156. నూట ఏబది ఆరవ అధ్యాయము

దుర్యోధనుడు భీష్ముని ప్రధాన సేనాపతిగా అభిషేకించుట.

వైశంపాయన ఉవాచ
తతః శాంతనవం భీష్మం ప్రాంజలిః ధృతరాష్ట్రజః।
సహ సర్వైః మహీపాలైః ఇదం వచనమబ్రవీత్॥ 1
వైశంపాయనుడిట్లు పలుకసాగాడు. జనమేజయా! తరువాత దుర్యోధనుడు రాజులందరితో కలసి శంతనునందనుడైన భీష్మునికి నమస్కరిస్తూ ఇలా పలికాడు. (1)
ఋతే సేనాప్రణేతారం పృతనా సుమహత్యపి।
దీర్యతే యుద్ధమాసాద్య పిపీలికపుటం యథా॥ 2
పితామహా! ఎంత సైన్యమున్నా యోగ్యుడైన సేనాపతి లభించకపోయినచో, సైన్యమంతా చీమలపుట్టవలె చెల్లాచెదరవుతుంది. (2)
న హి జాతు ద్వయోర్బుద్ధిః సమా భవతి కర్హిచిత్।
శౌర్యం చ బలనేతౄణాం స్పర్ధతే చ పరస్పరమ్॥ 3
ఏ ఇద్దరి బుద్ధీ ఎన్నడూ సమానంగా ఉండదు. యోగ్యులైన సేనాపతుల శౌర్యం ఒకదానితో ఒకటి పోటీపడుతుంది. (3)
శ్రూయతే చ మహాప్రాజ్ఞ హైహయానమితౌజసః।
అభ్యయుః బ్రాహ్మణాః సర్వే సముచ్ఛ్రితకుశధ్వజాః॥ 4
మహామతీ! ఒకసారి బ్రాహ్మణులంతాకలసి దర్భలతో చేసిన పతాకాలు ధరించి మహాతేజస్వులైన హైహయవంశ క్షత్రియులను ముట్టడించిన సంగతి మనం విన్నదే కదా! (4)
తానభ్యయుస్తదా వైశ్యాః శూద్రాశ్చైవ పితామహ।
ఏకతస్తు త్రయో వర్ణాః ఏకతః క్షత్రియర్షభాః॥ 5
తాతా! ఆసమయంలో బ్రాహ్మణులతోపాటు వైశ్యులు, శూద్రులు కూడా కలసి ఒక పక్షంగాను, రెండవపక్షంగా క్షత్రియనేతలు నిలిచారు. (5)
తతో యుద్ధేష్వభజ్యంత త్రయోవర్ణాః పునః పునః।
క్షత్రియాశ్చ జయంత్యేవ బహులం చైకతో బలమ్॥ 6
యుద్ధం ప్రారంభంకా గానే, మూడు జాతులవారు ఓడిపోసాగారు. నిజానికి బ్రాహ్మణ, వైశ్య శూద్రసైన్య సంఖ్య ఎక్కువగా ఉన్నా క్షత్రియులే విజయాన్ని సాధించారు. (6)
తతస్తే క్షత్రియానేవ పప్రచ్ఛుః ద్విజసత్తమాః।
తేభ్యః శశంసుః ధర్మజ్ఞాః యాథాతథ్యం పితామహ॥ 7
ఆ సమయంలో బ్రాహ్మణులంతా కలసి క్షత్రియులనే ఇలా అడిగారు. మేము ఓడిపోవడానికి కారణం ఏమిటి? వివరించండి అని. దానికి రాజులు యథార్థకారణం ఇది అంటూ ఇలా పలుకసాగారు. (7)
వయమేకస్య శృణ్వానాః మహాబుద్ధిమతో రణే।
భవంతస్తు పృథక్ సర్వే స్వబుద్ధివశవర్తినః॥ 8
మేము మాలో బుద్ధిమంతుడైన వానిని సేనానిగా నియమించుకొని యుద్ధంలో అతని వాక్యాన్నే జవదాటకుండా ప్రవర్తిస్తాము. మరి మీరో ఎవరి బుద్ధికి తోచినట్లు వారు వ్యవహరిస్తారు. (8)
