151. నూట ఏబది ఒకటవ అధ్యాయము
(సైన్యనిర్యాణపర్వము)
పాండవపక్షసేనానిని ఎన్నుకొనుట - పాండవసేనలు కురుక్షేత్రమును చేరుట.
వైశంపాయన ఉవాచ
జనార్దనవచః శ్రుత్వా ధర్మరాజో యుధిష్ఠిరః।
భ్రాతౄనువాచ ధర్మాత్మా సమక్షం కేశవస్య హ॥ 1
వైశంపాయనుడిట్లు అన్నాడు.
జనమేజయా! శ్రీకృష్ణభగవానుని మాటలు విన్న ధర్మాత్ముడయిన ధర్మనందనుడు - కేశవుని సమక్షంలో తన తమ్ములను జూచి ఇలా అన్నాడు. (1)
శ్రుతం భవద్భిర్యత్ వృత్తం సభాయాం కురుసంసది।
కేశవస్యాపి యద్వాక్యం తత్సర్వమవధారితమ్॥ 2
కౌరవసభలో జరిగిన వృత్తాంతమంతా మీరు విన్నారు కదా! అలాగే శ్రీకృష్ణుడు పలికిన దాన్ని కూడా బాగా గుర్తించి ఉంటారు. (2)
తస్మాత్ సేనావిభాగం మే కురుధ్వం నరసత్తమాః।
అక్షౌహిణ్యశ్చ సప్తైతాః సమేతా విజయాయ వై॥ 3
కాబట్టి నరశ్రేష్ఠులైన వీరులారా! మీరు మీ సేనలవిభాగాన్ని సిద్ధపరచుకోండి. ఈ ఏడు అక్షౌహిణీ సైన్యాలు ఒక చోట చేరాయి. ఇవి మనకు విజయాన్ని తప్పక చేకూర్చుతాయి. (3)
తాసాం యే పతయః సప్త విఖ్యాతాస్తాన్ నిబోధత।
ద్రుపదశ్చ విరాటశ్చ ధృష్టద్యుమ్నశిఖండినౌ॥ 4
సాత్యకి శ్చేకితానశ్చ భీమసేనశ్చ వీర్యవాన్।
ఏతే సేనాప్రణేతారః వీరాః సర్వే తనుత్యజః॥ 5
ఈ ఏడు అక్షౌహిణులకు ప్రసిద్ధులైన ఏడుగురు సేనాపతుల పేర్లను చెపుతున్నాను. ఆలకించండి. ద్రుపదుడు, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీమసేనుడు - వీరందరూ మనకోసం శరీర త్యాగానికైనా సిద్ధపడ్డారు. కాబట్టి వీరే పాండవసేనా నాయకులు. (4,5)
సర్వే వేదవిదః శూరాః సర్వే సుచరితవ్రతాః।
హ్రీమంతో నీతిమంతశ్చ సర్వే యుద్ధవిశారదాః॥ 6
వీరంతా వేదవేత్తలు, శూరులు, ఉత్తమ వ్రతాన్ని పాలించేవారు. వినయమూ, నీతీ కలిగి యుద్ధంలో ఆరితేరినవారు. (6)
ఇష్వస్త్రకుశలాః సర్వే తథా సర్వాస్త్రయోధినః।
సప్తానామపి యో నేతా సేనానాం ప్రవిభాగవిత్॥ 7
యస్సహేత రణే భీష్మం శరార్చిః పావకోపమమ్।
తం తావత్ సహదేవాత్ర ప్రబ్రూహి కురునందన।
స్వమతం పురుషవ్యాఘ్ర కో నః సేనాపతిః క్షమః॥ 8
వీరందరు ధనుర్వేదంలో నిపుణులు. వీరంతా అస్త్ర యుద్ధంలో కూడ సమర్థులు. (వీరిలో) ఏడుగురిలో ఎవరు నేతగా ఉంటారు? ఎవరు సైన్యవిభాగాన్ని బాగా గుర్తించగలరు? యుద్ధంలో బాణజ్వాలలతో అగ్నిలా ప్రజ్వలించే భీష్ముని ఎవరు ఎదుర్కొనగలరు. కురునందనా! సహదేవా! ముందుగా నీవే నీ అభిప్రాయాన్ని ప్రకటించు. మనలో ప్రధాన సేనాపతిగా వ్యవహరించడానికి సమర్థుడెవరో తెలుపుము. (7,8)
సహదేవ ఉవాచ
సంయుక్త ఏకదుఃఖశ్చ వీర్యవాంశ్చ మహీపతిః।
యం సమాశ్రిత్య ధర్మజ్ఞం స్వమంశమనుయుఞ్జ్మహే॥ 9
మత్స్యో విరాటో బలవాన్ కృతాస్త్రో యుద్ధదుర్మదః।
ప్రసహిష్యతి సంగ్రామే భీష్మం తాంశ్చ మహారథాన్॥ 10
