145. నూట నలువది యైదవ అధ్యాయము
కర్ణుడు తనకొడుకని కర్ణునితో కుంతి చెప్పుట.
కర్ణ ఉవాచ
రాధేయోఽహ మాధిరథిః కర్ణస్త్వామభివాదయే।
ప్రాప్తా కిమర్థం భవతీ బ్రూహి కిం కరవాణి తే॥ 1
కర్ణుడు అన్నాడు. రాధకొడుకును, అధిరథుని పుత్రుడిని, కర్ణుడిని నీకు నమస్కరిస్తున్నాను. పూజ్యురాలా! ఎందుకు వచ్చావు? నేనేమి చెయ్యాలో చెప్పు. (1)
కుంత్యువాచ
కౌంతేయస్త్వం న రాధేయో న తవాధిరథః పితా।
నాసి సూతకులే జాతః కర్ణ తద్విద్ధి మే వచః॥ 2
కుంతి చెప్పింది. కర్ణా! నీవు కుంతీ పుత్రుడవు - రాధేయుడవు కావు. నీ తండ్రి అధిరథుడు కాడు - నీవు సూతకులంలో పుట్టలేదు. నా మాట విను. (2)
కానీనస్త్వం మయా జాతః పూర్వజః కుక్షిణా ధృతః।
కుంతిరాజస్య భవనే పార్థస్త్వమసి పుత్రక॥ 3
కన్యగా ఉన్నపుడు నీవు నాకు కుంతిభోజుని ఇంట్లో పుట్టావు. నిన్ను కడుపున వహించాను - నీవు పృథా కుమారుడవు. (3)
ప్రకాశకర్మా తపనో యోఽయం దేవో విరోచనః।
అజీజనత్త్వాం మయ్యేష కర్ణ శస్త్రభృతాం వరమ్॥ 4
వెలుగునిచ్చే సూర్యుడు శస్త్రధారుల్లో ఉత్తముడవయిన నిన్ను నాయందు కన్నాడు. (4)
కుండలీ బద్ధకవచః దేవగర్భః శ్రియా వృతః।
జాతస్త్వమసి దుర్ధర్ష మయా పుత్ర పితుర్గృహే॥ 5
నా పితృగృహంలో, కుండలాలతో, కవచంతో దేవగర్భుడవై ఎంతో ప్రకాశంతో నాకు పుట్టావు. (5)
స త్వం భ్రాతౄనసంబుద్ధ్య మోహాద్యదుపసేవసే।
ధార్తరాష్ట్రాన్న తద్యుక్తం త్వయి పుత్ర విశేషతః॥ 6
అటువంటి నీవు నీ తమ్ముళ్లను తెలియక మోహంతో ధృతరాష్ట్రపుత్రులను సేవిస్తున్నావు. అది నీకు ఏమాత్రం తగదు. (6)
ఏతద్ధర్మఫలం పుత్ర వరాణాం ధర్మనిశ్చయే।
యత్తుష్యంత్యస్య పితరః మాతా చాప్యేకదర్శినీ॥ 7
పుత్రా! ప్రాణాలన్నీ కొడుకు మీదే పెట్టుకొన్న తల్లినీ, తండ్రినీ, పితరులనూ సంతోష పెట్టడమే ధర్మనిశ్చయంలో పుత్రునికి ధర్మఫలం. (7)
అర్జునేవార్జితాం పూర్వం హృతాం లోభాదసాధుభిః।
ఆచ్ఛిద్య ధార్తరాష్ట్రేభ్యః భుంక్ష్వ యౌధిష్ఠిరీం శ్రియమ్॥ 8
పూర్వం అర్జునుడు సంపాదించిందీ, దుర్మార్గులయిన ధృతరాష్ట్ర పుత్రులు లోభంతో లాక్కొన్నదీ, అయిన ధర్మజుని సంపదనను నీవు అనుభవించు. (8)
అద్య పశ్యంతి కురవః కర్ణార్జునసమాగమమ్।
సౌభ్రాత్రేణ సమాలక్ష్య సంనమంతామసాధనః॥ 9
సౌభ్రాత్రంతో నిండిన కర్ణార్జునుల కలయికను ఈనాడు కౌరవుల్య్ చూస్తారు. దుష్టులు దాన్ని చూసి కుంగి/వంగిపోతారు. (9)
కర్ణార్జునౌ వై భవేతాం యథా రామజనార్దనౌ।
అసాధ్యం కిం ను లోకే స్యాత్ యువయోః సహితాన్త్మనోః॥ 10
మనసులు కలిసిన కర్ణార్జునులు ఇద్దరూ బలరామకృష్ణులవలె ఉంటే మీకిక లోకంలో అసాధ్యం ఏముంటుంది? (10)
కర్ణః శోభిష్యసే నూనం పంచభిర్భ్రాతృభిర్వృతః।
దేవైః పరివృతో బ్రహ్మా వేద్యామివ మహాధ్వరే॥ 11
యజ్ఞవేదిక మీద దేవతలతో పరివేష్టితుడయిన బ్రహ్మదేవుని వలె అయిదుగురు తమ్ముళ్లతో కలిసి నీవు తప్పక శోభిస్తావు. (11)
ఉపపన్నో గుణైః సర్వైః జ్యేష్ఠః శ్రేష్ఠేషు బంధుషు।
సూతపుత్రేతి మా శబ్దః పార్థస్త్వమసి వీర్యవాన్॥ 12
మంచిగుణాలన్నీ కలవాడవు. పెద్దవాడవు. ఉత్తములయిన బంధువుల్లో నీకు సూతపుత్రుడనే పేరు రాకూడదు. నీవు పృథా కుమారుడవు. (12)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కుంతీ కర్ణ సమాగమే పంచచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 145 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కుంతీ కర్ణసమాగమ మను నూట నలువది యైదవ అధ్యాయము. (145)