తతస్తే బ్రాహ్మణాశ్చక్రుః ఏకం సేనాపతిం ద్విజమ్।
నయే సుకుశలం శూరమ్ అజయన్ క్షత్రియాంస్తతః॥ 9
అపుడు బ్రాహ్మణులుకూడా తమలో ఒకరిని సేనాపతిగా ఎంచుకొని తద్వారా క్షత్రియులపై విజయాన్ని సాధించగలిగారు. (9)
ఏవం యే కుశలం శూరం హితేప్సితమకల్మషమ్।
సేనాపతిం ప్రకుర్వంతి తే జయంతి రణే రిపూన్॥ 10
తమ హితాన్ని కోరేవానిని పాపరహితుని, యుద్ధనిపుణులను సేనాపతిగా నియమిస్తే యుద్ధరంగంలో విజయాన్ని పొందగలుగుతారు. (10)
భవానుశనసా తుల్యః హితైషీ చ సదా మమ।
అసంహార్యః స్థితో ధర్మే స నః సేనాపతిర్భవ॥ 11
మీరు సదా నా హితాన్నే కోరుతారు. మీరు శుక్రాచార్యులవంటి వారు. మిమ్ములను సంహరించగలశక్తి ఎవ్వరికీ లేదు. మీరు ధర్మమార్గంలో ఉన్నవారు కాబట్టి మీరే మా ప్రధాన సేనాపతిగా ఉండండి. (11)
రశ్మివతామివాదిత్యః వీరుధామివ చంద్రమాః।
కుబేర ఇవ యక్షాణాం దేవానామివ వాసవః॥ 12
పర్వతానాం యథా మేరుః సుపర్ణః పక్షితాం యథా।
కుమార ఇవ దేవానాం వసూనామివ హవ్యవాట్॥ 13
కాంతిగలవారికి సూర్యునివలె, లతలకు చంద్రునివలె, యక్షులకు కుబేరునివలె, దేవతలకు ఇంద్రునివలె, పర్వతాలకు మేరుపర్వతం వలె, పక్షులకు గరుడునివలె, దేవయోనులకు కార్తికేయునివలె, వసువులకు అగ్నివలె, మీరు మాసేనకంతటికీ అధినాయకులు, (12-13)
భవతా హి వయం గుప్తా శక్రేణేవ దువౌకసః।
అనాధృష్యా భవిష్యామః త్రిదశానామపి ధ్రువమ్॥ 14
దేవతలు ఇంద్రుని వల్ల రక్షింపబడినట్లుగా మేమంతా మీ నాయకత్వంలో దేవగణాలకు కూడా అభేద్యంగా ఉంటాము. (14)
ప్రయాతు నో భవానగ్రే దేవానామివ పావకిః।
వయం త్వామమయాస్యామః సౌరభేయా ఇవర్షభమ్॥ 15
కుమారస్వామి దేవగణాల ముందు సాగునట్లుగా మీరు మా సైన్యం ముందర నడచెదరుగాక! ఎద్దుల ననుసరించి ఆవులు నడచునట్లుగా మేమంతా మిమ్ముల ననుసరిస్తాము. (15)
భీష్మ ఉవాచ
ఏవమేతన్మహాబాహో! యథా వదసి భారత।
యథైవ హి భవంతో మే తథైవ మమ పాండవాః॥ 16
అపుడు భీష్ముడిట్లన్నాడు. దుర్యోధనా! నీవు అన్నది నిజమే. కాని నాకు నీవు ఎంతముఖ్యమో పాండవులుకూడా అంత ముఖ్యమే! (16)
అపి చైవ మయా శ్రేయః వాచ్యం తేషాం నరాధిప।
సంయోద్ధవ్యం తవార్థాయ యథా మే సమయః కృతః॥ 17
రాజా! నేను నీకూ, వారికీ హితవచనాలు చెప్పాలి. యుద్ధం మాత్రం నీవైపునుండే చేస్తాను. ఈ విధంగానే నేను ప్రతిజ్ఞచేశాను కదా! (17)