సహదేవుడిట్లు అన్నాడు. మనకు బంధువు, దుఃఖ సమయంలో మనతో పాటేఉండి మహాపరాక్రమంగల రాజు, ధర్మజ్ఞుడు, వీరుడైన విరాట మహారాజును ఆశ్రయించి మనం రాజ్యభాగాన్ని పొందగలం. అతడు బలవంతుడై అస్త్రవిద్యలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో దుర్మదుడై పోరాడగలడు. అతడు మత్స్య దేశానికి ప్రభువుగా నున్నాడు. అ విరాట రాజు యుద్ధభూమిలో భీష్మునీ, ఇతర మహారథులను తట్టుకో గలడు. (9,10)
వైశంపాయన ఉవాచ
తథోక్తే సహదేవేన వాక్యే వాక్యవిశారదః।
నకులోఽనంతరం తస్మాత్ ఇదం వచనమాదదే॥ 11
వైశంపాయనుడు ఇలా అన్నాడు. జనమేజయా! సహదేవుడు ఇలా అన్నాక మాటలలో నేర్పరియైన నకులుడు ఇలా అందుకున్నాడు. (11)
వయసా శాస్త్రతో ధైర్యాత్ కులేనాభిజనేన చ।
హ్రీమాన్ బలాన్వితః శ్రీమాన్ సర్వశాస్త్రవిశారదః॥ 12
వేద చాస్త్రం భరద్వాజాత్ దుర్ధర్షః సత్యసంగరః।
యో నిత్యం స్పర్ధతే ద్రోణం భీష్మం చైవ మహాబలమ్॥ 13
శ్లాఘ్యః పార్థివవంశస్య ప్రముఖే వాహినీపతిః।
పుత్రపౌత్రైః పరివృతః శతశాఖ ఇవ ద్రుమః॥ 14
యస్తతాప తపో ఘోరం సదారః పృథివీపతిః।
రోషాత్ ద్రోణవినాశాయ వీరః సమితిశోభనః॥ 15
పితేవాస్మాన్ సమాధత్తే యస్సదా పార్థివర్షభః।
శ్వశురో ద్రుపదోఽస్మాకం సేనాగ్రం స ప్రకర్షతు॥ 16
స ద్రోణ భీష్మావాయాతౌ సహేదితి మతిర్మమ।
స హి దివ్యాస్త్రవిద్రాజా సఖా చాంగిరసో నృపః॥ 17
ద్రుపదుడు వయసులోనూ, శాస్త్రజ్ఞానంలోనూ, ధైర్యం లోనూ, కులంలోనూ, బంధువులలోనూ పెద్దవాడు. వినయం, బలం, ఐశ్వర్యం, మూడూ అతనిలో ఉన్నాయి. సమస్త శాస్త్ర విశారదుడు. భరద్వాజ మహర్షినుండి అస్త్రవిద్యను నేర్చు కొన్నాడు. సత్యప్రతిజ్ఞుడని, భేదించుటకు వీలుగాని వీరుడని ప్రసిద్ధి చెందాడు. నిరంతరం మహాబలవంతులయిన భీష్మ ద్రోణులతో పోటీపడుతూ ఉంటాడు. రాజవంశమందరి ముందు వాహినీపతిగా ప్రశంసింపబడినాడు. పుత్రపౌత్రాదులతో వందల కొమ్మలున్న వృక్షంలా శోభిల్లుతున్నాడు. అ మహారాజు రోషంతో ద్రోణాచార్యుని వినాశనాన్ని కోరుతూ భార్యతో సహా ఘోరతపస్సు ఆచరించాడు. యుద్ధభూమిలో నిలిచిన శూరులకు, వీరులకు, మనలాంటి వారికి తండ్రిలా ఆప్యాయతలను అందిస్తున్నాడు. అట్టి మన మామగారైన భూపాల శిరోమణి ద్రుపదుల వారే మన సైన్యానికి ప్రముఖనేతగా వ్యవహరించుగాక! నా అభిప్రాయానుసారంగా ఒక్కుమ్మడిగా వచ్చినా ద్రోణభీష్మాదులను ద్రుపదమహారాజే ఎదుర్కొన గలవాడు. ఎందుకంటే అతడు అతడు దివ్యాస్త్ర జ్ఞాన సంపన్నుడైన ద్రోణాచార్యులవారి స్నేహితుడు కదా! (12-17)
మాద్రీసుతాభ్యాముక్తే తు స్వమతే కురునందనః।
వాసవిర్వాసవసమః సవ్యసాచ్యబ్రవీద్వచః॥ 18
