155. నూట ఏబది అయిదవ అధ్యాయము
దుర్యోధనుడు సేనాపతులను నియమించుట.
వైశంపాయన ఉవాచ
వ్యుష్టాయాం వై రజన్యాం రాజా దుర్యోధనస్తతః।
వ్యభజత్ తాన్యనీకాని దశ చైకం చ భారత॥ 1
వైశంపాయనుడిట్లన్నాడు. జనమేజయ మహారాజా! ఆ రాత్రి గడచిన తరువాత తెల్లవారుజామున దుర్యోధనుడు తన పదకొండు అక్షౌహిణులను విభజించాడు. (1)
నరహస్తిరథాశ్వానాం సారం మధ్యం చ ఫల్గు చ।
సర్వేష్వేతేష్వనీకేషు సంధిదేశ నరాధిపః॥ 2
దుర్యోధనుడు సైన్యంలోని పాద, హస్తి, రథ, అశ్వదళాలలో ఉత్తమ మధ్యమ అధమ శ్రేణులుగా గుర్తించిన వానిని వాటికి తగిన స్థానాలలో నియమించాడు. (2)
సానుకర్షాః సతూణీరాః సవరూథాః సతోమరాః।
సోపాసంగాః సశక్తీకాః సనిషంగాః సహర్ష్టయః॥ 3
సధ్వజాః సపతాకాశ్చ సశరాసనతోమరాః।
రజ్జుభిశ్చ విచిత్రాభిః సపాశాః సపరిచ్ఛదాః॥ 4
సకచగ్రహవిక్షేపాః సతైలగుడవాలుకాః।
సాశీవిషఘటాః సర్వే ససర్జరసపాంసవః॥ 5
సఘంటఫలజాః సర్వే సాయోగుడజలోపలాః।
సశాలభిందిపాలాశ్చ సమధూచ్ఛిష్టముద్గరాః॥ 6
సకాండ దండకాస్సర్వే ససీరవిషతోమరాః।
సశూర్ప పిటకాస్సర్వే సదాత్రాంకుశతోమరాః॥ 7
సకీలకవచాః సర్వే వాసీవృక్షాదనాన్వితాః।
వ్యాఘ్రచర్మపరీవారాః ద్వీపిచర్మావృతాశ్చ తే॥ 8
సహర్ష్టయః సశృంగాశ్చ సప్రాసవివిధాయుధాః।
సకుఠారాః సకుద్దాలాః సతైలక్షౌమసర్పిషః॥ 9
ఆ వీరులంతా అనుకర్షాలు, పెద్ద అమ్ముల పొదులూ, కవచాలూ, తోమరాలూ, చిన్న అమ్ముల పొదులూ, శక్తులూ, ఉపాసంగాలూ, నిషంగానూ, ఈటెలు కలిగి ఉన్నారు. (3)
ధ్వజాలు, జెండాగుడ్డలు, వింటితోమరాలు, విచిత్రములైన త్రాళ్లు, పాశాలు, (కప్పుకొనే) కంబళ్ళు కలిగి ఉన్నారు. (4)
జుట్టుకు పట్టించి లాగే కర్రలు, నూనె, బెల్లం, ఇసుకలతో కూడిన కుండలు, పాములున్న కుండలు, సర్జరసంతోకూడిన పొడి, సమకూర్చి ఉన్నారు. (5)
గంటలతో కూడిన పలకలు; ఇనుము బెల్లం కరిగించిన పాకం, గుళ్లు, శాలాలు, భిందిపాలాలు, తేనె, మైనం, రోకళ్లు సిద్ధం చేశారు. (6)
ముళ్లకర్రలు, నాగళ్లు, విషపూరిత తోమరాలు, చేటలు, పెట్టెలు, కొడవళ్లు, ముళ్లతోమరాలు కలిగి ఉన్నారు. (7)
ముళ్లకవచాలు, ఉలులు, పులితోళ్లు, చిరుతపులి తోళ్లు సిద్ధం చేసి ఉన్నారు. (8)
చేతితో విసిరే ఆయుధాలు, కొమ్ములు, బల్లెములు, అనేక విధాలయిన ఆయుధాలు, గొడ్డళ్లు, నునపాలు, నేతిగుడ్డలు, నూనెగుడ్డలు, కలిగి ఉన్నారు. (9)
4. పరిచ్ఛదములు - కప్పుకునే కంబళ్లు మొ॥
రుక్మజాల ప్రతిచ్ఛన్నాః నానామణివిభూషితాః।
చిత్రానీకాః సువపుషః జ్వలితా ఇవ పావకాః॥ 10
ఆ సైనికులందరూ బంగారు ఆభరణాలను వివిధ మణులను ధరించి మండుతున్న అగ్నిజ్వాలలవలె ప్రకాశించారు. (10)