న తు పశ్యామి యోద్ధారమ్ ఆత్మనః సదృశం భువి।
ఋతే తస్మాన్నరవ్యాఘ్రాత్ కుంతీపుత్రాత్ ధనంజయాత్॥ 18
నాతో పోరాడగల వీరుడు నరోత్తముడయిన అర్జునుడు తప్ప మరొకరిని నేను చూడలేదు. (18)
స హి వేద మహాబుద్ధిః దివ్యాన్యస్త్రాణ్యనేకశః।
న తు మాం వివృతో యుద్ధే జాతు యుధ్యేత పాండవః॥ 19
పాండునందనుడు అర్జునుడు మహాబుద్ధిశాలి అనేక దివ్యాస్త్రాలు తెలిసినవాడు. అయినా అతడు నాముందు నిలచి నాతో యుద్ధం చేయడు. (19)
అహం చైవ క్షణేనైవ నిర్మనుష్యమిదం జగత్।
కుర్యాం శస్త్రబలేనైవ ససురాసురరాక్షసమ్॥ 20
నేను కూడా (అర్జునునివలె) నా శస్త్ర బలంతో దేవతలతోనూ, అసురులతోనూ, రాక్షసులతోనూ నిండిన ఈ జగత్తును క్షణంలో నిర్మానుష్యం చేయగలను. (20)
న త్వేవోత్సాదనీయా మే పాండోః పుత్రా జనాధిప।
తస్మాత్ యోధాన్ హనిష్యామి ప్రయోగేణాయుతం సదా॥ 21
ఏవమేషాం కరిష్యామి నిధనం కురునందన।
న చేత్ తే మాం హనిష్యంతి పూర్వమేవ సమాగమే॥ 22
రాజా! నేను పాండుపుత్రులను చంపజాలను. కురునందనా! ఒకవేళ పాండవులు ఈ యుద్ధంలో ముందుగా నన్ను చాంపకపోతే నేను నా అస్త్రాలతో ప్రతిరోజూ పాండవ పక్షంలో వారిని పదివేలమంది చొప్పున చంపగలను. నేను ఈ విధంగా వారి సైన్యమంతటిని సంహరించగలను. (21-22)
సేనాపతిస్త్వహం రాజన్ సమయేనాపరేణ తే।
భవిష్యామి యథాకామం తన్మే శ్రోతుమిహార్హసి॥ 23
రాజా! నేను నా ఇచ్ఛననుసరించి నీకు ఒకే ఒక షరతుతో సేనాపతిగా ఉంటాను. ఇపుడు జాగ్రత్తగా విను. (23)
కర్ణో వా యుధ్యతాం పూర్వమ్ అహం వా పృథివీపతే।
స్పర్ధతే హి సదాత్యర్థం సూతపుత్రో మయా రణే॥ 24
రాజా! ముందుగా కర్ణుడుగాని లేదా నేను గాని యుద్ధం చేస్తాం. ఎందుకనగా ఈ సూతపుత్రుడు ఎప్పుడూ యుద్ధంలో నాతో పోటీపడుతూ ఉంటాడు గదా. (24)
కర్ణ ఉవాచ
నాహం జీవతి గాంగేయే రాజన్ యోత్స్యే కథంచన।
హతే భీష్మేతు యోత్స్యామి సహ గాండీవధన్వనా॥ 25
కర్ణుడిట్లు అన్నాడు. రాజా! భీష్ముడు జీవించి ఉండగా ఎట్టి పరిస్థితులలోనీ నేను యుద్ధం చేయబోను. పితామహుడు అస్తమించిన తర్వాతనే గాండీవితో(అర్జునునితో) యుద్ధానికి తలపడతాను. (25)
వైశంపాయన ఉవాచ
తతః సేనాపతిం చక్రే విధివత్ భూరిదక్షిణమ్।
ధృతరాష్ట్రాత్మజో భీష్మం సోఽభిషిక్తో వ్యరోచత॥ 26
వైశంపాయనుడిట్లు అన్నాడు.