మాద్రీకుమారులైన నకుల సహదేవులు తమ అభిప్రాయాన్ని ప్రకటించిన తరువాత కురునందనుడు, ఇంద్ర సమానుడైన ఇంద్రపుత్రుడు సవ్యసాచి అర్జునుడిలా చెప్పాడు. (18)
యోఽయం తపఃప్రభావేణ ఋషిసంతోషణేన చ।
దివ్యః పురుష ఉత్పన్నః జ్వాలావర్ణో మహాభుజః॥ 19
ధనుష్మాన్ కవచీ ఖడ్గీ రథమారుహ్య దంశితః।
దివ్యైయవరైర్యుక్తమ్ అగ్నికుండాత్ సముత్థితః॥ 20
గర్జన్నివ మహామేఘః రథఘోషేణ వీర్యవాన్।
సింహసంహననో వీరః సింహకల్పపరాక్రమః॥ 21
సింహోరస్కః సింహభుజః సింహవక్షా మహాబలః।
సింహప్రగర్జనో వీరః సింహస్కంధో మహాద్యుతిః॥ 22
సుభ్రూః సుదంష్ట్రః సుహనుః సుబాహుః సుముఖోఽకృశః।
సుజత్రుః సువిశాలాక్షః సుపాదః సుప్రతిష్ఠితః॥ 23
అభేద్యః సర్వశస్త్రాణాం ప్రభిన్న ఇవ వారణః।
జజ్ఞే ద్రోణవినాశాయ సత్యవాదీ జితేంద్రియః॥ 24
ధృష్టద్యుమ్నమహం మన్యే సహేత్ భీష్మస్య సాయకాన్।
వజ్రాశని సమస్పర్శాన్ దీప్తాస్యానురగానివ॥ 25
ధృష్టద్యుమ్నుడు అగ్నిజ్వాలలతో సమానమైన కాంతి కల మహాభుజుడు. తనతండ్రితపః ప్రభావంతోనూ, మహర్షుల దయాప్రసాదంగానూ దివ్య పురుషుడుగా జన్మించాడు. అగ్నికుండంనుండి కవచాన్ని ధనుస్సును ఖడ్గాన్ని ధరించి పుట్టాడు. దివ్యమైన ఉత్తమాశ్వాలతో ఉద్భవించి రథాన్ని అధిరోహించి యుద్ధంకోసం సిద్ధంగా కనబడుతూ ఉంటాడు. అతని రథఘోష మహామేఘధ్వనిని తలపింపజేస్తూ ఉంటుంది. శారీరకలక్షణాలు, పరాక్రమం, హృదయం, వక్షఃస్థలం, బాహువులు కంఠం - గర్జన - ఇవి అన్నీ అతనికి సింహము వలె ఉంటాయి. మహాబలంతో మహాతేజస్విగా మహావీరుడుగా ఉంటాడు. పెద్ద మూపురం, అందమైన పలువరుస, దవడలు, బుగ్గలు, భుజస్కంధాలు, అందమయిన ముఖం కలిగి అలుపెరుగని వాడు. అందమైన ఎగు బుజాలు విశాలనేత్రాలు సుందరపాదాలు కలవాడు. ఎవరి అస్త్రశస్త్రాలకూ గురికానివాడు. మదపుటేనుగు వంటి పరాక్రమం కలిగి వీరుడైన ద్రోణాచార్యుల వినాశనానికై పుట్టిన వాడు. సత్యవాక్కుతో, జితేంద్రియుడుగా వెలుగొందుతున్నాడు. అట్టి దృష్టద్యుమ్నుడు ప్రధాన సేనాపతిగా అన్నివిధాలా యోగ్యుడని భావిస్తున్నాను. భీష్మపితామహుని బాణాలు విషకీలలను వెలిగ్రక్కే సర్పాలవంటివి. ఆ బాణాల స్పర్శ - వజ్రంవలె, భయంకరమైన పిడుగుపాటు వలె భరింపశక్యం కాదు. ఆ బాణాలను ఎదుర్కొనటానికి ధృష్టద్యుమ్నుడే సమర్థుడు. (19-25)
యమదూతసమాన్ వేగే నిపాతే పావకోపమాన్।
రామేణాజౌ విషహితాన్ వజ్రనిష్పేషదారుణాన్॥ 26
పురుషం తం న పశ్యామి యస్సహేత మహావ్రతమ్।
ధృష్టద్యుమ్నమృతే రాజన్ ఇతి మే ధీయతే మతిః॥ 27
భీష్మ పితామహుని బాణాలు పడటంతోనే అగ్నివలె దగ్ధంచేస్తాయి. ప్రకాశిస్తాయి. వేగంతో యమదూతలవలె ప్రాణాలు తీస్తాయి. వజ్రాయుధపు రాపిడివలె గంభీరంగా మ్రోగుతాయి. వాటిని మునుపు పరశురాముడు ధరించాడు. భీష్మపితామహుని ధాటిని తట్టుకొనడానికి ధృష్టద్యుమ్నుడు తప్ప వేరొక్కరు సమర్థుడుగా నాకు తోచడం లేదు. ఇది న నిశ్చితాభిప్రాయం. (26,27)