తథా కవచినః శూరాః శస్త్రేషు కృతనిశ్చయాః।
కులీనా హయయోనిజ్ఞాః సారథ్యే వినివేశితాః॥ 11
శస్త్రవిద్యలలో ఆరితేరిన ఆ సైనికులు కవచాలను ధరించారు. సత్కులంలో పుట్టినవారు, గుఱ్ఱాలను గురించి చాలా విషయాలను తెలిసినవారు... ఇలాంటి వారందరినీ రథసారథ్యంలో నియోగించారు. (11)
బద్ధారిష్టాః బద్ధకక్షాః బద్ధధ్వజపతాకినః।
బద్ధాభరణనిర్యూహాః బద్ధచర్మాసిపట్టిశాః॥ 12
తమతమ రథాలలోని అమంగళాలు తొలగాలని రకరకాల యంత్రాలను ఔషధాలను కట్టసాగారు. త్రాళ్ళను బిగించారు. తమ రథాలపై రెపరెపలాడే పతాకాలను నిలిపారు. అందంగా కొన్నిరకాల ఆభరణాలు చిరుగంటలు కట్టారు. అన్ని తావులలో చర్మపుతొడుగులు కల ఖడ్గాలను కూడా సిద్ధపరచుకొన్నారు. (12)
చతుర్యుజో రథాః సర్వే సర్వే చోత్తమవాజినః।
సప్రాపఋష్టికాః సర్వే సర్వే శతశరాసనాః॥ 13
ఆ రథాలన్నీ నాలుగేసి గుర్రాలతో కట్టిఉన్నాయి. గుఱ్ఱాలన్నీ ఉత్తమ జాతివి. రథాలనిండా ప్రాస - ఋష్టి అనే ఆయుధవిశేషాలను - నూర్ల సంఖ్యలో నున్న విల్లంబులను సిద్ధపరచారు. (13)
ధుర్యయోర్హయయోరేకః తథాన్యౌ పార్ష్ణిసారథీ।
తౌ చాపి రథినాం శ్రేష్ఠా రథీ చ హయవిత్ తథా॥ 14
నగరాణీవ గుప్తాని దురాధర్షాణి శత్రుభిః।
ఆసన్ రథసహస్రాణి హేమమాలీని సర్వశః॥ 15
రథానికి ఉన్న రెండు రెండు గుఱ్ఱాలకు కలిపి ఒక్క 'రక్షకుణ్ణి' నియమించారు. ఒకొక్క రథానికి ఇద్దరు చక్రరక్షకులను కూడా నియమించారు. ఆ ఇద్దరూ రథికులలో శ్రేష్ఠులే. నాల్గవవాడు రథికుడు. అతడు గుర్రాల తత్త్వం తెలిసినవాడు. ఆ రణరంగమంతా బంగారు ఆభరణాలతో బంగరు దండలతో కూడిన వేల రథాలతో కళకళలాడి పోతోంది. శత్రుదుర్భేద్యంగా నున్న ఆ రథాలన్నిటిని నగరాలవలె రక్షింపసాగారు. (14-15)
యథా రథా స్తథా నాగాః బద్ధకక్షః స్వలంకృతాః।
బభూవుః సప్తపురుషాః రత్నవంత ఇవాద్రయః॥ 16
రథాలను అలంకరించినట్లు ఏనుగులనుకూడా బంగారు దండలతో అలంకరించారు. త్రాళ్లతో బిగించారు. ఒక్కొక్క ఏనుగుపైని ఏడుగురు చొప్పున ఉన్నారు. ఆ ఏనుగులు రత్నాలతో కూడిన పర్వతాలవలె గోచరిస్తున్నాయి. (16)
ద్వావంకుశధరౌ తత్ర ద్వావుత్తమ ధనుర్ధరౌ।
ద్వౌ వరాసిధరౌ రాజన్ ఏకః శక్తిపినాకధృక్॥ 17
ఆ ఏడుగురిలో ఇద్దరు అంకుశాలను ధరించారు. ఇద్దరు ఉత్తమ ధనుస్సులను ధరించారు. మరోఇద్దరు మంచి చురకత్తులను ధరించారు. మరో వీరుడు శక్తి అనే త్రిశూలాన్ని ధరించి ఉన్నాడు. (17)
గజైర్మత్తైః సమాకీర్ణం సర్వమాయుధకోశకైః।
తద్ బభూవ బలం రాజన్ కౌరవ్యస్య మహాత్మనః॥ 18