జనమేజయ మహారాజా! తరువాత దుర్యోధనుడు శాస్త్రప్రకారంగా భూరిదక్షిణలిచ్చి భీష్ముని ప్రధానసేనాపతిగా అభిషేకించాడు. దానితో భీష్ముడు ఎంతో ప్రకాశించాడు. (26)
తతో భేరీశ్చ శంఖాశ్చ శతశోఽథ సహస్రశః।
వాదయామాసురవ్యగ్రాః వాదకా రాజశాసనాత్॥ 27
తరువాత రాజాజ్ఞతో వాద్యముల వారు, వందలు వేలు భేరులు, శంఖాలు ఉత్సాహంతో మ్రోగించారు. (27)
సింహనాదాశ్చ వివిధాః వాహనానాం చ నిఃస్వనాః।
ప్రాదురాసన్ననభ్రే చ వర్షం రుధిరకర్దమమ్॥ 28
వీరుల సింహనాదాలు వాహనాల నానాశబ్దాలు మిన్నుముట్టాయి. మేఘాలు లేకుండానే ఆకాశం నుండి రక్తవర్షం కురిసి బురద బురద అయిపోయింది. (28)
నిర్ఘాతాః పృథివీకంపాః గజబృంహితనిస్స్వనాః।
ఆసంశ్చ సర్వయోధానాం పాతయంతో మనాంస్యుత॥ 29
ఏనుగుల ఘీంకారాలతో పాటు ఆకాశంలోని పిడుగుల శబ్దాలు వినబడసాగాయి. భూమి కంపించ సాగింది. ఈ ఉత్పాతాలు యుద్ధసైనికులను మూర్ఛిల్లజేశాయి. (29)
వాచశ్చాప్యశరీరిణ్యః దిశశ్చోల్కాః ప్రపేదిరే।
శివాశ్చ భయవేదిన్యః నేదుర్దీప్తతరా భృశమ్॥ 30
అశుభసంకేతంగా ఆకాశవాణి వినబడసాగింది. ఆకాశం నుండి ఉల్కలు పడసాగాయి. భయంకర శబ్దాలతో నక్కల కూతలు అమంగళసూచకంగా మాటి మాటికి వినిపించాయి. (30)
సైనాపత్యే యదా రాజా గాంగేయమభిషిక్తవాన్।
తదైతాన్యుగ్రరూపాణి బభువుః శతశో నృపః॥ 31
రాజా! దుయోధనుడు భీష్ముని సేనాపతిగా నియమించగానే అశుభ ఉత్పాతములు వందలకొద్దీ సంభవించాయి. (31)
తతః సేనాపతిం కృత్వా భీష్మం పరబలార్దనమ్।
వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్ గోభిర్నిష్కైశ్చ భూరిశః॥ 32
వర్ధమానో జయాశీర్భిః నిర్యయౌ సైనికైర్వృతః।
ఆపగేయం పురస్కృత్య భ్రాతృభిః సహితస్తదా॥ 33
స్కన్ధావారేణ మహతా కురుక్షేత్రం జగామ హ॥ 34
ఈవిధంగా శత్రుసైన్యాన్ని చెండాడే స్వభవంగల భీష్ముని సేనాపతిగా నియమించిన ఆ దుర్యోధనుడు బ్రాహ్మణోత్తములచే స్వస్తివాచనం చేయించాడు. వారికి గోవులను బంగారు కాసులను భూరిదక్షిణలుగా ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులందరూ విజయ సూచకాలయిన ఆశీస్సులతో దుర్యోధనునకు అభ్యుదయం కలగాలని కోరుతున్నారు. పిమ్మట భీష్ముని ముందుంచుకొని, తన తమ్ములను వెంటబెట్టుకొని సైన్యాలతో హస్తినాపురం నుండి విశాలమయిన(డేరాలతో) శిబిరాలతో ఉన్న కురుక్షేత్రం సమీపించాడు. (32-34)
పరిక్రమ్య కురుక్షేత్రం కర్ణేన సహ కౌరవః।
శిబిరం మాపయామాస సమే దేశే జనాధిప॥ 35
జనమేజయా! కర్ణునితో కురుక్షేత్రానికి చేరుకున్న దుర్యోధనుడు ఒక సమతల ప్రదేశంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. (35)
మధురామాషరే దేశే ప్రభూతయవసేంధనే।
యథైవ హాస్తినపురం తద్వత్ శిబిరమాబభౌ॥ 36
బీడుభూమికాని మనోహర ప్రదేశంలో మెత్తని పచ్చికబయలు దట్టంగా ఉన్నచోట దుర్యోధనుని సైన్యశిబిరాలు - హస్తినాపురాన్ని తలపించే రీతిలో వెలిశాయి. (36)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ సైన్యనిర్యాణపర్వణి భీష్మసైనాపత్యే షట్ పంచాశ్దధిక శతతమోఽధ్యాయః ॥ 156 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున సైన్యనిర్యాణ పర్వమను ఉపపర్వమున
భీష్మసైనాపత్యము అను నూట ఏబది ఆరవ ఆధ్యాయము. (156)