క్షిప్రహస్తశ్చిత్రయోధీ మతః సేనాపతిర్మమ।
అభేద్యకవచః శ్రీమాన్ మాతంగ ఇవ యూథపః॥ 28
అత్యంత వేగంగా హస్తసంచాలనం చేయగలడు. విచిత్ర పద్ధతుల్లో యుద్ధం చేసే నేర్పరి. బ్రద్ధలు కొట్టలేని కవచాన్ని ధరించి ఏనుగుల సమూహంలో సంచరించే గజరాజువలె ప్రకాశించే ధృష్టద్యుమ్నుడే సేనాపతిగా తగ్గవాడు. (28)
(వైశంపాయన ఉవాచ
అర్జునేనైవముక్తే తు భీమో వాక్యం సమాదదే)
వైశంపాయనుడిట్లు అన్నాడు. అర్జునుడు ఈ విధంగా చెప్పిన తరువాత భీమసేనుడు అందుకొన్నాడు.
భీమసేన ఉవాచ
వధార్థం యస్సముత్పన్నః శిఖండీ ద్రుపదాత్మజః।
వదంతి సిద్ధా రాజేంద్ర ఋషయశ్చ సమాగతాః॥ 29
యస్య సంగ్రామమధ్యేతు దివ్యమస్త్రం ప్రకుర్వతః।
రూపం ద్రక్ష్యంతి పురుషా రామస్యేన మహాత్మనః॥ 30
న తం యుద్ధే ప్రపశ్యామి యో భింద్యాత్ తు శిఖండినమ్।
శస్త్రేణ సమరే రాజన్ సన్నద్ధం స్యందనే స్థితమ్॥ 31
ద్వైరథే సమరే నాన్యః భీష్మం హన్యాన్మహావ్రతమ్।
శిఖండినమృతే వీరం స మే సేనాపతిర్మతః॥ 32
భీమసేనుడు ఇలా అన్నాడు. రాజేంద్రా! ద్రుపదకుమారుడు 'శిఖండి' భీష్ముని వధ కోసం పుట్టినవాడు. ఈ మాట ఇక్కడకు విచ్చేసిన సిద్ధపురుషులు - మహర్షులు చెప్పినది. యుద్ధరంగంలో శిఖండి తన దివ్యాస్త్రాలను ప్రదర్శించగలడు. ఆ సమయంలో ప్రజలంతా అతని రూపం పరశురాముని రూపంతో సమానమైనదిగా దర్శిస్తారు. రాజా! మహావ్రతాన్ని బూనిన శిఖండి రథారూఢుడై నిలిస్తే అతనిని ఎవరూ ఛేదించలేరు. ద్వైరథ యుద్ధంలో శూరుడు, వీరుడూ అయిన 'శిఖండి' తప్ప మరొక వీరుడు ఆపితామహుని తెగటార్చలేరు. కాబట్టి నా అభిప్రాయాన్ననుసరించి ఆ శిఖండియే సేనాపతిగా తగినవాడు.(29-32)
యుధిష్ఠిర ఉవాచ
సర్వస్య జగతస్తాత సారాసారం బలాబలమ్।
సర్వం జానాతి ధర్మాత్మా! మతమేషాం చ కేశవః॥ 33
ధర్మరాజిలా పలుకసాగాడు. నాయనా! ధర్మాత్ముడు, భగవంతుడునగు శ్రీకృష్ణుడు ఈ సమస్త జగత్తుయొక్క సారాసారాలూ, బలబలాలూ తెలిసినవాడు. మరి ఈవిషయంలో రాజన్యుల అభిప్రాయాలు కూడా ఆ మహాత్మునికే తెలుసు.(33)
యమాహ కృష్ణో దాశార్హః సోఽస్తు సేనాపతిర్మమ।
కృతాస్త్రోఽప్యకృతాస్త్రో వా వృద్ధో వా యది వా యువా॥ 34
కాబట్టి దాశార్హకుల భూషణుడైన శ్రీకృష్ణుడు ఎవరి పేరు చెప్పితే వారే మనకు ప్రధాన సేనాపతిగా ఉండదగినవాడు. ఆ వ్యక్తి అస్త్రవిద్యలో నిపుణుడైనా, కాకపోయినా వృద్ధుడైనా, యువకుడైనా కావచ్చు. (ఈ విషయంలో మనపక్షంలోని వారికి ఉచిత అవసరంలేదు). (34)
ఏష నో విజయే మూలమ్ ఏష తాత! విపర్యయే।
అత్ర ప్రాణాశ్చ రాజ్యం చ భావాభావౌ సుఖాసుఖే॥ 35
