
కథం న సుకృతం మే స్యాత్ నాపరాధవతీ కథమ్॥ 23
భవేయమితి సంచింత్య బ్రాహ్మణం తం నమస్య చ।
కౌతూహలాత్తు తం లబ్ధ్వా బాలిశ్యాదాచరం తదా।
కన్యా సతీ దేవమర్కమ్ ఆసాదయమహం తతః॥ 24
నాకు పుణ్యం ఎందుకు కలగదు? నేను నిర్దోషినెట్లా అవుతాను? అని ఆలోచించి ఆ దుర్వాసునకు నమస్కరించాను. కుతూహలంతో ఆ వరం పొందాను. చిన్నతనంవల్ల దేవత నాహ్వానించాను. కన్య నైన నేను సూర్యుని రప్పించాను. (23,24)
యోఽసౌ కానీనగర్భో మే పుత్రవత్ పరిరక్షితః।
కస్మాన్న కుర్యాద్వచనం పథ్యం భ్రాతృహితం తథా॥ 25
అపుడే నా కడుపున కానీనుడుగా పుట్టినవాడే గదా ఈ కర్ణుడు. వానిని కొడుకుగానే భావించాను. అతడు సోదర హితమూ, ఇష్టమూ అయిన నామాటను ఎందుకు చేయకుండా ఉంటాడు? (25)
ఇతి కుంతీ వినిశ్చిత్య కార్యనిశ్చయముత్తమమ్।
కార్యార్థ మభినిశ్చిత్య యయౌ భాగీరథీం ప్రతి॥ 26
అని కుంతి ఉత్తమమయిన కార్యాన్ని నిశ్చయించుకొంది. ఆ పని కోసం గంగానది దగ్గరకు వెళ్లింది. (26)
ఆత్మజస్య తతస్తస్య ఘృణినః సత్యసంగినః।
గంగాతీరే పృథాశ్రౌషీత్ వేదాధ్యయన నిఃస్వనమ్॥ 27
కరుణాపరుడు, సత్యసంధుడు అయిన తన కొడుకు గంగాతీరంలో అధ్యయనం చేస్తున్న వేదధ్వనిని కుంతీదేవి విన్నది. (27)
ప్రాఙ్ముఖస్యోర్ధ్వబాహోఃసా పర్యతిష్ఠత పృష్ఠతః।
జప్యావసానం కార్యార్థం ప్రతీక్షంతీ తపస్వినీ॥ 28
తూర్పు ముఖంగా చేతులు పైకెత్తి నిలిచిన కర్ణునికి వెనుక నిలబడు తనపనికోసం అతని జపావసానాన్ని నిరీక్షించింది. (28)
అతిష్ఠత్ సూర్యతాపార్తా కర్ణస్యోత్తరవాపసి।
కౌరవ్య పత్నీ వార్ష్ణేయీ పద్మమాలేన శుష్యతీ॥ 29
సూర్యుని వేడిమికి కరిగిపోతూ, వృష్ణి వంశపు ఆడపడుచు కుంతీదేవి తామరతీగలాగా వాడిపోతూ కర్ణుని ఉత్తరీయపునీడలో నిలిచింది. (29)
ఆపృష్ఠతాపాత్ జప్త్వా స పరివృత్య యతవ్రతః।
దృష్ట్వా కుంతీ ముపాతిష్ఠత్ అభివాద్య కృతాంజలిః॥ 30
వెన్ను వేడెక్కేదాకా(అపరాహ్ణందాకా) జపం చేసుకొని, వెనుదిరిగి కుంతిని చూసి, చేతులు జోడించి నిలిచాడు కర్ణుడు. (30)
యథాన్యాయం మహాతేజాః మానీ ధర్మభృతాం వరః।
ఉత్ప్మయన్ ప్రణతః ప్రాహ కుంతీం వైకర్తనో వృషః॥ 31
మహాతేజస్వి, అభిమానవంతుడు, ధార్మికోత్తముడూ అయిన కర్ణుడు యథావిధిగా కుంతికి నమస్కరించి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు. (31)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కుంతీ కర్ణసమాగమే చతుశ్చత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 144 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యానపర్వ మను ఉపపర్వమున కుంతీకర్ణసమాగమ మను నూట నలువది నాలుగవ అధ్యాయము. (144)