150. నూట ఏబదియవ అధ్యాయము

కౌరవుల పట్ల దండనీతిటే తగినదని కృష్ణుడు చెప్పుట.

వాసుదేవ ఉవాచ
ఏవముక్తేతు భీష్మేణ ద్రోణేన విదురేణ చ।
గాంధార్యా ధృతరాష్ట్రేణ న వై మందోఽన్వబుద్ధ్యత॥ 1
వాసుదేవుడిట్లు అన్నాడు. ఇలా భీష్మద్రోణ విదురులూ గాంధారీధృతరాష్ట్రులూ చెప్పినా ఆ మందబుద్ధి వినలేదు. (1)
అవధూయోత్థితో మందః క్రోధసంరక్తలోచనః।
అన్వద్రవంత తం పశ్చాత్ రాజానః త్యక్తజీవితాః॥ 2
ఆ మందబుద్ధి కోపంతో ఎర్రని కనులతో విదిలించుకొని లేచి వెళ్లిపోయాడు. ప్రాణాల మీద ఆశవదలుకొన్న రాజులంతా అతని వెనుక వెళ్లిపోయారు. (2)
ఆజ్ఞాపయచ్చ రాజ్ఞాస్తాన్ పార్థివాన్నష్టచేతసః।
ప్రయాధ్వం వై కురుక్షేత్రం పుష్యోఽద్యేతి పునః పునః॥ 3
వివేక శూన్యులయిన ఆ రాజులందరినీ 'ఈ రోజు పుష్యమి - కురుక్షేత్రానికి నడవండి' అంటూ పదే పదే ఆజ్ఞాపించాడు. (3)
తతస్తే పృథివీపాలాః ప్రయయుస్సహసైనికాః।
భీష్మం సేనాపతిం కృత్వా సంహృష్టాః కాలచోదితాః॥ 4
కాలచోదితులయిన ఆ రాజులంతా ససైన్యంగా భీష్ముడిని సేనాపతిగా చేసుకొని బయలుదేరారు. (4)
అక్షౌహిణ్యో దశైకా చ కౌరవాణాం సమాగతాః।
తాసాం ప్రముఖతో భీష్మః తాలకేతుర్వ్యరోచత॥ 5
పదకొండు అక్షౌహిణుల కౌరవ సైన్యం అక్కడకు చేరింది. అందులో తాటిచెట్టు జెండా కల భీష్ముడు చాలా గొప్పగా కనిపించాడు. (5)
యదత్ర యుక్తం ప్రాప్తం చ తద్విధిత్స్వ విశాంపతే।
ఉక్తం భీష్మేణ యద్వాక్యం ద్రోణేన విదురేణ చ॥ 6
గాంధార్యా ధృతరాష్ట్రేణ సమక్షం మమ భారత।
ఏతత్తే కథితం రాజన్ యద్వృత్తమ్ కురుసంసది॥ 7
రాజా! ఉచితమై చేయగలిగినది చెయ్యి. భీష్ముడూ, ద్రోణుడూ, విదురుడూ, గాంధారీ ధృతరాష్ట్రులూ, నా ఎదుట చెప్పినదీ, కురుసభలో జరిగినదీ అంతా చెప్పాను నీకు. (6,7)
సామ్యమాదౌ ప్రయుక్తం యే రాజన్ సౌభ్రాత్రమిచ్ఛతా।
అభేదాయాస్య వంశస్య ప్రజానాం చ వివృద్ధయే॥ 8
కురుపాండవుల సౌభ్రాత్రాన్ని కోరి, వంశం ఛిన్నాభిన్నం కాకూడదని, ప్రజల అభ్యుదయంకోసం ముందుగా సామ వాక్యాలు పలికాను. (8)
పునర్భేదశ్చ మే యుక్తః యదా సామ న గృహ్యతే।
కర్మానుకీర్తనం చైవ దేవమానుష సంహితమ్॥ 9
సామోపాయం పనికిరాకపోయేసరికి భేదోపాయం ప్రయోగించాను. దేవతలకూ, మానవులకూ సంబంధించిన పనులన్నీ ఏకరువు పెట్టాను. (9)
యదా నాద్రియతే వాక్యం సామపూర్వం సుయోధనః।
తదా మయా సమానీయ భేదితాః సర్వ పార్థివాః॥ 10
సామవచనాలను దుర్యోధనుడు ఆదరించలేదు. అపుడు రాజులందరినీ పిలిచి వారిలో భేదం పెట్టాను. (10)
అద్భుతాని చ ఘోరాణి దారుణాని చ భారత।
అమానుషాణి కర్మాణి దర్శితాని మయా విభో॥ 11