ఈ శ్రీకృష్ణభగవానుడే మన, జయాపజయాలకు మూలకారణం. మన ప్రాణాలు, రాజ్యం, మన కలిమి మన లేమి, సుఖదుఃఖాలూ అన్నీ అతనిపై ఆధారపడి ఉన్నాయి. (35)
ఏష ధాతా విధాతా చ సిద్ధిరత్ర ప్రతిష్ఠితా।
యమాహా కృష్ణో దాశార్హః సోఽస్తు నో వాహినీపతిః॥ 36
అతడే కర్త. అతడే విధాత. మన కార్యసిద్ధులనీ ఆస్వామిపైనే ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణభగవానుడు ఎవరిపేరు ప్రస్తావిస్తాడో అతడే మన ప్రధాన సేనాపతి. (36)
బ్రవీతు వదతాం శ్రేష్ఠ నిశా సమభివర్తతే।
తతః సేనాపతిం కృత్వా కృష్ణస్య వశవర్తినః॥ 37
రాత్రేః శేషే వ్యతిక్రాంతే ప్రయాస్యామో రణాజిరమ్।
అధివాసితశస్త్రాశ్చ కృతకౌతుకమంగళాః॥ 38
కాబట్టి వక్తలలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు తన అభిప్రాయం చెప్పాలి. రాత్రికాలం పూర్తిఅవుతోంది. మనం మన సేనాపతిని ఎన్నుకొని రాత్రి గడిచినపిమ్మట అస్త్రవస్త్రాలను(గంధమాల్యాదులతో పూజించి), కౌతుకములను రక్షాబంధనాలను గావించుకొని స్వస్తి వాచకములను అనుసరించి శ్రీకృష్ణాధీనులమై యుద్ధరంగానికి వెడదాం. (37-38)
వైశంపాయన ఉవాచ
తస్య తద్వచనం శ్రుత్వా ధర్మరాజస్య ధీమతః।
అబ్రవీత్ పుండరీకాక్షః ధనంజయమవేక్ష్య హ॥ 39
మమాప్యేతే మహారాజ! భవద్భిర్య ఉదాహృతాః।
నేతారస్తవ సేనాయాః మతా విక్రాంతయోధినః॥ 40
వైశంపాయనుడు చెపుతున్నాడు రాజా! బుద్ధిమంతుడైన యుధిష్ఠిరుని మాటల నాలకించిన శ్రీ కృష్ణుడు అర్జునుని వైపు చూసి ఇలా అన్నాడు. మహారాజా! మీరు చెప్పిన వారంతా సేనాపతులుగా సమర్థులే. ఎందుకనగా మీరు పేర్కొన్న వారంతా మహాపరాక్రమ వంతులయిన యోధానుయోధులే. (39-40)
సర్వ ఏవ సమర్థా హి తవ శత్రుం ప్రబాధితుమ్।
ఇంద్రస్యాపి భయం హ్యేతే జనయేయుర్మహాహవే॥ 41
కిం పునర్ధార్తరాష్ట్రాణాం లుబ్ధానాం పాపచేతసామ్।
శత్రువును ఓడించడంలో వీరందరూ శక్తిమంతులే. వీరు యుద్ధరంగంలో ఇంద్రుని కూడా భయపెట్ట గలరు. ఒక పాపాత్ములూ, లోభచిత్తులూ అయిన ధృత రాష్ట్రకుమారుల విషయంలో చెప్పాలా? (41 1/2)
మయాపి హి మహాబాహో త్వత్ప్రియార్థం మహాహవే॥ 42
కృతో యత్నో మహాంస్తత్ర శమః స్యాదితి భారత।
ధర్మస్య గతమానృణ్యం న స్మ వాచ్యా వివక్షతామ్॥ 43
మహాబాహూ! భరతనందన! నేను కూడా ఈ యుద్ధవిషయంలో ఆలోచించి నీకు మంచిని చేయాలని శాంతిని స్థాపించడానికై ఎంతో ప్రయత్నం చేశాను. ఈ కారణాన మనవారంత ధర్మఋణం తీర్చుకొనగలిగిన వారం కాగలిగాము. ఇతరుల దోషాలను ఎత్తిచూపేవారు కూడా మనపై నిందలను మోపలేరు. (42-43)
కృతాస్త్రం మన్యతే బాలః ఆత్మానమవిచక్షణః।
ధార్తరాష్ట్రో బలస్థం చ పశ్యత్యాత్మానమాతురః॥ 44
దుర్యోధనుడు యుద్ధం కావాలని తహతహ లాడుతున్నాడు. అతడు మూర్ఖుడు. అయోగ్యుడై తనను అస్త్ర విద్యాపారంగతునిగా భవిస్తున్నాడు. తాను బలహీనుడైనా బలవంతుడననే అనుకొంటున్నాడు. (44)