రాజా! మహాత్ముడైన ఆ దుర్యోధనుని సైన్యమంతా కవచాలు, ఆయుధాలు, ఒరలతో మదించిన ఏనుగులతో కిటకిటలాడింది. (18)
ఆముక్తకవచైర్యుక్తైః సపతాకైః స్వలంకృతైః।
సాదిభి శ్చోపపన్నాస్తు తథా చాయుతశో హయాః॥ 19
కవచాలను ధరించి యుద్ధానికి సిద్ధమై, ఆభరణాలతో ప్రకాశిస్తూ వేలకొలది సైన్యం గుఱ్ఱాలపై పతాకాలను ఎగురవేస్తూ కనిపించసాగారు. (19)
అసంగ్రాహాః సుసంపన్నాః హేమభాండపరిచ్ఛదాః।
అనేక శతసాహస్రాః సర్వే సాదివశే స్థితాః॥ 20
ఆ గుఱ్ఱాలన్నీ ఎట్టి మారాం చేయనివి. అవి ఎప్పుడూ వీరుల వశంలో ఉండేవి. వాటిమీద అలంకారాలు, పట్టాలు వస్త్రాలు కప్పారు. అలాంటి ఉత్తమాశ్వాలు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి. (20)
నానారూపవికారాశ్చ నానాకవచశస్త్రిణః।
పదాతినో నరాస్త్రత్ర బభూవుర్హేమమాలినః॥ 21
పదాతిసైన్యమంతా సువర్ణ ఆభరణాలను ధరించారు. వారు ధరించిన కవచాలు అస్త్రశస్త్రాలు రకరకాలుగా కనబడసాగాయి. (21)
రథస్యాసన్ దశగజాః గజస్య దశవాజినః।
నరా దశ హయస్యాసన్ పాదరక్షాః సమంతతః॥ 22
ఒక్కొక్క రథం వెనుక పది పది ఏనుగులు, ఒకొక్క ఏనుగు వెనుక పదిపది గుఱ్ఱాలు, అలాగే గుఱ్ఱాల వెనుక పదిపది చొప్పున పదాతి సైనికులు ఉన్నారు. (22)
రథస్య నాగాః పంచాశత్ నాగస్యాసన్ శతం హయాః।
హయస్య పురుషాః సప్త భిన్నసంధానకారిణః॥ 23
ఒకొక్కరథం వెనుక ఏబది ఏనుగులు, ఒకొక్క ఏనుగు వెనుక నూరు గుఱ్ఱాలు, ఒకొక్కగుఱ్ఱము వెనుక ఏడుగురు చొప్పున కాలుబలం నియమితులైనారు. వారు సైన్యమును చెదరకుండా సంధానం చేయసాగారు. (23)
సేనా పంచశతం నాగాః రథాస్తావంత ఏవ చ।
దశ సేనా చ పృతనా పృతనా దశవాహినీ॥ 24
ఐదువందల ఏనుగులు, ఐదువందల రథములు కలిపితే ఒకసేన అవుతుంది. పదిసేనలు కలిస్తే ఒక పృతన అవుతుంది. పది పృతనలు కలిపితే ఒక వాహిని అవుతుంది. (24)
సేనా చ వాహినీ చైవ పృతనా ధ్వజినీ చమూః।
అక్షౌహిణీతి పర్యాయైః నిరుక్తా చ వరూథినీ॥ 25
సేనా - వాహినీ, పృతన, ధ్వజినీ, చమువు, వరూధినీ, అక్షౌహిణీ అనే శబ్దాలతో సైన్యం చెప్పబడుతుంది. (25)
ఏవమ్ వ్యూఢాన్యనీకాని కౌరవేయేణ ధీమతా।
అక్షౌహిణ్యో దశైకా చ సంఖ్యాతా సప్త చైవహ॥ 26
ఈవిధంగా దుర్యోధనుడు పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని, పాండవులు ఏడు అక్షౌహిణుల సైన్యాన్ని సిద్ధపరచారు. మొత్తం పదునెనిమిది అక్షౌహిణులసైన్యం ఆ కురుక్షేత్రంలో కనిపించింది. (26)
అక్షౌహిణ్యస్తు సప్తైవ పాండవానామభూత్ బలమ్।
అక్షౌహిణ్యో దశైకా చ కౌరవాణామభూత్ బలమ్॥ 27