రాజా! అద్భుతాలు, ఘోరాలు, భయంకరాలూ, అమానుషాలు అయిన కృత్యాలు కూడా ప్రదర్శించాను. (11)
నిర్భర్త్సయిత్వా రాజ్ఞస్తాన్ తృణీకృత్య సుయోధనమ్।
రాధేయం భీషయిత్వా చ సౌబలం చ పునః పునః॥ 12
ద్యూతతో ధార్తరాష్ట్రాణాం నిందాం కృత్యా తథా పునః।
భేదయిత్వా నృపాన్ సర్వాన్ వాగ్భిర్మంత్రేణ చాసకృత్॥ 13
పునః సామాభిసంయుక్తం సంప్రదాన మథాబ్రువన్।
అభేదాత్ కురువంశస్య కార్యయోగాత్తథైవ చ॥ 14
ఆ రాజులందరినీ బెదిరించాను. దుర్యోధనుని తృణీకరించి మాట్లాడాను. కర్ణుని శకునిని భయపెట్టాను. జూదం కారణంగా కౌరవులందరినీ తప్పు పట్టాను. రాజులందరినీ మంచిమాటలతోనూ భేదోపాయాలతోనూ బెదిరిపోయేటట్లు చేశాను. మళ్లీ సామ, దాన వాక్యాలు పలికాను. కురువంశం విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు కార్యసిద్ధికోసం ఇదంతా చేశాను. (12,13,14)
తే శూరా ధృతరాష్ట్రస్య భీష్మస్య విదురస్య చ।
తిష్ఠేయుః పాండవాః సర్వే హిత్వా మానమధశ్చరాః॥ 15
వీరులయిన ఆ పాండవులందరూ పట్టుదల విడిచి నేలపై నిలిచి ధృతరాష్ట్రునీ, భీష్మునీ, విదురునీ సేవిస్తారు. (15)
ప్రయచ్ఛంతు చ తే రాజ్యమ్ అనీశాస్తే భవంతు చ।
యథాఽహ రాజా గాంగేయః విదురశ్చ హితం తవ॥ 16
వారు రాజ్యం నీకిచ్చేస్తారు. వారు పాలకులు కావలసిన పనిలేదు. ధృతరాష్ట్రుడూ, భీష్ముడూ, విదురుడు నీకే హితం చెప్పారో అలా చెయ్యి. (16)
సర్వం భవతు తే రాజ్యం పంచగ్రామాన్ విసర్జయ।
అవశ్యం భరణీయాహి పితుస్తే రాజసత్తమ॥ 17
రాజ్యం అంతా నీకే ఉండనియ్యి. అయిదు ఊళ్లు మాత్రం ఇయ్యి. నీ తండ్రి పాండవులను కూడా పోషించాలి గదా! (17)
ఏవముక్తోఽపి దుష్టాత్మా నైవ భాగం వ్యముంచత।
దండం చతుర్థం పశ్యామి తేషు పాపేషు నాన్యథా॥ 18
ఇలా ఎన్ని చెప్పినా ఆ దుర్మార్గుడు భాగమే వదల లేదు. ఇంక ఆ పాపుల మీద నాల్గవదయిన దండమే ప్రయోగించాలనిపిస్తుంది నాకు. మరొకటి పనికిరాదు. (18)
నిర్యాతాశ్చ వినాశాయ కురుక్షేత్రం నరాధిపాః।
ఏతత్తే కథితం రాజన్ యద్వృత్తం కురుసంసది॥ 19
ఆ రాజులంతా చావుకోసం కురుక్షేత్రం వెళ్లిపోయారు కూడ. రాజా! కౌరవసభలో జరిగినదంతా నీకు చెప్పాను (19)
న తే రాజ్యం ప్రయచ్ఛంతి వినా యుద్ధేన పాండవ।
వినాశహేతవః సర్వే ప్రత్యుపస్థితమృత్యవః॥ 20
పాండుకుమారా! యుద్ధం లేకుండా వాళ్లు నీ రాజ్యం ఇవ్వరు. వారంతా వినాశకారకులు. వారికి మృత్యువు పొంచి ఉంది. (20)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కృష్ణవాక్యే పంచాశదధికశతతమోఽధ్యాయః॥ 150 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కృష్ణవాక్యమను నూట ఏబదియవ అధ్యాయము. (150)