యుజ్యతాం వాహినీ సాధు వధసాధ్యా హి మే మతాః।
న ధార్తరాష్ట్రాః శక్ష్యంతి స్థాతుం దృష్ట్వా ధనంజయమ్॥ 45
భీమసేనం చ సంక్రుద్ధం యమౌ చాపి యమోపమౌ।
యుయుధానద్వితీయం చ ధృష్టద్యుమ్నమమర్షణమ్॥ 46
అభిమన్యుం ద్రౌపదేయాన్ విరాటద్రుపదావపి।
అక్షౌహిణీపతీం శ్చాన్యాన్ నరేంద్రాన్ భీమవిక్రమాన్॥ 47
కాబట్టి మీరు మీ సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయండి. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం శత్రుసంహారంతో గాని వారు వశం కారు. వీరుడైన అర్జునుడు, యమధర్మరాజుతో సమానులైన నకుల సహదేవులు, సాత్యకిసహితుడు, అమర్షశీలుడైన ధృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ఉపపాండవులూ, విరాటరాజు, ద్రుపదుడు అక్షౌహిణీ సేనానాయకుల పరాక్రమాన్ని చూసి ధృతరాష్ట్ర కుమారులు నిలబడటానికి కూడా సాహసించలేరు. (45-47)
సారవద్బలమస్మాకం దుష్ప్రధర్షం దురాసదమ్।
ధార్తరాష్ట్రబలం సంఖ్యే హనిష్యతి న సంశయః॥ 48
ధృష్టద్యుమ్నమహం మన్యే సేనాపతి మరిందమ।
మన సైన్యం మిక్కిలి శక్తిమంతమైనది. అభేద్యం. ఎదిరింపరానిది. మన సేన ధార్తరాష్ట్రుల సేనలను సంహరించగలదు. ఇందులో సందేహం లేదు. శత్రుమర్దనా! నేను ధృష్టద్యుమ్నునే ప్రధాన సేనాపతిగా అనుకొంటున్నాను. (48 1/2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తేతు కృష్ణేన సంప్రాహృష్యన్నరోత్తమాః॥ 49
తేషాం ప్రహృష్టమనసాం నాదః సమభవన్మహాన్।
యోగ ఇత్యథ సైన్యానాం త్వరతాం సంప్రధావతామ్॥ 50
వైశంపాయనుడు ఇట్లు చెప్పనారంభించాడు. రాజా! శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పడంటో నరశ్రేష్ఠ లందరూ ఎంతో సంతోషించారు. వెంటనే వారు "యుద్ధానికి సిద్ధం కండి సన్నద్ధులైరండీ" అంటూ సైన్యమంతటినీ మహోత్కంఠతతో పరుగులెత్తించ సాగారు. ఆ సమయంలో ప్రసన్నమనస్కులైన వీరుల యొక్క మహానాదాలు అన్నిదిక్కులూ చెలరేగాయి. (49-50)
హయవారణశబ్దాశ్చ నేమిఘోషాశ్చ సర్వతః।
శంఖదుందుభిఘోషాశ్చ తుములాః సర్వతోఽభవన్॥ 51
అన్నిదిక్కులా అశ్వహేషలు, గజఘీంకారాలు, రథాల చప్పుళ్ళు వినబడసాగాయి. అంతటా శంఖదుందుభుల ధ్వనులు మారుమోగాయి. (51)
తదుగ్రం సాగరనిభం క్షుబ్ధం బలసమాగమమ్।
రథపత్తిగజోదగ్రం మహోర్మిభిరివాకులమ్॥ 52
రథాలు, పదాతి దళాలు, గజబలాలతో నిండిన ఆ సైన్యం భయంకర తరంగాలతో కూడిన మహాసాగరం వలె కల్లోలిత మయింది. (52)
ధవతామాహ్వయానానాం తనుత్రాణి చ బధ్నతామ్।
ప్రయస్యతాం పాండవానాం ససైన్యానాం సమంతతః॥ 53
గంగేవ పూర్ణా దుర్ధర్షా సమదృశ్యత వాహినీ।