పాండవుల సైన్యం కేవలం ఏడు అక్షౌహిణులు, కౌరవుల బలం పదకొండు అక్షౌహిణులుగా ఆ యుద్ధరంగంలో ఒకచోటుకు చేరుకుంది. (27)
నరాణాం పంచపంచాశదేషా పత్తిర్విధీయతే।
సేనాముఖం చ తిస్రస్తా గుల్మ ఇత్యభిశబ్దితమ్॥ 28
ఏబది ఐదు పదాతి సైనికులను 'పత్తి' అని అంటారు. అలాంటి మూడు పత్తులు కలిపితే ఒక సేనాముఖం అని వ్యవహరిస్తారు. సేనాముఖానికి మూడు రెట్లు గుల్మమని అంటారు. (28)
త్రయో గుల్మా గణస్త్వాసీత్ గణాస్త్వయుతశోఽభవన్।
దుర్యోధనస్య సేనాసు యోత్స్యమానాః ప్రహారిణః॥ 29
మూడు 'గుల్మాలు' ఒక గణం. దుర్యోధనుని సైన్యంలో యుద్ధం చేసే పదాతి సైనికుల గణాలు వేలకొలదీ ఉన్నాయి. (29)
తత్ర దుర్యోధనో రాజా శూరాన్ బుద్ధిమతో నరాన్।
ప్రసమీక్ష్య మహాబాహుః చక్రే సేనాపతీంస్తదా॥ 30
అపుడు మహాబాహువయిన దుర్యోధనుడు బాగా ఆలోచించి బుద్ధిమంతులు శూరులైన వీరపురుషులను సేనాపతులుగా నియమించాడు. (30)
పృథగక్షౌహిణీనాం చ ప్రణేతౄన నరసత్తమాన్।
విధివత్ పూర్వమానీయ పార్థివానభ్యభాషత॥ 31
నరోత్తములయిన అక్షౌహిణీ నాయకులందరినీ వేర్వేరుగా రప్పించి వారితో దుర్యోధనుడు చక్కగా సంభాషిస్తున్నాడు. (31)
కృపం ద్రోణం చ శల్యం చ సైంధవం చ జయద్రథమ్।
సుదక్షిణమ్ చ కాంబోజం కృతవర్మాణమేవ చ॥ 32
ద్రోణపుత్రం చ కర్ణమ్ చ భూరిశ్రవసమేవ చ।
శకునిం సౌబలం చైవ బాహ్లీకం చ మహాబలమ్॥ 33
కృపాచార్యుని, ద్రోణాచార్యుని, అశ్వత్థామను, మద్రరాజు శల్యుని, సింధురాజు జయద్రథుని, కాంబోజరజు సుదక్షిణుని, కృతవర్మను, కర్ణుని, భూరిశ్రవసుని, సుబలపుత్రుడుశకునిని, మహాబలవమ్తుడైన బాహ్లీకుని ఆ దుర్యోధనుడు ఒకొక్కరిని ఒకొక్క అక్షౌహిణీ సైన్యమునకు అధినాయకునిగా నిశ్చయించాడు. (32,33)
దివసే దివసే తేషాం ప్రతివేలం చ భారత।
చక్రే స వివిధాః పూజాః ప్రత్యక్షం చ పునః పునః॥ 34
భారతా! ఆ దుర్యోధనుడు ప్రతిరోజూ ఆయా వేళల్లో ఆ సేనాపతులందరినీ తానే ప్రత్యక్షంగా సత్కరించేవాడు. (34)
తథా వినియతాః సర్వే యే చ తేషాం పదానుగాః।
బభూవుః సైనికా రాజ్ఞాం ప్రియం రాజ్ఞః చికీర్షవః॥ 35
దుర్యోధనుడు తన అనుయాయులందరినీ వారికి తగిన స్థానాలలో నియమించాడు. ఆ మహారాజుల సైనికులందరూ దుర్యోధనునికి ప్రియం చేకూర్చాలనే తపనతో తమ తమ కార్యాలలో నిమగ్నులైనారు. (35)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ సైన్యనిర్యాణ పర్వణి దుర్యోధనసైన్యవిభాగే పంచ పంచాశదధిక శతతమోఽధ్యాయః ॥ 155 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున సైన్యనిర్యాణపర్వమను ఉపపర్వమున
సైన్యవిభాగమను నూట ఏబది ఐదవ ఆధ్యాయము. (155)