పాండవులు, వారి సైన్యాలు అంతటా పరుగిడుతూ యుద్ధానికి ఆహ్వానిస్తూ కవచాలను ధరిస్తూ రణయాత్రకు బయలుదేరారు. అ సైన్యప్రవాహాలు విశాలమై మహాజలంతో నిండిన గంగానదివలే దాటశక్యం కానట్లు కనపడ్డాయి. (53 1/2)
అగ్రానీకే భీమసేనః మాద్రీపుత్రౌ చ దంశితౌ॥ 54
సౌభద్రో ద్రౌపదేయాశ్చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః।
ప్రభద్రకాశ్చ పాంచాలాః భీమసేనముఖా యయుః॥ 55
భీమసేనుడు, కవచాలను ధరించిన నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు ధృష్టద్యుమ్నుడు ప్రభద్రకగణాలు, పాంచాలురు వీరందరూ భీమసేనుని తమకు ముందుంచుకొని బయలుదేరారు. (54-55)
తతః శబ్దః సమభవత్ సముద్రస్యేవ పర్వణి।
హృష్టానాం సంప్రయాతానాం గోషో దివమివాస్పృశత్॥ 56
పూర్ణిమనాడు సముద్రమున్నంత కోలాహలంతో, హర్షంతో, ఉత్సాహంతో పొంగిపొరలే ఆ సైన్యంచేసే ఘోష అంతటా వ్యాపించి స్వర్గలోకాన్ని మిన్నుముట్టింది. (56)
ప్రహృష్టా దంశితా యోధాః పరానీకవిదారణాః।
తేషాం మధ్యే యయౌ రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః॥ 57
హర్షాతిరేకంతో కవచాలను ధరించి శత్రుసైన్యాలను చీల్చిచెండాడే సైన్యాల మధ్యలో నుండి ధర్మరాజు నడువసాగాడు. (57)
శకటాపణవేశాశ్చ యానయుగ్యం చ సర్వశః।
కోశం యంత్రాయుధం చైవ యే చ వైద్యాశ్చికిత్సకాః॥ 58
యుద్ధసామగ్రిని మోసే శకటాలు, అంగళ్ళు, గుడారాలు రథాలు మొదలయిన బండ్లు, ధనాగారం, యంత్రాలతో ప్రయోగించే అస్త్రాలు, వైద్యులు, శస్త్రచికిత్సకులు వారితోపాటు పయనించసాగారు. (58)
ఫల్గు యచ్చ బలం కించిత్ యచ్చాపి కృశదుర్బలమ్।
తత్ సంగృహ్య యయౌ రాజా యే చాపి పరిచారకాః॥ 59
ధర్మరాజు సారహీనులైన సైనికులను, చిక్కిన దుర్భలులను మిగిలిన పరిచారకులను ఉపప్లావ్య నగరంలో ఒకచోట చేర్చి తాను అక్కడ నుండి బయలుదేరాడు. (59)
ఉపప్లవ్యే తు పాంచాలీ ద్రౌపదీ సత్యవాదినీ।
సహస్త్రీభిర్నివవృతే దాసీదాససమావృతా॥ 60
పాంచాలరాజకుమార్తె సత్యవాదిని ద్రౌపదీదేవి దాస దాసీజనపరివేష్టితురాలై కొంతదూరం వరకూ ధర్మరాజుతో పాటు వెళ్లి మరల స్త్రీలతో కూడి తిరిగి వచ్చింది. (60)
కృత్వా మూలప్రతీకారం గుల్మైః స్థావరజంగమైః।
స్కన్ధావారేణ మహతా ప్రయయుః పాండునందనాః॥ 61
పాండునందనులు దుర్గ రక్షణకు అవసరమైన స్థావర జంగమ ఉపాయాలద్వారా మూల రక్షణ చేసి పెద్దసేనతో బయలు దేరారు. (61)
దదతో గాం హిరణ్యం చ బ్రాహ్మణైరభిసంవృతాః।
స్తూయమానా యయూ రాజన్ రథైర్మణివిభూషితైః॥ 62
రాజా! బ్రాహ్మణోత్తములు నాలుగు దిక్కులనుండి వచ్చి పాండవుల గుణాలను కీర్తించసాగారు. పాండవులు వారికి గోవులను, సువర్ణాదులను దానాలుగా సమర్పించారు. ఈ విధంగా పాండవులు మణిభూషితము లైన రథాలపై యాత్ర సాగించారు. (62)
కేకయా ధృష్టకేతుశ్చ పుత్రః కాశ్యస్య చాభిభూః।
శ్రేణిమాన్ వసుదానశ్చ శిఖండీ చాపరాజితః॥ 63
హృష్టాస్తుష్టాః కవచినః సశస్త్రాః సమలంకృతాః।
రాజానమన్వయుః సర్వే పరివార్య యుధిష్ఠిరమ్॥ 64
కేకయ రాజకుమారులు, ధృష్టకేతువు, కాశీరాజు కుమారుడైన అభిభువు, శ్రేణిమంతుడు వసుదానుడు, పరాజయ మెరుగని వీర శిఖండి, వీరందరు అలంకారాలు ధరించి కవచధారులై శస్త్రాలు దాల్చి హర్షంతో ఉల్లాసంగా యుధిష్ఠిరుని సమీపించి అతనితో నడవసాగారు. (64)
జఘనార్ధే విరాటశ్చ యాజ్ఞసేనిశ్చ సౌమకిః।
సుధర్మా కుంతిభోజశ్చ ధృష్టద్యుమ్నస్య చాత్మజాః॥ 65
రథాయుతాని చత్వారి హయాః పంచగుణాస్తథా।
పత్తిసైన్యం దశగుణం గజానామయుతాని షట్॥ 66
ఆమహాసైన్యం వెనుక సగభాగంలో విరాటరాజు, ధృష్టద్యుమ్నుడు, సుధర్ముడు, కుంతిభోజుడు ధృష్టద్యుమ్నుని కుమారులూ న్డౌవసాగారు. వీరితోపాటు నలుబదివేల రథాలు, రెండు లక్షల గుర్రాలు, నాలుగులక్షల పదాతిదళాలు, అరువది వేల ఏనుగులు ఉన్నాయి. (65,66)
అనాధృష్టిశ్చేకితానః ధృష్టకేతుశ్చ సాత్యకిః।
పరివార్య యయుః సర్వే వాసుదేవధనంజయౌ॥ 67
అనాధృష్టి, చేకితానుడు, దృష్టకేతువు, సాత్యకి వీరందరూ కృష్ణార్జునులను అనుసరించి వెళ్లారు. (67)
ఆసాద్య తు కురుక్షేత్రం వ్యూఢానీకాః ప్రహారిణః।
పాండవా సమదృశ్యంత నర్దంతో వృషభా ఇవ॥ 68
ఇలా పాండవులు వ్యూహరచనచేసి యుద్ధానికి సన్నద్ధులై కురుక్షేత్రం చేరుకొని మదించిన వృషభాలవలె నినదిస్తూ కనబడ్డారు. (68)
తే ఽవగాహ్య కురుక్షేత్రం శంఖాన్ దధ్మురరిందమాః।
తథైవ దధ్మతుః శంఖం వాసుదేవధనంజయౌ॥ 69
శత్రుసంహారకులగు వీరులు కురుక్షేత్రరణరంగం చేరుకొని తమతమ శంఖాలను పూరించారు. అలాగే శ్రీ కృష్ణార్జునులిరువురూ తమశంఖాలను పూరించారు. (69)
పాంచజన్యస్య నిర్ఘోషం విస్పూర్జితమివాశనేః।
నిశమ్య సర్వసైన్యాని సమహృష్యంత సర్వశః॥ 70
మెరపులతో కూడిన పిడుగువలె శబ్దించే పాంచజన్య శంఖధ్వని విని, అన్ని వైపులా విస్తరించిన పాండవసైన్యాలు చాలా సంతోషమూ, ఉత్సాహమూ పొందాయి. (70)
శంఖదుందుభిసంసృష్టః సింహనాదస్తరస్వినామ్।
పృథివీం చాంతరిక్షం చ సాగరాంశ్చాన్వనాదయత్॥ 71
శంఖ దుందుభులతో కూడిన వీరుల సింహనాదాలు భూమ్యాకాశసముద్రాలలో ఒక్కసారిగా ప్రతిధ్వనించాయి. (71)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి సైన్య నిర్యాణ పర్వణి కురుక్షేత్ర ప్రవేశే ఏకపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 151 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున సైన్యనిర్యాణపర్వమను ఉపపర్వమున కురుక్షేత్ర ప్రవేశమను నూటఏబదిఒకటవ అధ్యాయము. (151)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకముతో కలిపి మొత్తము 71 1/2 శ్లోకములు)